ఇండిపెండెన్స్ డే: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జీఎస్ రామ్మోహన్
- హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు
స్వతంత్ర భారత ప్రయాణం గురించిన విశ్లేషణల్లో సింహభాగం గత మూడు దశాబ్దాల్లో వచ్చిన మార్పుల చుట్టే తిరుగుతోంది. భారత్ ఈ మూడు దశాబ్దాల్లో ఎంత గుర్తుపట్టకుండా మారిపోయిందో వివరించే విశ్లేషణలను చూస్తూనే ఉన్నాం.
ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎంపీల చుట్టూ ఎలా లైన్లు కట్టేవారో, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోసం నెలల తరబడి ఎలా వేచిచూసేవారో, అయినవారితో మాట్లాడడం కోసం పబ్లిక్ బూత్ దగ్గర ఎలా గంటలకొద్దీ వేచి ఉండేవారో చాలా మంది తమ రాతల్లో చెబుతున్నారు. 90ల తరువాత పుట్టిన తరాలకు తెలియకపోవచ్చుకానీ పాత తరాలకు ఇవి అనుభవమే.
స్కూటర్ కొనాలన్నా ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన స్థితి నుంచి ఇవాళ ఎక్కడిదాకా ప్రయాణించామో చూస్తున్నాం. అవన్నీ కనిపించే నిజాలే. టెక్నాలజీ వినియోగం, సప్లయ్ సైడ్ తీసుకున్న మార్పులు, లైసెన్సింగ్ విధానంలో మార్పులు ప్రధానంగా పనిచేశాయి. సేవా రంగంలో, అనేక రోజువారీ పనుల్లో ఇండివిడ్యువల్ డిస్క్రిషన్ను చాలా వరకు తొలగించగలిగారు. అది మధ్యతరగతి రోజు వారీ జీవనాన్ని చాలా వరకు సులభతరం చేసింది.
సంస్కరణలతో వచ్చిన ముఖ్యమైన మార్పులు
- టెక్నాలజీ వినియోగం పెరగడం
- సరఫరా వ్యవస్థ మెరుగుపడటం
- లైసెన్సింగ్ రాజ్ రద్దు
అయితే కొన్ని రంగాల్లో ముఖ్యంగా సేవారంగంలో కనిపించే ఈ మార్పుల కంటే ముఖ్యమైన మౌలిక విషయాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది.
స్వతంత్ర భారత ప్రయాణంలో రెండు కీలక పరిణామాలు ఇపుడు చూద్దాం.
వచ్చిన ప్రధాన మార్పులు
- పేదరికం తగ్గడం
- అసమానతలు పెరగడం
దారిద్ర్యం తగ్గుదల
భారత దేశం 1994-2011 మధ్యలో వేగంగా దారిద్ర్యాన్ని తగ్గించగలిగింది. ఈమధ్య కాలంలో దారిద్ర్యాన్ని 45 శాతం నుంచి 21.9 శాతానికి తగ్గించగలిగింది. సంఖ్య రీత్యా చూస్తే, పదమూడు కోట్లమందికి పైగా ప్రజలను దుర్భర దారిద్ర్యం నుంచి విముక్తి చేసింది. 2011 తర్వాత భారత్ అధికారికంగా గణాంకాలు విడుదల చేయలేదు. సర్వే చేశారుగానీ, నివేదిక విడుదల చేయకుండా ఆపివేశారు.
వరల్డ్ బ్యాంక్ అధ్యయనాల ప్రకారం 2019నాటికి దుర్భర దారిద్ర్యం 10.2 శాతానికి తగ్గింది. ఇందులోనూ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల కంటే మెరుగైన పురోగతి కనబరిచాయి. 2019 తర్వాతి గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది.
దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్న వారి శాతాన్ని సింగిల్ డిజిట్ దగ్గరకు తేవడానికి మూడు దశాబ్దాలు పట్టిందని, అందులోనూ సంస్కరణల యుగంలోని 30 ఏళ్లు కీలక పాత్ర పోషించాయని గమనించాలి. ముప్పై ఏళ్ల క్రితం దేశంలో దాదాపు సగభాగం అంటే 45 శాతం దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే ఇవాళ నూటికి పదిమంది దారిద్ర్యంతో అలమటిస్తున్నారు. ఇది చెప్పుకోదగిన మార్పు.
గరీబీ హఠావో అన్న నినాదాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురావడంలో ఈ మూడు దశాబ్దాల్లో విశేషమైన పురోగతి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అసమానతల పెరుగుదల
అదే సమయంలో, సంస్కరణలు ఆరంభమైన ఈ మూడు దశాబ్దాల్లో అసమానతలు విపరీతంగా పెరిగాయి. బిలియనీర్ల సంపద అమాంతంగా పెరిగిపోతూ వచ్చింది. జాతీయ సంపదలో దిగువన ఉన్న వారి సంపద పడిపోతూ వస్తున్నది.
90లో ఫోర్బ్స్ అంతర్జాతీయ సంపన్నుల అగ్రజాబితాలో భారతదేశం నుంచి ఒక్క పేరు కూడా లేదు. కానీ భారతదేశంలో ఇవాళ 166 మంది బిలియనీర్లు ఉన్నారు. 2000 సంవత్సరంలో 9 మంది ఉంటే 2017 నాటికి ఆ సంఖ్య 119కి పెరిగింది. 2022నాటికి బిలియనీర్ల సంఖ్య 166కు చేరింది. రష్యా తర్వాత ఎక్కువ మంది బిలీయనీర్స్ ఉన్నది ఇండియాలోనే.
ఆక్స్‌ఫామ్ 2017లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, 77 శాతం జాతీయ సంపద, పైనున్న పది శాతం చేతిలో కేంద్రీకృతమై ఉంది. టాప్ ఒక్క శాతం చేతిలోనే 58 శాతం సంపద ఉంది.

ఫొటో సోర్స్, Forbs
ఆదాయాన్నే తీసుకుంటే 1990లో పైనున్న పది శాతం జాతీయ ఆదాయంలో 34.4 శాతం పొందితే, కిందనున్న 50 శాతం 20.3తో సరిపెట్టుకునేవారు. అదే 2018కి వచ్చేసరికి పైనున్న పది శాతం వారి వాటా 57.1 శాతానికి ఎగబాకింది. కిందనున్న యాభై శాతం వాటా 13.1కి దిగజారింది.
20 నెలల్లో రూ. 23 లక్షల కోట్లు
ఆక్స్‌ఫాం రిపోర్ట్ ప్రకారం..
- 2017 నాటికి 77 శాతం జాతీయ సంపద పైనున్న 10 శాతం చేతిలో కేంద్రీకృతమై ఉంటే టాప్ ఒక్క శాతం చేతిలోనే 58 శాతం సంపద పోగుబడి ఉంది.
- 2021నాటికి భారత్‌లోని టాప్-100 బిలియనీర్ల చేతిలోని సంపద రూ. 57.3 లక్షల కోట్లు
- కరోనా సంక్షోభంలో (2020 మార్చి నుంచి 2021 నవంబరు మధ్య) భారత బిలియనీర్ల సంపద రూ.23.14 లక్షల కోట్లు పెరిగింది.
ఇండియా సక్సెస్ స్టోరీని లేదా గ్రోత్ స్టోరీని ఈ రెండు అంశాల మధ్యలో చూడాల్సి ఉంటుంది. మూడు దశాబ్దాల సంస్కరణలు దుర్భర దారిద్ర్యాన్ని తగ్గించడంలో సఫలమయ్యాయని, అదే సమయంలో అసమానతలను విపరీతంగా పెంచేశాయని మన ముందున్న వివరాలు తెలియజేస్తున్నాయి.
వేతనాల్లో భారీ వ్యత్యాసం
వేతనాల్లోనూ ఈ వ్యత్యాసం మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది.
