రాహుల్ గాంధీ: ‘మోదీ చేయనిది.. రాహుల్ చేశారు’ – భారత్ జోడో యాత్ర గురించి విదేశీ మీడియా ఎలా విశ్లేషిస్తోంది?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, @INC

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో యాత్ర' జనవరి 6న శుక్రవారం హర్యానాలోకి ప్రవేశించింది.

రానున్న రోజుల్లో ఈ యాత్ర హర్యానా మీదుగా పంజాబ్ చేరుకుని చివరకు జమ్మూ కశ్మీర్ చేరుకోనుంది.

120 రోజుల క్రితం ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పది రాష్ట్రాల్లోని 52 జిల్లాల మీదుగా పాదయాత్ర సాగించారు.

ఈ యాత్రకు సంబంధించిన సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

గత నాలుగు నెలలుగా రాహుల్ గాంధీ పర్యటన, కాంగ్రెస్ పార్టీ సంబంధిత వార్తలు భారత మీడియాలో ప్రముఖంగా కనిపించాయి.

ఈ పాదయాత్రపై విదేశీ మీడియా కూడా ఆసక్తి కనబరిచింది. రాహుల్ పర్యటనపై విదేశీ మీడియాలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం.

జర్మన్ మీడియా భారత్ జోడో యాత్ర గురించి ఏం రాసింది?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

జర్మనీకి చెందిన ప్రభుత్వ మీడియా చానల్ డీడబ్ల్యూ (దాయిచ్ వెలే) గత డిసెంబర్ రెండో వారంలో ఓ కథనం ప్రచురించింది.

''కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర ద్వారా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మతపరమైన సమస్యలను లేవనెత్తుతూ కోల్పోయిన రాజకీయ ప్రాబల్యాన్ని తిరిగి పొందాలని కోరుకుంటోంది. రాహుల్ గాంధీని మాస్ లీడర్‌గా నిలబెట్టాలని కూడా అనుకుంటోంది.

తన 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో చాలా వరకు భారత రాజకీయాలకు మార్గనిర్దేశం చేసిన రాజకీయ పార్టీ ఇప్పుడు 2024 సాధారణ ఎన్నికలకు ముందు ఏదో ఒకవిధంగా పునరుజ్జీవం పొందడానికి ప్రయత్నిస్తోంది.

ఒకప్పుడు భారత రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేవలం మూడింటిలో మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతోంది.

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. అదే సమయంలో తమిళనాడు, బిహార్, జార్ఖండ్‌లలో ప్రాంతీయ భాగస్వామ్య పార్టీలతో అధికారం పంచుకుంటోంది.

గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించింది. అయితే ప్రతిపక్ష నేత కావడానికి కూడా కాంగ్రెస్‌కు ఎంపీలు లేకపోవడం ఇదే తొలిసారి'' అని రాసింది.

పార్టీలో అంతర్గత లోపాల కారణంగా కాంగ్రెస్ పతనాన్ని చవిచూడాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

"వ్యక్తిగత లేదా సంస్థాగత వైఫల్యాల కంటే హిందూ జాతీయవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో పార్టీ వైఫల్యమే ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణం" అని రాజకీయ విశ్లేషకులు జోయా హాసన్ డీడబ్ల్యూతో చెప్పారు.

జోయా హాసన్ ఇటీవల ప్రచురించిన తన పుస్తకం 'ఐడియాలజీ అండ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్'లో కాంగ్రెస్ పతనాన్నిగత దశాబ్దంలో భారత రాజకీయాల్లో వచ్చిన విస్తృత మార్పులతో ముడిపెట్టారు.

డీడబ్ల్యూతో హాసన్ మాట్లాడుతూ "భారతదేశం గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచనకు హిందూ జాతీయవాదం ఒక ముఖ్యమైన సవాలుగా మారింది. గ్రౌండ్ రియాలిటీ గానీ వ్యూహాత్మకంగా చూసినా మతతత్వంతో కూడిన రాజకీయాల కలయిక కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనాలు ఇవ్వదు. అటువంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలి" అని అభిప్రాయపడ్డారు.

