ట్రంప్‌తో సుంకాల వివాదంలో భారత్ ముందున్న దారులేంటి?

భారత్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, M WATSON/AFP via Getty Images

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియాలో మిగిలిన దేశాల కన్నా ఎక్కువగా భారతదేశంపై 50 శాతం సుంకాన్ని విధించారు. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయి.

గతంలో ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించారు.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించారు.

దీనిపై భారత్ స్పందించింది. రష్యా నుంచి యురేనియం, ఎరువులు కొనుగోలు చేస్తున్న అమెరికా, యూరప్ భారత్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని పేర్కొంది.

బీబీసీ హిందీ వీక్లీ ప్రోగ్రామ్ 'ది లెన్స్'లో, కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముఖేశ్ శర్మ భారతదేశంపై అమెరికా విధించిన సుంకాలు, భారత్-అమెరికా సంబంధాలు, ప్రస్తుత పరిస్థితిలో భారత్ ముందున్న సవాళ్లు, అవకాశాల గురించి మాట్లాడారు.

ఈ చర్చలో ముఖేశ్ శర్మతో పాటు భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శశాంక్, దౌత్య వ్యవహారాలపై అవగాహన ఉన్న జర్నలిస్ట్ స్మితాశర్మ పాల్గొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, MANDEL NGAN/AFP via Getty Images

భారత్, అమెరికా మధ్య సంబంధాలు మారుతున్నాయా?

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల అంశం నిత్యం చర్చనీయాంశంగా మారింది. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

అంతకుముందు భారత్, అమెరికా మధ్య సంబంధాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని భావించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, అమెరికా సంబంధాలు మారుతున్నాయనే చర్చ మొదలైంది.

గత 20-25 సంవత్సరాలలో భారత్, అమెరికాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రపంచంలో మారుతున్న కొత్త లెక్కల ప్రకారం రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శశాంక్ అన్నారు.

అయితే ప్రస్తుతం భారతదేశం, అమెరికా సంబంధాలు ఇలా ఉండడానికి ట్రంప్ వైఖరి కారణమని నిపుణులు భావిస్తున్నారు. భారత్ విషయంలో ట్రంప్ వైఖరిని ఒక వ్యక్తి, వ్యక్తిత్వం, రాజకీయాల సమస్యగా చూస్తున్నారు జర్నలిస్ట్ స్మితా శర్మ.

''ఓ వైపు ట్రంప్, ఆయన వ్యక్తిత్వం, ఆయన రాజకీయాలు ఉన్నాయి. ట్రంప్‌కు నియమ, నిబంధనలు లేవు. 2016లో మొదటిసారి అధ్యక్షుడైన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉందో కూడా మనం గుర్తుంచుకోవాలి" అని స్మితాశర్మ అన్నారు.

"అప్పుడు కూడా భారత్‌కు అనుకూలం కాని అనేక నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నారు. ట్రంప్ పరిపాలనాయంత్రాంగం ఒత్తిడి కారణంగా, భారత్ 2019 మేలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేసింది" అని స్మితా శర్మ గుర్తు చేశారు.

భారత్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, ALEXANDER NEMENOV/AFP via Getty Images

‘చైనాకు చెక్ పెట్టేందుకా’

భారత్ అనుసరిస్తున్న అనేక రకాల వాణిజ్య చర్యల వల్ల, భారత మార్కెట్లో తాము కోరుకుంటున్న పురోగతిని సాధించలేకపోతున్నామని అమెరికా సహా ఇతర దేశాలు భావిస్తున్నాయని స్మిత చెప్పారు.

అమెరికా, భారతదేశం సంబంధాలలో ఈ మార్పుకు భౌగోళిక రాజకీయాలు కూడా కారణమని శశాంక్, స్మితా శర్మ భావిస్తున్నారు.

"వచ్చే 20 ఏళ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ శక్తిగా అవతరిస్తామని, అమెరికాను వెనక్కి నెట్టివేస్తామని చైనా అంటోంది. చైనా చెప్పే విషయంలో వాస్తవికతను పరిశీలించడానికి ట్రంప్ దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఈ చర్యతో రెండు ప్రధాన బ్రిక్స్ దేశాలయిన భారత్, బ్రెజిల్ తన నియంత్రణలోకి రావచ్చని ఆయన భావించారు'' అని శశాంక్ అన్నారు.

భారత్ అలీన విధానాన్ని విడిచిపెట్టి, ఒక వైపే ఉండాలని అమెరికా పరిపాలనాయంత్రాంగంలో కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇది భారత విదేశాంగ విధానంలో లేదు.

భారత్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

అలీన విధానాన్ని భారత్ కొనసాగించగలదా?

భారతదేశానిది అలీన విధానం. అలా ఉంటూనే దిశానిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ప్రస్తుతం రష్యా విషయంలో భారత్‌పై అమెరికా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

ప్రస్తుత కాలంలో భారత్ అలీనదేశంగా ఉండగలదా..? అది ఆచరణాత్మక పరిష్కారమా? అన్న ప్రశ్నకు "ఈ పరిష్కారం అలాగే ఉంటుంది. మన దేశ రాజకీయాల్లో ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ, మన విదేశాంగ విధానంలో కొన్ని నియమాలున్నాయి. వాటిలో ఒకటి ఏ పెద్ద పాశ్చాత్య శక్తికి లేదా యుద్ధంలో ఏ పెద్ద శిబిరానికి భారత్ మిత్రదేశంగా మారదు" అని స్మితా శర్మ సమాధానమిచ్చారు.