- చాలీ చాలని జీతం
- వేతనాల్లో వ్యత్యాసాలు
- వర్కింగ్ కండిషన్స్
- ఇంక్లూజివ్ గ్రోత్
ఇలాంటివి భారత్‌కు చాలా పెద్ద సవాళ్లు విసురుతున్నాయని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ) నివేదిక పేర్కొంది. ఐఎల్‌ఓతో పాటు ప్రేమ్‌జీ ఫౌండేషన్ అధ్యయన పత్రం కూడా ఈ విషయాన్ని చర్చించి ఉన్నది.
కొన్ని కంపెనీల్లో సీఈఓలు నెలకు కోట్ల రూపాయల్లో వేతనం తీసుకుంటూ ఉంటే, అక్కడే పదిహేను వేలకు కూడా పనిచేసే ఉద్యోగులు ఉంటున్నారు. కొన్ని ప్రైవేటు కంపెనీల్లో వేతనాల వ్యత్యాసం వెయ్యి శాతానికి పైగా ఉంది.
పెద్ద దేశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు, ప్రపంచంలోనే అత్యధిక వేతన వ్యత్యాసాలు ఉన్న దేశాల్లో భారత్ అగ్రజాబితాలో ఉంది. ఇది అసమానతలు మరింత పెరిగేలా చేస్తున్నది.
చారిత్రకంగా చూసినపుడు, పెట్టుబడిదారీ విధానం పటిష్టమయ్యే కొద్దీ స్పెషలైజేషన్ పెరుగుతుంది. టెక్నాలజీ వినియోగం, స్కిల్డ్ నాన్ స్కిల్డ్ వ్యత్యాసం పెరుగుతుంది. స్కిల్డ్ ప్రీమియమ్స్ వేతనాల్లో వ్యత్యాసాలను పెంచుతాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నా కూడా భారత్‌లో ఉన్న వ్యత్యాసాలు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
అసంఘటిత కార్మికులు ఎక్కువ
అసంఘటిత కార్మిక రంగం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. సంపద పంపిణీలో అసమానతకు ఇవాళ అంతర్జాతీయ ప్రమాణంగా ఉన్నటువంటి గినీ కోఫిషియెంట్ లెక్కలే తీసుకుంటే 2011లో ఇది 35.7 శాతం ఉన్నది. 2018 నాటికి ఆ అసమానత 47.9 స్థాయికి చేరింది. మొత్తం ప్రపంచంలోనే అసమానతలు విపరీతంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రజాబితాలో ఉంది.

ఫొటో సోర్స్, World Bank
1922-2021 మధ్య టాప్-1శాతం(ఎర్రగీత), దిగువున ఉన్న 50శాతం(నీలిరంగు గీత) మధ్య ఆదాయ అసమానతలు ఈ కింది గ్రాఫ్‌లో చూడొచ్చు. నీలిరంగు గీతను ఎర్రగీత దాటి పైకి పోతున్న క్రమాన్ని గమనిస్తే గత 20 ఏళ్లలో ఈ అంతరం మరింతగా పెరుగుతోందనే విషయం తెలుస్తోంది.

ఫొటో సోర్స్, World Inequality Database
భారత్‌లో పెరిగిపోతున్న అసమానతలను ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త థామస్ పికెటి లోతుగా చర్చించి ఉన్నారు. 2015 నాటికి తొలి 10 శాతం పొందుతున్నవారి ఆదాయం రీత్యా చూసినపుడు, అసమానత అమెరికా, రష్యా కంటే కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. అంటే సంపద కేంద్రీకరణ ఎక్కువగా జరుగుతోందని స్పష్టంగా తెలుస్తున్నది.
దారిద్ర్యం లాగే అసమానత కూడా సమాజాన్ని పట్టి పీడించే సామాజిక రోగం.
