పురులియా: 30 ఏళ్లకిందట ఆకాశం నుంచి వందల ఏకే 47లు, గ్రెనేడ్లు ఇక్కడ ఎందుకు జారిపడ్డాయి, ఏం జరిగింది?

పురులియా, ఆయుధాలు జారవిడవడం, బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పురులియాలో రష్యన్ ఆంటోనోవ్ AN 26 విమానం ఆయుధాలను జారవిడిచింది.
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1995 డిసెంబర్ 17 రాత్రి. నాలుగు టన్నుల బరువున్న ప్రమాదకరమైన ఆయుధాలున్న రష్యన్ ఆంటోనోవ్ ఏఎన్-26 విమానం కరాచీ నుంచి ఢాకాకు బయలుదేరింది.

ఆ విమానంలో ఎనిమిది మంది ఉన్నారు. కిమ్ పీటర్ డేవి అనే డెన్మార్క్ దేశీయుడు, పీటర్ బ్లీచ్ అనే బ్రిటిష్ ఆయుధ వ్యాపారి, సింగపూర్‌లో ఉంటున్న భారత సంతతి వ్యక్తి దీపక్ మణికాన్, మరో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఐదుగురు రష్యన్ మాట్లాడేవారు, లాత్వియా పౌరులు.

ఈ విమానం వారణాసిలోని బాబత్‌పూర్ విమానాశ్రయంలో ఇంధనం నింపుకుంది. అక్కడ, విమానంలోని ఆయుధాల చెక్క పెట్టెలకు మూడు పారాచూట్లు కట్టారు.

సీబీఐకి పీటర్ బ్లీచ్ ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలను అంగీకరించారు. కరాచీకి వచ్చే ముందు ఆ ఆయుధాలను బల్గేరియాలోని బుర్గాస్‌లో విమానంలో లోడ్ చేసినట్లు చెప్పారు.

సీనియర్ జర్నలిస్ట్ చందన్ నంది 'ది నైట్ ఇట్ రెయిన్డ్ గన్స్' పుస్తకంలో "వారణాసి నుంచి బయలుదేరిన తర్వాత, విమానం గయ మీదుగా తన మార్గాన్ని మార్చుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని చాలా వెనుకబడిన జిల్లా పురులియా చేరుకున్న వెంటనే, తక్కువ ఎత్తులో ఎగరడం ప్రారంభించింది. అక్కడ, పారాచూట్‌లు కట్టిన మూడు పెద్ద చెక్క పెట్టెలను పడేశారు. అందులో వందలాది ఏకే 47 రైఫిల్స్‌ ఉన్నాయి" అని రాశారు.

"ఆనంద్ మార్గ ప్రధాన కార్యాలయానికి దగ్గరగా ఉన్న ఝల్దా గ్రామం సమీపంలో ఈ సామగ్రిని పడేశారు. తర్వాత, విమానం ముందుగా నిర్ణయించిన మార్గంలో వెళ్లడం ప్రారంభించింది. అది కలకత్తా‌లో దిగి, ఇంధనం నింపుకుని థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్లింది" అని పుస్తకంలో రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పురులియా, ఆయుధాలు జారవిడవడం, బ్రిటన్

ఫొటో సోర్స్, Rupa

ఫొటో క్యాప్షన్, ఆయుధాలు జారవిడిచిన ఘటనపై సీనియర్ జర్నలిస్ట్ చందన్ నంది 'ది నైట్ ఇట్ రెయిన్డ్ గన్స్' పుస్తకం రాశారు.

ఆయుధాల ఒప్పందం

చందన్ నంది, బ్రిటిష్ జర్నలిస్ట్ పీటర్ పోప్హామ్ ప్రకారం, విమానంలో ఉన్న ఆయుధ డీలర్ పీటర్ బ్లీచ్‌కు బ్రిటిష్ నిఘా సంస్థ ఎంఐ6తో సంబంధాలున్నాయి. కొన్నిసార్లు వారి గూఢచర్య కార్యకలాపాలలో పీటర్ సహాయం చేశారు.

విమానం వారణాసి నుంచి బయలుదేరినప్పుడు, తన విమానాన్ని కూల్చేస్తారని బ్లీచ్‌ భయపడ్డారు.

