రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన పూర్ణేశ్ మోదీ ఎవరు? ఆయనకు నరేంద్ర మోదీకి సంబంధం ఏమిటి?

పూర్ణేశ్ మోదీ

ఫొటో సోర్స్, FACEBOOK/PURNESHMODI

ఫొటో క్యాప్షన్, పూర్ణేశ్ మోదీ
    • రచయిత, జై శుక్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధి, గుజరాతి సర్వీసు

క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సూరత్‌లో జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తర్వాత, ఈ శిక్షను 30 రోజుల పాటు రద్దు చేసి, రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది.

రాహుల్ గాంధీకి సూరత్ జిల్లా కోర్టు ఈ శిక్ష విధించిన తర్వాత, ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయంపై రాహుల్ గాంధీ పత్రికా సమావేశం నిర్వహించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అదానీకి మధ్యనున్న సంబంధాన్ని ప్రశ్నించడంతోనే తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తనపై చర్యలు తీసుకున్నారని పత్రికా సమావేశంలో చెప్పారు.

అయితే, ఇంత జరగడానికి ప్రధాన కారణం సూరత్ బీజేపీ నేత పూర్ణేశ్ మోదీనే. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లింది పూర్ణేశ్ మోదీనే.

పూర్ణేశ్ మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్త. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో కూడా ఆయన క్రియాశీలకంగా ఉండేవారు.

సూరత్‌లో గణేశ్ ఉత్సవ్ సమితి అధ్యక్షుడిగా ఎంపికైనప్పుడు, ఆయన రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు.

పూర్ణేశ్ మోదీ

ఫొటో సోర్స్, FACEBOOK/PURNESHMODI

ఫొటో క్యాప్షన్, పూర్ణేశ్ మోదీ

పూర్ణేశ్ మోదీ ఎవరు?

ప్రస్తుతం పూర్ణేశ్ మోదీ సూరత్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వయసు 54 ఏళ్లు. బీ.కామ్, ఎల్ఎల్‌బీ చదివిన ఆయన కొన్నాళ్లపాటు న్యాయవాద వృత్తిలో ఉన్నారు.

గుజరాత్‌లో భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలో పూర్ణేశ్ మోదీ మంత్రిగా పనిచేశారు.

తొలిసారి ఆయన 2013లో సూరత్ పశ్చిమ నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలిచారు. స్థానిక ఎమ్మెల్యే కిశోర్ వంకావాలా మరణించడంతో, ఈ సీటు టికెట్‌ను పూర్ణేశ్ మోదీకి ఇచ్చింది బీజేపీ.

రోడ్లు, భవనాల మంత్రిత్వ శాఖను పూర్ణేశ్ మోదీకి ఇచ్చారు. కానీ, ఆయన సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదులు రావడంతో 2022 ఆగస్ట్‌లో పూర్ణేశ్ మోదీ పోర్టుఫోలియోను మార్చారు.

భూపేంద్ర పటేల్ 2.0 ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వన్నప్పటికీ, 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు పూర్ణేశ్ మోదీ.

చట్టసభ్యుల అసెంబ్లీలో ఆయన పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. ప్రారంభం నుంచి బీజేపీలో క్రియాశీలంగా ఉంటూ వస్తోన్న పూర్ణేశ్ మోదీ, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికార పార్టీ నేతగా కూడా పనిచేశారు.

2000 నుంచి 2005 వరకు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా పనిచేశారు. అదేవిధంగా, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా, ఆ తర్వాత 2009 నుంచి 2012 వరకు, 2013 నుంచి 2016 వరకు సూరత్ సిటీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

అయితే, తన రాజకీయ జీవితంలో కొన్ని వివాదాలు, కొందరు నేతలతో విభేదాలు కూడా ఉన్నాయి.

పూర్ణేశ్ మోదీ

ఫొటో సోర్స్, FACEBOOK/PURNESHMODI

ఫొటో క్యాప్షన్, పూర్ణేశ్ మోదీ

పూర్ణేశ్ మోదీనా లేదంటే ‘బూత్‌వాలా’నా?

రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణలో భాగంగా, పూర్ణేశ్ మోదీ ఇంటి పేరుపై కూడా పలు ప్రశ్నలను లేవనెత్తారు డిఫెన్స్ లాయర్.

పూర్ణేశ్ మోదీ ఇంటి పేరు మోదీ కాదని, ‘బూత్‌వాలా’ అంటూ కోర్టులో రాహుల్ గాంధీ న్యాయవాది కిరిటీ పాన్‌వాలా వాదించారు. రాహుల్ గాంధీ తనని అనుమానించారని, అబద్ధం చెబుతున్నారని వాదనల సమయంలో పూర్ణేశ్ మోదీ అన్నారు.

‘‘పూర్ణేశ్ మోదీ పూర్వీకులు సూరత్ బూత్ స్ట్రీట్‌లో నివసించే వారు. ఆయన తల్లి ఇంటి పేరు ‘బూత్‌వాలా’. ఆయన బర్త్ సర్టిఫికేట్‌లో కూడా ఇంటి పేరు ‘బూత్‌వాలా’గా ఉండేది. కానీ, ఆ తర్వాత తన ఇంటి పేరును ‘మోదీ’గా మార్చుకున్నారు’’ అని పూర్ణేశ్ మోదీ స్నేహితుడు, రాజకీయ మద్దతుదారుడు అశోక్ గోహిల్ చెప్పారు.

గుజరాత్‌లో ఘాంచి కమ్యూనిటీ నుంచి వారు వచ్చారని, ఈ కేసు విచారణ సమయంలో తను పేరు మార్చుకున్న అఫిడవిట్‌ను నిర్ధరణ పత్రంగా కూడా పూర్ణేశ్ మోదీ సమర్పించారు.

పూర్ణేశ్ మోదీ జీవన విధానం గురించి ప్రశ్నించగా.. ‘‘సూరత్‌లోని ఒక ఆసుపత్రిలో క్యాంటీన్ కాంట్రాక్ట్ పూర్ణేశ్ మోదీ తండ్రికి దక్కింది. క్యాంటీన్‌కి వచ్చే వారికి పూర్ణేశ్ మోదీ టీ, స్నాక్స్ అందించేవారు. ఈ సమయంలో కూడా పూర్ణేశ్ మోదీ ఆయన తండ్రికి సాయం చేస్తూ.. అమ్మడానికి ఉంచిన టీ సర్వ్ చేస్తుంటారు’’ అని అశోక్ గోహిల్ చెప్పారు.

ఘాంచి, గోలా అనేవి సూరత్‌లో రెండు ఓబీసీ కమ్యూనిటీలు. సూరత్‌లో ఈ కమ్యూనిటీల ప్రజల జనాభా ఎక్కువ.

పూర్ణేశ్ మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పూర్ణేశ్ మోదీ

పూర్ణేశ్ మోదీపై ఉన్న వివాదాలేంటి?

భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో ఆయనకు విభేదాలున్నట్లు కొందరు రాజకీయ నిపుణులు చెప్పారు. దీంతో పాటు, ఇతర వివాదాల కారణంగా కూడా తన మంత్రి పదవిని పూర్ణేశ్ మోదీ పోగొట్టుకున్నారు.

రోడ్ల గుంతలపై ఆయన వివాదాస్పదమైన ప్రకటనలు చేశారు. పూర్ణేశ్ మోదీ పీఏ మషేశ్ లాడ్‌పై కూడా పలు ఆరోపణలున్నాయి.

ఆయన నిర్వహించిన రోడ్లు, భవనాల విభాగపు పనితీరు కూడా సరిగ్గా లేకుండా పోయింది. పార్టీ చేసిన ప్రతిపాదనలపై ఆయన పెద్దగా దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. అలాగే, వ్యక్తిగత యాప్‌ను రూపొందించడం ద్వారా తన పాపులారిటీని ఆయన పెంచుకోవాలనుకుంటున్నారని విమర్శలు వచ్చాయి.

