అమెరికా మిలిటరీ యాక్షన్: ఇరాన్ బలం చూసి వెనక్కి తగ్గుతోందా, మరేదైనా కారణం ఉందా?

- రచయిత, రౌనక్ భైరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య తీసుకోవాలని భావిస్తున్నట్టు కనిపించింది. ఇరాన్‌కు సంబంధించి అమెరికా ఒక అడ్వైజరీ జారీ చేసినప్పుడు ఈ భయం మరింత పెరిగింది.
పశ్చిమాసియాలో అతిపెద్ద అమెరికా వైమానిక స్థావరం అయిన అల్-ఉదీద్ నుంచి కొన్ని దళాలను అమెరికా ఉపసంహరించుకోవాలని ఖతార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థావరం ఖతార్ ఆధీనంలో ఉంటుంది.
నిరసనకారులను ఇరాన్ ఉరితీస్తే అమెరికా కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా ట్రంప్ అన్నారు. గురువారం(జనవరి 15) సాయంత్రం నాటికి ఉరిశిక్షలు వాయిదా పడ్డాయని ఇరాన్ నుంచి వార్తలొచ్చాయి.
"ఇరాన్‌లో హత్యలు ఆగిపోయాయని మాకు సమాచారం అందింది. మళ్లీ వాటిని అమలు చేసే ప్రణాళికలు లేవు" అని తర్వాత ట్రంప్ చెప్పారు.
గురువారం సాయంత్రం నాటికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయని స్పష్టమైంది. అంతకుముందు ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరం దగ్గర భద్రతా హెచ్చరిక స్థాయిని అమెరికా తగ్గించింది.

‘‘దాడికి అమెరికా సిద్ధంగా లేదు’’
బుధవారం ఈ స్థావరం నుంచి తొలగించిన అమెరికా సైనిక విమానాలు ఇప్పుడు నెమ్మదిగా తిరిగి వస్తున్నాయని ఓ సోర్స్ చెప్పినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
కానీ అమెరికా సైన్యం దాడికి సిద్ధంగా లేదని ఆంగ్ల వార్తాపత్రిక 'ది టెలిగ్రాఫ్'లో వచ్చిన ఒక వార్తా నివేదిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
"పరిమిత అవకాశాలు, సామర్థ్యాల కారణంగా ఇరాన్‌పై దాడి చేయడానికి సైన్యం సిద్ధంగా లేదని అమెరికా అధికారులు రహస్య హెచ్చరిక చేశారు" అని బ్రిటిష్ వార్తాపత్రిక ది టెలిగ్రాఫ్‌ను ఉటంకిస్తూ బీబీసీ పర్షియన్ పేర్కొంది.
నివేదిక ప్రకారం "ఇరాన్ ప్రభుత్వంపై నిర్ణయాత్మక దాడికి హామీ ఇవ్వగలిగితేనే చర్య తీసుకోవాలని ట్రంప్ తన జాతీయ భద్రతా బృందాన్ని ఆదేశించినట్టు చెబుతున్నారు".
కానీ అధికారులు ఎన్‌బీసీ న్యూస్‌తో మాట్లాడుతూ తాము అలాంటి హామీలు ఇవ్వలేమని, సైనిక చర్య వారాలపాటు కొనసాగే పెద్ద సంఘర్షణకు కారణమవుతుందని ,ఇరాన్ నుంచి బలమైన ప్రతిస్పందనకు దారితీస్తుందని హెచ్చరించారు.
కానీ చర్య తీసుకుంటారా లేదా అనే గందరగోళం మధ్య జనవరి 11 నాటి టైమ్ మేగజీన్ రిపోర్టులో ఇలాంటి సంకేతాలే కనిపించాయి.
ట్రంప్ చేసిన వాగ్దానాలను ఏ రకమైన సైనిక చర్యా నెరవేర్చలేదనేది సాధారణ వాస్తవం అని నివేదిక చెబుతోంది.
అమెరికా ఒక లాంఛనప్రాయ దాడిని ప్రారంభించినా అది చాలా బలహీనంగా ఉంటుందని, దానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని ఆ రిపోర్టులో ఉంది.
ఈ సంక్షోభాన్ని ప్రస్తుతానికి నివారించినప్పటికీ ఏదైనా సైనిక చర్యను అడ్డుకోగల ఏర్పాటు ఇరాన్ భౌగోళిక స్థానం అందిస్తుందని రక్షణ నిపుణులు అంటున్నారు.