భారత్‌లో సంపదతో పాటే అసమానతలు భయానకంగా పెరిగిపోయాయని రెండింటి మధ్యలో అవినాభావసంబంధం ఉందని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
భారత్‌లో చాలామంది విశ్లేషకులు సెలెక్టివ్‌గా తమకు కావాల్సిన వివరాలను మాత్రం హైలెట్ చేస్తూ మిగిలిన పార్శ్వాలను చిన్న గీతగా మారుస్తుంటారు. కొందరైతే 'అశ్వత్థామ హతః కుంజరహా' అన్న రీతిలో వినిపించకుండా చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం చర్చిస్తోంది, కానీ..
వాస్తవానికి భారత ప్రభుత్వం నాలుగో ప్రణాళిక నుంచి నిన్నటి 2020-21 ఎకనామిక్ సర్వే పత్రం వరకూ ప్రతి సందర్భంలోనూ పెరిగిపోతున్న అసమాతనలను గురించి చర్చిస్తూనే ఉంది.
- అభివృద్ధికి ప్రధాన ప్రమాణం ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చడం కాదు, ఈ ప్రయాణం సమానత్వం సాధించే దిశగా సాగాలి అని 1969-74 నాటి నాలుగో పంచవర్ష ప్రణాళిక ప్రకటించింది.
- 'నేరాలకు విప్లవాలకు పేదరికం తండ్రి లాంటిది' అనే అరిస్టాటిల్ కొటేషన్‌తో 2020-21 ఎకనామిక్ సర్వే పత్రం మొదలవుతోంది. అసమానతల మీద పనిచేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త పికెటి సూత్రీకరణలను ఇది విస్రృతంగా చర్చించింది.
- అయితే సంపద పెరగడం వల్ల పేదరికం తగ్గుతుంది కాబట్టి, ఈ దశలో అసమాతనల కంటే అదే పెద్ద విషయమంటూ ఎకనామిక్ సర్వే తన పత్రాన్ని ముగించింది. ఇది భారత రాజ్యపు దిశను తెలియజేస్తుంది.
సంపద తగినంతగా లేదు కాబట్టి ఇపుడు అందుబాటులో ఉన్న సంపదను పంచడం వల్ల పేదరికాన్ని తిరిగి పంచడమే అవుతుంది. కాబట్టి సంపద సృష్టి మీద దృష్టి పెట్టాలని తొలి ప్రణాళిక ప్రవచిస్తే.. 75 ఏళ్ల తర్వాత టాప్-10 ప్రపంచ కుబేరుల్లో భారతీయులు చేరిన తరువాత కూడా భారత రాజ్యం అదే వైఖరిని తిరిగి వల్లె వేస్తున్నదని ఇక్కడ గుర్తించాలి.
1936లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రతిపాదించిన పారిశ్రామిక విధానం దగ్గర నుంచి నిన్నటి ఎకనామిక్ సర్వే దాకా మొత్తం భారత పారిశ్రామిక ప్రయాణాన్ని పరిశీలిస్తే అది సంపద కేంద్రీకరణకే పనిచేసింది.
ఈ ప్రయాణంలో దుర్భర దారిద్ర్యాన్ని ఒక మేరకు తగ్గించి వారిని పల్లెల నుంచి పట్టణాలకు వలసబాట పట్టేట్టు చేయడమే కాక, వారిని పారిశ్రామిక వినియోగదారులుగా మార్చడమనే పరిణామం ఇంకో వైపున ఉంది.
సంస్కరణల గురించి సానుకూలంగా మాట్లాడేవారిలో కొందరు 90ల వరకూ అన్నీ రాజ్య నియంత్రణలో ఉండడం వల్ల పోటీ వాతావరణం లేక భారత్ కునారిల్లిందని ఆరోపిస్తుంటారు. సోషలిస్టు నమూనా వల్ల భారత్ అణగారిపోయిందని విమర్శిస్తుంటారు.