న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ఏం చెప్పింది?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ఇండియాలో ఈ ఏడాది చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి ముఖ్యమైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

గతంలో ఈ మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కానీ బీజేపీ రాజకీయ వ్యూహం, కాంగ్రెస్ అంతర్గత విభేదాల కారణంగా కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగింది.

ఈ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల అనంతరం 2024లో భారత్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏదో విధంగా తమ పార్టీ పట్ల సామాన్య ఓటర్లలో ఉత్సాహం నింపాలని ప్రయత్నిస్తున్నారు.

అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ కరస్పాండెంట్ సమీర్ యాసిర్ భారత్ జోడో యాత్ర ప్రభావాన్ని చూడటానికి సామాన్య ప్రజలతో కలిసి పరిశీలించారు.

న్యూయార్క్ టైమ్స్‌లో ఆయన రాసిన కథనంలో "సార్వత్రిక ఎన్నికలకు కేవలం 16 నెలల సమయం ఉంది. భారతదేశంలో బహుళ పార్టీ ప్రజాస్వామ్యం భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది.

నరేంద్ర మోదీ వ్యక్తిత్వం ధృడంగా ఉంది. ఆయన సాధించిన విజయాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. అనేక దశాబ్దాల పాటు భారతదేశంలో బీజేపీ రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకొంటుందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు.

భారతదేశంలోని పలు సంస్థలపై బీజేపీ తన పట్టును పటిష్టం చేసుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాధారణ ప్రజలకు వాటిని దూరం చేస్తోందని దుయ్యబట్టాయి.

ఒకప్పుడు భారత పార్లమెంటులో చర్చలు జరిగేవి, ఇప్పుడు మంత్రుల ప్రసంగాలు మాత్రమే ఉంటున్నాయి. అధికార పార్టీ ముఖ్యమైన విధానపరమైన అంశాలపై చర్చకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

అంతేకాకుండా ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేస్తామని బెదిరించడం, ఒత్తిడి చేయడం ద్వారా మీడియాను బీజేపీ వైఖరిని అంగీకరించేలా చేసింది’’ అని పేర్కొన్నారు.

ముగ్గురు ప్రధానులను అందించిన పార్టీ అయినా..

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, CONGRESS

‘‘భారతదేశ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రజాస్వామ్య రాజకీయ ప్రయాణంలో మూడింట రెండొంతుల వరకు కాంగ్రెస్ పార్టీ దేశానికి నాయకత్వం వహించింది. దాదాపు 40 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన గాంధీ-నెహ్రూ కుటుంబం ఈ దేశానికి ముగ్గురు ప్రధానులను అందించింది.

అయితే రాహుల్ గాంధీ నాయకత్వంలో అదే పార్టీ అసెంబ్లీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు నిరంతర ఓటమిని చవిచూస్తోంది. ప్రస్తుతం 543 మంది సభ్యులు కలిగిన భారత పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 53 మాత్రమే. అయితే బీజేపీ ఎంపీల సంఖ్య 303గా ఉంది.

కాంగ్రెస్ పార్టీ దాని సిద్ధాంతాల కంటే పార్టీ చరిత్రలో కేంద్రంగా ఉన్న గాంధీ కుటుంబం పట్ల ఉన్న భక్తితో ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో పార్టీ రాజకీయ పతనానికి కారణాన్ని వెతుకుతున్నప్పుడు రెండు విషయాలు చర్చకు వచ్చాయి.

గాంధీ కుటుంబం నేతృత్వంలో ఏదైనా జరగడం, గాంధీ కుటుంబం లేకుండా జరగడం.

ఇదొక్కటే కాదు కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా క్రమంగా బలహీనపడిన తీరు, దానితో పాటు దాని కుంభకోణాలు, అంతర్గత విభేదాలు బహిరంగంగా తెరపైకి వచ్చాయి.