అయితే, చాలా సంద్భాల్లో భారత్ పరిస్థితిలో వచ్చిన మార్పులను కూడా ఆమె ప్రస్తావించారు.

"మోదీ ప్రభుత్వ హయాంలో గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్‌తో సంబంధాలు బలోపేతమయ్యాయి. పాలస్తీనా విషయంలో, మనం మన సంప్రదాయ వైఖరి నుంచి బాగా పక్కకు జరిగాం. గత కొన్నేళ్లుగా అమెరికాతో భారతదేశ సాన్నిహిత్యం చాలా పెరిగినట్టు అనిపించింది'' అని స్మితాశర్మ అన్నారు.

''కొన్నేళ్లగా రక్షణ రంగంలో రష్యా నుంచి దిగుమతులను భారత్ చాలావరకు తగ్గించుకుంది. కొన్ని సంవత్సారల క్రితం వరకు, భారత్ తన ఆయుధాలు, పరికరాలలో 75 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం, రష్యా నుంచి ఈ దిగుమతి 38 నుంచి 40 శాతం ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్, ఇజ్రాయెల్ అమెరికా నుంచి భారత్ పరికరాలను కొనుగోలు చేస్తోంది'' అని స్మిత చెప్పారు.

రష్యాతో సంబంధాలను బలహీనం చేసుకోవాలని భారత్ భావించడం లేదని, కానీ గత రెండు,మూడేళ్లగా యూరప్‌లో జరుగుతున్న యుద్ధంతో, రష్యా ప్రభావం పరిధి తగ్గుతున్నట్టు, చైనా ప్రభావం పరిధి పెరుగుతున్నట్టు కనిపిస్తోందని శశాంక్ అన్నారు.

"రష్యాను మిత్రదేశంలాగానే ఉంచేందుకు భారత్ నిరంతరం ప్రయత్నిస్తోంది. అయితే ప్రపంచంలో రష్యా స్థానాన్ని లేదా సోవియట్ యూనియన్ స్థానాన్ని ఆక్రమించడం ద్వారా జీ2 తరహా సంబంధాన్ని ఏర్పరచడానికి చైనా ప్రయత్నిస్తోంది. అలా ఉండకూదు'' అని ఆయన అన్నారు.

భారత్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గతంలోనూ ట్రంప్ భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని నిపుణులు అంటున్నారు.

అమెరికా సుంకాల విషయంలో భారత్ ఏమి చేయగలదు?

ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలన్నదే ప్రస్తుతం భారత్‌ ముందున్న అతిపెద్ద సవాలు అని స్మితా శర్మ అభిప్రాయపడ్డారు. ట్రంప్ వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే, ఆయన్ను ఎదిరించి, సవాలు చేయడం ముఖ్యమని ఆమె అన్నారు.

‘‘కానీ ట్రంప్‌ను సవాలు చేయడానికి గానీ, అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించడానికి భారత్‌కు అవకాశం లేదు.

దీనికి కారణం భారత ఎగుమతిదారులు అమెరికాకు ఎగుమతి చేసే అనేక వస్తువులు అమెరికా ఇతర పోటీ మార్కెట్ల నుంచి పొందగల ఉత్పత్తులు. ఆ పోటీ మార్కెట్లు బంగ్లాదేశ్, ఇండోనేసియా, కంబోడియా, వియత్నాం. వీటిపై అమెరికా భారతదేశం కంటే తక్కువ సుంకాలను విధించింది'' అని స్మిత చెప్పారు.

చైనాలా, భారత్ సెమీకండక్టర్లను లేదా అరుదైన భూ ఖనిజాలను ఎగుమతి చేయదని ఆమె అన్నారు.

"ట్రంప్‌తో సంప్రదింపులు జరపడానికి మీ దగ్గర ప్రస్తుతం ఏముందనేది ఒక పెద్ద సవాలు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య సంపదకు సంబంధించిన మార్కెట్లను తెరవకపోతే, ఇతర అవకాశాలేమున్నాయి'' అని ఆమె ప్రశ్నించారు.

భారత్‌లో అధికారంలో ఉండే ఏ పార్టీకైనా వ్యవసాయం, మత్స్య పరిశ్రమ వంటి రంగాల్లోకి ఇతరదేశాలను అనుమతించడం కష్టమని స్మితా శర్మ అన్నారు.

ఇలాంటి పరిస్థితిలో, భారతదేశం ఏం చేయాలి, ఏం చేయగలదు?

"ఈ సమయంలో భారత్ అమెరికా నుంచి ఏమి కొనగలదో చూడాలి. అమెరికా నుంచి వీలైనంత ఎక్కువగా రక్షణ పరికరాలను కొంటామని భారత్ చెప్పగలదు'' అని ఆమె చెప్పారు.

భారత్ ఇప్పుడు ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాల్సి ఉంటుందని, ఎందుకంటే ప్రస్తుతం అన్ని విషయాలూ వ్యాపారలావాదేవీలకు అనుసంధానమై ఉన్నాయని, అదే నిజమైన శక్తి అని స్మితాశర్మ విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)