ముఖ్యంగా నెహ్రూ, ఇందిరాగాంధీల సోషలిస్టు విధానాలు దేశాన్ని ఎదగకుండా చేశాయని, పీవీ-మన్మోహన్ ద్వయం పుణ్యమా అని దాన్నుంచి పెగుల్చుకుని బయటపడడం వల్లే ఇవాళ ఇంత సంపద చూడగలుగుతున్నామని చెబుతుంటారు.
పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం సంస్కరణలకు చోదక శక్తిగా పనిచేసిన మాట వాస్తవమే. అయితే దాన్ని దాటి చారిత్రక పరిణామాన్ని కూడా చూడాల్సి ఉంది. వారు ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి దారివేసిన పరిణామాలున్నాయి. అదొక పరిణామ క్రమం. కేవలం జంప్ కాదు.
అప్పట్లో పోటీ వద్దన్నది పారిశ్రామికవేత్తలే
పోటీ వద్దని, దేశీయ పరిశ్రమలకు రక్షణ కావాలని తొలుత కోరింది పారిశ్రామిక వేత్తలే. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ, విదేశీ పోటీ లేకుండా తమకు రక్షణ కావాలని తొలి దశలో పారిశ్రామికవేత్తలు కోరి ఉన్నారు.
అది సోషలిస్టు నెహ్రూ స్వకపోల కల్పితం కాదు. స్వాతంత్ర్యం కనుచూపు మేరలో ఉందనగా 1944-45లో భారత అభివృద్ధి కోసం జేఆర్‌డీ టాటా నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బాంబే పారిశ్రామిక వేత్తల బృందం బాంబే ప్లాన్ రూపొందించింది. ఆ ప్లాన్ చూస్తే ఆ రోజున పారిశ్రామికవేత్తల ధోరణి ఎలా ఉందో అర్థమవుతుంది.
పోటీ సామర్థ్యం: విదేశీ వస్తువుల పోటీని తట్టుకునే సామర్థ్యం దేశీయ పరిశ్రమకు ఉండదని రక్షణ నిబంధనలు అవసరమని ఆ రోజు నొక్కి వక్కాణించింది పారిశ్రామిక వేత్తలే.
రాజ్యం పెట్టుబడులు: విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, స్వదేశీ పరిశ్రమ ఎదుగదలకు రాజ్యం డబ్బు పంప్ చేయాలని కూడా నాటి బాంబే పారిశ్రామిక వేత్తల కమిటి సిఫారసు చేసింది.
ప్రభుత్వ సొమ్ముతో పారిశ్రామిక వాతావరణం: ఒక్కముక్కలో చెప్పాలంటే, దేశీయ వాతావరణం స్వేచ్ఛాయుత పోటీకి సిద్ధంగా లేదని ప్రభుత్వం తన సొమ్ముతో పారిశ్రామిక వేత్తలను పారిశ్రామిక వాతావరణాన్ని ప్రోత్సహించాలని కోరింది. ఆ రోజున్న వాతావరణం అది.
అయితే లైసెన్సింగ్ విధానాలు, రక్షణ విధానాలు మోనోపలీకి దారితీశాయి. తర్వాత వచ్చిన మోనోపలీ ఎంక్వరీ కమిషన్ స్వయంగా ఈ విషయాన్ని పేర్కొంది. గుత్తాధిపత్యం వల్లనే వస్తువులు విస్తరించక, వాటి ఉత్పత్తి కోసం వేచి ఉండాల్సి వచ్చేది. అది వనరులయినా, ఉపయోగించే వస్తువులయినా, స్కూటర్ల కోసమయినా, ఫోన్ల కోసమయినా, మరేదయినా... ఏదో ఒక గుత్తాధిపత్యం.
ప్రభుత్వమే అతి పెద్ద పెట్టుబడిదారు, పెట్టుబడిదారుల సృష్టికర్త
ప్రభుత్వ ధనమే పెట్టుబడిగా దేశీయ కేపిటలిస్టులను ప్రోత్సహించే పని స్వతంత్ర భారత చరిత్ర పొడవునా సాగుతూ వచ్చింది. నాడు పార్లమెంట్లో ప్రధాని నెహ్రూ స్పీచ్, 1955-56 పారిశ్రామిక విధానం చుట్టే సాగింది.
