ధందో ఇన్వెస్ట్‌మెంట్: బొమ్మాబొరుసు సూత్రంతో మదుపు లాభదాయకమా... వారెన్ బఫెట్ ఏకలవ్య శిష్యుడు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
మొహ్నీష్ పబ్రాయ్ ఒక భారతీయ అమెరికన్ వ్యాపారి. 1986లో ఒక చిన్న కంపెనీలో గుమాస్తాగా జీవితాన్ని మొదలు పెట్టిన ఆయన ప్రస్తుతం ఏడాదికి రెండు మిలియన్ డాలర్లు (అంటే సుమారు 16.53 కోట్ల రూపాయలు) సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించే స్థాయికి చేరుకున్నారు.
వారెన్ బఫెట్, చార్లీ ముంగర్ల ఏకలవ్య శిష్యుడిగా చెప్పుకునే మొహ్నీష్ 2006లో బఫెట్ చారిటీ లంచ్ కోసం 6,50,000 డాలర్లు వెచ్చించారు. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలో తన అనుభవాలను "ధందో ఇన్వెస్టర్" అనే పుస్తకంగా విడుదల చేశారు.
మదుపు చేసే సమయంలో తన ఆలోచనా విధానాన్ని, తాను ఇతరుల నుంచి నేర్చుకున్న విషయాలను అమలులో పెట్టి లాభపడిన విధానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. వారెన్ బఫెట్, చార్లీ ముంగర్ తన ఆలోచనా విధానాన్ని, తద్వారా తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారో మొహ్నీష్ ఉపోద్ఘాతంలోనే చెప్పారు.
అంతేకాక ప్రముఖ కంపెనీలు మొదలు పెట్టే సమయంలో వారు ధందో ఇన్వెస్ట్‌మెంట్ సూత్రాలను ఎలా పాటించారో అనేక ఉదాహరణలను ప్రస్తావించారు. బఫెట్, ముంగర్ల సూక్తులతో పాటు బెంజమిన్ గ్రాహం చెప్పిన విషయాలనూ ఆయన ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటీ ధందో ఇన్వెస్ట్‌మెంట్..
స్థూలంగా చూస్తే తక్కువ రిస్క్ ఉన్న చోట మదుపు చేసి, ఎక్కువ ఆదాయాన్ని ఆర్జింజడాన్ని ధందో ఇన్వెస్ట్‌మెంట్‌గా చెప్పొచ్చు. ధందో ఇన్వెస్ట్‌మెంట్ అంటే బొమ్మ పడితే గెలుస్తాను, బొరుసు పడితే తక్కువ నష్టంతో బయటపడతాను అని రచయిత చాలా సందర్భాలలో స్పష్టంగా తెలియజేశారు.
ఉగాండా నుంచి శరాణార్థులుగా అమెరికా చేరిన పటేల్ కుటుంబం తమ వ్యాపారదక్షతతో మోటెల్ సంస్థను ఎలా వృద్ధిలోకి తీసుకొచ్చారనే విషయాన్ని మొదటి అధ్యాయంలో వివరించారు. చాలా తక్కువ పెట్టుబడితో ఒక పెద్ద సంస్థను నిర్మించిన పటేల్ కుటుంబం పాటించిన సూత్రం ధందో ఇన్వెస్ట్‌మెంట్.
అలాగే, మణిలాల్, వర్జిన్ ఎయిర్లైన్స్, మిత్తల్ స్టీల్ ప్రయాణంలో కూడా ధందో ఇన్వెస్ట్‌మెంట్ సూత్రం ఉందని ఉదాహరణలతో వివరించారు.
మొదటి నాలుగు అధ్యాయాలలో ఉన్న ఈ కంపెనీల వివరాలు దేనికదే ఒక ప్రత్యేకమైన కేస్ స్టడీగా ఔత్సాహిక మదుపరులకు ఉపయోగపడతాయి.
ఈ కంపెనీల ప్రారంభ రోజుల్లో తీసుకున్న నిర్ణయాలలో ఉన్న ధందో ఇన్వెస్ట్‌మెంట్ సిద్ధాంతాన్ని ఐదు ప్రధాన భాగాలుగా వివరించవచ్చు.