కొన్ని నెలలుగా ఇరాన్ తన రక్షణ వ్యవస్థలో కూడా సమూల మార్పులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ ఎంత బలంగా ఉంది?
గత సంక్షోభం తర్వాత ఇరాన్ ఎంతగా బలపడిందో ఇరాన్ ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అమీర్ హతామీ అనేక సందర్భాల్లో చెప్పారు.
"జూన్ 2025లో 12 రోజుల యుద్ధం సమయంలో ఉన్న దానికంటే ఇప్పుడు ఇరాన్ సాయుధ దళాలు చాలా సన్నద్ధంగా ఉన్నాయి. ఆ యుద్ధం ఇరాన్ సైన్యానికి ఒక ప్రత్యేకమైన అనుభవం. అది మా బలాన్ని పెంచింది. సైనికుల శిక్షణ స్థాయిని పెంచింది. వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచింది" అని అమీర్ హతామీ చెప్పినట్టు రష్యా ప్రభుత్వ వార్తా టాస్ తెలిపింది.
"ఇరాన్ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, ఏదైనా దాడి అవకాశాన్ని అడ్డుకోవడానికి ఇరాన్ తన సాయుధ దళాల సామర్థ్యాలను బలోపేతం చేసింది"
"ఇరాన్ భౌగోళిక స్థానం ఎల్లప్పుడూ దానికి ప్రయోజనకరంగానే ఉందనేది నిజం. గతంలో కూడా దీని వల్ల ఇరాన్ వ్యూహాత్మకంగా లాభపడింది" అని పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు, ఐసీడబ్ల్యూఏలో సీనియర్ ఫెలో అయిన డాక్టర్ ఫజ్జూర్ రెహమాన్ బీబీసీతో అన్నారు.
"అయితే, ఆధునిక యుద్ధంలో భూతలదాడి దాడి జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అమెరికా వద్ద బీ-2 బాంబర్లు,వైమానిక దాడులు చేయగల అనేక ప్రమాదకరమైన క్షిపణులు ఉన్నాయి. భూతలదాడిని ప్లాన్ చేసేటప్పుడు ఇరాన్ భౌగోళిక స్థానాన్ని విస్మరించలేమని స్పష్టమవుతుంది"

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌పై దాడి చేయడం ఎందుకు కష్టం?
"వెనెజ్వెలా నాయకుడు నికోలస్ మదురోను 'బంధించిన' తర్వాత, ట్రంప్ ఇరాన్‌పై కఠినమైన చర్యలు తీసుకోవడంపై ఉత్సాహంగా మాట్లాడారు" అని ది గార్డియన్ అనే ఆంగ్ల వార్తాపత్రిక పేర్కొంది.
"కానీ నిజానికి అమెరికా ఎలాంటి సైనిక సన్నాహాలు చేయలేదు. కొన్ని నెలలుగా ఇరాన్ చుట్టూ ఉన్న అమెరికా దళాలను తగ్గించడంతో దీనికి అవకాశం కనిపించడం లేదు. అక్టోబరు 2025 నుంచి పశ్చిమాసియాలో అమెరికా ఒక్క విమాన వాహక నౌకను కూడా మోహరించలేదు"
దీని అర్థం అమెరికా ఇరాన్ ప్రభుత్వ లక్ష్యాలపై లేదా ఇరాన్ నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీపై స్వయంగా దాడి చేయరు.
ఇలా చేయాలంటే పశ్చిమాసియా దేశాలలో వైమానిక స్థావరాలను అమెరికా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇరాన్ ఇప్పటికే దీనిపై ఆయా దేశాలను హెచ్చరించింది.
అమెరికా దగ్గర మరో అవకాశం ఉంది. అది బీ-2 బాంబర్. దీనిని జూన్ 2025లో ఉపయోగించింది. అయితే అది కూడా తన అణు కేంద్రాలను పూర్తిగా నాశనం చేయలేదని ఇరాన్ వాదిస్తోంది.