వివిధ వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో గాంధీ కుటుంబం విఫలమైన తీరు స్థానిక స్థాయిలో స్తబ్దతతో పాటు పెద్ద నాయకులు పార్టీని వీడేందుకు కారణమైందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు’’ అని ఆ కథనంలో రాశారు.

ఇండియానా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ బోధిస్తున్న ప్రొఫెసర్ సుమిత్ గంగూలీ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ "పార్టీ పరిస్థితిని మెరుగుపరచడానికి, ఆయన జాతీయ ప్రతిష్టను బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీకి ఈ పర్యటన చివరి ప్రయత్నం. ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన తన స్పష్టమైన భారత దృష్టిని చాటిచెప్పడంలో విఫలమయ్యారు" అని పేర్కొన్నారు.

అయితే పార్టీ అగ్రనేత జైరాం రమేష్ మాత్రం "మేం ఈ యాత్ర కోసం మా సర్వశక్తులూ వెచ్చిస్తున్నాం. మేం దీన్నుంచి ఏదైనా మార్పు తీసుకురాలేకపోతే అది పార్టీలో, సైద్ధాంతిక స్థాయిలో మాకు సమస్య అవుతుంది" అని అంగీకరించారు. 

‘‘భారతదేశ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి యాత్రలు చేయడం భారతీయ రాజకీయాలలో ఒక ముఖ్యమైన రూపం.

1990లో బీజేపీ అధికారంలో లేనప్పుడు మొఘల్ కాలం నాటి మసీదు స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని దేశవ్యాప్తంగా రథయాత్ర చేపట్టింది. ఈ రథయాత్ర వల్ల బీజేపీ తన సైద్ధాంతిక పునాదిని నిర్మించుకోవడంతోపాటు రాజకీయ విజయానికి బాటలు వేయగలిగింది.

అయితే, రాహుల్ గాంధీ ఈ పర్యటన ద్వారా జాతీయ రాజకీయాల్లో మళ్లీ తన పార్టీని నిలబెట్టగలరా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు'' అని న్యూయార్క్ టైమ్స్ రాసింది.

నెహ్రూ, గాంధీలను గుర్తుచేస్తున్నారంటున్న పాకిస్తానీ డాన్ పత్రిక..

మల్లికార్జున్ ఖర్గే

ఫొటో సోర్స్, ANI

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రాజ్యసభలో ఆ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించారు. అయితే ఎన్నికల సమయంలో ఆయన రిగ్గింగ్‌కు పాల్పడ్డారని శశిథరూర్ వర్గం ఆరోపించింది.

ఇది మాత్రమే కాదు ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే దీని తర్వాత కూడా ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా సుదీర్ఘ కెరీర్‌ను పూర్తి చేసుకున్న శశి థరూర్‌కు ఈ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత శశి థరూర్‌, ఆయన మద్దతుదారులు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 

డాన్ తన కథనాలలో కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర', ఖర్గే విజయాలను ఒకచోట చేర్చడానికి ప్రయత్నించింది.

“రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా తన పార్టీ, దేశ పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రయత్నించాలనుకుంటున్నారు. కానీ, 12 రాష్ట్రాల మీదుగా 150 రోజుల్లో 3,570 కిలోమీటర్లు ప్రయాణించడం, రాహుల్ కెమెరాలు లేకుండా సముద్రంలోకి దిగడాలు అద్భుతాలైతే కాదు.

కానీ, కర్ణాటకలో హిజాబ్ ధరించిన పాఠశాల విద్యార్థిని చేతిని పట్టుకుని నవ్వుతున్న రాహుల్ గాంధీ చిత్రం నెహ్రూ, గాంధేయ భారతదేశం ఆలోచనను ప్రతిబింబిస్తోంది’’ అని డాన్ రాసింది.

‘‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రాథమిక కర్తవ్యం బీజేపీని ఓడించడమే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన మొదటి ప్రసంగంలో దీన్ని అంగీకరించారు. అయితే ఆయన ఈ లక్ష్యాన్ని ఎన్నికల్లో గెలుపొందడంతో చూడకూడదు. బీజేపీని ఓడించడానికి కావాల్సిన సంకీర్ణాన్ని ఏర్పాటు చేసేందుకు జోడో యాత్ర ద్వారా వచ్చే శక్తిని వినియోగించుకోవడం ఖర్గే కర్తవ్యం.