- రష్యా, చైనాలో మాదిరే ఇక్కడ కూడా ఉక్కు ఉత్పత్తి మీద ఫోకస్ ఎక్కువగా ఉన్నది.
- దేశ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ ప్రైవేటు రంగాలు జమిలిగా పనిచేయాలని, ప్రభుత్వం ఈ విషయంలో కీలకపాత్ర పోషించాలని మొదటి రెండవ ప్రణాళికల్లో నొక్కి చెప్పారు.
- స్థూలంగా చెప్పుకుంటే, పెట్టుబడి విస్తరించడానికి రాజ్యం కీలకమని, అదే అందరికీ అతి పెద్ద పెట్టుబడిదారని, పెట్టుబడిదారుల సృష్టికర్త అని తొలుతే గుర్తించారు.
- 'భారీ పరిశ్రమలు పెట్టడానికయ్యే భారీ ఖర్చును ప్రైవేటు రంగం పెట్టలేని స్థితిలో, రాజ్యం ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నది' అని రెండో ప్రణాళిక పేర్కొని ఉన్నది.
- తొలి ప్రణాళిక వ్యవసాయానికి పెద్ద పీట వేస్తే, రెండో ప్రణాళిక పారిశ్రామిక రంగంపై దృష్టిపెట్టింది.
- ఆహారధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితిని దాటి మిగులు పెంచుకోవడమే లక్ష్యంగా మొదటి ప్రణాళిక ప్రకటించుకుంది. ఆ మిగులు కొత్త పరిశ్రమదారులను సృష్టిస్తుందని కొత్త పెట్టుబడిని సృష్టిస్తుందని ప్రపంచవ్యాప్త పరిణామాలు తెలుపుతున్నాయి.
భారత్‌లో అదే జరిగింది. భారత్ 80ల కల్లా ఆహారధాన్యాల కొరతను అధిగమించింది. ఇవాళ ఎగుమతిదారుగా అవతరించింది. ఆ పరిణామంలో హరిత విప్లవం కీలక పాత్ర పోషించింది. అందులో కొన్ని వ్యవసాయ కులాల నుంచి ప్రధానంగా పెట్టుబడిదారులు అవతరించారు. తెలుగు గడ్డ నుంచి కమ్మలు, రెడ్లు ఇలాగే వచ్చారు. పంజాబ్, హరియాణా నుంచి జాట్లు, సిక్కులు (వారిలోనూ జాట్ సిక్కులు అధికం) వ్యాపారవేత్తలుగా మారారు. కాబట్టి ఈ అభివృద్ధి కొన్ని కులాల్లోని వారికి ఎక్కువ సంపదను పంచిపెట్టేదిగా ఉంది. ఇక్కడ సామాజిక అసమానత ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాంతీయ అసమానతలు
నగర కేంద్రక అభివృద్ధి నమూనా వల్ల బిహార్, బెంగాల్ పారిశ్రామికీకరణలో వెనుకబాట పట్టాయి. అదే సమయంలో తమిళనాడు, మహారాష్ట్ర దూసుకెళ్లడం అనేది కూడా ప్రధానంగా కనిపించే ట్రెండ్.
స్వాతంత్ర్యం వచ్చేనాటికి బాంబేతో పాటు అంతకంటే మిన్నగా బిహార్, బెంగాల్ పారిశ్రామికంగా అగ్రజాబితాలో ఉంటే ఇవాళ ఆ రెండూ చాలా కిందకి వెళ్లిపోయాయి. ఇది ఆర్థిక సామాజిక రంగాల్లో కూడా ప్రతిఫలిస్తున్న మార్పు.
