మూడేళ్లుగా ఏకాకి.. ఇప్పుడు అమెరికా గడ్డపై రెడ్ కార్పెట్ - ‘వచ్చేసారి మాస్కోలో’ ఏం జరగబోతోంది?

పుతిన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లారా గాట్సీ
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలాస్కాలో అత్యంత కీలక సమావేశం జరిగింది.

యుక్రెయిన్ యుద్ధంలో శాంతిని తీసుకొచ్చేందుకు దీన్నొక ముఖ్య ఘట్టంగా పరిగణించారు.

కానీ, ఎలాంటి ఒప్పందం, కాల్పుల విరమణ ప్రకటన లేకుండా ఈ సమావేశం ముగిసింది.

ఈసారి మాస్కోకు రావాలని మాత్రమే ఆహ్వానం అందింది.

మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. వాటిల్లో కొన్నింటికే సమాధానాలు లభించాయి.

అలాస్కాలో జరిగిన సమావేశానికి సంబంధించి ఐదు కీలక విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1) రెడ్ కార్పెట్‌పై పుతిన్

శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ అలాస్కాకు వచ్చినప్పుడు, ఆకాశంలో మబ్బులు కమ్ముకుని ఉన్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆయన కోసం జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచర్డ్సన్ (అమెరికా మిలటరీ బేస్) వద్ద రెడ్ కార్పెట్‌పై వేచిచూస్తున్నారు.

పుతిన్ ముందుకు వచ్చినప్పుడు ట్రంప్ చప్పట్లు కొట్టారు.

ఇద్దరు నేతలు ఆప్యాయంగా కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత నవ్వుతూ పలకరించుకున్నారు.

పుతిన్‌కు ఆ క్షణం ఎంతో ముఖ్యం.

2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు ఆయనను ఏకాకి చేశాయి.

అప్పటి నుంచి ఆయన అంతర్జాతీయ ప్రయాణాలు కేవలం రష్యాకు మద్దతిచ్చే ఉత్తర కొరియా, బెలారస్ వంటి దేశాలకే పరిమితమయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అలాస్కా సమావేశం పుతిన్‌కు ఒక విజయం లాంటిదే.

కానీ, ఆయనను ఆహ్వానించిన విధానం రష్యా ఊహాలకు అందనిదే.

పుతిన్‌‌ను పాశ్చాత్య దేశాలు 'గ్రహాంతరవాసి'గా పిలిచిన కేవలం ఆరు నెలల్లోనే అమెరికా గడ్డపై ఒక అతిథిగా, భాగస్వామిగా సాదర స్వాగతం అందుకున్నారు.

ఈ మొత్తంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

మాస్కో ప్లేట్‌తో ఉన్న అధ్యక్షుడి కారును వదిలి.. ట్రంప్ ఆర్మ్డ్ లిమోసిన్‌లో ఎయిర్‌బేస్‌కు వెళ్లాలని పుతిన్ నిర్ణయించుకున్నారు.

కారు వస్తున్నప్పుడు, కెమెరాలన్నీ ఆ కారుపైనే. అందులో పుతిన్ వెనుక సీటులో కూర్చుని నవ్వుతూ కనిపించారు.

పుతిన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

2) ఎన్నడూ అడగని ప్రశ్నలను పుతిన్‌ను అడిగారు

రష్యాలో 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న పుతిన్ మీడియాపై పూర్తి పట్టు సాధించారు.

రష్యాలో ఎప్పుడూ కూడా ఆయన తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలను ఎదుర్కోలేదు.

కానీ, పుతిన్ అలాస్కా చేరుకోగానే, ''సామాన్య ప్రజలను చంపడం ఆపివేస్తారా?'' అని ఒక జర్నలిస్టు అడిగారు.

దానికి సమాధానం చెప్పకుండానే పుతిన్ ముఖం తిప్పేశారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి, ఫోటో సెషన్‌లో కూడా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీతో త్రైపాక్షిక సమావేశం పుతిన్ నిర్వహిస్తారా? అని ఒక రష్యన్ జర్నలిస్టు అడిగారు.

దానికి సమాధానంగా పుతిన్ చిరునవ్వు నవ్వి మౌనంగా ఉన్నారు.

ట్రంప్, పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్

ఫొటో సోర్స్, Reuters

3) సంభాషణ ముగిసినప్పుడు ఏం చెప్పారు?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్‌ ఉంటుందేమోనని భావించింది.

కానీ, రెండు దేశాల నేతలు కేవలం తమ ప్రకటనలు మాత్రమే చేశారు. ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు.

ఎప్పటిలాగా కాకుండా పుతిన్ ముందు మాట్లాడారు.

చాలా గౌరవంగా ఈ సంభాషణను కొనసాగించారు. అలాస్కా రష్యా చరిత్రలో భాగమని ప్రస్తావిస్తూ ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత కొన్ని నిమిషాలకు, యుక్రెయిన్‌లో పరిస్థితిపై మాట్లాడారు.

అసలు సమస్య పరిష్కారం కాకుండా శాంతి ఉండదని అన్నారు.

యుక్రెయిన్‌కు, ఇతర దేశాలకు ఈ ప్రకటన ఒక హెచ్చరిక పంపినట్లయింది.