పూర్ణేశ్ మోదీ మంత్రిగా ఉన్నప్పుడు, వర్షాకాలం రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాకాలం రోడ్లు దెబ్బతినడం సాధారణమే అంటూ వివాదాస్పదమైన ప్రకటనను ఆయన చేశారు.

‘‘కసబ్‌ను ప్రాణాలతో పట్టుకోవడం మంచిదైంది. లేదంటే, కాంగ్రెస్ అతన్ని సాఫ్రాన్ టెర్రర్‌లో చంపేసేది.’’ అని మరో వివాదాస్పదమైన వ్యాఖ్యను చేశారు పూర్ణేశ్ మోదీ.

ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండానే పలుమార్లు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు. ఇలా పలు వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన చేశారు.

పూర్ణేశ్ మోదీని మంత్రిగా తొలగించినప్పుడు..

2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్ణేశ్ మోదీని మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ సమయంలో పూర్ణేశ్ కేబినెట్ మంత్రిగా ఉండేవారు.

ఆయన నుంచి తీసుకున్న రోడ్లు, భవనాల మంత్రిత్వ శాఖను జగ్‌దీశ్ పాంచాల్‌కి అప్పజెప్పారు.

గుజరాత్‌లో బీజేపీ వర్గాలుగా విడిపోయిందని, కానీ ఏ వర్గానికి ఆయన మద్దతు ఇస్తారో ఇప్పటి వరకు పూర్ణేశ్ మోదీ నిర్ణయించుకోలేకపోయారని గుజరాత్ గార్డియన్ డైలీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ మనోజ్ మిస్త్రీ అన్నారు.

సీఆర్ పాటిల్‌తో ఉన్న విభేదాల కారణంగానే ఆయన పక్కకున్నట్లు మనోజ్ మిస్త్రీ తెలిపారు.

సీఆర్ పాటిల్‌

ఫొటో సోర్స్, FACEBOOK/CRPAATIL

ఫొటో క్యాప్షన్, సీఆర్ పాటిల్‌

పాటిల్‌తో విభేదాలే పూర్ణేశ్ మోదీని దెబ్బకొట్టాయా?

సీఆర్ పాటిల్‌తో ఉన్న విభేదాల కారణంగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్ణేశ్ మోదీకి టికెట్ దొరకదని ప్రజలు భావించారని రాజకీయ పరిశీలకులు చెప్పారు. అయితే, ఆయనకున్న కాంటాక్ట్‌లతో పూర్ణేశ్ మోదీకి టికెట్ దొరికింది.

పూర్ణేశ్ మోదీకున్న క్లీన్ ఇమేజ్‌తో పార్టీలో ఆయనకున్న స్థానం బలంగా ఉంటుందని గుజరాత్ గార్డియన్ డైలీ మనోజ్ మిస్త్రీ, మరో సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ నరేశ్ వారియా భావించారు.

బీజేపీ అంతర్గతంగా వర్గాలుగా విడిపోవడం నచ్చకనే పూర్ణేశ్ మోదీ పక్కకు తప్పుకున్నారని మనోజ్ మిస్త్రీ చెప్పారు. ‘ఆయన ముందుకొచ్చే వ్యక్తి కాదు, కానీ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతారు. భవిష్యత్‌లో ఆయన సేవలను పార్టీ వాడుకోవచ్చు’ అని చెప్పారు.

‘‘పోరాడే తత్వమున్న నేత ఈయన. సూరత్ సిటీ ప్రజలు పూర్ణేశ్ మోదీని గౌరవిస్తారు. రాజకీయంగా ఆయన్ను జెంటిల్‌మేన్‌గా పరిగణించవచ్చు’’ అని మనోజ్ మిస్త్రీ తెలిపారు.

