నరేంద్ర మోదీ డిగ్రీల వివాదం ఏంటి..? సర్టిఫికెట్లు అడిగిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఫైన్ ఎందుకు వేశారు?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Facebook/Narendra Modi

నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను చూపించాల్సిన అవసరం ప్రధానమంత్రి కార్యాలయానికి లేదని గుజరాత్ హై కోర్టు తీర్పు చెప్పింది.

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల వివరాలను ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌తో పాటు గుజరాత్ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీలను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్(సీఐసీ) ఆదేశించింది.

ఈ ఆదేశాలను జస్టిస్ బిరెన్ వైష్ణవ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలను ఇవ్వాలని సమాచార హక్కు ద్వారా అడిగిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 25,000 రూపాయలు జరిమానాను కూడా కోర్టు విధించిందని ఆయన న్యాయవాది పెర్సీ కవీనా బీబీసీకి తెలిపారు.

నరేంద్ర మోదీ డిగ్రీలను బహిరంగపర్చాలంటూ నాటి ముఖ్య సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులకు అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో డిగ్రీలను చూపించాలంటూ 2016లో సమాచార కమిషన్ ఆదేశించింది. ఆ ఆదేశాలను గుజరాత్ హై కోర్టులో గుజరాత్ యూనివర్సిటీ సవాలు చేసింది. ప్రధానమంత్రి వ్యక్తిగత వివరాలను ఇవ్వడంలో ఎటువంటి ప్రజాప్రయోజనం లేదని అది పేర్కొంది.

నరేంద్ర మోదీ డిగ్రీల విషయంలో దాచడానికి ఏమీలేదని, ఇప్పటికే ఆయన డిగ్రీలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని గుజరాత్ యూనివర్సిటీ తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

‘‘కొందరు పిల్లతనంతోనో లేక కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేసేందుకు అవకాశం కల్పించడానికో’’ ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు అడిగారని గుజరాత్ యూనివర్సిటీ వాదించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''దేశానికి చాలా ప్రమాదం''

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల మీద గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.

ప్రధాని ఎంత వరకు చదువుకున్నారో తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా? అని ఆయన ప్రశ్నించారు.

''తన డిగ్రీలను చూపించడాన్ని ఆయన తీవ్రంగా కోర్టులో వ్యతిరేకించారు. ఎందుకు? ఆయన డిగ్రీలు చూపించమని అడిగిన వాళ్లకు ఫైన్ వేస్తారా? ఏం జరుగుతోంది? చదువుకోని లేదా తక్కువ చదువుకున్న ప్రధాని ఈ దేశానికి చాలా ప్రమాదకరం'' అంటూ అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

మోదీ సర్టిఫికెట్లు

ఫొటో సోర్స్, BJP/Twitter

ఏమిటి వివాదం?

నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల మీద వివాదం చాలా కాలం నుంచి నడుస్తోంది. దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేసినట్లుగా చూపిస్తున్న సర్టిఫికెట్లు నిజమైనవి కాదని, అవి 'ఫేక్' అనే ఆరోపణలు వచ్చాయి.

ఆమ్ ఆద్మీ వంటి రాజకీయ పార్టీలు నరేంద్ర మోదీ డిగ్రీల మీద విమర్శలు చేయడం ప్రారంభించాయి.

విద్యార్హత మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు అమిత్ షా 2016 మే 10న మోదీ సర్టిఫికెట్లను మీడియాకు చూపించారు.

నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు అంటూ చెబుతున్న కాపీలను అమిత్ షా, అరుణ్ జైట్లీ చూపించారు. వాటి ప్రకారం 1978లో మోదీ దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. 1983లో పొలిటికల్ సైన్స్‌లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఉత్తీర్ణత సాధించారు.

బీజేపీ చూపించిన నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ అసలైనదేనని 2016 మే 11వ తేదీన దిల్లీ యూనివర్సిటీ తెలిపింది. అయితే అందులో ఉత్తీర్ణత సంవత్సరం '1979' అని ఉండటం చిన్న లోపమని అది వెల్లడించింది.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Facebook/ArvindKejriwal

''సమాచారం నిరాకరణ''

దిల్లీకి చెందిన న్యాయవాది మహ్మద్ ఇర్షద్ ఆర్టీఐ ద్వారా నరేంద్ర మోదీ డిగ్రీల వివరాలను కోరారు.

కానీ ఆ వివరాలను వెల్లడించేందుకు దిల్లీ యూనివర్సిటీ నిరాకరించింది. విద్యార్థుల వివరాలను బయటకు వెల్లడించకూడదు అని 2016 జూన్ 13న యూనివర్సిటీ తెలిపింది.

సమాచారం ఇవ్వనందుకు 2017 జనవరిలో దిల్లీ యూనివర్సిటీకి 25,000 జరిమానాను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ విధించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''మా దగ్గర సమాచారం లేదు''

దిల్లీ యూనివర్సిటీ నుంచి 1978లో బీఏలో ఉత్తీర్ణులైన వారి జాబితాను ఇవ్వాల్సిందిగా ఐఏఎన్‌ఎస్ ప్రతినిధి సమాచార హక్కు ద్వారా అడిగారు. ఈ సారి ఆ 'డేటా' తమ వద్ద లేదంటూ యూనివర్సిటీ తెలిపింది.

''రికార్డులను ఒక ఏడాది మాత్రమే స్టోర్ చేస్తాం. అందువల్ల ఆ డేటా ఇప్పుడు మా వద్ద లేదు'' అని దిల్లీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ వెల్లడించింది.

''నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలు మా వద్ద లేవు'' అని దిల్లీ యూనివర్సిటీ చెప్పడం వివాదాన్ని మరింత పెంచింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)