తోటగొడిపుట్: ఇంటి కోసం దాచుకున్న డబ్బులతో ఊరికి రోడ్డు వేయిస్తున్న ఉత్తరాంధ్ర గిరిజన మహిళ

జమ్మే

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, జమ్మే
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

సొంత ఇల్లు నిర్మించుకుందామని నాలుగేళ్లుగా దాచుకున్న డబ్బుతో గ్రామానికి రోడ్డు వేయిస్తున్నారు జమ్మే అనే మహిళ.

జమ్మే, డ్రైవరుగా పని చేస్తున్న ఆమె భర్త కూడా సొంత ఇంటి కోసం డబ్బు కూడబెట్టారు. కానీ ఇంటి కంటే గ్రామానికి రోడ్డు అవసరమే ఎక్కువ అని భావించి, దాచుకున్న సొమ్మును రోడ్డు కోసం వినియోగిస్తున్నారు.

‘దొర జమ్మే’ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జోలాపుట్ రిజర్వాయర్‌ను అనుకుని ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఉన్న తోటగొడిపుట్ గ్రామంలో సామాజిక ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్నారు.

మట్టి రోడ్డు కూడా లేని తోటగొడిపుట్ గ్రామాన్ని చేరుకోవాలంటే గొడిపుట్ గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు కొండపైకి నడవాల్సిందే.

తోటగొడిపుట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ఒక్కొక్కరుగా గ్రామాన్ని వదిలేస్తున్నారు’

జోలాపుట్ రిజర్వాయరు గట్టును ఆనుకుని ఉన్న ప్రాంతంపై తోటగొడిపుట్ గ్రామంలోని గిరిజనం తరాలుగా సామలు, రాగులు వంటి పంటలను పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కొండపై ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి, బడి, సంత ఇలా దేనికి వెళ్లాలన్నా కొండ దిగువకు నడచుకు రావడం కష్టంగా మారింది. దీంతో కాస్త సౌకర్యాలున్న ఇతర గ్రామాలకు కొన్ని కుటుంబాలు వెళ్లిపోయాయి. దీంతో ప్రస్తుతం గ్రామంలో కేవలం 9 కుటుంబాలే నివసిస్తున్నాయి.

“నా చిన్నతనంలో చాలా మంది కనిపించేవారు గ్రామంలో. ఇప్పుడు జనాభా బాగా తగ్గిపోయింది. దీనికి కారణం రోడ్డు సౌకర్యం లేకపోవడమే అని తెలుసు. ప్రస్తుతం ఉన్నవారు కూడా రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ కష్టాలు చెప్పలేం” అని తోటగొడిపుట్ గ్రామానికి చెందిన సుమిత్ర బీబీసీతో చెప్పారు.

గ్రామంలోని పరిస్థితిని చూసిన జమ్మే కూడా తాము గ్రామంలో ఉందామా? వెళ్లిపోదామా? అనే సందిగ్ధంలో ఉండేవారమని చెప్పారు.

గ్రామంలో స్లాబ్ ఇంటిని నిర్మించుకునేందుకు దాచుకున్న డబ్బుతో గ్రామానికి రోడ్డు నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందని, దాని ఫలితమే ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులని జమ్మే బీబీసీకి చెప్పారు.

తోటగొడిపుట్ గ్రామాన్ని చేరుకునేందుకు జరుగుతున్న రోడ్డు పనులు సగానికిపైగా పూర్తైయాయి. ఇంకొంత భాగం జరగాల్సి ఉంది. ప్రస్తుతం గొడిపుట్ గ్రామం నుంచి తోటగొడిపుట్ వెళ్లేందుకు నిర్మిస్తున్న మట్టి రోడ్డు వద్ద జేసీబీ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

తోటగొడిపుట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘నాలుగేళ్లు పైసా, పైసా దాచాను’

జమ్మే ఇంటి నిర్మాణం కోసం నాలుగేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకుంటూ వచ్చారు. ఈ ఏడాది ఎలాగైనా ఇంటిని నిర్మిద్దామనుకున్నారు. కానీ ఆ సొమ్ముతోనే రోడ్డు పనులు చేయిస్తున్నారు.

‘‘జేసీబీ పనులు గత ఎనిమిది రోజులుగా (29.03.23 నాటికి) జరుగుతున్నాయి. జేసీబీకి రోజు అద్దె రూ.16 వేలు, కూలీలు, ఇతర ఖర్చులు అన్ని కలిపి రోజూ రూ. 20 వేలు ఖర్చవుతున్నాయి. దీంతో నేను దాచుకున్న రూ. 2 లక్షలు దాదాపు ఖర్చైపోయాయి’’అని జమ్మే తెలిపారు.

