భారత్‌పై ట్రంప్ కఠిన వైఖరి రష్యాకు లాభమా? చరిత్ర ఏం చెబుతోంది...

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్ట్ 15న, అలాస్కాలో ఉత్సాహంగా భేటీ అయ్యారు.

పుతిన్‌ను కలిసిన సమయంలో ట్రంప్ హావభావాలు, ఆ తర్వాత ఆయన చేసిన ప్రకటనలు రష్యా, యుక్రెయిన్ వ్యవహారంపై ఆయన కోపంగా ఉన్నారనే భావన కలిగించేలా లేవు.

ఈ సమావేశాన్ని భారత్‌ కూడా సునిశితంగా గమనించింది.

ఈ భేటీ సజావుగా సాగితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై ట్రంప్ విధించిన 25 శాతం అదనపు సుంకాలను ఎత్తివేయచ్చని భావించారు.

కానీ, ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. ప్రస్తుత, యథాతథ స్థితి కొనసాగితే.. ఆగస్ట్ 27 నుంచి భారత్‌పై 50 శాతం సుంకాలు అమలవుతాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ట్రంప్, పుతిన్ భేటీ తర్వాత కూడా భారత్‌పై అమెరికా కఠిన వైఖరిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు.

ఈ భేటీ జరిగిన మూడు రోజుల అనంతరం, వైట్‌హౌస్‌లో ట్రేడ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కౌన్సెలర్‌గా ఉన్న పీటర్ నవరో బ్రిటిష్ న్యూస్ పేపర్ ఫైనాన్షియల్ టైమ్స్‌లో ఒక వ్యాసం రాశారు. అందులో ఆయన భారత్‌ను విమర్శించారు.

"అమెరికన్లు భారతీయ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే డాలర్లను భారత్ చౌకగా రష్యన్ చమురు కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తోంది. రష్యన్ ముడిచమురును శుద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. భారత్‌లో లాభాలు ఆర్జిస్తున్న వారు రష్యాకు నిశ్శబ్ద భాగస్వాములుగా ఉన్నారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తూనే ఉంది, అందుకు భారత్ సహకరిస్తోంది’’ అని పీటర్ నవరో రాశారు.

అమెరికా తనను వ్యూహాత్మక భాగస్వామిగా చూడాలని భారత్ కోరుకుంటే, ఆ దేశం కూడా అలాగే వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన రాశారు.

ట్రంప్, పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

పుతిన్, ట్రంప్ మధ్య సత్సంబంధాలు

ట్రంప్, పుతిన్ మధ్యనున్న స్నేహపూర్వక వాతావరణం భారత్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు, కానీ రష్యా - అమెరికాకు మాత్రం ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాకు రష్యాతో సొంతంగా వాణిజ్య సంబంధాలున్నాయి. రష్యా నుంచి చైనా భారత్ కంటే ఎక్కువ మొత్తంలోచమురు కొనుగోలు చేస్తోంది. కానీ, పుతిన్‌ను ట్రంప్ ఆహ్వానిస్తూ, చైనాపై సుంకాల నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు.

ఇవన్నీ గమనిస్తే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే భారత్‌పై ట్రంప్ కఠిన వైఖరికి కారణం కాదంటున్నారు.

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకులు పర్వేజ్ హుద్‌భాయ్ మాట్లాడుతూ, ట్రంప్ కఠిన వైఖరికి చమురు కారణం కాదు. అది ట్రంప్, మోదీ ఆత్మగౌరవానికి సంబంధించిన ఘర్షణగా అభివర్ణించారు.

''కాల్పుల విరమణ వ్యవహారంలో మోదీ తనకు క్రెడిట్ ఇవ్వకపోవడం ట్రంప్‌కు నచ్చలేదు. ట్రంప్ ఆదేశాల మేరకు కాల్పుల విరమణ జరిగిందని అంగీకరించడం మోదీకి తన దేశంలో సాధ్యం కాదు. అందువల్ల, ఇది ఇద్దరు నేతల ఆత్మగౌరవ ఘర్షణగా భావిస్తున్నా'' అన్నారు పర్వేజ్.

అలాస్కాలో భేటీకి ముందు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కూడా భారత్‌కు బెదిరింపులు పంపారు. పుతిన్‌తో చర్చలు సానుకూలంగా జరగకపోతే, భారత్‌పై సుంకాలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు. భారత్‌కు వ్యతిరేకంగా యూరప్ కూడా ఇందులో కలిసిరావాలన్నారు.

అమెరికా, భారత్, రష్యా, డోనల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు నష్టం జరిగినా పుతిన్‌కు ప్రయోజనమేనా?

థింక్ ట్యాంక్ అనంత సెంటర్ విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపై పనిచేస్తుంది.

ఆ సంస్థ సీఈవో ఇంద్రాణి బాగ్చి అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను పోస్ట్ చేస్తూ, "ఇది చాలా ప్రమాదకరం. రష్యాకు భారత్ ప్రత్యేకమని పాశ్చాత్య దేశాలు భావిస్తాయి, కాబట్టి పుతిన్‌‌పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్‌‌ను శిక్షించాలి. రష్యా ప్రయోజనాల విషయంలో పుతిన్ వెనక్కితగ్గరు, అలాగే భారత్‌కు ఇబ్బంది కలిగినా పట్టించుకోరు. అలాంటప్పుడు, భారత్ పంచింగ్ బ్యాగ్‌గా మారుతుంది. తన ప్రమేయం లేకుండానే భారత్ ప్రభావితమవుతుంది'' అని రాశారు.

ఇంద్రాణి బాగ్చి పోస్టును రీపోస్ట్ చేస్తూ థింక్ ట్యాంక్‌ 'బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌'లో ఫెలో అయిన తన్వీ మదన్ ఇలా రాశారు. "ట్రంప్ భారత్‌ను ఇబ్బందిపెడితే పుతిన్‌కు ప్రయోజనం. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్నట్లయితే, రష్యాతో సంబంధాల బలోపేతానికి భారత్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు, చైనాతో ఒప్పందానికి భారత్ మరింత సన్నద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది'' అని రాశారు.

''భారత్‌లో కొందరు వ్యూహాత్మక స్వతంత్ర ప్రతిపత్తిని కొనసాగిస్తామని, లేదంటే చైనాకు దగ్గరవుతామని అనుకుంటున్నారు. కానీ, ట్రంప్ భారత్‌ విషయంలో ఇలానే ఆలోచిస్తారని అనుకోను. ప్రస్తుతానికి, చైనాతో పోటీ గురించి ట్రంప్ ఆందోళన చెందడం లేదు. భారత్ తన వ్యూహాత్మక స్వతంత్ర ప్రతిపత్తిని ఎప్పటికీ వదులుకోదని ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు'' అని ఆయన రాశారు.

‘‘అసలు.. రష్యా, పాకిస్తాన్, అమెరికా , పాకిస్తాన్ మధ్య బలపడుతున్న సంబంధాల గురించి భారతీయులు ఎందుకు ఆందోళన చెందడం లేదు?’’ అని తన్వీ మదన్ ప్రశ్నిస్తున్నారు.

''ఒకప్పుడు పాకిస్తాన్‌కు అమెరికా కంటే పెద్ద సైనిక సామగ్రి సరఫరాదారు రష్యా. భారత్ కూడా దీని గురించి ఫిర్యాదులు చేసింది. కానీ, భారత్ ఫిర్యాదు కారణంగా పాకిస్తాన్‌తో చేపట్టిన ఎఫ్‌డీఎఫ్‌ఏ ప్రాజెక్టు నుంచి రష్యా వైదొలుగుతుందని అనుకోవడం లేదు. అమెరికాతో భారత్ వివాదం శాశ్వతం కాదని రష్యాకు తెలుసు. అమెరికాకు భారత మార్కెట్ అవసరం. ఇటీవల, తాలిబాన్ల విషయంలో రష్యా, పాకిస్తాన్ మధ్య సహకారాన్ని మనం గమనించవచ్చు. గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగిన నాలుగు నెలల అనంతరం చైనా, రష్యా మధ్య రక్షణ సహకారం పెరిగింది'' అని ఆయన రాశారు.

తన్వీ మదన్ ఇంకా ఇలా రాశారు, "రష్యా, అమెరికా సంబంధాలు మెరుగుపడడం అమెరికా - భారత్ సంబంధాల్లో ఒత్తిడిని తగ్గించగలదు. అయితే, అమెరికా - రష్యా మధ్య స్నేహ సంబంధాలు చైనా - రష్యా మధ్య దూరాన్ని పెంచుతాయని చాలామంది భారతీయులు భావించారు. కానీ, అలా జరగదని విశ్వసిస్తున్నా. చైనా, రష్యా రెండింటితోనూ ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.''

"ఇది భారత్‌కు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని అనుకుంటున్నా. పొగడ్తలను పుతిన్ ఒక సాధనంగా చూస్తారు, దానిని మనం బలహీనతకు గుర్తుగా చూడకూడదు. 1960 - 70ల కాలం, లేదా బోరిస్ యెల్సిన్, క్లింటన్ మధ్య జరిగిన చర్చలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌ను పణంగాపెట్టి ప్రయోజనం పొందేందుకు కూడా రష్యా సంకోచించదు. ఇక్కడ అమెరికా ఒక్కటే కాదు.''

అమెరికా అహంకారపూరిత చర్యల నుంచి ప్రయోజనం కలుగుతుందని భావించిన ప్రతిసారీ, పుతిన్ దానిని సంతోషంగా వినియోగిస్తారని చాలామంది నమ్ముతున్నారు. ఉదాహరణకు, ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్ , పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ.

ఆ తర్వాత రష్యా నుంచి వెలువడిన ప్రకటనలో, కాల్పుల విరమణకు ట్రంప్‌కు క్రెడిట్ ఇచ్చారు. ఓవైపు ట్రంప్ వాదనలను భారత్ తిరస్కరిస్తున్న సమయంలో రష్యా నుంచి అలాంటి ప్రకటన వచ్చింది. 2019లో, భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ఏర్పడినప్పుడు.. రష్యా మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చింది.

