జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?

గాజు గ్లాసు

ఫొటో సోర్స్, JSP

ఫొటో క్యాప్షన్, గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ ఇప్పుడు ‘‘ఫ్రీ సింబల్స్’’ జాబితాలో ఉంచింది.
    • రచయిత, వి.రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'గాజు గ్లాసు' కేంద్రంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి కేటాయించిన ఈ గుర్తును భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) తాజాగా ‘‘ఫ్రీ సింబల్స్’’ జాబితాలో ఉంచిందనే వార్తలే దీనికి కారణం.

ఈ సందర్భంగా, రాజకీయ పార్టీలకు గుర్తులను ఎలా కేటాయిస్తారు, ‘‘ఫ్రీ సింబల్స్’’ అంటే ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం.

‘‘ది ఎలక్షన్ సింబల్స్(రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్, 1968’’ ప్రకారం రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గుర్తులు కేటాయిస్తుంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తులను ఆయా పార్టీలు ఉపయోగిస్తాయి.

ఎన్నికల గుర్తులు రెండు రకాలు.

ఆప్ సింబల్

ఫొటో సోర్స్, Getty Images

రిజర్వుడు గుర్తులు

రికగ్నైజ్డ్ అంటే ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉన్న పార్టీలకు మాత్రమే కేటాయించే గుర్తులను రిజర్వుడు గుర్తులు అంటారు.

ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌సీపీ, బీఆర్‌ఎస్ అనేవి ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న రాష్ట్ర పార్టీలు. ఈ పార్టీల గుర్తులను రిజర్వుడు గుర్తులు అంటారు.

కాంగ్రెస్, బీజేపీ అనేవి ఎన్నికల సంఘం గుర్తించిన జాతీయ పార్టీలు. వీటి గుర్తులు కూడా రిజర్వు చేసినవే.

రిజర్వుడు గుర్తులను ఇతరులకు కేటాయించరు.

గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల టికెట్ల మీద పోటీ చేసే అభ్యర్థులు ఆ పార్టీలకు కేటాయించిన ఎన్నికల గుర్తులనే వాడాలి. ఇతర గుర్తుల మీద పోటీ చేయడానికి లేదు.

ఎన్నికల సంఘం

ఫొటో సోర్స్, ECI/FB

ఫ్రీ సింబల్స్

ఇవి ఎవరికీ రిజర్వు చేయని గుర్తులు.

కొత్తగా స్థాపించిన పార్టీలు లేదా గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ‘‘ఫ్రీ సింబల్స్’’ నుంచి గుర్తులను కేటాయిస్తారు. గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకు ఎన్నికల గుర్తులను రిజర్వు చేయరు.

ఫ్రీ సింబల్స్ జాబితాను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తూ ఉంటుంది.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?

ఎన్నికల సంఘం వద్ద పెద్ద సంఖ్యలో గుర్తుల జాబితా ఉంటుంది. రిజర్వుడు, రిజర్వు చేయని గుర్తులు వాటిలో ఉంటాయి. ఓటర్లు సులభంగా గుర్తుపెట్టుకునేందుకు వీలుగా అగ్గిపెట్టె, గ్లాసు, ఆటో లాంటి చిత్రాలను ఎన్నికల చిహ్నాలుగా ఉంచుతారు.

గుర్తింపు పొందిన పార్టీలకు ఎలాగూ వాటికి రిజర్వు చేసిన గుర్తులు ఉంటాయి. కానీ కొత్తగా స్థాపించిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్టర్డ్ పార్టీలు: గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు ‘‘ఫ్రీ సింబల్స్’’ జాబితా నుంచి మూడు ఆప్షన్లను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఉదాహరణకు A అనే పార్టీ అగ్గిపెట్టె, మామిడి పండు, చెట్టు మూడు గుర్తులను ఎంచుకుంది. ఆ పార్టీ ‘చెట్టు’ గుర్తు కావాలని అనుకుంటోంది. అప్పుడు ‘చెట్టు’కు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మిగతా రెండు గుర్తులకు రెండవ, మూడవ ప్రాధాన్యం ఇవ్వాలి.

ఆ తరువాత ఎన్నికల సంఘం పరిశీలించి, అందుబాటులో ఉంటే ‘చెట్టు’ను A ఎన్నికల గుర్తుగా కేటాయిస్తుంది.

ఒకటి కంటే ఎక్కువ రిజిస్టర్డ్ పార్టీలు ఒకే గుర్తుకు తొలి ప్రాధాన్యం ఇస్తే, ఆ గుర్తును ఎవరికి కేటాయించాలనేది డ్రా తీస్తారు.

ఉదాహరణకు A, B అనే రెండు రిజిస్టర్డ్ పార్టీలున్నాయి. అవి రెండూ ‘చెట్టు’ గుర్తుకే తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. అప్పుడు డ్రాలో ఎవరి పేరు వస్తే వారికి చెట్టు గుర్తును కేటాయిస్తారు.

రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థుల్లో ఎవరైనా అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఉంటే వారికి డ్రా తీయకుండానే నేరుగా ఆ గుర్తును ఆ పార్టీకే కేటాయిస్తారు.

ఉదాహరణకు A పార్టీ తరపున అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఉంటే ఆ పార్టీకే ‘చెట్టు’ గుర్తును ఇస్తారు. B పార్టీకి చివర్లో మిగిలిన చిత్రాల నుంచి గుర్తును కేటాయిస్తారు.

స్వతంత్ర అభ్యర్థులు: వీళ్లు కూడా మూడు ఆప్షన్లు ఎంచుకోవచ్చు. రిజర్వుడు పార్టీకి కేటాయించిన గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వరు. కాబట్టి వాటిని ఎంచుకోకూడదు.

స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రాధాన్యం ప్రకారం గుర్తులను ఎంచుకోవాలి. ఒకరి కంటే ఎక్కువ మంది ఒకే గుర్తు కోసం పోటీ పడితే డ్రా తీస్తారు.

ఉదాహరణకు X, Y అనే ఇద్దరు వ్యక్తులు ‘అగ్గిపెట్టె’ గుర్తు కోసం పోటీపడ్డారు అనుకుందాం. అప్పుడు లాటరీ తీసి వారిలో ఒకరికి ఆ గుర్తును కేటాయిస్తారు.

ఒకవేళ X సిట్టింగ్ ఎంపీ లేదా ఎమ్మెల్యే అయి ఉండి, చివరి ఎన్నికల్లో ‘అగ్గిపెట్టె’ గుర్తు మీద పోటీ చేసి ఉంటే అప్పుడు ఆ గుర్తును Xకే కేటాయిస్తారు.

కోరుకున్న గుర్తులు దొరకని వారికి ఎన్నికల సంఘమే ఇలా అందుబాటులో ఉన్న గుర్తుల్లో ఒకటి కేటాయిస్తుంది.

రిజిస్టర్డ్ పార్టీలకు రిజర్వుడు గుర్తులు

సాధారణంగా రిజిస్టర్డ్ పార్టీలకు ప్రత్యేకంగా గుర్తులను రిజర్వు చేయరు. కానీ కొన్ని రకాల అర్హతలున్న రిజిస్టర్డ్ పార్టీలకు రిజర్వుడు గుర్తులను ఇస్తుంటారు.

కనీసం 15 మంది ఎంపీటీసీలు లేదా ముగ్గురు జెడ్పీటీసీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 15 మంది వార్డు మెంబర్లు ఉంటే అలాంటి రిజిస్టర్డ్ పార్టీలకు రిజర్వుడు గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయిస్తుంది.

(లేదా)

అసెంబ్లీ, పార్లమెంటులో సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఉంటే అలాంటి రిజిస్టర్డ్ పార్టీలు రిజర్వు గుర్తులను పొందొచ్చు.

బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

జాతీయ పార్టీ అర్హతలు

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం ( ఈ నిబంధనను కాలానుగుణంగా మార్చుతున్నారు) చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి.

దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి.

(లేదా)

కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.

(లేదా)

గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.

బీఆర్ఎస్

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్ర పార్టీ అర్హతలు

ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు కనీసం రెండు అసెంబ్లీ స్థానాలను గెలవాలి.

(లేదా)

ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.

(లేదా)

ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు కనీసం ఒక స్థానాన్ని గెలవాలి.

(లేదా)

ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కనీసం మూడు శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.

(లేదా)

లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చి ఉండాలి.

ఒక ఎన్నికల్లో జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే అదే హోదా శాశ్వతంగా ఉండదు.

అంటే, ఎన్నికల తరవాత పార్టీలు తమ గత హోదాను కలిగి ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది.

దీనివల్లే జాతీయ పార్టీల సంఖ్య, రాష్ట్ర స్థాయి పార్టీల సంఖ్య మారే అవకాశం ఉంటుంది.

రిజిస్టర్డ్‌ పార్టీలు

జాతీయ, రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించలేకపోయిన పార్టీలను రిజిస్టర్డ్‌ పార్టీలుగా పరిగణిస్తారు.

కొత్తగా స్థాపించిన పార్టీ ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో పోటీ చేయాలి.

50 కంటే తక్కువ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలు అయితే కనీసం ఐదు స్థానాల్లో పోటీ చేయాలి.

20 కంటే తక్కువ లోక్‌సభ స్థానాలు ఉంటే కనీసం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)