అవినీతి, బంధుప్రీతిపై నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడారు? ప్రధాని టార్గెట్ ఎవరు?

ఫొటో సోర్స్, Youtube/PMOIndia
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానంగా రెండు విషయాలను ప్రస్తావించారు. అవి.. అవినీతి, కుటుంబ రాజకీయాలు.
ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగిస్తూ, "అవినీతి దేశాన్ని చెదపురుగులా తినేస్తోంది. దేశం దానితో పోరాడాల్సి ఉంది. దేశాన్ని దోచుకున్న వాళ్లంతా, అవన్నీ వెనక్కి ఇచ్చేయాలి. అదే మా ప్రయత్నం. బంధుప్రీతి, వారసత్వం గురించి నేను మాట్లాడితే, రాజకీయాల గురించి మాత్రమే చెబుతున్నానని అనుకుంటారు. అది కాదు. దురదృష్టవశాత్తూ రాజకీయాల్లో ఉన్న ఈ చీడపురుగు దేశంలోని అన్ని వ్యవస్థలకూ పాకింది. అవినీతిపై, అవినీతిపరులపై ద్వేషం పుట్టనంత వరకు, సాంఘికంగా దాన్ని చిన్నచూపు చూడనంతవరకూ ఈ మనస్తత్వం పోదు" అని అన్నారు.
మోదీ ప్రసంగంలోని ఈ భాగం సోషల్ మీడియాలోనూ, మీడియా ఛానళ్లలోనూ చర్చనీయాశంగా మారింది. ఈ మాటలతో మోదీ ప్రతిపక్షాలపై దాడి చేసినట్టు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
అయితే, మోదీ ప్రసంగం బీజేపీ నేతలను కూడా కలవరపెట్టిందని, ఆ పార్టీలో కూడా అవినీతి, బంధుప్రీతి పేరుకుని ఉండడమే అందుకు కారణమని మరికొందరు అంటున్నారు.
మరికొంతమంది దీన్ని 2024 ఎన్నికల సన్నాహంగా చూస్తున్నారు.
మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ స్పందిస్తూ, "బహుశా ఆయన తన మంత్రుల గురించే మాట్లడినట్టున్నారు" అని వ్యాఖ్యానించింది.
ఎర్రకోట పైనుంచి ప్రసంగం ఎందుకంత ముఖ్యం?
సీనియర్ జర్నలిస్ట్ నిస్తులా హెబ్బార్ మోదీ ప్రసంగంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
"అవినీతికి, అవినీతిపరులకు వ్యతిరేకంగా ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలని మోదీ అన్నారు. సమాజం వైఖరి మారాలని అన్నారు. ప్రజల ఆలోచనా విధానం మారితే రాజకీయాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు ఏళ్ల తరబడి ఉంటుంది. దీనివలన రాజకీయ పంథా మారుతుంది. అవినీతి ఆరోపణల్లో రాహుల్, సోనియా వైపు మాత్రమే కాకుండే లాలూ ప్రసాద్ యాదవ్ వైపు కూడా ఆయన వేలు చూపించారు. అవినీతికి పాల్పడి, శిక్ష పడిన రాజకీయ ప్రముఖుల్లో లాలూ యాదవ్ ఒకరు. వారసత్వం, బంధుప్రీతి గురించి మాట్లాడినప్పుడు ఆయన కేవలం రాజకీయాలకే కాకుండా ఇతర వ్యవస్థలకు కూడా గురి పెట్టారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. వారసత్వానికి పట్టం కట్టేవాళ్లు, అవినీతిపరులు అధికారంలోకి రాకూడదన్నది ప్రధాని ఉద్దేశం. అలాంటివాళ్లు దేశ హితాన్ని పట్టించుకోకుండా తమ హితం గురించే ఆలోచిస్తారు" అని నిస్తులా హెబ్బార్ అన్నారు.
ప్రధాని మోదీ అవినీతి, బంధుప్రీతి గురిచి మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు.
ఈ ఏడాది మార్చిలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత, బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "మీ పిల్లలకు టిక్కెట్లు రాకుంటే దానికి కారణం నేనే. బంధుప్రీతి ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పుని నేను భావిస్తున్నాను" అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఈ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్‌కు ముందు కూడా మోదీ ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంధుప్రీతిపై ఘాటుగా మాట్లాడారు.
నిన్న ఎర్రకోట ప్రాకారల మధ్య నుంచి అదే విషయాన్ని మళ్లీ చెప్పారు. గతంలో, ఈ విషయాన్ని పార్టీ సమావేశాలు, ర్యాలీలలో చెప్పడమంటే అది రాజకీయాలకే పరిమితంగా ఉండేది. ఇప్పుడు ఎర్రకోట పైనుంచి చెప్పడమంటే దేశం మొత్తానికి ఉద్దేశించినట్టు లెక్క.
75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ ఈ మాటలు చెప్పడం వలన ఈ అంశం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుందని రాజకీయ విశ్లేషకురాలు నీరజా చౌదరి అన్నారు.