బ్రిటన్ వార్తాపత్రిక 'ది ఇండిపెండెంట్' 2011 మార్చి 6వ తేదీ సంచికలో ప్రచురితమైన 'అప్ ఇన్ ఆర్మ్స్: ది బిజార్ కేస్ ఆఫ్ ది బ్రిటిష్ గన్ రన్నర్, ది ఇండియన్ రెబెల్స్ అండ్ ది మిస్సింగ్ డెన్' అనే వ్యాసంలో పీటర్ పోప్హామ్ ఇలా రాశారు.

"విమానయానానికి మూడు నెలల ముందు, ఒక డానిష్ కస్టమర్‌కు పెద్ద మొత్తంలో ఆయుధాలు కావాలని తనను సంప్రదించారని పీటర్ బ్లీచ్ నాతో చెప్పారు. ఈ ఆయుధాలు ఏ దేశానికీ కాదు, తీవ్రవాద సంస్థకు అని తెలుసుకున్నప్పుడు, దాని గురించి బ్రిటిష్ నిఘా విభాగానికి సమాచారం ఇచ్చారు బ్లీచ్.

బ్రిటిష్ నిఘా విభాగం అతనికి తన పని కొనసాగించాలని సలహా ఇచ్చింది. బ్లీచ్‌ తీవ్రవాద వ్యతిరేక స్టింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నానని, ఆయుధాలు పడవేసే ముందు భారత ఏజెన్సీలు దానిని అడ్డుకుంటాయని, అతను దాని నుంచి బయటపడతాడని నమ్మకంతో ఈ ఆపరేషన్‌లో భాగమయ్యారు" అని తెలిపారు.

ఆయుధ వ్యాపారి పీటర్ బ్లీచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆయుధ వ్యాపారి పీటర్ బ్లీచ్

పురులియాలో ఆయుధాలు జారవిడిచి...

ఈ మిషన్ సమయంలో, భారత ప్రభుత్వం దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎటువంటి సూచనలు లేవు.

పీటర్ పోప్హామ్ దీని గురించి వ్యాసంలో "వారణాసి నుంచి బయలుదేరినప్పుడు బ్లీచ్ ఆందోళనకు గురయ్యారు. విమానాన్ని కూల్చివేయాలని భారత్ నిర్ణయించుకుందని ఆయన భావించారు. తన జీవితానికి ముగింపు దగ్గర పడిందని భయపడ్డారు" అని రాశారు.

కాగా, విమానం ఆ రాత్రే చీకటిలో ఆయుధాలను జారవిడిచింది. కానీ, ఏమీ జరగలేదు. ఇబ్బందులు తొలగాయనుకున్నారు బ్లీచ్. కానీ అక్కడి నుంచే ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వందలాది AK-47 రైఫిళ్లు, ఆయుధాలు నేలపై చెల్లాచెదురుగా జనాలకు కనిపించాయి.

పురులియాలో జారవిడిచిన ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పురులియాలో ఆయుధాలు జారవిడిచారు.

పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తిన పశువుల కాపరి

డిసెంబర్ 18 ఉదయం, పురులియా జిల్లాలోని గనుడి గ్రామానికి చెందిన సుభాష్ తంతుబాయి తన పశువులను మేపడానికి ఆ ప్రాంతానికి వెళ్లారు. అకస్మాత్తుగా అతని కళ్లు అక్కడి గడ్డి మైదానంపై పడ్డాయి. అక్కడ ఏదో మెరుస్తోంది.

ఝల్దా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ప్రకారం.. సుభాష్ వాటి దగ్గరకు వెళ్లినప్పుడు, ఆయన ఇంతకు ముందెప్పుడూ చూడని తుపాకీ చూశారు. అక్కడ అలాంటివి, దాదాపు 35 తుపాకులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇది చూసి, ఝల్దా పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తారు సుభాష్.