"అక్టోబరులో అమెరికా తన విమాన వాహక నౌకలను ఉపసంహరించుకుంది. ఇది ఇరాన్‌కు కొంత ఉపశమనం కలిగించింది. కానీ ఇప్పుడు అమెరికా మళ్ళీ తన విమాన వాహక నౌకలను పశ్చిమాసియాకు పంపుతోంది. దాడి జరిగితే వీటిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇరాన్ పొరుగు దేశాల సైనిక వైమానిక స్థావరాలను కూడా అమెరికా ఉపయోగించుకోవచ్చు" అని డాక్టర్ ఫజ్జూర్ రెహమాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భౌగోళికంగా ఇరాన్ స్థానం
భౌగోళికంగా ఇరాన్ ఉన్న ప్రదేశం కూడా ఆ దేశానికి గొప్ప బలం.
అట్లాస్ ఆఫ్ వార్ ప్రకారం, బలమైన సహజ సరిహద్దులు ఇరాన్ చుట్టూ ఉంటాయి. ఇది ఆ దేశ శత్రువులకు పెద్ద అడ్డంకి.
ఉత్తరాన కాస్పియన్ సముద్రం, దక్షిణాన పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో ఎడారులు, పర్వతాలు, ఇంకా పశ్చిమంలోనే జాగ్రోస్ పర్వతాలు, ఉత్తరంలో ఎల్బర్జ్ పర్వతాలు ఉన్నాయి. ఇవి శత్రువుకు సవాల్ విసురుతాయి. ఈ అడ్డంకులు అనేమార్లు దండయాత్రలను అడ్డుకున్నట్లు చరిత్రలో ఉంది.
1980లలో ఇరాన్-ఇరాక్‌ల మధ్య యుద్ధం జరిగింది. అయితే, జాగ్రోస్ పర్వతాల కారణంగా ఇరాకీ సైన్యం ఇరాన్‌లోకి ఎక్కువ దూరం వెళ్లలేకపోయింది.
మొదట అహ్వాజ్ (ఒక కీలక చమురు క్షేత్రం)ను స్వాధీనం చేసుకుని, ఆపై పర్వతాలను దాటి ఇరాన్‌లోకి చొచ్చుకుపోవాలన్నది సద్దాం హుస్సేన్ ప్లాన్. కానీ, ఆయన ప్రణాళిక పూర్తిగా ఫెయిలైంది.
దీంతో ఇరాన్‌ను లొంగదీసుకోవడంలో ప్రకృతి పెద్ద అడ్డంకి అని నిరూపితమైంది. ఎనిమిది సంవత్సరాలు సాగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేదు.
ఇక తూర్పు నుంచి ఇరాన్‌పై దాడి చేయాలనుకుంటే, వారు దష్త్-ఎ-లుట్, దష్త్-ఎ-కవీర్ వంటి విస్తారమైన ఎడారులను దాటవలసి ఉంటుంది. ఈ ఎడారులు భారీ సైనిక చర్యలకు ఇబ్బందులను కలిగిస్తాయి.
పర్వతాలు, ఎడారులతోపాటు సముద్రం కూడా ఇరాన్‌కు సహజ రక్షణ కోటలా ఉంటుంది. పర్షియన్ గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధి చాలా ఇరుకుగా ఉంటుంది. దానిపై ఇరాన్‌కు నియంత్రణ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గం.
ప్రపంచంలోని చమురులో దాదాపు 20శాతం ఈ జలసంధి గుండా వెళుతుంది. అందువల్ల, ఏదైనా పెద్ద యుద్ధం వచ్చిందంటే ఇరాన్ చేతిలో ఈ కీలకమైన ఆయుధం ఉన్నట్లే.
ప్రపంచానికి చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి, శత్రువులు ఇరాన్ మీద దాడి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ సైనిక శక్తి ఎంత?
గ్లోబల్ ఫైర్‌పవర్ ప్రకారం, ప్రపంచంలోని టాప్ 20 సైనిక శక్తులలో ఇరాన్ ఒకటి. పవర్ ఫుల్ మిలిటరీ ఉన్న 145 దేశాలలో ఇరాన్ ది 16వ స్థానం.
ఇరాన్‌లో 610,000 యాక్టివ్ డ్యూటీ గార్డ్స్, 350,000 రిజర్వ్ ఫోర్స్ ఉంది. మొత్తంగా 960,000 మంది సైనికులు ఉన్నారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) ఇరాన్‌లో ఒక ప్రత్యేక విభాగం. అసాధారణమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసం దీన్ని తయారు చేశారు.
ఇరాన్ దగ్గర 551 ఫైటర్ జెట్‌లు ఉన్నాయి.
