నంబాల కేశవరావు మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయని పోలీసుల ప్రకటన, నమ్మశక్యంగా లేదంటున్న కుటుంబ సభ్యులు

ఫొటో సోర్స్, NambalaRamprasad/Gettyimages
- రచయిత, లక్కోజు శ్రీనివాస్, విష్ణుకాంత్ తివారి
- హోదా, బీబీసీ కోసం
నంబాల కేశవరావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
అయితే, నంబాల కేశవరావుతో పాటు ఇతర మావోయిస్టుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు వస్తున్న వార్తలను తాము నమ్మడం లేదని ఆయన సోదరుడు నంబాల రామ్‌ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
''కోర్టు ఆదేశాలను కూడా ఛత్తీస్‌గఢ్ పోలీసులు పట్టించుకోవడం లేదని ఇప్పటికే హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశాం. మంగళవారం(మే 27న) సుప్రీం కోర్టులో కూడా కేసు వేయబోతున్నాం'' అని అన్నారు.
''మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్లిపోయే విధంగా ఏవోవో మాటలు చెప్తున్నారు. మేం వాటిని నమ్మడం లేదు. కోర్టు ఆదేశాలను కాదని ఏ అధికారైనా ఎలా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తారు'' అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఆయన మరో సోదరుడు, శ్రీకాకుళంలో ఉన్న నంబాల ఢిల్లీశ్వరరావు మాట్లాడుతూ, ''మిగతా వారు కోర్టుకి వెళ్లలేదు కాబట్టి వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేసి, వారితో పాటు నంబాల కేశవరావు, సజ్జ నాగేశ్వరరావు మృతదేహాలకు కూడా అంత్యక్రియలు చేసేశామని పోలీసులు చెప్తున్నట్లు ఉంది. ఎందుకంటే, మేం మానసికంగా బలహీన పడతామని'' అన్నారు.

ఇంతకుముందు ఏం జరిగిందంటే..
ఇటీవల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీసులను సంప్రదించి బంధువులు తీసుకోవచ్చని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ, ఇంకా ఆయన మృతదేహం కుటుంబీకులకు అప్పగించలేదు.
రెండు రోజులుగా ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని ఆయన సోదరుడు నంబాల రామ్‌ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
సీపీఐ-మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో, భద్రతా దళాల చేతుల్లో మరణించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 21న ప్రకటించారు.
"45 ఏళ్ల కిందట నంబాల కేశవరావుతో కలిసి ఉన్న మా కుటుంబ గ్రూప్ ఫోటో కావాలని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అడుగుతున్నారు. కేశవరావు మీ సోదరుడే అని నమ్మకమేంటని ప్రశ్నిస్తున్నారు?" అని నంబాల రామ్‌ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
నంబాల కేశవరావు మృతదేహాం కోసం ఛత్తీస్‌గఢ్ వెళ్లిన ఆయన ప్రస్తుతం నారాయణ్‌పూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నానని చెప్పారు. ఆయనతో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, Nambala Ramprasad
'మా సోదరుడి మృతదేహాన్ని అప్పగించమని ప్రాధేయపడుతున్నాం'
"నేను రెండు రోజులుగా ఆసుపత్రి, పోలీస్‌స్టేషన్ ఇలా తిరుగుతూనే ఉన్నాను. నాతో పాటు మరో పదిమంది ఉన్నారు. పోలీసులు మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు. మా సోదరుడి మృతదేహాన్ని అప్పగించమని ప్రాధేయపడుతున్నాం. అయినా వాళ్లు ఏవేవో కారణాలు చూపిస్తూ ఆలస్యం చేస్తున్నారు. మృతదేహాన్ని ఇవ్వం అని చెప్పడం లేదు. కానీ, ఏవో కారణాలు చూపిస్తూ టైంపాస్ చేస్తున్నారు" అని నంబాల రామ్‌ప్రసాద్ అన్నారు.
''పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండేందుకు, రెండు రోజులుగా చెట్టు కిందే ఉంటున్నా. వెళ్లిపోవాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అలాగే నారాయణ్‌పూర్ వచ్చే క్రమంలో అంబులెన్స్‌కు కూడా అనేక అడ్డంకులు పెట్టారు'' అని రామ్ ప్రసాద్ అన్నారు. "మాకు విసుగొచ్చి సరే ఇక్కడైనా ఆయన అంత్యక్రియలు చేసుకోనివ్వండని మేం అనాలని పోలీసులు చూస్తున్నట్లు అర్థమవుతోంది. అంటే మృతదేహాన్ని శ్రీకాకుళం తీసుకెళ్లకుండా... ఛత్తీస్‌గఢ్‌లోనే అంత్యక్రియలు చేసేలా మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నట్లు కనిపిస్తోంది. కొందరు పోలీసులు ఇక్కడే అంత్యక్రియలు చేసుకోండి అని అన్నారు కూడా" అని రామ్‌ప్రసాద్ ఆవేదనతో చెప్పారు.
"మా సోదరుడ్ని చూసి 45 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు మరణించాక మా సంప్రదాయం ప్రకారం ఆయనకు అంతిమ సంస్కారాలైన చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. మృతదేహాన్ని ఇచ్చేవరకు ఇక్కడ నుంచి కదలం. ఆ మృతదేహం ఎంత చెడిపోయినా తీసుకునే వెళ్తాం" అని రామ్‌ప్రసాద్ బీబీసీతో అన్నారు.
నంబాల కేశవరావు మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత, ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిరాకరించడంతో, వారు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు, కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఇటీవలే తీర్పు చెప్పింది.

