స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి ఇండియా ఎందుకంత ప్రాముఖ్యమిస్తోంది, ఈ విమానం రాడార్‌కు దొరకదా?

స్టెల్త్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షకీల్ అక్తర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల దేశీయ తయారీకి భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. వీటి ప్రోటోటైప్ తయారీ కోసం రక్షణ కంపెనీలనుంచి ఆసక్తి వ్యక్తీకరణ కూడా కోరింది.

గగనతల పోరాటంలో అత్యంత ప్రభావం చూపే స్టెల్త్ యుద్ద విమానాలను ప్రస్తుతం అమెరికా, రష్యా చైనా మాత్రమే అభివృద్ధి చేస్తున్నాయి.

ప్రైవేటు కంపెనీలను కూడా భాగస్వాములను చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ భారత వైమానిక దళ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతుందని భారత రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

'అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) నమూనాకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దీనిని అభివృద్ధి చేసే బాధ్యతను భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి అప్పగించారు.

భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేటు కంపెనీల సహకారంతో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది.

''స్టెల్త్ యుద్ధవిమానాల నమూనాను ప్రయోగాత్మ కంగా అభివృద్ధి చేయడమనేది దేశీయ నైపుణ్యం, సామర్థ్యం,పోటీతత్త్వాన్ని వినియోగించుకునే దిశగా అతిపెద్ద ముందడుగు'' అని రక్షణ మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఓ ప్రకటన తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు అనుభవం ఉంది. భారత తొలి తేలికపాటి యుద్దవిమానం 'తేజస్'ను ఈ సంస్థే తయారుచేసింది. దీనిని భారత నౌకా, వాయుసేన అమ్ములపొదిలో చేర్చారు.

తాజాగా ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీ బాధ్యతను ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి అప్పగించారు. త్వరలోనే ఈ ఏజెన్సీ ప్రైవేటు కంపెనీల సహకారం కోసం ‘ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ ను ప్రకటించనుంది.

రక్షణ పరికరాలను తయారు చేసే ప్రైవేటు సంస్థలు కూడా విదేశీ భాగస్వాముల సహకారంతో ఈ ప్రాజెక్టులో చేరడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారమవుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

'టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్' రక్షణ రంగ విమానాల తయారీ, అసెంబ్లింగ్‌లో నైపుణ్యం కలిగిన కంపెనీ అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్, తయారీని కాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ 2024 మార్చ్‌లో ఆమోదించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన భారత వైమానిక ప్రదర్శనలో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ స్టెల్త్ ఫైటర్ జెట్‌ను ప్రదర్శించింది. ఇందులో సింగిల్ సీటు, రెండు ఇంజిన్లు ఉన్నాయి. ఇది ఐతరం యుద్ధ విమానం.

ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రణాళిక ప్రకారం 2035 నాటికి స్టెల్త్ విమానాల తయారీ ప్రారంభమవుతుందని, తొలుత కనీసం 120 విమానాలను డెలివరీ చేస్తారని మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఇంతకీ భారతదేశానికి ఇది ఎంతటి ముఖ్యమైన ప్రాజెక్టు? రక్షణ రంగ నిపుణులు దీనిని ఎలా చూస్తున్నారు?

యుద్ద విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టెల్త్ ఐదోతరం యుద్ద విమానాల తయారీ బాధ్యతను ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి అప్పగించారు

స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏమిటి?

అలెక్స్ పిస్టాస్ అట్లాంటిక్ కౌన్సిల్‌లో సీనియర్ ఫెలోగా ఉన్నారు. ఆయన పెంటగాన్ మాజీ అధికారి కూడా. ఉగ్రవాద నిరోధం, రక్షణరంగం, అంతరిక్షం, హైటెక్ రంగాలలో డిజిటల్ పరివర్తనపై ఆయన స్పెషలైజేషన్ చేశారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ ఐదో తరం యుద్ధ విమానాలలో కీలకమైన విషయం 'స్టెల్త్ టెక్నాలజీ. ఇది రాడార్ దృష్టిని , థెర్మల్ డిటెక్షన్‌ను తప్పించుకుంటుంది. దీనిని కనిపెట్టడం చాలా కష్టసాధ్యమైన పని’ అని చెప్పారు.

ఆయుధ వ్యవస్థలు, వ్యూహాత్మక, సూపర్ సోనిక్ విమాన రంగాలలో ఈ యుద్ధ విమానాలు గణనీయమైన పురోగతిని సాధించాయని అలెక్స్ పిస్టాస్ చెప్పారు.

ఐదవ తరం యుద్ధ విమానాలు అధునాతన యుద్ధ విమానాలు, ఇవి స్టెల్త్, సూపర్ క్రూయిజ్ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాయి. రాడార్ ను తప్పించే సామర్ధ్యం వీటికి ఉందని, దీని వల్ల శత్రువులు వాటిని సులభంగా చూడలేరన్నారు.

కొత్త ఇంజిన్ డిజైన్లు, కూలింగ్ సిస్టమ్స్, ఇంటర్నల్ వెపన్స్ చాంబర్లు విమానం ఉష్ణోగ్రతను తగ్గిస్తాయని, దీనివల్ల థర్మల్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని గుర్తించడం కష్టమవుతుందని తెలిపారు.