మానవరహిత విమానాలు ఎక్కువగా ఉన్న దేశాలలో ఇరాన్ కూడా ఒకటి. అలాగే 25 జలాంతర్గాములు సహా 147 నౌక సంబంధ వాహనాలు ఇరాన్ దగ్గర ఉన్నాయి.
ఇరాన్ వాచ్ నివేదిక ప్రకారం, ఇరాన్ క్షిపణి ఆయుధశాల మిడిల్‌ఈస్ట్‌లోనే అతిపెద్దది.
2022లో, అమెరికా సెంట్రల్ కమాండ్‌కు చెందిన జనరల్ కెన్నెత్ మెకెంజీ ఇరాన్ గురించి చెబుతూ "ఇరాన్ దగ్గర 3,000 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇందులో క్రూయిజ్ క్షిపణులు లేవు" అని అన్నారు.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, 2024లో ఇరాన్ రక్షణ బడ్జెట్ 7.9 బిలియన్ డాలర్లు ( సుమారు రూ. 716,870,181,900) ఇది ఆ దేశ జీడీపీలో దాదాపు 2.0శాతం. 2023లో ఇరాన్ సైనిక వ్యయం దాదాపు 10.3 బిలియన్ డాలర్లు ( సుమారు రూ. 933,911,300,000) .
సైనిక వ్యయంలో ఇరాన్ ప్రపంచంలో 34వ స్థానంలో ఉంది. అయితే, ఇరాన్ 2025 గణాంకాలను విడుదల చేయలేదు. రక్షణ బడ్జెట్‌ను 200శాతం పెంచాలని, దానిని 16.7 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని మాత్రం యోచిస్తోంది ఆ దేశం.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, ఇరాన్‌ల సైనిక బలాల్లో గణనీయమైన తేడా ఉన్నప్పటికీ, అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్‌లో అది మొదటి స్థానంలో ఉంది.
ఆ దేశం దగ్గర దాదాపు 13 లక్షలమంది సైనికులు ఉన్నారు. సుమారు 8 లక్షలమంది రిజర్వ్ సైనికులు కూడా ఉన్నారు. దీంతో దాని మొత్తం సైనిక బలగం దాదాపు 21 లక్షలు. 2005 నుండి యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్‌లో స్థిరంగా అగ్రస్థానంలో ఉంది అమెరికా.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జాబితాలో కూడా అమెరికాయే మొదటి స్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం, 2024లో అమెరికా రక్షణ బడ్జెట్ 997 బిలియన్ డాలర్లు ( సుమారు రూ. 90,429,725,200,000)
ఇది ఆ దేశపు జీడీపీలో 3.4 శాతం. ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికా వాటా 37 శాతం.
ఇరాన్, అమెరికా సైనిక బలాల్లో భారీ అంతరం ఉన్నప్పటికీ, ఇరాన్‌పై దాడి చేయడం అమెరికాకు అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
నావల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్‌లో జాతీయ భద్రతా వ్యవహారాల అసోసియేట్ ప్రొఫెసర్ అఫ్షోన్ ఓస్టోవర్ 2024లో మాట్లాడుతూ, "శత్రువులు దాడి చేయకపోవడానికి ఒక కారణం ఇరాన్‌ను చూసి భయపడటం వల్ల కాదు. ఇరాన్‌పై జరిగే యుద్ధం ఏదైనా తీవ్రమైన యుద్ధం అవుతుందని వాళ్లు అర్థం చేసుకోవడమే"
రక్షణ విశ్లేషకుడు రాహుల్ బేదీ అభిప్రాయం ప్రకారం "అమెరికాతో పోరాడటానికి ఇరాన్ దగ్గరున్న ఉత్తమ ఆయుధాలు క్షిపణులు, డ్రోన్లే. ఇరాన్ ఫైటర్ జెట్‌లు చాలాకాలంగా పనిచేయడం లేదు. దాని నౌకదళ శక్తి కూడా అంతంత మాత్రమే''
"ఒకవేళ ఇరాన్‌పై దాడి జరిగితే, అది మళ్లీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, క్షిపణులను ఉపయోగించే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాకు బలమైన సైనిక బలగం, ఇజ్రాయెల్ మద్దతు ఉంది. మిడిల్‌ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌కు గట్టి పట్టుంది. అది అమెరికాకు అన్ని విధాలుగా సహాయం చేయగలదు" అని రాహుల్ బేదీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














