ప్రపంచ పటంలోనే లేని దేశానికి నకిలీ రాయబార కార్యాలయం.. నిందితుడు అరెస్ట్

ఫొటో సోర్స్, ANI
ఘజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఎస్‌టీఎఫ్ యూనిట్ అరెస్ట్ చేసింది.
నిందితుడు తాను పశ్చిమ ఆర్కిటికా, సబోరా, పౌలివియా, లోదోనియా దేశాలకు తనను తాను రాయబారినంటూ పరిచయం చేసుకునేవారు.
ఈ కేసు వివరాలను ఎస్‌టీఎఫ్ ఎస్ఎస్పీ సుశీల్ ఘులే వెల్లడించారు.
''వెస్ట్ ఆర్క్‌టికా, సబోరా, పాల్వియా, లొదొనియా, మరికొన్ని దేశాలకు తాను రాయబారినంటూ సదరు వ్యక్తి తనకు తాను పరిచయం చేసుకునేవారు. ఆయన నుంచి దౌత్యాధికారుల మాదిరిగానే నంబరు ప్లేట్లను అమర్చిన వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ నెంబర్లకు ఏ అధికారిక సంస్థ ఆమోదం లేదు'' అని చెప్పారు.
ఘజియాబాద్ ఏరియాలోని కవి నగర్‌లో ఒక అద్దె ఇంట్లో నకిలీ రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి పేరు హర్షవర్థన్ జైన్ అని పోలీసులు చెప్పారు.


ఫొటో సోర్స్, ANI
నకిలీ పాన్‌కార్డులు, ఫోర్జరీ ఫోటోలు స్వాధీనం...
''నిందితుడు ఘజియాబాద్, కవి నగర్‌లోని కేబీ-45లో నివాసం ఉంటున్నారు. కవి నగర్, కేబీ-35లో ఒక అద్దె ఇంట్లో అక్రమంగా రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు'' అని సుశీల్ ఘులే వెల్లడించారు.
''ప్రజలను మోసగించడానికి నిందితుడు మార్ఫింగ్ చేసిన ఫోటోలను ఉపయోగించేవాడు. చాలామంది ప్రముఖులతో తనకు పరిచయం ఉన్నట్లుగా ఆ ఫోటోలతో నమ్మించేవాడు'' అని ఘులే చెప్పారు.
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసేవాడని, డొల్ల కంపెనీల ద్వారా హవాలా రాకెట్ నడుపుతున్నట్టు విచారణలో వెల్లడైందని తెలిపారు.
నిందితుడిని అరెస్టు చేస్తున్న సమయంలో, అతని వద్ద నుంచి భారీ సంఖ్యలో అనుమానిత, నకిలీ సామాగ్రిని ఎస్‌టీఎఫ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
వాటిలో....
దౌత్య తరహా నెంబర్ ప్లేట్లు ఉన్న నాలుగు వాహనాలు
12 రకాల అక్రమ పాస్‌పోర్టులు
రెండు నకిలీ పాన్ కార్డులు
వివిధ దేశాలు, కంపెనీల పేర్లతో 34 నకిలీ స్టాంపులు
రెండు ప్రెస్ కార్డులు
రూ.44.70 లక్షల నగదు
పలు దేశాల కరెన్సీ
అదనంగా 18 నకిలీ నంబర్ ప్లేట్లు
కంపెనీ సంబంధిత డాక్యుమెంట్లు
గతంలోనూ కేసు, అరెస్ట్
పోలీసు రికార్డుల ప్రకారం... హర్షవర్థన్ 2011లోనే ఒక కేసులో అరెస్టు అయ్యారు.
''ఆ కేసు కూడా అతనిపై కవి నగర్ పోలీసుస్టేషన్‌లోనే నమోదైంది. ఆ సమయంలో అతని వద్దనుంచి ఒక శాటిలైట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు'' అని ఎస్‌ఎస్‌పీ సుశీల్ ఘులే చెప్పారు.
హర్షవర్థన్‌పై ఇప్పుడు ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. అక్రమ వ్యవహారాలు, నకిలీ డాక్యుమెంట్ల తయారీ, మోసం విషయంలో వివిధ సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

ఫొటో సోర్స్, HTTPS://WWW.WESTARCTICA.INFO/
'వెస్ట్ ఆర్కిటికా’ ఉందా?
నకిలీ రాయబార కార్యాలయ వ్యవహారం వెలుగులోకి రావడంతో 'వెస్ట్ ఆర్కిటికా' కూడా వార్తల్లోకి వచ్చింది.
తాను రాయబారిగా నిందితుడు హర్షవర్థన్ చెప్పుకున్న దేశాలలో ఇదొకటి.
తొలిసారిగా ఈ పేరు వింటే... ఇదేదో చిన్న దేశమనో, ఎక్కడో దూరంగా ఉన్న దేశంగానో అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇదొక కల్పిత దేశం. అమెరికా నౌకాదళ మాజీ అధికారి ట్రావిస్ మెక్‌హెన్రీ 2001లో ఈ కల్పిత దేశాన్ని సృష్టించారు.
దీనికి సొంత వెబ్‌సైట్, జాతీయ పతాకం, అధికారిక చిహ్నం, కరెన్సీ ఉన్నాయి. అంటార్కిటికాలో ఏ దేశానికి అధికారికంగా హక్కులేని, మంచుతో కప్పి ఉన్నఅంటార్కిటికా భూభాగం తమ దేశమని ఇది సొంతంగా ప్రకటించుకుంది.
వెస్ట్ఆర్కిటికా వెబ్‌సైట్ చూస్తే... వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై అవగాహనకు కృషి చేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ అది. ఇది కూడా 'అంబాసడర్', 'సిటిజన్‌షిప్', ‘గౌరవనీయ బిరుదులు’ ఇస్తోంది.
అయితే ఏదేశం కానీ, లేదా ఐక్యరాజ్యసమితిగానీ ఎన్నడూ అదో నిజమైన దేశమని గుర్తించలేదు.
ఆ వెబ్‌సైట్ ప్రకారమే... వెస్ట్ ఆర్కిటికా దేశ ప్రభుత్వానికి అధిపతి గ్రాండ్ డ్యూక్ ట్రావిస్. ఆయనకు సహాయంగా ప్రధానమంత్రి, రాయల్ కౌన్సిల్ కూడా ఉన్నాయి. అక్కడ రూపొందించిన చట్టాలను అమలుచేయడానికి ఉన్న సంస్థ పేరు 'గ్రాండ్ డ్యూకల్ కోర్టు' .
ఆ స్వచ్ఛంద సంస్థ ఆశయాలను నెరవేర్చడానికి తమ విజ్ఙానాన్ని, సమయాన్ని, నైపుణ్యాలను వెచ్చించే ప్రజలు సభ్యులుగా ఉంటారని ఆ వెబ్ సైట్ పేర్కొంది.
ఇదంతా డిజిటల్, ప్రతీకాత్మకం మాత్రమే. వాస్తవ ప్రపంచంలో దీనికి న్యాయపరమైన లేదా దౌత్యపరమైన గుర్తింపు లేదు.
అయితే, ఈ వెస్ట్ ఆర్కిటికాకు, నిందితుడు హర్షవర్థన్ కు ఏదైనా సంబంధం ఉందా లేదా అనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














