పెళ్లికి బాంబును గిఫ్ట్‌గా పంపి వరుడి మరణానికి కారణమైన వ్యక్తికి జీవిత ఖైదు..

పెళ్లి, వివాహం, ఒడిశా, వెడ్డింగ్ బాంబ్ కేసు
ఫొటో క్యాప్షన్, పెళ్లి కానుకగా పంపిన పార్శిల్ ఓపెన్ చేయగానే బాంబు పేలి వరుడు సాహు చనిపోయారు, వధువు రీమాకి తీవ్రగాయాలయ్యాయి.
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పెళ్లికి బహుమానంగా పార్శిల్‌లో ఒక బాంబును పంపించి వరుడి మరణానికి కారణమైన వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. కాలేజీ మాజీ ప్రిన్సిపల్ అయిన పుంజీలాల్ మెహర్ (56)ను కోర్టు దోషిగా తేల్చింది.

2018లో ఒడిశాలో జరిగిన ఈ ఘటనలో వరుడితో పాటు ఆయన బంధువు ఒకరు మరణించారు.

'వెడ్డింగ్ బాంబ్' కేసుగా అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ కేసులో హత్య, హత్యాయత్నం, పేలుడు పదార్థాల వాడకం వంటి అభియోగాల్లో పుంజీలాల్‌ను కోర్టు దోషిగా తేల్చింది.

పెళ్లి బహుమతి రూపంలో ఈ బాంబును వరుడు సౌమ్య శేఖర్ సాహు (26) ఇంటికి పంపించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సాహుకు పెళ్లి జరిగి అప్పటికి కొన్ని రోజులే అయింది.

దంపతులు దాన్ని తెరవగా అందులోని బాంబు పేలి సాహు, ఆయన బంధువు చనిపోయారు. వధువు రీమా తీవ్రంగా గాయపడ్డారు.

ఇదొక హేయమైన నేరమంటూ ప్రాసిక్యూషన్ చేసిన వాదనను కోర్టు అంగీకరించింది. కానీ, మరణ శిక్షకు అర్హమైన అరుదైన కేసు (రేరెస్ట్ ఆఫ్ రేర్)గా వర్గీకరించడానికి నిరాకరించింది.

గతంలోనూ బీబీసీ ఈ కేసు గురించి వివరంగా కవర్ చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒడిశాలోని బోలాంగిర్ జిల్లా పట్నాఘర్‌ పట్టణంలో 2018 ఫిబ్రవరిలో ఈ పేలుడు ఘటన జరిగింది.

అప్పటికి అయిదు రోజుల క్రితమే పెళ్లి జరిగిన నవదంపతులు తమ ఇంటికి పార్శిల్ వచ్చినప్పుడు వంట చేసుకుంటున్నారు.

సౌమ్య శేఖర్‌కు పెళ్లి బహుమతిగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి ఆ పార్శిల్ వచ్చినట్లు దాని మీద రాసి ఉంది.

పార్శిల్ తెరవడానికి దానికి ఉన్న దారాన్ని సౌమ్య లాగుతుండగా పెద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కిచెన్‌లో ఉన్న ఆయనతో పాటు వారి బామ్మ 85 ఏళ్ల జేమమణి సాహు చనిపోయారు. 22 ఏళ్ల రీమా తీవ్రంగా గాయపడ్డారు. ఆమె చెవిలోని కర్ణభేరీ దెబ్బతిన్నది. ఈ ఘటన ఆమెకు చాలా వేదనను మిగిల్చింది.

సుదీర్ఘ దర్యాప్తు తర్వాత పుంజీలాల్ మెహర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌమ్య శేఖర్ తల్లి పనిచేసిన ఒక కాలేజీ మాజీ ప్రిన్సిపలే ఈ పుంజీలాల్.

ఒడిశా, వెడ్డింగ్ బాంబ్

ఫొటో సోర్స్, Facebook/Punji Lal Meher

ఫొటో క్యాప్షన్, పుంజీలాల్ మెహర్

వృత్తిపరంగా కోపం పెంచుకొని, ప్రణాళిక ప్రకారమే మెహర్ ఈ దాడి చేశారని అప్పట్లో నాతో దర్యాప్తు అధికారులు చెప్పారు.

రాయ్‌పూర్ నుంచి బాంబును పంపించడానికి ఆయన ఒక తప్పుడు పేరు, అడ్రస్‌ను ఉపయోగించారు. సీసీటీవీ, పార్శిల్ స్కానింగ్ లేకుండా కొరియర్ సర్వీస్‌ ద్వారా బాంబును పంపించారు.

ఆ పార్శిల్ బస్సులో 650 కిలోమీటర్లు ప్రయాణం చేసి, అనేక చేతులు మారుతూ చివరకు సౌమ్య ఇంటికి చేరుకుంది.