“అనారోగ్యం బారిన పడినవారిని, గర్భిణులను ఆసుపత్రికి తరలించాలంటే కనీసం మట్టి రహదారైనా ఉండాలి కదా. పిల్లలు బడికి వెళ్లాలన్నా రోడ్డు కావాలి. అందుకే కష్టమే అనిపించినా ఇంటి కంటే రోడ్డే ముఖ్యమని నమ్మాను. అధికారులను అడిగి అడిగి విసిసిపోయాను. నేనే సొంతంగా రోడ్డు వేయించేందుకు ముందుకొచ్చాను" అని జమ్మే బీబీసీకి తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఇల్లు కట్టాలని దాచిన డబ్బుతో ఊరికి రోడ్డు వేయిస్తున్న గిరిజన మహిళ

‘ఈ గ్రామ కోడలినైనా పాడేరులోనే ఉండేదాణ్ని’

జమ్మే దంపతులకు ఇద్దరు పిల్లలు.

పెళ్లైన కొత్తలో రోడ్డు సౌకర్యం లేని తోటగొడిపుట్ గ్రామన్ని చూసిన జమ్మే అక్కడ ఉండలేక పాడేరుకు తన భర్తను తీసుకుని వెళ్లిపోయి, అక్కడే ఉండేవాళ్లమని చెప్పారు.

“నేను పుట్టింది అరకు సమీపంలోని చిన్నంజుడు గ్రామంలో. అక్కడ అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇంటి ముందరకు రోడ్డు ఉండేది. విద్యుత్, తాగు నీరు, బోరు బావులు ఇలా అన్ని ఉండేవి. ఒక్కసారిగా తోటగొడిపుట్ రావడంతో అంతా కొత్తగా అనిపించింది. దాంతో పాడేరు వెళ్లిపోయాం. క్రమంగా అలవాటుపడి ఇక్కడికి వచ్చేశాం. మిగతా వాళ్లు ఒక్కొక్కరు గ్రామం విడిచి వెళ్లిపోతుంటే బాధేసింది. రోడ్డు పనులు జరుగుతుండటంతో ఆ సమస్య ఉండదని భావిస్తున్నాను” అని జమ్మే చెప్పారు.

రహదారి సౌకర్యం వస్తే మంచినీరు, బోర్లు వంటివి వస్తాయని నమ్మకం ఉందని ఆమె తెలిపారు.

తన నిర్ణయానికి భర్త వెంకటరావు కూడా సహకరిస్తున్నారని, ఆయన కూడా ఇల్లు తర్వాత కట్టుకుందాం, రోడ్డే వేయిద్దామన్నారని జమ్మే చెప్పారు.

‘‘ఈ ఊరికి నేను కోడలిగా వచ్చినప్పటి నుంచి గ్రామంలోకి కనీసం ఒక ఆటోగానీ, బైక్ గానీ వచ్చినట్లు చూడలేదు. రోడ్డు పూర్తైయితే నా కోరిక తీరుతుంది. అది నాకు చాలా సంతోషం’’ అని జమ్మే ఆశతో చెప్పారు.

తోటగొడిపుట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ఇక నా ఆటో తోటగొడిపుట్ వెళ్తుంది”

ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్న జమ్మే అందరి అవసరాల కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయం వలన తమ గ్రామానికి కష్టాలు తొలిగిపోతాయని తోటగొడిపుట్ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె నిర్ణయాన్ని దిగువనున్న గ్రామాల ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు.

“నేను గత పదేళ్లుగా తోటగొడిపుట్ గ్రామస్థులను ఆటో ఎక్కించుకుంటున్నాను. కానీ వారు ఎక్కినా, దిగినా అన్ని ఆ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గొడిపుట్ గ్రామంలోనే. రోడ్డు లేకపోవడంతో, చేతిలో ఎంత బరువులున్నా కూడా గొడిపుట్ గ్రామం నుంచి నడుచుకునే వెళ్లేవారు. ఆరోగ్య కార్యకర్త సొంత డబ్బులతో వేస్తున్న రోడ్డు పూర్తయితే నా ఆటోని తోటగొడిపుట్ గ్రామానికి నేరుగా తీసుకుని వెళ్లగలను” అని గొడిపుట్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గోపాల్ బీబీసీతో అన్నారు.

తోటగొడిపుట్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

'రోడ్డు పనులు ఆపేస్తాం, వ్యవసాయం చేస్తాం’

జమ్మే జీతం నెలకు రూ. 4 వేలు. ఆమె భర్త వ్యవసాయం చేస్తారు. అలాగే డ్రైవరుగా కూడా పని చేస్తారు.

