రష్యా: ‘ఐదేళ్లలో 80 శాతం తగ్గిన ఆల్కహాల్ విక్రయాలు’.. నిజమెంత?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జార్జి నెయాస్కిన్
- హోదా, బీబీసీ రష్యన్ సర్వీస్
రష్యాలో మద్యపానాన్ని బాగా ఆస్వాదిస్తారు. దేశంలో అత్యధికులు ఎంతో ఇష్టంగా తాగే 'వోడ్కా'ను జాతీయ మద్యంగా పరిగణిస్తారు. అయితే ఐదేళ్ల కిందటితో పోలిస్తే రష్యాలో ఆల్కహాల్ అమ్మకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోయాయి.
రష్యా గణాంక సంస్థ 'రోస్టాట్' లెక్కల ప్రకారం చూస్తే ఆల్కహాల్ అమ్మకాలు ఐదేళ్లలో దాదాపు 30 శాతం తగ్గాయి. అధికారిక విక్రయాల ఆధారంగా రోస్టాట్ ఈ గణాంకాలను రూపొందిస్తుంది.
ఐదేళ్ల కిందటితో పోలిస్తే ఆల్కహాల్ విక్రయాలు 80 శాతం పడిపోయాయని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి వెరోనికా స్కోవోర్‌త్సోవా ఇటీవల చెప్పారు. ఈ సంఖ్యపై ఆరోగ్యశాఖను బీబీసీ కొన్ని ప్రశ్నలు అడగ్గా, సమాధానం రాలేదు.
ఆరోగ్యశాఖ మంత్రి చెప్పినట్లు 80 శాతం కాదుగాని, రోస్టాట్ లెక్కల ప్రకారం అమ్మకాలు దాదాపు 30 శాతం పడిపోయాయని బీబీసీ పరిశీలనలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
2017 సంవత్సరానికి సంబంధించి ఆల్కహాల్ గణాంకాలను రోస్టాట్ ఇంకా విడుదల చేయలేదు. అయితే జనవరి నుంచి నవంబరు వరకు గణాంకాలు అందుబాటులో ఉన్నాయి.
అంతకుముందు సంవత్సరం 2016 గణాంకాలతో పోల్చి చూస్తే, 2017లో ఆల్కహాల్ విక్రయాలు పెరిగాయని రష్యాలో ఆరోగ్యం, మద్యపానం అంశాలపై పరిశోధనలు చేసే అర్థశాస్త్ర ప్రొఫెసర్ యెవ్‌గెనీ యకోవ్‌లెవ్ చెప్పారు. ఈ ప్రొఫెసర్ మాస్కోలోని న్యూ ఎకమినక్ స్కూల్‌లో పనిచేస్తున్నారు.
2016 జనవరి-నవంబరు కాలంతో పోలిస్తే 2017లో ఇదే కాలానికి వోడ్కా విక్రయాలు పది శాతం పెరిగాయి.
రష్యాలో తాగిన మొత్తం ప్యూర్ ఆల్కహాల్‌ను రోస్టాట్, దేశ జనాభాతో భాగించి సగటును లెక్కిస్తుంది.
రష్యన్లు గత ఏడాది సగటున 6.6 లీటర్లకు సమాన మొత్తంలో ప్యూర్ ఆల్కహాల్‌ను తాగారని రోస్టాట్ గణాంకాలు చెబుతున్నాయి. సగటున 6.6 లీటర్ల వోడ్కా, స్పిరిట్‌లు, 57 లీటర్ల బీరు, 7.3 లీటర్ల వైన్, స్పార్క్లింగ్ వైన్, షాంపేన్ తాగారని పేర్కొంటున్నాయి.
అక్రమ మద్యం లేదా రికార్డుల్లో నమోదుకాని మద్యం రష్యాలో తాగే మొత్తం మద్యంలో పది శాతంలోపు ఉంటుందని ప్రొఫెసర్ యెవ్‌గెనీ యకోవ్‌లెవ్ తెలిపారు. రోస్టాట్ తన లెక్కల్లో అక్రమ మద్యాన్ని పరిగణనలోకి తీసుకోదు.
రష్యా పురుషుల్లో మద్యపానం కారణంగా సంభవించే మరణాలు గత దశాబ్ద కాలంలో దాదాపు 50 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఒక నివేదికలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- రష్యా ఎన్నికలు: పుతిన్ ప్రత్యర్ధి అలెక్సీ నావల్సీపై అనర్హత వేటు
- ట్రంప్-పుతిన్ సమర్పించు రాజకీయ డ్రామా!
- క్యాన్సర్‌ను పసిగట్టే రక్తపరీక్ష!!
- రిపబ్లిక్ డే పరేడ్: ఆసియాన్ ఎందుకంత ప్రత్యేకం?
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- ఉత్తర కొరియాతో ఇప్పటికీ మాట్లాడే దేశాలు ఎన్ని?
- అమెరికా న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- అడవుల్లో పులులను ఎలా లెక్కిస్తారో తెలుసా?
- మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