స్టేషన్ ఇన్‌చార్జ్ ప్రణవ్ కుమార్ మిత్రా సీనియర్ జర్నలిస్ట్ చందన్ నందితో మాట్లాడుతూ "ఆ వార్త విన్న వెంటనే, యూనిఫాం వేసుకొని చితాము గ్రామానికి బయలుదేరాను. నేను అక్కడికి చేరుకున్నప్పుడు నేలపై పడి ఉన్న ఆలివ్ రంగు చెక్క పెట్టెలు విరిగిపోయి ఉన్నాయి, వాటిలోని ఆయుధాలు కనిపించలేదు"

"మా అధికారుల్లో ఒకరు ఇండియన్ ఆర్మీ సైనికుడికి ఫోన్ చేశారు. నా అభ్యర్థన మేరకు, సమీపంలోని చెరువులోకి దిగాడు. బయటకు వచ్చేటపుడు అతని చేతిలో ట్యాంక్-డిస్ట్రాయర్ గ్రెనేడ్ ఉంది. అప్పుడు ఇది ఎంత పెద్ద వ్యవహారమో అర్థమైంది" అని తెలిపారు.

అనంతరం, ఆయుధాలు తీసుకెళ్లిన వారు పోలీసులకు తిరిగివ్వాలని లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటన చేశారు.

ఆ తర్వాత బెలము, ఖతంగా, మరము, పగాడో, బెరాడి సమీపంలోని గ్రామాలలో చాలా సంఖ్యలో ఏకే 47 రైఫిళ్లు పడి ఉన్నాయని తెలిసింది. ఒక వ్యక్తి వచ్చి పొలంలో ఒక పెద్ద నైలాన్ పారాచూట్ పడి ఉందని, దాని కింద చాలా రైఫిళ్లు ఉన్నాయని చెప్పారు.

బ్రిటన్, బల్గేరియా, లాత్వియా, దక్షిణాఫ్రికా సంబంధిత అధికారులకు కలకత్తా కోర్టు పంపిన లేఖలో "పురులియా, దాని పరిసర ప్రాంతాల నుంచి మొత్తం 300 ఏకే-47 రైఫిళ్లు, ఇరవై ఐదు 9ఎంఎం పిస్టల్స్, రెండు 7.62 స్నైపర్ రైఫిళ్లు, 2 నైట్ విజన్ బైనాక్యులర్లు, 100 గ్రెనేడ్లు, 16,000 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు 4,375 కిలోలు" అని తెలిపింది.

ముంబయిలో బలవంతంగా ల్యాండింగ్

ఆయుధాలు భారత భద్రతా దళాల చేతుల్లోకి వెళ్లాయని వాటిని వదిలేసిన వారికి తెలిసింది. అయినప్పటికీ, వారు కరాచీకి తిరిగి పయనమయ్యారు. ఫుకెట్ నుంచి విమానంలో తిరిగి వస్తూ, కలకత్తాకు బదులుగా చెన్నైలో ఇంధనం నింపుకొని బయలుదేరారు.

విమానం ముంబయి చేరడానికి ఇంకా 15-20 నిమిషాల సమయం పట్టే సమయంలో, కాక్‌పిట్ రేడియోలో ఒక స్వరం వినిపించింది. రష్యన్ విమానాన్ని ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్ చేయాలని భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 విమానం ఆదేశించింది.

చందన్ నంది తన పుస్తకం 'ది నైట్ ఇట్ రెయిన్డ్ గన్స్'లో ఈ సంఘటనను వివరిస్తూ "విమానం ల్యాండ్ కావడం ప్రారంభించినప్పుడు, కిమ్ డేవీ ముఖంలో ఆందోళన పెరిగింది. అతను తన బ్రీఫ్‌కేస్ నుంచి కొన్ని కాగితాలను తీసి, వాటిని చిన్న ముక్కలుగా చించి, కాల్చాడు. ఆ తర్వాత వాటిని టాయిలెట్‌కు తీసుకెళ్లి ఫ్లష్ చేశారు.

అనంతరం, తన బ్రీఫ్‌కేస్ నుంచి నాలుగు ఫ్లాపీ డిస్క్‌లను తీసి ముక్కలుగా విరిచారు. లైటర్ తీసుకొని ముక్కలకు నిప్పంటించారు బ్లీచ్. ఆయన ఆ పని పూర్తి చేసే సమయానికి, విమానం చక్రాలు ముంబయి ఎయిర్ పోర్ట్ రన్‌వేను తాకుతున్నాయి’’ అని తెలిపారు.

