కొలంబియాలో శశి థరూర్ ఏమన్నారు, భారత్ దౌత్య విజయంగా ఎందుకు అభివర్ణిస్తున్నారు?

ఫొటో సోర్స్, @ShashiTharoor
పాకిస్తాన్‌పై జరిగిన వైమానిక దాడుల్లో చనిపోయిన వారికి సంబంధించి కొలంబియా తన ప్రకటనను ఉపసంహరించుకుందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు.
పాకిస్తాన్‌లో జరిపిన దాడులు, తీవ్రవాదంపై భారత వైఖరిని తెలియజేసేందుకు శశి థరూర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం అమెరికా, లాటిన్ అమెరికా దేశాల్లో పర్యటిస్తోంది. ఈ ప్రతినిధి బృందం శుక్రవారం కొలంబియాలో పర్యటించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి (డిప్యూటీ మినిస్టర్), ఇతర ప్రతినిధులను కలిసింది.
''కొలంబియా ప్రకటనపై మనం ఆందోళన వ్యక్తం చేశాం, ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు.. ఈ విషయంలో భారత్ వైఖరిని పూర్తిగా అర్థం చేసుకున్నట్లు డిప్యూటీ మినిస్టర్ మాతో చెప్పారు'' అని థరూర్ అన్నారు.
నిజానికి, పాకిస్తాన్‌లో భారత వైమానిక దాడులను ఖండిస్తూ మే 8న కొలంబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, ఆ దాడుల వల్ల మరణించిన వారికి సంతాపం తెలిపింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన తీవ్రవాద దాడిలో ఒక స్థానికుడితో సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు, పాకిస్తాన్ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగినట్లు భారత్ ఆరోపించింది. ఆ తర్వాత, మే 7న పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలపై భారత్ వైమానిక దాడులు చేసింది.

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురువారం మాట్లాడుతూ, ''భారత్‌లో జరిగిన ఉగ్రదాడి బాధితులపై సానుభూతికి బదులు, పాకిస్తాన్‌లో జరిపిన దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ కొలంబియా చేసిన ప్రకటన కొంత నిరాశకు గురిచేసింది'' అన్నారు.
''ఆ ప్రకటన చేసిన సమయానికి, బహుశా పరిస్థితి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చని భావిస్తున్నాం'' అని శశి థరూర్ అన్నారు.
థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం కొలంబియా విదేశాంగ శాఖకు భారత్ వైఖరిని తెలియజేసింది.

ఫొటో సోర్స్, @ShashiTharoor
శశి థరూర్ ఏమన్నారంటే..
''ప్రకటనను ఉపసంహరించుకోవడం''పై కొలంబియా విదేశాంగ శాఖ డిప్యూటి మినిస్టర్ రోసా యోలాండా విలావిసెన్సియో సమక్షంలో శశి థరూర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
''మనం ఆందోళన వ్యక్తం చేసిన ప్రకటనను కొలంబియా అధికారికంగా ఉపసంహరించుకున్నట్లు డిప్యూటీ మినిస్టర్ మాకు చెప్పారు. మన వైఖరిని కొలంబియా పూర్తిగా అర్థం చేసుకుంది. వారి చొరవను గౌరవిస్తున్నాం.''
వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపిన ప్రకారం.. రోసా యోలాండా మాట్లాడుతూ ''ఈరోజు వారిచ్చిన వివరణాత్మక సమాచారంతో మాకు విషయం సవివరంగా తెలిసింది, అక్కడి వాస్తవ పరిస్థితి, ఘర్షణ, కశ్మీర్‌లో ఏం జరిగింది వంటివి తెలిశాయి'' అన్నారు.
''ఒకవైపు ఉగ్రవాదులు, మరోవైపు చూస్తే సామాన్య పౌరులు.. వారిద్దరినీ ఒకేలా చూడలేం. అలాగే, మన దేశంపై దాడి చేసిన వారికి, రక్షణ కోసం చేసే వారికీ మధ్య సారూప్యత సాధ్యం కాదు. కొలంబియా చేసిన ప్రకటనలో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని విస్మరించినట్లు అనిపించింది, అదే మాకు కొంత నిరాశ కలిగించింది'' అని కొలంబియా ఎంపీ అలెజాండ్రో టోరో సమక్షంలో ఎంపీ శశి థరూర్ అన్నారు.
"మా సార్వభౌమాధికారం కోసం, ప్రపంచంలో, ఉపఖండంలో శాంతి నెలకొల్పడం కోసం కొలంబియా ప్రతినిధిగా మాకు మద్దతుగా నిలవడం సంతోషకరం" అని ఆయన అన్నారు.
శశి థరూర్ ప్రకటన తర్వాత, ఇది భారత్ సాధించిన దౌత్య విజయంగా సోషల్ మీడియాలో అభివర్ణిస్తున్నారు.
సింధు జలాల ఒప్పందంపై..
‘ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు సంబంధించి, పాకిస్తాన్ వైపు నుంచి సంతృప్తికర సంకేతాలొచ్చేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది’ అని ఈ పర్యటన సందర్భంగా శశి థరూర్ అన్నారు.
''సింధు జలాల ఒప్పందం అనేది, 1960ల ప్రారంభంలో సద్భావన, సామరస్యంతో కుదుర్చుకున్న ఒప్పందం. ముందుమాటలో (సద్భావన, సామరస్యం) ఈ పదాలు ఉన్నాయి. విచారకరమైన విషయమేంటంటే, గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాద చర్యల వల్ల ఈ సద్భావనకు తూట్లు పడుతూనే ఉన్నాయి.''
''ఉగ్రవాదం, యుద్ధం వంటి సమయాల్లోనూ ఈ ఒప్పందం కొనసాగింది. కానీ, ఈసారి మా ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని నిలిపేసింది. ఈ ఒప్పందం ముందుమాటలో చెప్పినట్లు సద్బావన స్ఫూర్తితో పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం, అయితే, పాకిస్తాన్ నుంచి సంతృప్తికరమైన సంకేతాలొచ్చేంత వరకు ఈ ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, FLORENCE LO/POOL/AFP via Getty Images
కొలంబియా పాకిస్తాన్‌కు ఎందుకు మద్దతిచ్చింది..
భారత్ - పాకిస్తాన్ వివాదంలో, కొలంబియా గతంలో చేసిన ప్రకటన పాకిస్తాన్‌కు మద్దతుగా ఉండడానికి కారణం చైనా కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్'( BRI)లో చేరేందుకు కొలంబియా ఇటీవల సంతకం చేసింది.
ఈ బీఆర్ఐ ప్రాజెక్టులో పాకిస్తాన్ కూడా భాగస్వామి. పాక్ పాలిత కశ్మీర్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది.
బీఆర్ఐలో భాగంగా, చైనా - కొలంబియా మధ్య జాయింట్ కోఆపరేషన్ ప్లాన్‌పై సంతకాలు జరిగాయి. లాటిన్ అమెరికా దేశమైన కొలంబియా, ట్రంప్ టారిఫ్ ప్రకటనల తర్వాత చైనా వైపు మొగ్గుచూపుతోంది.
కొలంబియా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, 2025 బడ్జెట్‌లో దాదాపు 11 బిలియన్ డాలర్ల ఆర్థిక సర్దుబాట్లు అవసరం. పరిమిత ఆదాయం, పేరుకుపోయిన అప్పులతో కొలంబియా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














