తెనాలిలో యువకులకు నడిరోడ్డుపై లాఠీదెబ్బలు, వీడియో వైరల్.. అసలేం జరిగింది?

తెనాలి, గుంటూరు, ఏపీ పోలీస్, దళితులు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

‘రౌడీషీటర్లు అయినంత మాత్రాన వారిని పోలీసులు నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్టు లాఠీలతో కొట్టొచ్చా?’ ‘లాఠీలతో ఒకరు బాదుతుంటే నొప్పితో కాళ్లు కదపకుండా మరో పోలీసు ఆ నిందితుడి కాళ్లను బలంగా ఎక్కి తొక్కొచ్చా..?’

సోమవారం వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలోని దృశ్యాలు, పోలీసుల వివరణ.. నేపథ్యంలో మానవహక్కుల నేతలు, దళిత సంఘాల నేతలు అడుగుతున్న ప్రశ్నలివి..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే...

పోలీసులు ముగ్గురు యువకులను నడిరోడ్డుపై కాళ్లు చాపి కూర్చోబెట్టారు. ఓ పోలీస్ లాఠీతో ఓ యువకుడి కాళ్లపై బలంగా కొట్టసాగారు. నొప్పి తట్టుకోలేక కాళ్లు వెనక్కి తీసుకుంటే కాళ్లు సరిగ్గా పెట్టమని గద్దించి తిరిగి కొట్టారు.

రెండో యువకుడినీ అదే మాదిరి కొట్టసాగారు. ‘సార్‌.. సార్‌. సార్‌. అబ్బా అమ్మో’ అని ఆ యువకుడు అరుస్తూనే పరుగెత్తాడు.

మూడో యువకుడి దగ్గరకు మరో పోలీస్ వచ్చి కొట్టడం ప్రారంభించారు. ఇంకో పోలీస్ ఆ యువకుడి కాళ్లు కదలకుండా కాళ్లపై తన కాలు బలంగా అదిమిపెట్టారు.

పరుషమైన భాషలో తిడుతూ, కొడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది.

ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది పోలీసులు స్పష్టంగా చెప్పడం లేదు, కానీ మే 26న ఇది వైరల్‌ అయింది.

పోలీసులు ఏం చెబుతున్నారంటే..

‘ఈ ఘటన తెనాలి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఐతా నగర్‌లో జరిగింది. ఆ ముగ్గురూ బాబూలాల్, చేబ్రోలు జాన్‌ విక్టర్, డోమా రాకేష్. మా స్టేషన్‌ కానిస్టేబుల్‌ చిరంజీవిపై గంజాయి మత్తులో వారు దాడి చేశారు’ అని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌(సీఐ) రామ్‌లా నాయక్‌ బీబీసీకి చెప్పారు.

కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఆ ముగ్గురినీ కొట్టి అరెస్టు చేశామని ఆయన తెలిపారు.

ముగ్గురిలో ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయని, విక్టర్‌పై 9, రాకేష్‌పై 8 కేసులు వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదయ్యాయని.. హత్య, దొమ్మీ కేసులతో పాటు గంజాయి కేసులు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు.

ప్రస్తుతం ముగ్గురు నిందితులూ రిమాండ్‌లో ఉన్నారని, నెల క్రితం జరిగిన ఈ ఘటన వీడియోను ఇప్పుడు ఎవరో కావాలని వైరల్‌ చేశారని వారు అంటున్నారు.

వాస్తవానికి, ఆ కేసులో వేము నవీన్‌కుమార్‌ అనే రౌడీషీటర్‌ కూడా నిందితుడిగా ఉన్నారని, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీఐ వెల్లడించారు.

తెనాలి, గుంటూరు, ఏపీ పోలీస్, దళితులు

ఫొటో సోర్స్, UGC

విచారణలో భాగంగా నడిరోడ్డుపై అలా అరికాలిపై లాఠీలతో కొట్టొచ్చా అని బీబీసీ అడగ్గా.. ‘మేం అలా కొట్టలేదు. వీడియో మార్ఫింగ్‌ చేశారేమోనని అనుమానంగా ఉంది’ అని సీఐ చెప్పుకొచ్చారు.

వీడియో స్పష్టంగా ఉందని ప్రస్తావిస్తే.. మార్ఫింగ్‌ చేశారు అని ఆయన అన్నారు.

మరో పోలీసు అధికారి మాత్రం అసహనం వ్యక్తం చేశారు.

''పోలీసులపై దాడి చేస్తే ఏం చేయాలి.. తప్పు చేసిన వారికి, తప్పులు చేసే వారికి పోలీసులంటే భయం ఉండాలి. అందుకే వారికి నడిరోడ్డుపై అరికాలి ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం'' అని అసహనంగా అన్నారు.

ఘటనపై విచారణ చేస్తున్నాం: గుంటూరు జిల్లా ఎస్పీ

అసలేం జరిగింది అనే దానిపై విచారణ చేస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ బీబీసీతో చెప్పారు.

'అలా చేయడం దారుణం'

''ఆ ముగ్గురూ తీవ్రమైన నేరస్తులు కావొచ్చు. హంతకులూ కావొచ్చు. కానిస్టేబుల్‌పై దాడి జరిగిందన్నదీ నిజమే అయ్యుండొచ్చు. కానీ, చట్ట ప్రకారం శిక్షించాల్సిన పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నడిరోడ్డుపై అలా కొట్టడం దారుణం.

ఇక పోలీసులకు, రౌడీలకు తేడా ఏముంటుంది. ఇది ఏప్రిల్‌లో జరిగిందంటున్నారు. ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది జీఎస్‌ నాగేశ్వరరావు బీబీసీతో అన్నారు.

నేరం చేస్తే చట్టప్రకారమే శిక్షించాలి కదా?

''పోలీసుల వాదన ప్రకారం వాళ్లు నేరం చేసే ఉండొచ్చు. చేయలేదని వాళ్లు చెబుతున్నారు. ఏదైనా సరే కోర్టులో విచారణ జరగాలి. అంతేకానీ, నడిరోడ్డుపై అలా కొట్టడం దారుణం. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ వీడియోను స్టేటస్‌లో పెట్టుకున్న ఓ న్యాయవాదినీ ఇబ్బందులకు గురిచేశారు. ఇది పద్ధతి కాదు. అందుకే నేను నిందితుల్లో రాకేష్‌ తరఫున వాదిస్తున్నా'' అని దళిత నేత, తెనాలి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్‌ బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)