బీబీసీ ఇంటర్వ్యూ: అమెరికాపై అణు దాడి చేయగల సత్తా ఉత్తర కొరియాకు ఉంది - సీఐఏ సారథి

సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ మైక్ పాంపేయో
ఫొటో క్యాప్షన్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ మైక్ పాంపేయో
    • రచయిత, గోర్డాన్ కొరెరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొన్ని నెలల్లోనే అణ్వాయుధాలు అమర్చిన క్షిపణులతో అమెరికాపై దాడి చేయగల శక్తిసామర్థ్యాలు ఉత్తర కొరియాకు ఉన్నాయని అమెరికా గూఢచార సంస్థ 'సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)' డైరెక్టర్ మైక్ పాంపేయో బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

అమెరికాకు రష్యా నుంచి ఎంత ముప్పుందో చైనా నుంచి కూడా అంతే ముప్పు ఉందని ఆయన తెలిపారు.

ఈ ఏడాది నవంబరులో అమెరికా కాంగ్రెస్‌కు జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకొని, వాటికి విఘాతం కలిగించేందుకు రష్యా యత్నిస్తుందని తాను భావిస్తున్నట్లు పాంపేయో చెప్పారు.

రష్యా యత్నాలను సీఐఏ తిప్పి కొడుతుందని, రష్యా ప్రభావాన్ని అత్యంత తక్కువ స్థాయికి తగ్గిస్తామని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరుగుతాయని విశ్వాసం వ్యక్తంచేశారు.

అమెరికా, ఐరోపాల్లో ప్రభుత్వాలను, వ్యవస్థలను దెబ్బతీసేందుకు రష్యా ఎప్పట్లాగే యత్నిస్తోందని, రష్యా కార్యకలాపాల్లో పెద్దగా తగ్గుదల లేదని ఆయన చెప్పారు.

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్

చైనాకు వనరులు ఎక్కువ

అమెరికా లాంటి దేశాల్లో అధికార వ్యవస్థలను దెబ్బతీసేందుకు రష్యా చేసే యత్నాలు ఎంత ఆందోళనకరమో, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల వ్యవహారాలను ప్రభావితం చేసేందుకు చైనా చేసే యత్నాలు కూడా అంతే ఆందోళనకరమని సీఐఏ సారథి వ్యాఖ్యానించారు.

ఇతర దేశాల వ్యవహారాలను ప్రభావితం చేసేందుకు రష్యా కంటే కూడా చైనాకు క్షేత్రస్థాయి, ఇతరత్రా వనరులు ఎక్కువగా ఉన్నాయని పాంపేయో తెలిపారు. రష్యా, చైనా ఆర్థిక వ్యవస్థల్లో వ్యత్యాసాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అమెరికా సమాచారాన్ని తస్కరించేందుకు చైనా యత్నిస్తోందని, అమెరికాకు వ్యతిరేకంగా తన తరపున పనిచేసేవారిని, గూఢచారులను దేశంలోకి చొప్పిస్తోందని సీఐఏ సారథి తెలిపారు.

"అమెరికా పాఠశాల్లలో, ఆస్పత్రుల్లో, ఇతర వైద్య వ్యవస్థల్లో, కార్పొరేట్ సంస్థల్లో అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే తన మనుషులను చైనా చొప్పిస్తోంది. బ్రిటన్, ఐరోపా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ చైనా ఇలా చేస్తోంది" అని ఆయన వివరించారు.

చైనా జాతీయ పతాకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా యత్నాలను అడ్డుకోవాలంటే సంబంధిత దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాలని పాంపేయో చెప్పారు.

చైనాను కలసికట్టుగా ఎదుర్కోవాలి

చైనా మార్కెట్‌లోకి ప్రవేశించాలనుకునే అమెరికా కంపెనీలనూ చైనా తన ఆర్థిక బలంతో ప్రభావితం చేసేందుకు యత్నిస్తోందని పాంపేయో తెలిపారు.

పాశ్చాత్య దేశాల వ్యవహారాల్లో తన శక్తిని ప్రయోగించేందుకు చైనా చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలంటే సంబంధిత దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

దాదాపు రెండు వారాల క్రితం సీఐఏ మాజీ అధికారి జెర్రీ చున్ షింగ్ లీ(53)ని అమెరికా అధికారులు న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

చైనాలో సీఐఏ గూఢచర్యాన్ని స్తంభింపజేయడానికి సంబంధించిన ఒక కేసులో కీలక సమాచారాన్ని ఆయన అట్టిపెట్టుకున్నారనే అభియోగాలు ఉన్నాయి.

జెర్రీ చున్ షింగ్ లీ 1994 నుంచి 2007 మధ్య సీఐఏలో పనిచేశారు. లీ అరెస్టుకు ముందు రెండేళ్ల కాలంలో దాదాపు 20 మంది సీఐఏ ఇన్‌ఫార్మర్లు హత్యకు గురికావడమో, జైలుపాలు కావడమో జరిగింది.