ఫొటో సోర్స్, Nambala Ramprasad
'శ్రీకాకుళంలో నా వెనుకే పోలీసులు వస్తున్నారు'
''మా సోదరుడు నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకుండా అడ్డంకులు పెడుతున్నారు. మా గ్రూపు ఫోటో, వెళ్లిన వారి ఆధారాలు అంటూ రకరకాల ప్రూఫ్స్ అడుగుతూ ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికీ మృతదేహాన్ని ఎప్పుడు ఇస్తారనే విషయంపై స్పష్టత లేదు. మా సోదరుడు, అతనితో పాటు వెళ్లిన వారంతా నారాయణ్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ వద్ద ఎదురు చూస్తున్నారు'' అని శ్రీకాకుళంలో ఉన్న నంబాల కేశవరావు మరో సోదరుడు నంబాల ఢిల్లీశ్వరరావు బీబీసీతో చెప్పారు.
"ఇక్కడ నన్ను కూడా ఎక్కడికి వెళ్లనివ్వడం లేదు. ఏ చిన్న పని మీద బయటకు వెళ్లినా పోలీసులు నా వెనకాలే వస్తున్నారు" అని ఢిల్లీశ్వరరావు చెప్పారు.
''మా సోదరుడు ఆయన సిద్ధాంతాల కోసం నక్సలిజంలోకి వెళ్లారు. అది ఆయన ఎంచుకున్న మార్గం. ఇప్పుడు ఆయన మృతదేహాన్ని అప్పగిస్తే పోలీసులకు వచ్చే నష్టం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకుని మా సోదరుడి మృతదేహం మాకు ఇప్పించాలి. శ్రీకాకుళం జిల్లా పోలీసులు కూడా మాకు సహకరించడం లేదు" అని అన్నారు.
"ఏపీ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా మృతదేహాన్ని అప్పగించడం లేదు కాబట్టి, కోర్టు ధిక్కరణ కింద ఛత్తీస్‌గఢ్ పోలీసులపై కోర్టును ఆశ్రయిస్తాం" అని ఢిల్లీశ్వరరావు బీబీసీతో చెప్పారు.
స్పందించని శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయం
ఈ విషయంపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీతో, ఆయన కార్యాలయంతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది.
గత రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫోన్లు, మెసేజులు ఏ రూపంలోనూ వారు అందుబాటులోకి రావడం లేదు.

