స్వాల్‌బార్డ్: 4 నెలలు చీకటి, 4 నెలలు పగలు.. ఈ అందమైన ప్రాంతానికి రావాలంటే వీసా అక్కర్లేదు, కానీ తుపాకీ కావాలి

ఫొటో సోర్స్, Getty Images
నార్వే నార్త్ పోల్ మధ్య ఉన్న చిన్న దీవుల సముదాయం స్వాల్‌బార్డ్.
ఉత్తర ధ్రువానికి దక్షిణం వైపున1300 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం.
ప్రపంచానికి ఓ చివరన ఉన్న భూభాగం ఇది.
ప్రపంచంలో ఏ దేశస్తుడైనా ఇక్కడకు రావచ్చు. ఎలాంటి వీసా అక్కర్లేదు. ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు.
1920ల్లో ఇక్కడ ప్రజలు ఆవాసం ఏర్పాటు చేసుకునే వరకూ ఇది నార్వేలో భాగంగా ఉండేది. ఏడాదిలో నాలుగు నెలలు నిరంతరాయంగా చీకటి, నాలుగు నెలల నిరంతరాయంగా పగలు స్వాల్‌బార్డ్ ప్రత్యేకతలు.

ఫొటో సోర్స్, Getty Images
స్వాల్‌బార్డ్ రాజధాని లాంగర్‌బియన్. జనాభా రెండున్నర వేలు. అందులోనూ 51 దేశాలకు చెందిన వాళ్లున్నారు.
ఇక్కడ జనాభా కంటే ధృవపు ఎలుగుబంట్ల సంఖ్య ఎక్కువ. అప్పుడప్పుడూ అవి పట్టణంలోకి వస్తుంటాయి. ధృవపు ఎలుగుబంట్లు అప్పుడప్పుడూ స్థానికులపై దాడి చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి.
ఈ ప్రాంతాన్ని సందర్శించేవారుగానీ, ఇక్కడ నివసించేవారుగానీ రావాలన్నా, పట్టణానికి దూరంగా వెళ్లాలన్నా తుపాకీ కచ్చితంగా ఉండాలి. లేదా తుపాకీ ఉన్న వ్యక్తి పక్కన ఉండాలి. ఎందుకంటే- ధృవపు ఎలుగుబంట్ల నుంచి రక్షణ కోసం తుపాకీ తప్పనిసరి.
ధృవపు ఎలుగుబంట్లతో పాటు జింకలు, సీల్స్, వేల్స్, కొన్ని నక్కలకు ఈ ప్రాంతం ఆవాసం.

ఫొటో సోర్స్, Getty Images
20వ శతాబ్దపు తొలినాళ్లలో ఈ ప్రాంతానికి బొగ్గు తవ్వకం కోసం ఇక్కడకు వచ్చిన వాళ్లు ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడున్న వారిలో ఎక్కువ మంది పర్యటకంలో పని చేస్తున్నారు.
స్వాల్‌బార్డ్ ఎప్పుడూ మంచుతో కప్పి ఉంటుంది. ఇక్కడ పంటలు పండవు. పచ్చదనం కనిపించదు. ఆర్కిటిక్ మంచులో సాహసాలు చేయాలనుకునే వారికి ఇదొక ఆకర్షణీయ కేంద్రం.
స్వాల్‌బార్డ్‌లో ప్రజా రవాణా లేదు. స్థానికుల్లో కొంతమందికి కార్లు ఉన్నాయి. అంతా కలిపితే ఇక్కడి రోడ్ల విస్తీర్ణం 50 కిలోమీటర్లు మాత్రమే. మంచు దట్టంగా కురిసేటప్పుడు స్నో మొబైల్స్ మీద ప్రయాణిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో మిగతా ప్రాంతాల మాదిరిగానే స్వాల్‌బర్డ్‌ను కూడా కరోనావైరస్ మహమ్మారి దెబ్బ తీసింది. కోవిడ్ కాలంలో టూరిస్టుల రాక పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మొదటి రెండు వారాల వరకూ ఇక్కడ సూర్యరశ్మి ఉండదు. అందంగా కనిపించినా, ఇక్కడి జీవితం చాలా సవాళ్లు, ప్రమాదాలతో కూడుకున్నది. అప్పుడప్పుడూ మంచు చరియలు ఇళ్లపై విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పర్యావరణానికి ప్రత్యక్ష నిదర్శనం స్వాల్‌బార్డ్ పగడపు దిబ్బలే.
1971 నుంచి ఆర్కిటిక్‌లో ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ మేర పెరిగింది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
నిరుడు కొన్ని ప్రాంతాల్లో దట్టంగా ఉన్న మంచు ప్రస్తుతం లేదని స్థానికులు చెబుతున్నారు. పర్యావరణం ఈ ప్రాంతాన్ని చాలా వేగంగా మార్చేస్తోంది. ఇదిలాగే కొనసాగితే మరో వందేళ్ల తర్వాత స్వాల్‌బార్డ్ ప్రస్తుతం ఉన్నట్లుగా కనిపించకపోవచ్చు.
మిగతా అంశాలు ఎలా ఉన్నా, మీరు ఉంటున్న ప్రపంచంలో మీకు బోర్ కొడితే, మనసు కాస్త మార్పును కోరుకుంటే ఈ చిన్న దీవుల సముదాయాన్ని సందర్శించండి. ఇదో కొత్త ప్రపంచం.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: గణేశుడి పేరుతోనే ఈ లోయకు గనీష్ వ్యాలీ అనే పేరు వచ్చిందా?
- ఆదిత్య L1: సూర్యుడి వైపు ఇస్రో చూపు, ఈ ప్రయోగం ఎలా జరుగుతుందంటే....
- ఓవర్సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’
- హీట్‌వేవ్: వడగాల్పులతో రక్తం వేడెక్కి రక్తనాళాలు తెరుచుకుంటాయ్, చెమట పడుతుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే...
- మణిపుర్: కుకీ, మెయితీల మధ్య బలమైన విభజన రేఖ...అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