మోదీ ప్రసంగంలో మూడు పంచ్‌లైన్లు ఉన్నాయని, అవి.. అవినీతి, బంధుప్రీతి, కోఆపరేటివ్ కాంపిటీటివ్ ఫెడరలిజం అని నీరజా చౌదరి అన్నారు.
ఈమధ్య కాలంలో విపక్షాల నేతలపై ఈడీ, ఇతర ఏజెన్సీలు చర్యలు చేపడుతున్నట్టు తరచుగా వార్తల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ అవినీతి గురించి మాట్లాడడం మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. పార్థ ఛటర్జీ, సంజయ్ రౌత్, రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ అందరినీ ఈడీ టార్గెట్ చేస్తోంది.
అయితే, విపక్షాల వాదన మరోలా ఉంది. మోదీ పాలనా విధానంతో ఏకీభవించని ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు ఈడీని ఉపయోగించుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
2024 ఎన్నికల సన్నాహాలు
ప్రధాని మోదీ అవినీతి అంశానికి కొత్త స్పిన్ ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.
"అవినీతికి వ్యతిరేకంగా జరిపే ఈ పోరాటంలో దేశ ప్రజల సహకారం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో అవినీతి ముఖ్యాంశం కానున్నదనేది స్పష్టం. ఈడీని ఉపయోగించుకోవడం ముందు ముందు కూడా కొనసాగుతుంది. ఇందులో ఏమాత్రం సంకోచం ఉండదు. మోదీ ప్రసంగం విన్న తరువాత ఇదీ నా అభిప్రాయం" అంటూ నీరజా చౌదరి వ్యాఖ్యానించారు.
సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది ఇక్కడ మరో విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
"మోదీ మాత్రమే కాదు, బీజేపీ మొత్తం 2024లో ప్రతిపక్షాలను అవినీతి ఆరోపణలతో కార్నర్ చేయాలనుకుంటోంది. 2012లో కూడా బీజేపీ, యూపీఏ ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలతో ముట్టడించింది. 2014 ఎన్నికలకు వచ్చేసరికి యూపీఏ 2ను అత్యంత అవినీతి ప్రభుత్వంగా ప్రజల ముందు చిత్రీకరించి, ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందేనని పిలుపునిచ్చింది. నేడు 2022లో కూడా బీజేపీ అదే మంత్రం పఠిస్తోంది. ఈరోజు ఎన్ని అవినీతి కేసులు ముందుకొస్తున్నాయో, అవన్నీ విపక్షాలకు చెందినవే. బీజేపీ తన ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అవినీతి, బంధుప్రీతి రెండూ 2024లో ప్రధాన అంశాలు కానున్నాయి. నిన్నటి ప్రసంగం ద్వారా మోదీ తన పార్టీకి కూడా ఒక సందేశం ఇచ్చారు. 2024లో ఈ రెండు అంశాలపై గట్టి పోరాటం జరగనుంది.. ఈ పోరాటాన్ని గట్టిగా ఎదుర్కోవాలంటే తమ పార్టీ నేతలు కూడా ఈ రెండు విషయాలకు దూరంగా ఉండాలన్న సందేశం అందించారు.

తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనపై మోదీ ఏమన్నారంటే..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ను కూడా అవినీతి, కుటుంబ పాలన అనే అంశాలపైనే టార్గెట్ చేస్తోంది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సదర్భంగా మే 14వ తేదీన జరిగిన సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో ఇంత పనికిరాని, అవినీతి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు’’ అని ఆరోపించారు.
తెలంగాణ కుటుంబ పాలన కింద అణగారిపోతోందని, దీనికి విముక్తి కలిగించాలని ప్రజలు నిర్ణయానికొచ్చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మే 26వ తేదీన హైదరాబాద్‌లో అన్నారు.
''తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు. ఒక ఆశయం కోసం వేల మంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదు. ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యింది. కేవలం ఒక కుటుంబం కోసం రాష్ట్ర ఏర్పాటు జరగలేదు''అని మోదీ వ్యాఖ్యానించారు.
''తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధిచెందుతాయి''అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
''కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలి. ఇది 2024లో సాధ్యం అవుతుంది. మేం పారిపోయే వాళ్లం కాదు, పోరాడే వాళ్లం. బీజేపి కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లు. తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయం''అని మోదీ వ్యాఖ్యానించారు.


ఫొటో సోర్స్, BANGALORE NEWS PHOTOS
బీజేపీలో బంధుప్రీతి
ప్రస్తుతం భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కుటుంబ రాజకీయాలలో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నాయని విజయ్ త్రివేది అన్నారు. కానీ, ఎర్రకోట పైనుంచి ఇచ్చిన ప్రసంగంలో మోదీ ఏ పార్టీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదని, దేశం మొత్తానికి సవాలు విసిరారని అన్నారు.
కాగా, ప్రధాని మోదీ దాడి సొంత మంత్రులు, వారి కుమారులపైనేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు.
ఇటీవల పార్లమెంటులో బీజేపీ నేత తేజస్వి సూర్య, ఎన్సీపీ నేత సుప్రియా సూలే మధ్య కుటుంబ రాజకీయాలపై వాగ్వాదం జరిగింది.