ఇంతకుముందు చాలా సందర్భాలలో కాంగ్రెస్‌కు వచ్చిన అవకాశాలను కోల్పోయినట్లు కనిపిస్తోంది. సీట్ల పంపకం జగడాలు ప్రతిపక్ష పార్టీలను కలిసి రాకుండా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అవడం కంటే ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి బలమైన ఎన్నికల వేదికను నిర్మించడం ముఖ్యం'' అని అభిప్రాయపడింది.

మోదీ చేయనిది, రాహుల్ గాంధీ చేశాడంటున్న బ్రిటిష్ పత్రిక గార్డియన్...

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

కాంగ్రెస్ పార్టీకి ఈ యాత్రతో ఆశించిన ప్రయోజనాలను పక్కన పెడితే రాహుల్ గాంధీ ప్రతిష్టను బలోపేతం చేయడానికి 'భారత్ జోడో యాత్ర' ఒక ముఖ్యమైన అడుగు.

రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది కూడా ఎన్నికలు లేని రోజుల్లో మొదటిసారిగా ఇంత మీడియా కవరేజీని పొందారు.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్ మధులికా బెనర్జీ రాసిన వ్యాసాన్ని బ్రిటన్ వార్తాపత్రిక ది గార్డియన్‌ ప్రచురించింది. ఆమె ఆ యాత్రలో ప్రయాణించారు.

ఆ వ్యాసంలో ''ఇది ఎలాంటి హింసకు తావులేని భారీ మిలటరీ క్యాంపెయిన్ లాంటిది. వివిధ భాషా సంఘాలు, నేపథ్యాల ప్రజలు మార్చ్‌లో పాల్గొనడంతో ఆసక్తికరంగా మారింది. ఇది మినీ ఇండియా మార్చ్‌లా ఉంది. ఇలాంటి భారతదేశం ఉంటుందని తెలుసు, కానీ దాని అనుభవం చాలా అరుదు’’ అని చెప్పారు.

‘‘గత సమావేశాల మాదిరిగానే ఈ పాదయాత్రలో కూడా రాహుల్ గాంధీ చాలా మర్యాదపూర్వకమైన, తెలివైన వ్యక్తిగా నేను గుర్తించాను. రాహుల్‌ను సవాల్ చేయడం, ఆయనతో విభేదించడం చాలా సులువుగా జరిగాయి. చాలా మంది భారతీయ నాయకులతో ఇది సాధ్యం కాదు.

నరేంద్ర మోదీతో ఇలా చేయడం కుదరదు. ఎందుకంటే ఆయన విలేకరుల సమావేశాలు కూడా పెట్టరు. మోదీ సభల్లో ప్రజలు వైభవాన్ని చూస్తున్నారు. అయితే ఇవి కాకుండా రాహుల్ గాంధీ పెంచిన గడ్డం, సామాన్యులతో ఉన్న చిత్రాలు మంచి రాజకీయ ఇమేజ్‌ని సృష్టిస్తున్నాయి’’ అని ఆమె పోల్చి చెప్పారు.

‘‘గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ పతనానికి రాహుల్ గాంధీయే కారణమన్నారు. అయిష్టంగానే రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు సమయం లేదని ఆరోపించడంతో పాటు పప్పు అనే బిరుదు కూడా పెట్టారు. కాగా, పార్టీ స్థితికి ఆ పార్టీ నేతలు, సంస్థలూ కారణమే.

అయితే జోడో యాత్ర ఆ ఆరోపణలను క్లియర్ చేసిందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ యాత్ర పార్టీ కార్యకర్తలకు ఒక ప్రయోజనం చేకూర్చింది. రాహుల్ గాంధీ నిర్వహించిన ఈ బడా యాత్రతో ఆయన మీద పప్పు అనే ట్యాగ్ సరైందిగా కనిపించడం లేదు'' అని రాసింది గార్డియన్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)