కోల్‌కతా వంటి మహానగరం ఉన్నప్పటికీ బెంగాల్ వెనుకబాటుకు భూసంస్కరణలు పటిష్టంగా అమలు కావడం, వ్యవసాయ మిగులు ప్రైవేట్ పెట్టుబడిగా పోగుపడడం లాంటి పరిస్థితులే కారణం అనే వాదన బలంగా ఉన్నది.
అదే సమయంలో, వామపక్షాల కాలంలో పని సంస్కృతి దెబ్బతిన్నదనే వాదన ఉంది. కానీ మరోవైపున, హక్కుల స్పృహ వల్ల మంచి పని వాతావరణం, మెరుగైన వేతనాలను డిమాండ్ చేసే చోట పెట్టుబడి దారులు వెనుకడుగు వేయడం అనే కోణాన్ని కూడా బెంగాల్ విషయంలో చూడాల్సి ఉంటుంది అనేవారూ ఉన్నారు. బెంగాల్ ఇవాళ చాలామందికి ఒక కేస్ స్టడీ.
కొరత నుంచి మిగులుకు
60ల్లో ఆహారధాన్యాల సంక్షోభం, అమెరికా నుంచి దిగుమతులపై ఆధారపడిన స్థితిలో దేశం ఉన్నది. నేడు, పండిన ధాన్యాన్ని ఏం చేసుకోవాలో తెలీక తలపట్టుకునే స్థితిలో ఉంది. హరిత విప్లవం, ఆ తర్వాత సాగిన పరిణామాలు దానికి బాట వేశాయి.
- వ్యవసాయ మిగులు నుంచి పెట్టుబడి వస్తుందని తెలిసినప్పటికీ, అంతవరకూ దానికి అనువైన పరిస్థితులు సృష్టించడంలో రాజ్యం తొలిదశలో విఫలమైంది.
- వ్యవసాయంలో వెనుకబడిన పాత పద్ధతుల వల్ల అధిక దిగుబడి సాధ్యపడకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉన్నది.
- ఇవాళ సాగుభూమి విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ ఉత్పత్తి పెరుగుతూనే ఉంది. ఇదొక కీలక మార్పు.
- లాల్ బహదూర్ శాస్త్రి, ఆ తర్వాత ఇందిరాగాంధీ కొనసాగించిన హరిత విప్లవం దాని స్ఫూర్తితో మొదలైన వ్యవసాయ సాంకేతిక మార్పులు నేడు పరిస్థితుల్లో మార్పు తెచ్చాయి.
- అప్పటికే ముందుచూపుతో నెహ్రూ ఆరంభించిన ఆనకట్టలు సాధనాలుగా ఉపకరించాయి.
- ఆర్థిక లోటు నుంచి ఆర్థిక మిగులు దిశగా ఆర్థికవ్యవస్థ ప్రయాణించింది.
కొత్త పెట్టుబడిదారులు పుట్టుకొచ్చారు
సినిమా, ఫార్మా, మీడియా ఏ రంగం తీసుకున్నా ప్రథమ వాటా నాటి హరిత విప్లవ ఫలితాలను పొందిన ప్రాంతాల వారే కావడం యాదృచ్ఛికం కాదు.
ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, పంజాబ్, తమిళనాడు, హరియాణా, గంగాపరీవాహ ప్రాంతాలు... ఎక్కడెక్కడ హరిత విప్లవం జరిగిందో అక్కడల్లా ఈ పరిణామం కనిపిస్తుంది.
