విమానం ఆగకముందే తలుపు తెరిచి దూకబోయాడు, చివరకు ఏమైందంటే...

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, NEWS 1

ఫొటో క్యాప్షన్, విమానం
    • రచయిత, డెరెక్ కాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఏషియానా ఎయిర్‌లైన్స్ విమానం దక్షిణ కొరియాలో ల్యాండ్ అవుతుండగానే ఓ ప్రయాణికుడు దాని తలుపు తెరిచి కిందికి దూకబోయాడు.

194 మంది ప్రయాణికులున్న ఈ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన దక్షిణ కొరియాలోని డేగు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది.

విమానం గాల్లో ఉండగా తలుపు తెరవడంతో కొందరు ప్రయాణికులు స్పృహతప్పి పడిపోయారు. మరికొందరు శ్వాస సమస్యలతో బాధపడ్డారు.

వీరందరినీ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

విమాన ప్రమాదం

విమానం తలుపులు తెరిచిన వ్యక్తి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుంది. తనకు ఊపిరాడనట్లుగా ఉందని, వెంటనే దిగాలని ఆ ప్రయాణికుడు చెప్పాడని, అందుకే విమానం కిందికి దిగకముందే డోర్ తెరిచాడని యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది.

ఉద్యోగం కోల్పోయిన తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు ఆ వ్యక్తి పోలీసుల విచారణలో తెలిపాడు.

అతను ప్రస్తుతం మానసికంగా ఇబ్బంది పడుతున్నాడనీ, కనీసం నిలబడటానికి కూడా కష్టపడుతున్నాడని స్థానిక పోలీసు అధికారి విలేఖరులతో చెప్పారు.

‘‘ఈ స్థితిలో అతన్ని పూర్తిగా విచారించడం కష్టం. అందుకే అతన్ని ఎలాంటి ప్రశ్నలు అడగలేకపోయాం’’ అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, విమానం డోరు తెరుచుకున్న తర్వాత దృశ్యాలు

ఓజెడ్ 8124 నంబరు గల ఎయిర్ బస్ ఎ-321-200 జెట్ విమానం జెజూ ఐలాండ్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 11.45 కు టేకాఫ్ అయ్యింది.

సుమారు గంట తర్వాత అది దక్షిణ కొరియాలోని డేగు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావడానికి సిద్ధమయ్యింది. అయితే, విమానం భూమికి 250 మీటర్ల (సుమారు పావు కిలోమీటర్) ఎత్తులో ఉండగానే ఆ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశారు.

కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, విమానం ఎడమ వైపున డోర్ తెరిచి ఉన్నట్లు, అందులోపలి నుంచి గాలి వేగంగా వీస్తున్నట్లు కనిపిస్తుంది.

విమానం ల్యాండ్ కాబోతుండటంలో ఫ్లైట్ అటెండెంట్లు అతన్ని ఆపలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాకు తెలిపారు.

డోర్ తెరిచిన తర్వాత ఆ వ్యక్తి విమానం నుంచి దూకేందుకు కూడా ప్రయత్నించాడని వారు వెల్లడించారు. అది చూసి తాము భయాందోళనలను గురైనట్లు న విమానంలోని ప్రయాణికులు వెల్లడించారు.

"తలుపుకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా స్పృహ కోల్పోతున్నట్లు కనిపించడం, ఫ్లైట్ అటెండెంట్లు మైక్ ద్వారా వైద్యులను పిలుస్తుండటంతో పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారింది" అని 44 ఏళ్ల ప్రయాణికుడు యోన్‌హాప్‌ వార్తా సంస్థతో అన్నారు.

"విమానం పేలిపోతుందని, నేను కచ్చితంగా చచ్చిపోతానని అనుకున్నా" అని ఆయన చెప్పారు.

వీకెండ్ కోసం వెళ్తున్న అనేకమంది స్కూలు పిల్లలు కూడా ఆ విమానంలో ఉన్నారు.

‘‘పిల్లలు ఒక్కసారిగా భయపడ్డారు. ఏడవటం మొదలు పెట్టారు’’ అని ఒక మహిళ యోన్‌హాప్ వార్తా సంస్థతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)