ఫొటో సోర్స్, Screenshot
‘మావోయిస్టుల మృతదేహాలను వెంటనే అప్పగించాలి’
‘‘ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో 2025 మే 21 నాడు భద్రతా దళాల చేతుల్లో మరణించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం’’ అని శాంతి సమన్వయ కమిటీ పేరిట ఒక ప్రకటన విడుదలైంది.
మృతదేహాలను గౌరవంగా భద్రపరచాలనే చట్టపరమైన, నైతిక బాధ్యత ఉన్నప్పటికీ వాటిని కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరచలేదని, కుళ్లిపోయేలా వదిలేశారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఈ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
కమిటీలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, డాక్టర్ ఎం.ఎఫ్. గోపినాథ్, కవితా శ్రీవాత్సవ, క్రాంతిచైతన్య, మీనా కందసామి సభ్యులు.
‘‘మరణించిన మనషులు ప్రతి ఒక్కరూ మరణంలో కూడా గౌరవానికి అర్హులు. ఈ మృతదేహాలను నిరంతరం నిర్బంధించడం చట్టపరంగా ప్రశ్నించదగినవి మాత్రమే కాదు. నైతికంగా కూడా ఖండించదగినది’’ అని ఈ కమిటీ తన ప్రకటనలో పేర్కొంది.
హైకోర్టుకు ఇచ్చిన హామీని గౌరవించి, మృతదేహాలను మరింత కుళ్లిపోవడానికి ముందే వారి కుటుంబాలకు అందజేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి శాంతి సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

ఫొటో సోర్స్, Nambala Ramprasad
బస్తర్ రేంజ్ ఐజీ ఏం చెప్పారు?
''నిర్దేశిత న్యాయ ప్రక్రియలను అనుసరించి ఎన్‌కౌంటర్ తర్వాత మృతదేహాల గుర్తింపు, న్యాయ విచారణ, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నాం. న్యాయపరమైన ప్రక్రియలన్ని పూర్తయ్యాక, హక్కుదారుల్ని గుర్తించిన తర్వాతనే మృతదేహాలను వారికి అప్పగిస్తాం'' అని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సుందరాజ్.పి చెప్పారు.
''ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున, పోలీసులు మరిన్ని వివరాలు ఇవ్వలేరు'' అని ఆయన తెలిపారు.
ఈ ప్రక్రియలు పూర్తి చేసేందుకు లేదా మృతదేహాలను అప్పగించే విషయంపై పోలీసులు కానీ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎలాంటి కాలపరిమితిని ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు హైకోర్టు ఏమంది?
నంబాల కేశవరావు, 'అవామ్-ఇ-జంగ్' ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జ వెంకట నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు మే 23న, శుక్రవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
స్వగ్రామాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించుకుంటామని పేర్కొన్నారు.
కేశవరావు మృతదేహం కోసం ఆయన సోదరుడు ఢిల్లీశ్వరరావు, సజ్జ వెంకట నాగేశ్వరరావు తరఫున ఆయన సోదరుడు శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేశారు.
"ఈ పిటిషన్‌పై హైకోర్టు మే 24న (శనివారం) విచారణ జరిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం జరిగినట్లు ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. పోస్టుమార్టం పూర్తైనందున పిటిషనర్లు ఛత్తీస్‌గఢ్ అధికారులను సంప్రదించి.. మృతదేహాలను తీసుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది" అని ఢిల్లీశ్వరరావు బీబీసీతో చెప్పారు.
"మృతదేహాన్ని మీకు అప్పగిస్తే.. దానిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. స్వగ్రామంలో ర్యాలీలు చేస్తారు. అంత్యక్రియలు చేసిన చోట స్తూపాలు కడతారు. ఏదైనా సందర్భం వస్తే అక్కడ నివాళులు అర్పించడం వంటివి చేస్తుంటారు. ఇదంతా మళ్లీ నక్సలిజం వైపు కొందరిని ఆకర్షించే విధంగా ఉంటుంది. అందుకే మేం మృతదేహం ఇవ్వం" అని పోలీసులు ఛత్తీస్‌గఢ్ వెళ్లిన రామ్‌ప్రసాద్ బృందంతో అన్నారని నంబాల ఢిల్లీశ్వరరావు తెలిపారు.
దీంతో తాము హైకోర్టును ఆశ్రయించామని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