‘‘సీఆర్ పాటిల్ హిరక్ జయంతి కోఆపరేటివ్ బ్యాంకు స్కామ్‌లో జైలుకి వెళ్లినప్పుడు, సూరత్ బీజేపీలో ఆయన తరఫున నిల్చున్న ఏకైక వ్యక్తి పూర్ణేశ్ మోదీనే. కానీ, ఆ తర్వాత ఇద్దరి మధ్య పవర్ గేమ్ రాజుకుంది’’ అని నరేష్ వారియా చెప్పారు.

‘‘సీఆర్ పాటిల్‌తో ఒకప్పుడు పూర్ణేశ్ మోదీకి మంచి సంబంధాలుండేవి. సూరత్ ప్రజలతో, ఇతర నేతలతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. పెద్దపెద్ద వివాదాల్లో ఆయన జోక్యం లేదు. భవిష్యత్‌లో బీజేపీ పూర్ణేశ్ మోదీ సేవలను వాడుకోవచ్చు’’ అని అన్నారు.

పూర్ణేశ్ మోదీ మున్సిపల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, బీజేపీ పనితీరు చాలా బాగుండేదని చెప్పారు. మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ, మెరుగైన పనితీరు కనబర్చేవారని అన్నారు. సీఆర్‌ పాటిల్‌తో తప్ప ఆయనపై పెద్దగా ఎలాంటి వివాదాస్పదమైన అంశాలు లేవు.

పూర్ణేశ్ మోదీ

ఫొటో సోర్స్, FACEBOOK/PURNESHMODI

ఫొటో క్యాప్షన్, పూర్ణేశ్ మోదీ

ఈ కేసుతో రాజకీయ లబ్ది చేకూరుతుందా?

ఈ కేసు గెలిచిన తర్వాత పూర్ణేశ్ మోదీ ప్రధానాంశంగా మారారని నిపుణులన్నారు. అయితే, దీని నుంచి రాజకీయంగా లబ్ది చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని కొందరంటున్నారు.

ఈ కేసు వల్ల ఆయన పొలిటికల్ క్రెడిబులిటీ కచ్చితంగా పెరుగుతుందని మనోజ్ మిస్త్రీ అన్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఆయన లబ్ది పొందకపోవచ్చన్నారు.

‘ఒకవేళ ఈ కేసులో రాహుల్ గాంధీ జైలుకి వెళ్తే, గుజరాత్‌లో ప్రస్తుత బీజేపీ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే క్రెడిట్ దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. గుజరాత్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కే అవకాశాలు లేదా కార్పొరేషన్ అధ్యక్షుడిగా అయ్యే అవకాశాలు చాలా తక్కువే. ఈ కేసు 2019కి చెందినది. రాహుల్ గాంధీపై ఆయన కేసు దాఖలు చేసినప్పటికీ, వివాదాస్పదమైన వ్యాఖ్యలు, విభేదాల కారణంగా గుజరాత్ ప్రభుత్వంలో పూర్ణేశ్ మోదీని మంత్రి పదవి నుంచి తొలగించారు.’ అని మనోజ్ మిస్త్రీ అన్నారు.

ఒకవేళ భవిష్యత్‌లో ఆయనకు పెద్ద స్థానమేదైనా దొరికినా, గతంలో ఆయన చేసిన పనుల మూలంగానే వస్తుందని, ఈ కేసు కారణంగా కాదని నరేష్ వారియా అన్నారు.

‘‘ఒకవేళ పూర్ణేశ్ మోదీ రాజకీయ భవిష్యత్ బలపడితే, ఇది ఈ కేసు వల్ల కాదు. గతంలో ఆయన చేసి పనుల మూలంగా, సంస్థాగత పనుల కారణంగానే జరుగుతుంది’’ నరేష్ వారియా చెప్పారు.

మోదీ మండల్‌లోని నేతలతో ఆయనకు మంచి కాంటాక్ట్‌లున్నప్పటికీ, ఇప్పటి వరకు ఆయన మంత్రి కాలేకపోయారన్నది మీరు చూడొచ్చు. ఈ విషయం నుంచి కూడా పూర్ణేశ్ మోదీ అంతగా లబ్ది పొందకపోవచ్చని రాజకీయ పరిశీలకులన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)