స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన మొబిలిటీ, లాంగ్ రేంజ్ వెపన్స్ వంటి ఫీచర్లన్నీ కలిసి ఐదో తరం యుద్ధ విమానాలను అత్యంత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. వాటిని గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి కూడా పెద్ద సవాలుగా మారుతుంది.

భారత సైన్యం వనరులు

ఫొటో సోర్స్, Getty Images

ఇండియాకు ఎందుకంత ముఖ్యమైనవి?

ఇటీవలి భారత్, పాకిస్తాన్ ఘర్షణ, యుద్ధాలలో ఫైటర్ జెట్స్, వైమానిక దళ ప్రాముఖ్యాన్ని చాటి చెప్పాయని రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేడీ చెప్పారు.

''ఇటీవల ఘర్షణలలో ప్రధానంగా ఇరుదేశాల వైమానిక దళాలు పాల్గొన్నాయి. నాలుగురోజులపాటు సాగిన ఘర్షణలలో యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగించారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్యనున్న విమానాలు నాలుగోతరం లేదంటే వాటికంటే కొంచెం మెరుగైనవి'' అని రాహుల్ బేడీ పేర్కొన్నారు.

అధికారులు ఇప్పుడు వాయుసేనపై దృష్టిసారించినట్టు కనిపిస్తోంది. స్టెల్త్ యుద్ధ విమానాల ప్రాజెక్టు కూడా ఇందులో భాగమే. పైగా పదాతిదళ ప్రాముఖ్యం పరిమితంగా ఉంది.

చైనా (మీడియా కథనాల ప్రకారం) పాకిస్తాన్‌కు ఐదోతరం స్టెల్త్ జె-35ఏ యుద్ద విమానాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఐదోతరం యుద్ధ విమానాల అవసరం మరింతగా పెరిగిందని రక్షణ రంగ విశ్లేషకుడు ప్రవీణ్ సాహ్నీ చెప్పారు.

''పాకిస్తాన్ వద్ద ఈ యుద్ధ విమానాలుంటే భారత్, పాకిస్తాన్ మధ్యనున్న ఉద్రిక్త పరిస్థితులలో స్టెల్త్ ఫైటర్స్ భాగస్వామి కావడం మొదటిసారి అవుతుంది.

''పాకిస్తాన్ వద్ద ఈ యుద్ధ విమానాలు ఉంటే, ఇలాంటి స్టెల్త్ యుద్ధ విమానం భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలో భాగం కావడం ఇదే మొదటిసారి అవుతుందని, ఇది జరిగితే, ఇది భారత వైమానిక దళానికి క్లిష్ట పరిస్థితి అవుతుందని'' సాహ్నీ చెప్పారు.''ఇది రెండు దేశాల మధ్య వైమానిక శక్తి సమతుల్యతను పాకిస్తాన్ కు అనుకూలంగా మారుస్తుంది. మరోవైపు భారత్ వద్ద ప్రస్తుతం ఐదో తరం విమానాలు లేవు'' అని ఆయన విశ్లేషించారు.

ఇండియా ఆమోదించిన ప్రయోగాత్మక స్టెల్త్ ఫైటర్ యుద్ధ విమానం 2028నాటికల్లా సిద్ధమవుతుందని సాహ్నీ చెప్పారు.

''స్వావలంబన సాధించడానికి స్టెల్త్ యుద్ధవిమాన ప్రాజెక్ట్ ఓ మంచి ఆలోచన. కానీ ప్రస్తుత పరిస్థితులు శాంతియుతంగా లేవు. ఆపరేషన్ సిందూరు తరువాత ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోందని కానీ, శాశ్వత శాంతి ఏర్పడలేదు'' అని ఆయన చెప్పారు.

''ఇలాంటి పరిస్థితులలో విదేశాల నుంచి ఐదోతరం యుద్ధం విమానాలను కొనాల్సిన అవసరం ఉంది (భారతదేశ ప్రణాళికల ప్రకారం భారత్‌లో తయారయ్యే యుద్ధ విమానాలను రాబోయే పదేళ్లలో కానీ అందుబాటులోకి రావు) దీర్ఘకాలిక ప్రణాళికలలో స్టెల్త్ యుద్ద విమానాల ప్రాజెక్ట్ ఉపయుక్తమైనదే, కానీ ప్రస్తుత వాతావరణంతో దీనికి ఎటువంటి ప్రాముఖ్యతా లేదు''

''ఈ ప్రాజెక్టు ఇండియాకు అతిపెద్ద సవాల్. దీనికి కారణం దీని ఇంజినే. ఇప్పటి దాకా భారత్ ఏ విధమైన యుద్ధ విమానాల ఇంజిన్ తయారుచేయలేదు. సమీప భవిష్యత్తులో కూడా వాటిని తయారుచేసే ఆశ కూడా కనిపించడంలేదు. రెండేళ్ల కిందట ఈ ఇంజిన్ తయారీ గురించి అమెరికాతో చర్చలు సాగాయి కానీ, ఇప్పుడు అవి కూడా బలహీనపడ్డాయి''అని రాహుల్ బేడీ చెప్పారు.

''భారత్ ఐదోతరం యుద్ధ విమానాల ప్రాజెక్ట్‌కు దీర్ఘకాలం పడుతుంది. ఇందులో అంతర్జాతీయ యుద్ధ విమానాల తయారీ కంపెనీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి'' అని బేడీ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)