తెరవగానే పేలిపోయేలా దారంతో దాన్ని చుట్టారని ఇన్వెస్టిగేటర్లు చెప్పారు. పార్శిల్‌పై రాయ్‌పూర్ నుంచి ఎస్‌కే శర్మ అనే నకిలీ పేరు పేర్కొన్నారు. దీంతో వారాలు గడచినా నిందితులెవరో తెలియలేదు.

వేలాది ఫోన్ రికార్డులను పరిశీలించిన దర్యాప్తు అధికారులు, 100 మందికి పైగా విచారించారు. కానీ, వారికి ఏ ఆధారాలు దొరకలేదు.

తర్వాత, ఏప్రిల్‌లో స్థానిక పోలీస్ చీఫ్‌కు చిరునామా లేని ఒక లేఖ అందింది.

వివాహం, వెడింగ్ బాంబ్, ఒడిశా
ఫొటో క్యాప్షన్, 2018లో పేలుడు జరిగిన తర్వాత వంటగది వీడియోలోని ఒక స్క్రీన్‌షాట్

బాంబును శర్మ పేరుతో కాదని సిన్హా అనే పేరుతో పంపినట్లు లేఖలో పేర్కొన్నారు. అలాగే డబ్బు, మోసానికి సంబంధించిన విషయాలను అందులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.

ముగ్గురు వ్యక్తులు ఈ పనిచేశారని, వారంతా ఇప్పుడు పోలీసులకు దొరకనంత దూరంలో ఉన్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. వరుడికి లవర్ ఉన్నట్లు, ఆస్తి వివాదాలు ఉన్నట్లు సూచించేలా రాశారు. అమాయకులను హింసించడం మానేయాలని పోలీసులను లేఖలో కోరారు.

ఈ లేఖ దర్యాప్తును మలుపుతిప్పింది.

పార్శిల్ రసీదుపై ఉన్న చేతిరాతను తప్పుగా అర్ధం చేసుకున్నట్లు అప్పట్లో ఒడిశా క్రైమ్ బ్రాంచ్ హెడ్‌గా ఉన్న పోలీస్ అధికారి అరుణ్ బోథ్రా గుర్తించారు. ఆ అక్షరాలు Sharma కంటే కూడా Sinha అనే పేరుకు దగ్గరగా ఉన్నట్లుగా ఆయన గుర్తించారు.

అంటే, ఉత్తరం రాసిన వ్యక్తికి ఈ విషయం తెలిసే ఉంటుందని అరుణ్ భావించారు. కేవలం పార్శిల్ పంపిన వ్యక్తికి మాత్రమే తెలిసే అవకాశం ఉన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించడంతో నిందితుడే ఆ లేఖను పంపి ఉంటాడని పోలీసులు ఊహించారు.

''నేరం జరిగిన తీరు గురించి మాకు తెలిసిన దాని కంటే లేఖను పంపిన వ్యక్తికే ఎక్కువ తెలుసు అనే విషయం సుస్పష్టం. ఆ లేఖను పంపడం ద్వారా స్థానికులు ఆ పని చేయలేదని మాకు చెప్పాలనుకున్నాడు. ముగ్గురు వ్యక్తులు ఈ కుట్రకు పాల్పడినట్లు మాకు చెప్పాలని భావించాడు. మేం చేసిన పొరపాట్లను గుర్తు చేయడం ద్వారా అతను బయటపడ్డాడు'' అని 2018లో బీబీసీతో భోథ్రా చెప్పారు.

సౌమ్య శేఖర్ తల్లి కాలేజీలో లెక్చరర్. లేఖలోని చేతిరాతను, వాడిన పదాలను బట్టి అవి తన కొలీగ్, కాలేజీ మాజీ ప్రిన్సిపల్ మెహర్ చేతిరాతగా ఆమె గుర్తించారు. మెహర్ స్థానంలో ఆమె ప్రిన్సిపల్ అయ్యారు.

దీంతో పోలీసులు, మెహర్‌ను ప్రధాన అనుమానితుడిగా చేర్చారు.

తొలుత విచారణలో మెహర్ ఏదో కట్టుకథ చెప్పారు. ఎవరో తనను బెదిరించి, లేఖను పంపాల్సిందిగా బలవంతం చేశారంటూ పోలీసులకు తెలిపారు.

తర్వాత ఆయన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు.

దీపావళి సందర్భంగా బాణసంచా నిల్వచేసి, అందులోని గన్‌పౌడర్‌ తీసి బాంబును తయారు చేసి రాయ్‌పూర్ నుంచి కొరియర్ చేసినట్లు ఆయన ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

మెహర్ బాధితుని పెళ్లి, అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు.

(భువనేశ్వర్ నుంచి సందీప్ సాహు అదనపు రిపోర్టింగ్ )

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)