గద్దర్: ఉద్యమాల నుంచి రాజకీయాల వరకు.. అంతులేని అభిమానం నుంచి విమర్శల దాకా..

గద్దర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గుత్తా రోహిత్
    • హోదా, బీబీసీ కోసం

అవి 1990ల నాటి రోజులు. తెలంగాణలోని వరంగల్‌లో సీపీఐ(ఎంఎల్) (పీపుల్స్ వార్) అనుబంధ సంఘమైన రైతు కూలీ సంఘం సమావేశం జరిగింది. ఈ సభకు దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మంది వచ్చి ఉంటారని అంచనా.

సభకు భారీగా తరలివచ్చిన జనాన్ని వేదికపై నుంచి పర్యవేక్షిస్తున్నారు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్. తెలంగాణ మాండలికం, జానపదానికి ట్రేడ్‌మార్క్ అయిన గద్దర్ పాటల్లో తెలంగాణలో పోలీసు యంత్రాంగం సాగించే అణచివేతపై పదునైన విమర్శతోపాటు కిందిస్థాయి పోలీసులపై సానుభూతి కనిపిస్తుంది.

1947లో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టారు గద్దర్. ఆయన తండ్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్థాపించిన కాలేజీలో పనిచేశారు.

విద్యతోనే విముక్తి సాధ్యమని గద్దర్ తండ్రి బలంగా విశ్వసించేవారు. అలా గద్దర్ విద్యాప్రస్థానం ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ వరకూ సాగింది.

అదే సమయంలో, శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటం, రాడికల్ స్నేహాలు, సినీ దర్శకుడు బి.నర్సింగరావు, కేశవరావ్ జాదవ్ వంటి వారి ప్రభావంతో ఆయన ఉద్యమ బాటపట్టారు. చిన్నప్పటి నుంచే పాటలు పాడడంలో నైపుణ్యముంది. అలా ఆయన గళం సమానత్వం కోసం పాటుపడింది.

గద్దర్ 1970లలో సీపీఐ ఎంఎల్ సాంస్కృతిక విభాగమైన జననాట్య మండలిలో చేరారు. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయ్యారు. అప్పట్లో తెలంగాణలో బలంగా ఉన్న భూస్వాములు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జననాట్య మండలి నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ఆ తర్వాతి కాలంలో ఆయన గద్దర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మిలిటెంట్ పార్టీ గదర్ నుంచి ఆ పేరు వచ్చింది.

గద్దర్

ఫొటో సోర్స్, Getty Images

జననాట్యమండలి నుంచి బహిష్కరణ

ఎమర్జెన్సీ తర్వాత పూర్తి సమయం జననాట్యమండలి కోసమే పనిచేసేందుకు గద్దర్ తన బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన తుది శ్వాస వరకు చేతిలో కర్ర, భుజంపై గొంగడి, కాళ్లకు గజ్జెలు కట్టుకుని ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ అసమానత్వం, అణచివేత, పోలీసు దాష్టీకాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. తిరుగుబాటుకు చిరునామాగా మారారు.

1995లో జననాట్య మండలి నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినప్పటికీ తను నమ్ముకున్న బాటలోనే నడిచారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాల వైపు మొగ్గు చూపారు. కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిన దేశంలో బహుజన రాజకీయాలు రావాలని కోరుకున్నారు. ఆ సమయంలో 1997లో గుర్తు తెలియని దుండగులు ఆయన శరీరంలోకి మూడు బుల్లెట్లు దింపారు.

ఆ బుల్లెట్లలో ఒకటి వెన్నుపూస వద్దే ఉండిపోయింది. తుదిశ్వాస వరకూ ఆ బుల్లెట్ ఆయన శరీరంలో అలాగే ఉంది. ఈ దాడి తర్వాత ఆయన కొత్త పంథాతో ముందుకెళ్లారు. తన చిరకాల వాంఛల్లో ఒకటైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక సారథిగా నిలిచారు. తన ప్రదర్శనలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను చాటారు.

సీపీఐ (మావోయిస్టు) పార్టీ కార్యక్రమాల నుంచి దూరమైనప్పటికీ సానుభూతిపరుడిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య జరిగిన శాంతి చర్చల్లో ప్రతినిధిగా పాల్గొన్నారు.

గద్దర్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్దర్ రాడికల్ ఉద్యమంతో బంధం తెంచుకున్నారు. పార్లమెంటరీ రాజకీయాన్ని ప్రత్యామ్నాయంగా భావిస్తూ 2018లో తొలిసారి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాను బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు మళ్లినట్లు ఆ సమయంలో ఆయన ప్రకటించారు.

పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమైన రాజకీయ పార్టీలతో కలిశారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలతో కలిశారు.

మానవ హక్కుల పరిరక్షణ, సంక్షేమం, లౌకికవాద సమాజ నిర్మాణంలో పార్టీలను కలుపుకొని పోవడంలో కీలకపాత్ర పోషించాలని ఆయన కోరుకున్నారు. తర్వాత కాలంలో ఆయన పలు పార్టీలు మారారు. చనిపోయే నాటికి ఆయన కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనలో ఉన్నారు.

ఎన్నో విమర్శలు

ఆరు దశాబ్దాల గద్దర్ రాడికల్ జీవితం అంత సాఫీగా సాగలేదు. ఎన్నో విమర్శలను గద్దర్ ఎదుర్కొన్నారు. రాజకీయ రంగ ప్రవేశంపైనా చాలా విమర్శలు వచ్చాయి.

తన ప్రదర్శనలు, విప్లవోద్యమ పాటలతో వేల మంది యువకులు నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లేందుకు కారణమయ్యారని, వారిలో చాలా మంది ఎన్‌కౌంటర్లలో చనిపోయారని, ఇప్పుడు బుల్లెట్ వదిలి బ్యాలెట్ వైపు వస్తున్నాననడమేంటనే తీవ్ర విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు.

చివరి రోజుల్లో హిందూ దేవతలను, మతసంస్థలకు చెందిన వారిని పొగుడుతూ పాటలు పాడే స్థాయికి దిగజారారనే విమర్శలు కూడా గద్దర్‌పై వచ్చాయి. అయితే, ఆయనపై ఎన్నివిమర్శలు వచ్చినా అభిమానం కూడా అలాగే కొనసాగింది.

ఆయన జీవితం తెలంగాణ పరిస్థితులను గుర్తుచేస్తుంది.

వెట్టిచాకిరీ, పెత్తందారీ వ్యవస్థ రాజ్యమేలిన రోజుల్లో ఆయన నక్సలైట్ ఉద్యమంలో చేరారు. వేగంగా వచ్చిన పెట్టుబడిదారీ విధానాల కారణంగా రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం, ఇతర మార్పులతో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం బలహీనపడింది. 1980ల నాటి నుంచి మేధావులు, గాయకులు ఉద్యమం నుంచి బయటకు రావడం మొదలైంది. 1990లలో అది బాగా కనిపించింది.

తాను దాదాపు 4 వేల నుంచి 5 వేల పాటలు రాశానని, వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రదర్శించినట్లు గద్దర్ ఒకసారి చెప్పారు. ఆయన ప్రదర్శనలు, ఆయన జీవితం వైవిధ్యంగానే కొనసాగాయి.

వీడియో క్యాప్షన్, ‘ఒరేయ్ రిక్షా సినిమాకు పాటలు రాసిన గద్దరన్న నా దగ్గర రూపాయి తీసుకోలే’

ఇవి కూడా చదవండి: