నరేంద్ర మోదీ విద్యార్హతలపై వివాదం ఎందుకు? ప్రధాని కావాలంటే ఏం చదవాలి? సీఎం అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించిన ఆధారాలు చూపించే విషయంలో కొన్నాళ్లుగా రాజకీయ వివాదం నడుస్తోంది.
ఇటీవల గుజరాత్ హైకోర్టు దీనిపై దాఖలైన పిటిషన్ కొట్టివేస్తూ ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
అంతేకాదు, పిటిషన్ వేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానా కూడా విధించింది.
ప్రధానమంత్రి విద్యార్హతల సర్టిఫికేట్లు వెల్లడించాలంటూ 2016లో అప్పటి కేంద్ర సమాచార కమిషనర్(సీఐసీ) మాడభూషి శ్రీధరాచార్యులు సంబంధిత యూనివర్సిటీలకు జారీచేసిన ఆదేశాలనూ కోర్టు రద్దు చేసింది.
ప్రధాని మోదీ విద్యార్హతల ధ్రువపత్రాలను ఆ సమాచారం కోరిన అరవింద్ కేజ్రీవాల్‌కు చూపించాలంటూ మాడభూషి శ్రీధరాచార్యులు పీఎంవోలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, గుజరాత్ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను ఆదేశించారు.
ఆ ఆదేశాలపై గుజరాత్ యూనివర్సిటీ కోర్టుకు వెళ్లడంతో స్టే విధించారు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టివేస్తూ పిటిషనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానా విధించింది.
దీంతో ఇది దేశంలో రాజకీయ వివాదంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
సమస్య విద్యార్హత లేకపోవడమా? ‘అవాస్తవాలు’ చెప్పడమా?
గుజరాత్ కోర్టు తీర్పును కేజ్రీవాల్ తప్పుపడుతూ, దేశ ప్రధాని ఏం చదువుకున్నారో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా అంటూ తరచూ విమర్శలు చేస్తున్నారు.
విద్యార్హతల ఆధారాలను ఎందుకు దాచిపెడుతున్నారు? తక్కువ చదువుకున్న వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉండడం ప్రమాదకరం కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆయనకు మద్దతుగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు గళం విప్పుతున్నారు.
అదే సమయంలో దేశంలోని ఇతర పార్టీల నేతలు కొందరు నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. భారత్‌లో ప్రధానమంత్రికంటూ ప్రత్యేక విద్యార్హతల అవసరం ఏమీ లేదని అంటున్నారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కులమతాల పేరిట విభజన వంటి అనేక తీవ్రమైన సమస్యలు ఉండగా, అవన్నీ వదిలేసి ప్రధాని ఏం చదువుకున్నారనే విషయంలో రాజకీయ వివాదాలు సృష్టించడం రాజకీయం చేయడమే తప్ప దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం అనిపించుకోదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ వంటివారు అభిప్రాయపడుతున్నారు.
అయితే, విద్యార్హతలు అవసరమా లేదా అనే కంటే విద్యార్హతలపై దాపరికం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. అదే సమయంలో తక్కువ చదువుకున్న వ్యక్తి దేశానికి ప్రధాని అయితే ప్రమాదకరం అనే కేజ్రీవాల్ విమర్శలపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల విషయంలో చాలాకాలంగా వివాదం నడుస్తోంది. మోదీ దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేసినట్లుగా చూపిస్తున్న సర్టిఫికెట్లు నిజమైనవి కాదని, అవి 'ఫేక్' అనే ఆరోపణలు వచ్చాయి.
దీంతో బీజేపీ నేత అమిత్ షా 2016 మే 10న మోదీ సర్టిఫికెట్లను మీడియాకు చూపించారు.
బీజేపీ చూపించిన నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ అసలైనదేనని 2016 మే 11వ తేదీన దిల్లీ యూనివర్సిటీ తెలిపింది. అయితే అందులో ఉత్తీర్ణత సంవత్సరం '1979' అని ఉండటం చిన్న లోపమని అది వెల్లడించింది.
ఇంతకూ భారత్‌లో ప్రధానమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉండాల్సిన విద్యార్హతలు ఏమిటి?
ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పోటీ చేయడానికి ఉండాల్సిన విద్యార్హతలు ఏమిటి?
ఎంపీలకు, ప్రధానికి వేర్వేరు విద్యార్హతలున్నాయా? ఎమ్మెల్యేలకు, సీఎంలకు వేర్వేరు విద్యార్హతలుండాలా?
దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్నవారు ఏం చదువుకున్నారు?
ఇవన్నీ తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధానిగా ఎవరిని నియమిస్తారు? ఏం చదువుకుంటే ప్రధాని అవుతారు?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు.
లోక్‌సభలో అత్యధిక సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించిన పార్టీ లేదా కూటమి తమ నేతగా ఎన్నుకుని రాష్ట్రపతికి ప్రతిపాదించిన అభ్యర్థిని కానీ, లేదంటే లోక్‌సభలో సగం కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు పొందిన అభ్యర్థిని కానీ ప్రధానిగా నియమిస్తారు.
లోక్‌సభలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లేని సందర్భాలలో రాష్ట్రపతే తన స్వీయ విచక్షణతో ఎవరినైనా ప్రధానిగా నియమించొచ్చు. అయితే, అలా నియమితులైన నేత తన బలాన్ని సభలో నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ప్రధానిగా నియమితులైనప్పటికి కానీ, ఆ తరువాత ఆర్నెళ్లలో కానీ పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది.
ప్రధానిగా నియమితులయ్యే నేతకు ఎలాంటి విద్యార్హతలూ అవసరం లేదు. నిరక్షరాస్యులు కూడా ప్రధాని కావొచ్చు.
భారత్ ప్రజాస్వామ్య దేశం కావడంతో రాజ్యాంగం ప్రకారం ప్రజలందరికీ సమాన అవకాశాలుంటాయి. విద్యార్హతలు లేవన్న కారణంతో ఎవరికీ దేశ ప్రధాని అయ్యే అవకాశాన్ని కాదనడానికి వీల్లేదు.

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంటు సభ్యులకూ విద్యార్హతలుండాలా? నిరక్షరాస్యులు ఎంపీ కాలేరా?
పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు పోటీ చేయాలంటే నామినేషన్ల పరిశీలన సమయానికి కనీసం 25 ఏళ్లు పూర్తయి ఉండాలి.
ఎగువ సభ అయిన రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 30 ఏళ్లు నిండి ఉండాలి.
పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలంటే దేశంలో ఎక్కడైనా ఓటరుగా నమోదై ఉండాలి.
ఏదైనా కేసులో రెండేళ్లు, అంతకుమించి శిక్ష పడినవారు పోటీకి అనర్హులు.
లోక్‌సభకు కానీ రాజ్యసభకు కానీ పోటీలో ఉండే అభ్యర్థులకు ఎలాంటి ప్రత్యేక విద్యార్హతలూ అవసరం లేదు. నిరక్షరాస్యులు కూడా పోటీ చేయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత 17వ లోక్‌సభలో ఎంపీల చదువులు ఇలా..
ప్రస్తుత 17వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల అఫిడవిట్లను విశ్లేషించి పీఆర్ఎస్ ఇండియా రీసర్చ్ 2019లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 4 శాతం మంది సభ్యులు డాక్టరేట్ స్థాయి విద్యార్హతలు కలిగి ఉన్నారు.
25 శాతం మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, 43 శాతం మంది గ్రాడ్యుయేషన్, 27 శాతం మంది హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసినవారు ఉన్నారు.

ఫొటో సోర్స్, ANI
30 మంది సీఎంలలో ఎక్కువ చదువుకున్నది ఆయనే..
దేశంలో ప్రస్తుతం ఉన్న 30 మంది ముఖ్యమంత్రులలో అత్యధిక విద్యార్హతలు ఉన్నది అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ -ఏడీఆర్’ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది.
ఆయన గౌహతి యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
ఏడీఆర్ నివేదిక ప్రకారం.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలున్న ముఖ్యమంత్రులు తొమ్మిది మంది, గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నవారు 11 మంది.
ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఉన్నవారు నలుగురు కాగా డిప్లమో చదువుకున్న వారు ఒకరు ఉన్నారు.
ముగ్గురు సీఎంలు 12వ తరగతి వరకు చదువుకోగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పదో తరగతి వరకు చదువుకున్నారు.

ఫొటో సోర్స్, Facebook
ఎమ్మెల్యేలు, సీఎంలకు విద్యార్హతలు తప్పనిసరా?
ప్రధాని, ఎంపీలకు విద్యార్హతల నిబంధనలు లేనట్లే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులకు కూడా ప్రత్యేకంగా విద్యార్హతలేమీ అవసరం లేదు.
దేశంలో గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి విద్యార్హతలూ లేని ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు.
ఓటరుకు విద్యార్హత, అభ్యర్థికి అవసరం లేదు.. ఈ ఎన్నికల గురించి తెలుసా?
శాసన మండలిలోని గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు కూడా గ్రాడ్యుయేట్లు అయి ఉండాల్సిన అవసరం లేదు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటేయడానికి డిగ్రీ అర్హత అవసరం కానీ, ఈ స్థానానికి పోటీ చేసే అభ్యర్థికి మాత్రం డిగ్రీ అర్హత అవసరం లేదు.
అలాగే, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటేయాలంటే బోధన వృత్తిలో ఆరేళ్ల అనుభవం ఉండాలి. కానీ, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే బోధన వృత్తి అనుభవం అవసరం కానీ, డిగ్రీ విద్యార్హత కానీ అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
- గాడిద, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? ఇవి తాగితే ఆటిజం, డయాబెటిస్ తగ్గుతాయా
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