వ్యవసాయ మిగులు నుంచి పారిశ్రామిక పెట్టుబడి, పారిశ్రామిక వేత్తలు పుట్టుకు రావడం ప్రపంచవ్యాప్తంగా కనిపించే అంశమే. పెట్టుబడి విస్తరణకు వ్యవసాయ మిగులు కోసం భారత్ వేచి చూడాల్సి వచ్చింది. అదే క్రమంలో అంతకంతకూ పెరిగిపోయిన బ్యాంకింగ్ సిస్టమ్, పొదుపు మొత్తాలు, పన్నుల మొత్తాలు, ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఉదారంగా రుణాలు ఇవ్వడానికి ఉపకరించాయి. ఈ క్రమంలోనే వేలకోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టే కుంభకోణాలు కూడా మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
చైనాతో పోలిస్తే పుష్కరం ఆలస్యం
చైనాలో 78లో సంస్కరణలు ఆరంభమైతే భారత్‌లో కూడా ఇంచుమించుగా అదే టైంలో ఆ ఆలోచనలు మొదలయ్యాయి. రెండోసారి ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చినపుడు ఆ ధోరణి వ్యక్తమైంది. అయితే అర్థంతరంగా ఆమె హత్యకు గురికావడంతో పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆ దశాబ్దపు రాజకీయ ఒడుదొడుకుల మధ్య అవి అనుకున్నంతగా ముందుకు సాగలేదు. ఆ రకంగా భారత్ సంస్కరణలు ఓ పుష్కర కాలం ఆలస్యం అయినట్టు లెక్కేసుకోవచ్చు.
91 చెల్లింపుల సంక్షోభంలో బంగారు తాకట్టు ఎపిసోడ్ అనివార్య స్థితిని తెచ్చిపెట్టింది. తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో ఒప్పందం చేసుకుని పీవీ నరసింహారావు సంస్కరణల పని ప్రారంభించారు. సమర్థుడైన ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ సారథ్యంలో ఆ సంస్కరణలు వేగం పుంజుకున్నాయి.
పారిశ్రామికీకరణలో మూడు దశలు
పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ పాత్రను గుర్తిస్తూనే దాని వెనుక చారిత్రక పరిణామ క్రమం ఉందనే విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది.
- తొలుత ప్రభుత్వ నియంత్రణలో పారిశ్రామిక రంగం ఉండేది.
- ఆ తర్వాత దశలో ప్రభుత్వ-ప్రైవేటు జమిలిగా సాగింది.
- తుది దశలో అంటే వర్తమాన దశలో ప్రైవేటు రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఈ మూడు దశల్ని భారత పారిశ్రామిక ప్రయాణంలో ఆర్థిక పురోగతిలో స్పష్టంగా చూడొచ్చు. ఈ మూడు ఒక క్రమ పద్ధతిలో సాగాయని, ప్రైవేటు పెట్టుబడి దారులను సృష్టించి ప్రభుత్వం తాను మెల్లగా చాలా రంగాల నుంచి పక్కకు తప్పుకుందని ఈ ప్రయాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది.
స్థూలంగా సంస్కరణలు తెచ్చిన ప్రగతిని, ఆ ప్రగతి తెచ్చిన సంపదను గుర్తిస్తూనే పేదరికం విషయంలో అది సాధించిన పురోగతిని మెచ్చుకోవాలి. ఇదే సమయంలో అసమానతలు ప్రమాదకరస్థాయికి పెరిగిపోతున్నాయన్న వాస్తవాన్ని మరవకూడదు. నేరాలకు, విప్లవాలకు అసమానత తండ్రి లాంటిది అని ప్రభుత్వ నివేదికే గుర్తించి ఉంది కాబట్టి, అది మరింత ప్రమాదకరంగా మారకుండా అది ఏం చేస్తుందో, ఏం చేయగలదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- సల్మాన్ రష్దీ: ఎన్టీఆరే ‘ది సాటానిక్ వెర్సెస్’లో ఫరిస్తా పాత్రకు స్ఫూర్తిగా నిలిచారా-బీబీసీ ఇంటర్వ్యూలో రష్దీ ఏమన్నారు?
- వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి, కానీ పెట్రోలు ధర వారంలో 50శాతం పెరిగింది
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా, ఆ మాట నిజమేనా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఓసారి ఒక వ్యక్తి తన కోళ్ల కోసం వెతుకుతుంటే, 20,000మంది నివసించగల భూగర్భ నగరం బయటపడింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