పురులియా ఆయుధాల డీల్ సూత్రధారి కిమ్ డేవీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పురులియా ఆయుధాల డీల్ సూత్రధారి కిమ్ డేవీ

తప్పించుకున్న కిమ్ డేవీ

సహార్ అంతర్జాతీయ విమానాశ్రయం (ముంబయి)లో విమానం దిగేసరికి రాత్రి 1:40 అయింది. అయితే, వారికోసం అక్కడికి ఏ అధికారీ రాలేదు. 10 నిమిషాల తర్వాత ఇద్దరు వ్యక్తులతో విమానాశ్రయ జీప్ అక్కడికి వచ్చిందని పీటర్ బ్లీచ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

అక్కడేం చేస్తున్నారు, అనుమతి లేకుండా విమానం ఎందుకు దిగిందని వారు ప్రశ్నించారు?

చందన్ నంది తన పుస్తకంలో "కిమ్ డేవీ, బ్లీచ్ ఆ ఇద్దరు అధికారులతో మాట్లాడారు. భారత అధికారుల మూర్ఖత్వం, అసమర్థత పరాకాష్టకు చేరుకుంది. ల్యాండింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందా? అని డేవీ అడిగినప్పుడు, ఆ అధికారి అవును అని సమాధానం ఇచ్చారు"

అయితే, "విమానం ల్యాండ్ అయిన దాదాపు 45 నిమిషాల తర్వాత, మరో జీప్ అక్కడికి వచ్చింది. ఆరేడుగురు వ్యక్తులు సాధారణ దుస్తులలో ఉన్నారు. కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకుని, విమానాన్ని తనిఖీ చేయాలనుకుంటున్నామని చెప్పారు"

‘‘కస్టమ్స్ అధికారులు విమానంలోకి వెళ్లగానే, కిమ్ డేవీ కూడా అందులోకి ప్రవేశించారు. కాగితాలను తీసుకొని నిశ్శబ్దంగా విమానం నుంచి దిగారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. కొంత సమయం తర్వాత, విమానాన్ని 50 నుంచి 70 మంది సాయుధ భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు" అని రాశారు.

విమాన సిబ్బందికి జీవిత ఖైదు

అధికారులు పీటర్ బ్లీచ్‌తో పాటు ఐదుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధ ప్రయత్నాలు చేసిన అభియోగాలతో వారందరినీ విచారించారు.

రెండేళ్ల విచారణ తర్వాత, అందరికీ జీవిత ఖైదు పడింది.

దాదాపు 10 సంవత్సరాల తర్వాత కిమ్ డేవీ మళ్లీ కనిపించారు. ఆయన తాను చేసిన పనుల గురించి గొప్పలు చెప్పుకుంటూ డెన్మార్క్‌లో ఉన్నారు. డేవిని రప్పించడానికి భారత్ అనేక ప్రయత్నాలు చేసింది, కానీ ఫలించలేదు.

డేవీ, బ్రిటన్, డానిష్

ఫొటో సోర్స్, Getty Images

డేవీ సంచలన ఆరోపణలు

డేవీ 2011 ఏప్రిల్ 27న ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఈ మొత్తం ఎపిసోడ్‌లో భారత నిఘా సంస్థ 'రా' పాత్ర ఉంది. ఆయుధాలను పడవేయడం గురించి భారత ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉంది. ఇది రా, బ్రిటిష్ నిఘా సంస్థ ఎంఐ6ల ఉమ్మడి ఆపరేషన్" అని పేర్కొన్నారు.

డేవీ ఆరోపణలను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఇందులో ఏ ప్రభుత్వ సంస్థ ప్రమేయం లేదని సీబీఐ పేర్కొంది. తరువాత, కిమ్ డేవీ దీనిపై 'దే కాల్డ్ మీ టెర్రరిస్ట్' అనే పుస్తకం కూడా రాశారు.