1. ప్రస్తుతం ఉన్న వ్యాపారాలలో మదుపు చేయడం:
కొత్త వ్యాపారాలు, ఉత్పత్తులను మొదలు పెట్టడం కంటే ప్రస్తుతం ఉన్న వ్యాపారాలలో అవకాశాలను వెతకడం చాలా సులభమనేది ధందో ఇన్వెస్ట్‌మెంట్ సూత్రం. ఈ సందర్భంగా చార్లీ ముంగర్ చెప్పిన విషయాలను ప్రస్తావించారు.
ముంగర్ మదుపు చేయడాన్ని గుర్రం పందేలతో పోలుస్తారు. ప్రతి రోజూ గుర్రపు పందేలు చూసే వ్యక్తి వాటి గురించి అవగాహన పెంచుకుని చాలా తక్కువ నష్టం వచ్చే గుర్రం మీద తన పందెం కాస్తాడు. మదుపరి కూడా అలానే మదుపు గురించిన అనేక విషయాలను తెలుసుకుని తనకు తక్కువ నష్టం అనుకున్న వ్యాపారాలలో మదుపు చేస్తాడు.

ఫొటో సోర్స్, Getty Images
2. సులభంగా అర్థమయ్యే వ్యాపారాలలో మదుపు చేయడం:
ఎన్నో విజయవంతమైన వ్యాపారాలలో మదుపు చేసిన వారెన్ బఫెట్ మైక్రోసాఫ్ట్ సంస్థలో మదుపు చేయలేదు. ఎందుకంటే సాఫ్ట్ వేర్ వ్యాపారం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు. ఎన్నో ఏళ్ల తర్వాత కేవలం యాపిల్ సంస్థలో మదుపు చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
ఇదే సూత్రాన్ని ధందో ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా రచయిత వివరించారు.
ఒక వ్యాపారం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న మదుపరి, ఆ వ్యాపార భవిష్యత్తును కూడా సులభంగా అంచనా వేయగలరు. ఇతరుల సలహాల మీద ఆధారపడకుండా స్వయంగా మదుపు నిర్ణయాలు తీసుకోవడం ఒక విజయవంతమైన మదుపరికి చాలా ముఖ్యం.
బెర్క్ షైర్ కంపెనీ ఏ సంస్థలలో మదుపు చేయాలనే నిర్ణయాన్ని ఈరోజుకు కూడా కేవలం వారెన్ బఫెట్ ఒక్కరే నిర్ణయిస్తారు. మిగిలిన వారు ఆయనకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఇస్తారు.
3. సంక్షోభంలో ఉన్న వ్యాపారాల్లో మదుపు:
సంక్షోభంలో ఉన్న వ్యాపారంలో మదుపు చేయడం వల్ల లాభాలు ఎలా వస్తాయనేది సహజంగా తలెత్తే ప్రశ్న. కానీ, ఎక్కువ కాలపరిమితిని దృష్టిలో పెట్టుకుని మదుపు చేసేవారు ఇలాంటి సంక్షోభాలను అవకాశాలుగా తీసుకుని మదుపు చేస్తారు.
స్టీల్ పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పుడు లక్ష్మీ మిత్తల్ ఆ పరిశ్రమలో భారీగా మదుపు చేశారు. కొన్నేళ్ళ తర్వాత అదే పరిశ్రమ నుంచీ భారీగా లాభాలు ఆర్జించారు. కజకిస్తాన్‌లో మూతపడ్డ స్టీల్ పరిశ్రమను మిత్తల్ స్టీల్స్ ఎలా లాభాల బాటలోకి నడిపించిన విధానం ఒక కేస్ స్టడీగా నిలిచింది.
4. స్థిరమైన లాభాలు:
స్థిరమైన లాభాలు ఇచ్చే వ్యాపారాలను వారెన్ బఫెట్ moat(అగడ్త) అంటారు. మొహ్నీష్ కూడా ఇదే ఉపమానాన్ని అనేకసార్లు ఉపయోగించారు. ఈ స్థిరమైన లాభాల గురించి ఐదవ అధ్యాయంలో ఒక కీలకమైన విషయాన్ని చెప్పారు. ఈ లాభాలు కొన్ని సార్లు అధిక డిమాండ్ వల్ల, కొన్నిసార్లు వినూత్నమైన ఉత్పత్తుల వల్ల, ఇంకొన్ని సార్లు వ్యాపారదక్షత వల్ల వస్తాయని వివరించారు.
ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే, కోక్ కంపెనీ లాభాలు డిమాండ్ వల్ల వస్తున్నాయి. యాపిల్ కంపెనీ లాభాలు ఐఫోన్ లాంటి వినూత్నమైన ఉత్పత్తి వల్ల వస్తున్నాయి. వర్జిన్ ఎయిర్లైన్స్ లాభాలు ఆ సంస్థ క్రమశిక్షణ వల్ల వస్తున్నాయి. మదుపరులు ఈ విషయాన్ని గుర్తించి తాము మదుపు చేయాలని అనుకుంటున్న వ్యాపారం ఏ కోవలోకి వస్తుందో తెలుసుకుని తగిన విధంగా ముందుకు వెళ్లాలి.

ఫొటో సోర్స్, UGC
5. మదుపు చేసిన సొమ్ముకు రక్షణ
మదుపు ద్వారా లాభాలు గడించడం ఎంత ముఖ్యమో, మదుపు చేసిన మొత్తాన్ని కోల్పోకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం.
ఇదే విషయానికి మొహ్నీష్ పబ్రాయి కూడా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పేరు మీద ఒక అధ్యాయాన్ని కేటాయించారు. ఈ అధ్యాయంలో బెంజమిన్ గ్రాహం సూక్తులను ఊటంకిస్తూ మదుపును రక్షించుకోవడానికి ఏం చేయాలో వివరించారు.
వారెన్ బఫెట్ తన వాషింగ్టన్ పోస్ట్, కోకకోల షేర్లను కొన్ని దశాబ్దాలుగా అమ్మలేదు. దీర్ఘకాల ఆలోచనతో మదుపు విలువ ఎలా కాపాడుకోవాలో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
ఇవే కాకుండా, మహాభారతంలో అభిమన్యుడు, అర్జునుడి ఉపమానాలతో మదుపుకు సంబంధించిన విషయాలను చాలా ఆసక్తికరంగా చెప్పారు. మొత్తంగా చూస్తే పర్సనల్ ఫైనాన్స్ సాహిత్యంలో ఈ పుస్తకానికి ఒక విలక్షణమైన స్థానం ఉంది.
ఎందుకంటే, ఇది కొందరు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవన పయనాన్ని జల్లెడపట్టి ఔత్సాహిక మదుపరులకు ప్రయోజనం అందించడానికి చేసిన ప్రయత్నం.
(నోట్: ఈ కథనం నిర్దిష్టమైన అంశంపై స్థూలమైన అవగాహన కోసం మాత్రమే. నిర్ణయాలు మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారులను సంప్రదించి తీసుకోవాలి.)
ఇవి కూడా చదవండి:
- హిరోషిమా డే: 'మంచి నీళ్ళు తాగగానే చనిపోయారు, ఒకరి తరువాత ఒకరు చనిపోతూనే ఉన్నారు... వాళ్ళు మనుషుల్లా చనిపోలేదు'
- బ్లూ వేల్స్: రోజుకు 4 టన్నుల ఆహారం తినే నీలి తిమింగలాలు చనిపోయి విశాఖ తూర్పుతీరానికి కొట్టుకొస్తున్నాయి... ఎందుకు?
- ఆస్ట్రేలియా: 91 మంది బాలికలపై 246 సార్లు అత్యాచారం - చివరకు పోలీసులకు ఎలా దొరికాడంటే
- డీఎన్ఏ టెస్ట్: పిల్లలు తమకే పుట్టారో లేదో తెలుసుకోవడానికి పరీక్షలు చేయిస్తున్న తండ్రులు
- స్వాల్బార్డ్: 4 నెలలు చీకటి, 4 నెలలు పగలు.. ఈ అందమైన ప్రాంతానికి రావాలంటే వీసా అక్కర్లేదు, కానీ తుపాకీ కావాలి