అమెరికా, భారత్, రష్యా, డోనల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు సవాల్

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, సెంటర్ ఫర్ రష్యన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజన్ కుమార్ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం విషయంలో భారత్ భారీ సవాల్‌ను ఎదుర్కొంటోందని అన్నారు.

"ఏదో ఒక గ్రూపును ఎంచుకోవాలని భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది, కానీ అది భారత్‌కు ఏవిధంగానూ అనుకూలంగా లేదు. అమెరికా కోసం రష్యాను భారత్ వదులుకోలేదు, అలాగని.. కేవలం రష్యాతో మాత్రమే ఉండలేదు. భారత్‌పై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోదీ చైనా పర్యటన, అమెరికాయేతర నేతృత్వంలోని గ్రూపులో మరింత చురుగ్గా ఉండాలని భారత్ కోరుకుంటున్నట్లు చూపుతుంది. భారత్‌తో యుద్ధంలో పాకిస్తాన్‌కు చైనా సాయం చేసిన కొద్ది నెలలకే, ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్తున్నారు.''

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం న్యూదిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ పర్యటన అనంతరం, వాంగ్ యీ పాకిస్తాన్ వెళ్లనున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో వ్యూహాత్మక చర్చల్లో వాంగ్ యీ పాల్గొంటారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వాంగ్ యీ పర్యటన గురించి భారత్‌కు చెందిన ప్రముఖ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ ఎక్స్‌లో ఇలా రాశారు. "మే 7 - 10 మధ్య జరిగిన భారత్ - పాకిస్తాన్ సైనిక సంఘర్షణ సమయంలో చైనా తెరచాటు మూడోపక్షంలా ప్రవర్తించింది. పాకిస్తాన్‌‌కు రియల్ టైం ఇంటెలిజెన్స్‌ను అందించింది. దీంతో పాటు రాడార్, శాటిలైట్ ఇన్‌పుట్‌లు కూడా అందించింది. ఇండియన్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ స్వయంగా ఈ విషయం చెప్పారు.''

"ఈ నెలాఖరున మోదీ చైనాలో పర్యటించనున్నారు. లద్దాఖ్‌లో 2020 ఏప్రిల్‌కి ముందు, భారత్ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని చైనా ఇప్పటికీ ఖాళీ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పర్యటన జరుగుతోంది. ఇది 2020 ఏప్రిల్‌కి ముందు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని పునరుద్ధరించాలనే డిమాండ్‌ను వదులుకున్నట్లు సూచిస్తుంది'' అని చెల్లానీ రాశారు.

అమెరికా, భారత్, రష్యా, డోనల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

సోమవారం జైశంకర్‌తో వాంగ్ యీ భేటీ తర్వాత, చైనా మాండరిన్ భాషలో ఒక ప్రకటన విడుదల చేసింది. తైవాన్‌ను చైనాలో భాగంగా భారత్ అంగీకరించిందని అందులో పేర్కొంది. అయితే, వాంగ్ యీ పర్యటన గురించి భారత్ అధికారికంగా ఎలాంటి విషయాలూ వెల్లడించలేదు.

షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీలో, దక్షిణాసియాతో చైనా సంబంధాల నిపుణులు లిన్ మిన్వాంగ్ 'న్యూయార్క్ టైమ్స్‌'తో మాట్లాడుతూ, "చైనాతో సంబంధాలను భారత్ మెరుగుపరుచుకోవాలనుకుంటే, దానిని చైనా స్వాగతిస్తుంది. కానీ, భారత్‌ ఎలాంటి రాయితీలు పొందలేదు. చైనా తన ప్రయోజనాల విషయంలో రాజీపడదు, అలాగే పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడాన్నీ ఆపదు. భారత్ ప్రస్తుత వైఖరి ప్రధానంగా వ్యూహాత్మక సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో చైనాతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని భారత్ నిర్ణయించింది. చైనాఈ విషయాలను చాలా జాగ్రత్తగా అంచనా వేస్తుందని అనుకుంటున్నా" అన్నారు.

భారత్‌‌తో డోనల్డ్ ట్రంప్ శత్రుత్వ వైఖరి ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదమని ప్రముఖ భారతీయ - అమెరికన్ జర్నలిస్ట్ ఫరీద్ జకారియా సీఎన్ఎన్‌ కార్యక్రమంలో అన్నారు.

"గత 25 ఏళ్లుగా, భారత్‌ను అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా చూసింది. కానీ, డోనల్డ్ ట్రంప్ ఈ విధానాన్ని మార్చేస్తున్నారు. ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని కట్టడి చేయడంలో అమెరికాకు భారత్‌ను కీలకంగా పరిగణించారు. కానీ, భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ అవమానించారు. నిజానికి, భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది.''

"భారత్ విషయంలో ట్రంప్ తన వైఖరి మార్చుకున్నా.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెరికాపై విశ్వాసం దెబ్బతింది. అమెరికా తన అసలు రంగును బయటపెట్టిందని భారతీయులు భావిస్తున్నారు'' అని ఫరీద్ జకారియా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)