కిమ్ ఆ పుస్తకంలో "బిహార్‌కు చెందిన ఒక రాజకీయ నాయకుడు భారత్ నుంచి తప్పించుకోవడానికి నాకు సహాయం చేశారు. ఆయన సహాయంతో, వైమానిక దళ రాడార్‌లను కొంత సమయం ఆపివేయడం జరిగింది. దీంతో, ఆయుధాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా వదిలివేయవచ్చు. ఈ ఆయుధాల ఉద్దేశం ఆనంద్ మార్గ సంస్థ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో హింసను వ్యాప్తి చేయడం, దీన్ని ఒక సాకుగా చూపి జ్యోతి బసు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు" అని రాశారు.

ఆనంద మార్గ సంస్థ అంతకుముందు, కిమ్ డేవి వాదనల తర్వాత కూడా అన్ని ఆరోపణలను ఖండించింది. కొంతమంది తమ సంస్థ పరువు తీయాలని అనుకుంటున్నారని చెప్పింది. ఆయుధాలు జారవిడిచిన తర్వాత పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. అక్కడ పోలీసులకు ఆయుధాలు దొరకలేదని ఆనంద మార్గ పేర్కొంది.

ఈ ఘటన (పురులియా ఆర్మ్స్ డ్రాపింగ్)తో భారత పార్లమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో కొంతమంది ఎంపీలు భారత వైమానిక దళ రాడార్లు 24 గంటలూ పనిచేస్తాయా అని ప్రశ్నించడంతో, భారత వైమానిక దళ ప్రతినిధి ఎయిర్ వైస్ మార్షల్ ఎం. మెక్‌మహాన్ స్పందిస్తూ "రాడార్లు కాలిపోయే ప్రమాదం ఉన్నందున వాటిని 24 గంటలు యాక్టివ్‌గా ఉంచడం సాధ్యం కాదు" అని బదులిచ్చారు.

(పురులియా ఆర్మ్స్ డ్రాపింగ్ కమిటీ మూడో నివేదిక, పేజీ 7)

కిమ్ డేవీ 'దే కాల్డ్ మీ టెర్రరిస్ట్' అనే పుస్తకం, ఆయుధాలు జారవిడవడం

ఫొటో సోర్స్, People's Press

ఫొటో క్యాప్షన్, కిమ్ డేవీ 'దే కాల్డ్ మీ టెర్రరిస్ట్' అనే పుస్తకం రాశారు.

ఇండియాకు సమాచారం ఉందన్న బ్రిటన్

కిమ్ డేవీ తన విమాన ప్రణాళిక గురించి భారత ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉందని, విమానంలో ఎంతమంది ఉన్నారో, విమానంలో ఎన్ని ఆయుధాలున్నాయో, వాటిని ఎక్కడ పడేస్తున్నారో కూడా వారికి తెలుసని ఆరోపించారు.

ప్రభుత్వానికి తెలియకుండా శత్రుదేశం నుంచి ఆయుధాలతో నిండిన విమానం భారత భూభాగంలోకి తెలివిగల వ్యక్తి ఎవరైనా ఎందుకు తీసుకువస్తారని డేవీ ప్రశ్నించారు.

మాజీ ‘రా’ అధికారి ఆర్కే యాదవ్ తన పుస్తకం 'మిషన్ రా'లో "భారత పర్యటనలో ఉన్న బ్రిటిష్ హోం మంత్రి మైఖేల్ హోవార్డ్, ఆయుధాలను పడవేయడం గురించి ఇండియాకు బ్రిటిష్ ప్రభుత్వం ముందుగానే సమాచారం ఇచ్చిందని మీడియా సమావేశంలో చెప్పడంతో, డేవీ వాదనలు ధ్రువీకరణ అయ్యాయి" అని పేర్కొన్నారు.

‘‘ అయితే, విమానం కలకత్తాలో దిగడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎందుకు అనుమతించింది? రా సంస్థకు దీని గురించి ముందస్తు సమాచారం ఉంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో, స్థానిక పోలీసులు లేదా కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ వంటి ఇతర ప్రభుత్వ సంస్థలు వారణాసిలోనే విమానాన్ని ఎందుకు సెర్చ్ చేయలేదు?’’ అని తెలిపారు.

బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్

పీటర్ బ్లీచ్, సిబ్బంది విడుదల

"రష్యన్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే విమానాశ్రయ భవనం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో నిలిపి ఉంచారు. భద్రతా, నిఘా సంస్థలు అక్కడికి చేరుకున్నప్పుడు, విమానం డోర్ తెరిచే ఉంది. డేవీని అక్కడి నుంచి విమానాశ్రయంలోకి ప్రభుత్వ వాహనంలోనే తీసుకెళ్లారు. ఎటువంటి కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు లేకుండా అక్కడి నుంచి వెళ్లడానికి అనుమతించారు" అని ఆర్.కె. యాదవ్ తన పుస్తకంలో రాశారు.

ఒక విదేశీ విమానం భారత గగనతలాన్ని ఉల్లంఘించి, పారాచూట్ సహాయంతో దాని భూభాగంలో ఆయుధాలను పడవేస్తుందనే విషయం ఊహకు అందనిది.

"విమానాన్ని బలవంతంగా ల్యాండ్ చేసినప్పటికీ, ఈ మొత్తం ఆపరేషన్ సూత్రధారి అయిన కిమ్ డేవీ అలియాస్ నీల్సన్, భారత భద్రతా సంస్థల చేతుల నుంచి తప్పించుకొవడం, ముంబయిలోని సహార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రహస్యంగా వెళ్లిపోవడం అర్థంకానిది" అని చందన్ నంది తన పుస్తకం 'ది నైట్ ఇట్ రెయిన్డ్ గన్స్'లో రాశారు.

పీటర్ బ్లీచ్ అరెస్టైన తర్వాత తప్పించుకుంటాననే ఆశతో జరిగినదంతా చెప్పేశారు. కానీ, ఆయనకు జీవిత ఖైదు పడింది.

2004లో టోనీ బ్లెయిర్ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు, భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆయనకు క్షమాపణ ప్రసాదించి, విడుదల చేశారు. ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి భారత ప్రధానమంత్రిగా ఉన్నారు.

అంతకు నాలుగేళ్ల కిందట, అంటే 2000 జూలై 22న, రష్యా ప్రభుత్వం అభ్యర్థన మేరకు విమాన సిబ్బందిని విడుదల చేశారు. ఆ సంవత్సరం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు ముందు ఈ చర్యను సద్భావన చిహ్నంగా తీసుకున్నారు. ఆ సమయంలో కూడా వాజ్‌పేయి భారత ప్రధానమంత్రిగా ఉన్నారు.

మాజీ రా అధికారి ఆర్కే యాదవ్ పుస్తకం, 'మిషన్ రా'

ఫొటో సోర్స్, Manas Publications

ఫొటో క్యాప్షన్, మాజీ రా అధికారి ఆర్కే యాదవ్ 'మిషన్ రా' పుస్తకం రాశారు.

సమాధానం దొరకని ప్రశ్నలు

చందన్ నంది తన పుస్తకం 'ది నైట్ ఇట్ రెయిన్డ్ గన్స్'లో "ఈ పథకానికి కనీసం మూడేళ్ల కిందట ప్లాన్ వేశారని దర్యాప్తులో తెలిసింది. కిమ్ డేవీ వద్ద రెండు నకిలీ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఒక పాస్‌పోర్ట్‌లో అతని పేరు కిమ్ పాల్‌గ్రేవ్ డేవీ, మరొక పాస్‌పోర్ట్‌లో పేరు కిమ్ పీటర్ డేవీ" అని తెలిపారు.

ఈ రెండు పాస్‌పోర్ట్‌లు 1991, 1992లో న్యూజీలాండ్ రాజధాని వెల్లింగ్టన్ నుంచి జారీ అయ్యాయి.

ఈ సంఘటన జరిగి దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నా, ఈ ఆయుధాలు ఎవరి కోసం పడవేశారు? ఎవరు పడేయమన్నారు, దానికి డబ్బులు ఎవరు చెల్లించారు? ఆ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఎందుకు ఆపలేదు?

ఈ ఆయుధాలు పడవేయడం గురించి 'రా' సంస్థకి ముందుగానే తెలుసా? తెలిస్తే, ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ దాని గురించి ఇతర ఏజెన్సీలకు ఎందుకు తెలియజేయలేదు?

కిమ్ డేవీని ముంబయి విమానాశ్రయం నుంచి ఎలా వెళ్లనిచ్చారు? డెన్మార్క్‌ ఎలా చేరారు? వంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)