అమెరికా గూఢచార వ్యవస్థ తీవ్రమైన వైఫల్యాల్లో ఈ ఉదంతం ఒకటి. ఈ ఘటనలు జరుగుతున్నప్పుడు వీటికి కారణాలేమిటనేది సీఐఏకు అంతుచిక్కేది కాదు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ట్రంప్ హెచ్చరికలతో కిమ్‌కు సందేశం

ఉత్తర కొరియాను, ఉత్తర కొరియా పాలకుడు కిమ్-జాంగ్-ఉన్‌ను ఉద్దేశించి ట్రంప్ ట్విటర్‌లో హెచ్చరికలు, వ్యాఖ్యలు చేయడాన్ని, ముందెన్నడూ లేనంత స్థాయిలో విదేశాంగ విధానం గురించి బహిరంగంగా, నిక్కచ్చిగా మాట్లాడటాన్ని సీఐఏ సారథి వద్ద బీబీసీ ప్రస్తావించింది.

దీనిపై పాంపేయో స్పందిస్తూ- అధ్యక్షుడు ఇలా బహిరంగ హెచ్చరికలు చేస్తుండటం వల్ల ఉత్తర కొరియా నాయకులకు, మరికొన్ని ఇతర దేశాల నాయకులకు పరిస్థితి తీవ్రత తెలిసివస్తోందని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలతో, అమెరికా సీరియస్‌గా ఉందనే సందేశం కిమ్ జాంగ్-ఉన్‌కు చేరుతుందని పేర్కొన్నారు.

కిమ్ జాంగ్-ఉన్‌తో అమెరికాకే కాదు, యావత్ ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని పాంపేయో అభిప్రాయపడ్డారు. ఆయన శక్తిసామర్థ్యాలపై తమకు స్పష్టత ఉందన్నారు.

ఉత్తర కొరియా క్షిపణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిమ్ శక్తిసామర్థ్యాలపై అమెరికాకు స్పష్టత ఉందని సీఐఏ సారథి తెలిపారు.

నష్టాన్ని పరిగణనలోకి తీసుకొంటున్న ట్రంప్

ఉత్తర కొరియాతో పూర్తిస్థాయి పోరాటానికి దిగితే విధ్వంసం, ప్రాణనష్టం అధికంగా ఉంటాయనే వాస్తవాన్ని అధ్యక్షుడు ట్రంప్, ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకొంటున్నారని సీఐఏ సారథి వెల్లడించారు.

కిమ్ జాంగ్-ఉన్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు, లేదా అణ్వస్త్ర సహిత క్షిపణులను ప్రయోగించకుండా ఆయన్ను నిలువరించేందుకు అవకాశం ఉందా అని అడగ్గా, ఏమైనా జరగొచ్చని పాంపేయో బదులిచ్చారు. వివరాలు వెల్లడించలేదు.

మధ్య ప్రాచ్యంలో సుస్థిరతకు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని, ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా సీఐఏ సారథి తెలిపారు.

మైక్ పాంపేయో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైక్ పాంపేయో

ట్రంప్ మానసిక స్థితిపై ఆరోపణలు అర్థరహితం

తాము సేకరించిన నిఘా సమాచారాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కు వివరించేటప్పుడు ఆయన దృష్టిని బాగా కేంద్రీకరిస్తారని పాంపేయో చెప్పారు. సేకరించిన సమాచారాన్ని సీఐఏ నమ్మడానికిగల ప్రాతిపదిక ఏమిటని ఆరా తీస్తారని తెలిపారు.

ట్రంప్‌ మానసిక శక్తిసామర్థ్యాలు, ఆలోచనా శక్తి తగ్గిపోతున్నాయని, అధ్యక్ష పదవికి తగిన స్థాయిలో ఇవి ఆయనలో లేవంటూ జర్నలిస్టు మైకేల్ వోల్ఫ్ తన పుస్తకం 'ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్ హౌస్'లో చేసిన ఆరోపణలను పాంపేయో కొట్టిపారేశారు.

ఈ పుస్తకంలోని ఆరోపణలు అర్థరహితమైనవని ఆయన వ్యాఖ్యానించారు.

అధ్యక్ష బాధ్యతలకు సంబంధించిన కీలకమైన విషయాలను అర్థం చేసుకోలేని స్థితిలో ట్రంప్ ఉన్నారని ఆరోపించడం ప్రమాదకరమని, ఇది తప్పుడు ఆరోపణ అని ఆయన చెప్పారు.

సీఐఏ ప్రధాన కార్యాలయం
ఫొటో క్యాప్షన్, సీఐఏ ప్రధాన కార్యాలయం

మాది అత్యుత్తమ గూఢచార సంస్థ

ప్రపంచంలోకెల్లా సీఐఏ 'అత్యుత్తమ గూఢచార సంస్థ' అని, ఇది తనకెంతో గర్వకారణమని ఆయన చెప్పారు.

సీఐఏ సారథిగా పాంపేయో ఏడాది పూర్తిచేసుకున్నారు. నిరుడు జనవరి 23న ఆయన ప్రమాణం చేశారు.

సీఐఏ డైరెక్టర్ కావడానికి ముందు పాంపేయో, రిపబ్లికన్ పార్టీకి చెందిన అతివాద కాంగ్రెస్ సభ్యుల్లో ఒకరుగా ఉండేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)