గాలి తీవ్రతకు ఎవరెస్ట్ అంత ఎత్తున మేఘాల్లో పడ్డాడు, అసలేమైందంటే..

పారా గ్లైడింగ్ చేస్తూ అప్‌డ్రాఫ్ట్‌తో మేఘాల్లోకి వెళ్లాడు

ఫొటో సోర్స్, CCTV

    • రచయిత, జోయెల్ గుంటో
    • హోదా, బీబీసీ న్యూస్

చైనా పారాగ్లైడర్ ఒకరు గాలి విసిరికొట్టడంతో ప్రమాదవశాత్తు 27,800 అడుగుల ఎత్తులోని మేఘాల్లోకి దూసుకెళ్లి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా పేర్కొంది.

55 ఏళ్ల పెంగ్ యుజియాంగ్, పారాగ్లైడింగ్ కొత్త ఎక్విప్‌మెంట్‌ను పరీక్షిస్తున్న సమయంలో ఇలా జరిగింది.

సామగ్రి టెస్టింగ్‌లో భాగంగా కిలియాన్ పర్వతాల మీదుగా సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఆయన ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా ఏర్పడిన 'క్లౌడ్ సక్' (గాలి ప్రవాహం) ఆయనను ఒక్కసారిగా మరో 5,000 మీటర్లు ఎత్తులోని ఒక మేఘంలోకి లాక్కెళ్లింది.

శనివారం జరిగిన ఈ సంఘటన, పెంగ్ నడిపిన గ్లైడర్‌కు ఉన్న కెమెరాలో రికార్డైంది. చైనా వర్షన్ టిక్‌టాక్ అయిన డౌయిన్‌లో వీటిని పోస్ట్ చేయడంతో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.

గ్లైడర్ కంట్రోల్స్‌ను పెంగ్ పట్టుకున్నట్లుగా ఆయన ముఖంతో పాటు ఎక్కువ భాగం శరీరమంతా మంచు ఉన్నట్లు ఆ దృశ్యాలు చూపుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''అది చాలా భయానక అనుభవం. అక్కడంతా తెల్లగా ఉంది. నాకు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. దిక్సూచి లేకుండా నేను ఏ వైపు ఎగురుతున్నానో నాకు తెలియలేదు. నేను స్ట్రయిట్‌గా వెళ్తున్నా అనుకున్నా. కానీ, నిజానికి నేను గింగిరాలు తిరిగాను'' అని చైనా మీడియా గ్రూప్‌తో పెంగ్ చెప్పారు.

పెంగ్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 8,849 మీటర్లు కాగా, ఆయన వెళ్లిన ఎత్తు 8,500 మీటర్లు. అంత ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు కూడా -40 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోవచ్చు.

''నేను త్వరగా కిందకు రావాలని అనుకున్నా. కానీ, రాలేకపోయాను. ఇంకా, ఇంకా అలాఅలా పైకి వెళ్తూనే ఉన్నా. ఒక మేఘంలోకి చొచ్చుకెళ్లేంత వరకు ఇలాగే జరిగింది'' అని ఆయన చెప్పారు.

చైనా పారాగ్లైడర్

ఫొటో సోర్స్, CCTV

పెంగ్ గత నాలుగున్నరేళ్లుగా పారాగ్లైడింగ్ చేస్తున్నారు. కిందకు దిగే క్రమంలో తాను స్పృహ కోల్పోయి ఉండొచ్చని, అలాగే గాలిలో గింగిరాలు తిరుగుతున్న గ్లైడర్‌ను నియంత్రించడానికి ప్రయత్నించడం మరో భయంకరమైన అనుభవమంటూ ఆయన వివరించారు.

చైనా అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పెంగ్ ఉపయోగించిన గ్లైడర్‌కు అనుమతులు లేకపోవడంతో ఆయనను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ ఆధీనంలోని గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

పెంగ్ ఆరోజు ఆకాశంలో ఎగరాలని అనుకోలేదని, నేలపైనే ఉండి పారాచూట్ సరిగ్గా ఉందో లేదో పరిశీలించాలని అనుకున్నారని ఆ కథనం పేర్కొంది.

అయితే, బలమైన గాలులు ఆయనను నేలపై నుంచి పైకి లేపడంతో పాటు, ఆపై మరింత బలంగా వీచిన గాలులతో మేఘాల్లోకి వెళ్లిపోయారని ఆ కథనంలో పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)