'కర్ణాటక ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యం తెలుసా?' అని సుప్రియా సూలే, తేజస్వి సూర్యను ప్రశ్నించారు. తేజస్వి సూర్య మేనమామ రవి సుబ్రమణ్యం కర్ణాటకలోని బసవనగుడి నుంచి బీజేపీ ఎమ్మెల్యే.
అదే సమయంలో, సుప్రియా సూలే బీజేపీలో కుటుంబ వారసత్వం ఉన్న నేతల జాబితా తయారుచేశారు. ఇందులో పంకజా ముండే, పూనమ్ మహాజన్, రక్షా ఖడ్సే, జ్యోతిరాదిత్య సింధియా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌ల పేర్లను ప్రస్తావించారు.
ఈ నాయకులందరూ కూడా తనలాగే రాజకీయ కుటుంబాలకు చెందినవారని సుప్రియ అన్నారు. అయితే, రాజకీయ వారసత్వానికి తానేమి సిగ్గుపడడం లేదని, అందుకు గర్విస్తున్నానని ఆమె అన్నారు.
ఈ ఏడాది జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు మోదీ బీజేపీలోని కుటుంబ రాజకీయాలపై బహిరంగంగా మాట్లాడారు.
"బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ఆరోపణల్లో నిజాన్ని బయటపెట్టదలుచుకున్నాను. ఒకే కుటుంబానికి చెందినవారు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగడం, జనం వారిని గెలిపించడం రాజకీయాల్లో ఒక పార్శ్వం మాత్రమే. ఇందులో మరో కోణం కూడా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులే అధ్యక్షులు అవ్వాలి, ట్రెజరర్ అవ్వాలి, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డులో చేరాలి, తండ్రి కుదరకపోతే కొడుకు అధ్యక్షుడవ్వాలి.. ఇలాంటి ఆలోచనలతో పార్టీనే కుటుంబంగా మారుతోంది. ఇది ముఖ్యమైన అంశం" అని మోదీ ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

ఫొటో సోర్స్, PTI
ప్రాంతీయ పార్టీలు - వారసత్వ రాజకీయాలు
మోదీ మరొక ఇంటర్వ్యూలో వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ, జమ్ము-కశ్మీర్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ, బిహార్ పేరు తీసుకురాలేదు. అయితే, ఇప్పుడు అక్కడ నితీశ్, తేజస్వీల పార్టీ అధికారంలోకి వచ్చింది.
కుటుంబ రాజకీయాలను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం ఒక విధంగా ప్రాంతీయ పార్టీలపై దాడి అని నీరజా చౌదరి అభిప్రాయపడ్దారు.
"ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలలో వారసత్వ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అయినా, బిహార్‌లో తేజస్వి అయినా, ఎంకే స్టాలిన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, నవీన్ పట్నాయక్.. ఇలా ఎవరిని తీసుకున్నా కుటుంబ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఒక్క నితీశ్ కుమార్, కేజ్రీవాల్ తప్ప బంధుప్రీతి లేని ప్రాంతీయ పార్టీ లేదు" అని ఆమె అన్నారు.
అయితే, మోదీ కుటుంబ రాజకీయాలపై సంధించిన అస్త్రం, ప్రాతీయ పార్టీలను ఏకం చేసేందుకు పనికొస్తుందని నీరజ అభిప్రాయపడ్దారు.
"మోదీ ప్రసంగం ముందు చూపుతో కూడినది. అయిదు కర్తవ్యాలు, మహిళా సాధికారత, రాబోయే సమస్యలను ప్రస్తావించడం, నీటి పొదుపు ఆవశ్యకతను ప్రజలకు గుర్తు చేయడం, పరిశోధనలపై దృష్టి పెట్టడం.. ఇలాంటి అంశాలను ఎవరూ వ్యతిరేకించలేరు. విమర్శించలేరు" అని నీరజ అన్నారు.
"ఎర్రకోట పైనుంచి మోదీ ఏదో పెద్ద ప్రకటన చేస్తారని ప్రజలు ఊహించారు. కానీ, ఆయన అలాంటిదేమీ చేయలేదు. అయితే, 25 ఏళ్ల రోడ్ మ్యాప్ ఇచ్చారు" అని విజయ్ త్రివేది అన్నారు.
"మోదీ మహిళాశక్తి గురించి మాట్లాడడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో బీజేపీ, మహిళా వర్గాన్ని పెద్ద ఓటు బ్యాంకుగా మలచుకునే ప్రణాళిక కనిపిస్తోంది. మతం, కులం ఓటు బ్యాంకుల కన్నా పెద్ద ఓటు బ్యాంకుగా వారిని చూస్తోంది" అని నిస్తులా హెబ్బార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- పాకిస్తాన్ పాలిత కశ్మీర్లో హింసాత్మక నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- ‘నువ్వొక బాంబర్వి’ అంటూ ఆ యువకుడికి వచ్చిన మెసేజ్‌తో విమానం ఆరుగంటలు ఆగిపోయింది...
- సల్మాన్ రష్దీ: ‘సైతాన్ ఒక కన్ను పోగొట్టుకుంది’- రష్దీ మీద దాడిపై ఇరాన్ మీడియాలో కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