2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ ఒకే రకమైన డిమాండ్లు చేస్తున్నారు.

క్రిమియా, డోనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్‌లపై రష్యా సార్వభౌమత్వాన్ని గుర్తించడం.. యుక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయకపోవడం, విదేశీ బలగాలను వెనక్కి తీసుకోవడం, యుక్రెయిన్ ఎన్నికలు, నాటోలో చేరాలనే లక్ష్యాన్ని వదిలిపెట్టడం వంటివి పుతిన్ డిమాండ్ చేస్తున్నారు.

సులభంగా చెప్పాలంటే, ఈ షరతులు యుక్రెయిన్ ఓటమిని అంగీకరించి, సరెండర్ కావాలనేలా ఉన్నాయి.

యుక్రెయిన్‌కు ఇవి ఆమోదయోగ్యంగా ఉండటం లేదు. మూడున్నర ఏళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యాకు ఇప్పటికీ ఇవే ముఖ్యంగా ఉన్నాయి.

దీంతో, ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టమైంది.

రెడ్ కార్పెట్‌పై పుతిన్‌కు స్వాగతం

ఫొటో సోర్స్, Getty Images

4) యుక్రెయిన్ పేరే ప్రస్తావించలేదు

ఈ సమావేశం అసలు కారణాన్ని సందర్భాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ట్రంప్ యుక్రెయిన్ పేరును ప్రస్తావించకపోవడం, కాల్పుల విమరణకు పిలుపునివ్వకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.

''ప్రతివారం ఆరేడు వేల మంది ప్రజలు చనిపోతున్నారు'' అని చెప్పారు.

ఈ రక్తపాతాన్ని పుతిన్ కూడా ముగించాలనుకుంటున్నారని తెలిపారు.

సాధారణంగా చాలా ఎక్కువగా మాట్లాడే ట్రంప్, ఈ సారి పుతిన్ కంటే చాలా తక్కువగా మాట్లాడారు.

ఆయన ప్రకటన చాలా చిన్నగా ఉంది. ఇది అసాధారణం.

ఈ ప్రకటనలో అస్పష్టత సమావేశంలో ఏం జరిగిందోననేలా ప్రపంచాన్ని అయోమయంలో పడేసింది.

చర్చల్లో తాను, పుతిన్ గొప్ప పురోగతి సాధించామని ట్రంప్ చెప్పారు, కానీ ఆ పురోగతి ఏంటనే విషయంలో తగిన వివరాలు అందించకుండా ప్రపంచం ఊహకు వదిలేశారు.

యుక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు.

ఎలాంటి కీలకమైన ఒప్పందం జరగలేదు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీతో ఎలాంటి త్రైపాక్షిక సమావేశాన్ని కూడా ప్రకటించలేదు.

రష్యాకు భారీ ఊరటనిస్తూ.. కాల్పుల విరమణను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన విషయాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించలేదు.

'' ఇంకా మేం అక్కడికి (కాల్పుల విరమణ వరకు) చేరుకోలేదు'' అని ట్రంప్ అంగీకరించారు.

పుతిన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుతిన్ సాధారణంగా ఇంగ్లీష్‌లో మాట్లాడరు. కానీ, అలాస్కాలో ఆయన నవ్వుతూ, వచ్చేసారి మాస్కోలో కలుద్దామని ట్రంప్‌తో అన్నారు.

5) వచ్చేసారి మాస్కోలో..

యుక్రెయిన్ యుద్ధం విషయంలో ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించనప్పటికీ, రష్యా, అమెరికాల మధ్య సంబంధాలను ఈ సమావేశం మరింత దగ్గర చేసింది.

ఇరు నేతలు కరచాలనం చేసుకున్న ఫోటోలు, నవ్వుతూ పలకరించుకోవడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పుతిన్ కోసం అమెరికా సైనికులు రెడ్ కార్పెట్‌ పరుస్తున్న చిత్రాలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి.

కాగా.. 2020 ఎన్నికల్లో తాను గెలిచి ఉంటే, యుక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమయ్యేది కాదని ట్రంప్ పదేపదే చెప్తున్న మాటలతో పుతిన్ కూడా ఏకీభవించారు.

గొప్ప పురోగతి ఉందని ట్రంప్ చెబుతున్నప్పటికీ, అలాస్కా సమావేశం ఎలాంటి స్పష్టమైన ఫలితాలను ఇవ్వకుండానే ముగిసింది.

వచ్చే సమావేశం రష్యాలో జరిగే అవకాశం ఉందని మాత్రం నేతలిద్దరూ సంకేతాలిచ్చారు.

''బహుశా, త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుసుకుంటాను'' అని ట్రంప్ అన్నారు.

ఎలాంటి వాగ్దానం, రాజీ లేకుండా.. ''వచ్చేసారి మాస్కోలో'' అంటూ ఇంగ్లీష్‌లో జోక్ వేసేందుకు పుతిన్ చాలా సౌకర్యంగా ఫీలైనట్లు అనిపించింది.

ట్రంప్ నవ్వుతూ.. ''ఓ.. దట్స్ ఇంట్రెస్టింగ్, దానికి నేను విమర్శలు ఎదుర్కొంటాను. కానీ, యెస్, ఇది జరుగుతుందని నేను భావిస్తున్నా'' అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)