ఇంకా సగం రోడ్డు పనులు మిగిలే ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారని అడిగితే, జమ్మే ఏమన్నారంటే- “మా వద్ద ఉన్న డబ్బులు దాదాపు అయిపోయాయి. మొత్తం అయిపోగానే రోడ్డు పనులు ఇక చేయలేం. అందుకే సామలు, రాగులు అమ్మడం, వ్యవసాయ పనులకు వెళ్లడం, మా ఆయన డ్రైవరుగా పని చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్డు పనులను పూర్తి చేస్తాం. త్వరలోనే మా గ్రామానికి బైకులు, ఆటోలు, అంబులెన్సులు అన్ని నేరుగా వచ్చేటట్లు చేస్తాం” అని జమ్మే చెప్పారు.

జమ్మే భర్త వెంకటరావు కూడా ఆమె చెప్పినట్లే రోడ్డు పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటివరకు ఎవరి సహాయం తీసుకోలేదని, సహాయం దొరకకపోయినా రోడ్డు పనులను పూర్తి చేసి తీరుతామని చెప్పారు.

వీడియో క్యాప్షన్, అనసూయ కాంతిమతి ఇడ్లీలు ఎందుకంత ఫేమస్?

‘అధికారులు రోడ్డు కొలతలు తీసుకున్నారు.’

తమ గ్రామానికి రోడ్డు కావాలని ఏళ్ల తరబడి అధికారులకు, రాజకీయ నాయకులకు విన్నపాలు చేస్తున్నామని తోటగొడిపుట్ గ్రామస్థులు తెలిపారు. 2017లో ప్రభుత్వ అధికారులు గ్రామానికి వచ్చి రోడ్డు కొలతలు వేశారని, కానీ ఆ తర్వాత ఏ విధమైన ముందడుగు పడలేదని తెలిపారు.

“రోడ్డు లేదని మా గ్రామానికి బంధువులు కూడా వచ్చేవారు కాదు. కనీసం ఎవరు పట్టించుకోలేదు. ఏ పనికైనా రోడ్డు లేకపోవడమే అడ్డుగా మారింది. దీంతో చాలా మంది గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. మేం కూడా వెళ్లిపోదామనే అనుకున్నాం. ఇంతలో జమ్మే రోడ్డు వేయిస్తానని ముందుకొచ్చారు. రోడ్డు పనులు జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఆమె ఇంటి కోసం దాచుకున్న డబ్బుతో మా అందరి కోసం రోడ్డు నిర్మిస్తోంది.” అని తోటగొడిపుట్ గ్రామానికి చెందిన పార్వతి బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, స్థానికుల సహకారం తోడైతేనే చెడ్డీగ్యాంగ్‌ను అడ్డుకోగలమంటున్న పోలీసులు

‘తోటగొడిపుట్ రోడ్డుకు రూ. 40 లక్షలు అవుతుంది’

సొంత నిధులతో రోడ్డు వేయిస్తున్న జమ్మే విషయాన్ని ప్రస్తావిస్తూ... ప్రభుత్వం వేయాల్సిన రోడ్లను కొన్ని గిరిజన ప్రాంతాల్లో అక్కడి స్థానికులు సొంతగా నిర్మించుకోవడంపై బీబీసీ పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణను ప్రశ్నించింది.

పీవో స్పందిస్తూ- ‘‘ప్రతి గిరిజన కుటుంబం మాకు ముఖ్యమే. పాడేరు ఐటీడీఏ పరిధిలో 3 వేలకు పైగా గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో విద్యుత్, రోడ్డు వంటి సౌకర్యాలు లేని గ్రామాల్లో వాటిని కల్పించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఐదు కుటుంబాలున్న తోటగొడిపుట్ గ్రామానికి 1.5 కిలో మీటర్ల రోడ్డు అవసరం. ఆ ప్రాంతానికి రోడ్డు వేయాలంటే రూ. 40 లక్షలు అవుతుంది. తోటగొడిపుట్ గ్రామ రోడ్డు సమస్యను ప్రాజెక్ట్ ‘మిషన్ కనెక్ట్ పాడేరు’ పేరుతో ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపాం. త్వరలోనే నిధులు వచ్చే అవకాశం ఉంది. నిధులు రాగానే రోడ్డు కోసం జరిగిన పనులను అంచనా వేసి, పరిశీలన చేసిన తర్వాత తిరిగి చెల్లింపులు చేస్తాం’’అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)