సల్మాన్ రష్దీ: ఎన్‌‌టీఆరే ‘ది సాటానిక్ వెర్సెస్’లో ఫరిస్తా పాత్రకు స్ఫూర్తిగా నిలిచారా-బీబీసీ ఇంటర్వ్యూలో రష్దీ ఏమన్నారు?

మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్, ఏ‌ఎన్‌ఆర్, ఎస్వీఆర్

ఫొటో సోర్స్, Amazon.com

సల్మాన్ రష్దీ... న్యూయార్క్‌లో ఇటీవల కత్తిపోటుకు గురైన ఈ రచయిత ప్రస్తుతం కోలుకుంటున్నారు.

ఆయన 1988లో రాసిన నవల 'ద సాటానిక్ వెర్సెస్' ఎంతో వివాదాస్పదమైంది. ఎంతగా అంటే సల్మాన్ రష్దీని చంపేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమేనీ ఫత్వా సైతం జారీ చేసేంతగా.

'ద సాటానిక్ వెర్సెస్'లోని కొన్ని అంశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ 1990లలో అనేక దేశాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి.

1988లో ఆ పుస్తకం విడుదలైన తరువాత వివిధ అంశాల మీద బీబీసీతో సల్మాన్ రష్దీ మాట్లాడారు.

సల్మాన్ రష్దీ

'దైవాన్ని నమ్మను'

దైవాన్ని నమ్ముతారా? అని ప్రశ్నించినప్పుడు సల్మాన్ రష్దీ ఇలా చెప్పారు.

'తొలుత నేను దైవాన్ని నమ్మేవాడిని. పెరిగి పెద్దవుతున్న తరుణంలో నాలో అనేక ప్రశ్నలు తలెత్తేవి. బాంబే వంటి నగరంలో పెరిగినప్పుడు అన్ని మతాల వాళ్ల మధ్య మనం నివసిస్తుంటాం. నా మిత్రుల్లో అన్ని మతాల వాళ్లు ఉన్నారు.

మతంతో ఏం సంబంధం లేదని, దాన్ని పట్టించుకోనని చెప్పలేను. కానీ నేను దైవాన్ని నమ్మను.'

నందమూరి తారక రామారావు ఎన్టీఆర్

ఫొటో సోర్స్, facebook/TDP.Official

ఒక పాత్రకు ఎన్‌టీఆర్ స్ఫూర్తా?

ఈ పుస్తకంలో రెండు ప్రధాన పాత్రలున్నాయి. ఒకటి... జిబ్రీల్ ఫరీస్త. రెండు... సలాదీన్ చమ్చా. ఈ రెండు పాత్రలు భారతీయ ముస్లింలే.

'దక్షిణ భారత సినిమాల్లో దేవునిగా నటించే ఒక వ్యక్తి ఆధారంగా ఫరీస్త పాత్రను తీర్చిదిద్దాను. ఆయన చాలా సినిమాల్లో దేవునిగా నటించారు' అని సల్మాన్ రష్దీ తెలిపారు. ఆ వ్యక్తే ఎన్‌టీ రామారావు అని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పాల్ బ్రెయిన్స్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.

ఈ పుస్తకంలో విమానం కూలినప్పుడు ప్రాణాలతో బయటపడ్డ సలాదీన్ పాత్ర, బ్రిటన్‌లో శరణార్థిగా అనేక కష్టాలు పడుతుంది. ఆ పాత్ర సల్మాన్ రష్దీ జీవితానికి కాస్త దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది.

'నా అనుభవం నుంచి సలాదీన్ పాత్ర రూపుదిద్దుకుంది. అందులో సందేహం లేదు. అలాగని ఆ పాత్ర మొత్తం నేను కాదు. బాంబే లేదా లండన్‌... ఎక్కడ ఉన్నా అక్కడి ప్రాంతంతో కలిసి పోయే పాత్ర అది. అదే సమయంలో ఆ పాత్ర ఏ ప్రాంతానికి కూడా చెందదు.

నిజమైన ఇంగ్లిష్ వ్యక్తిగా జీవించేందుకు సలాదీన్ పాత్ర ప్రయత్నిస్తుంది. కానీ లండన్‌ ప్రజల తీరుతో అది కష్టమవుతుంది. కట్టుబొట్టు అన్నీ ఇంగ్లిష్ వాళ్ల మాదిరిగానే మార్చుకున్నా సలాదీన్‌ను కార్టూన్ క్యారెక్టర్‌గానే చూస్తారు.

చివరకు ఒక డెవిల్‌గా సలాదీన్ పాత్ర మారుతుంది ' అని రష్దీ వివరించారు.

సల్మాన్ రష్దీ

ఫొటో సోర్స్, Getty Images

ఒక్క మాటలో నవల గురించి...

'ఈ నవల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... 'మార్పు' అనొచ్చు.

ప్రపంచంలోని ఒక మూల నుంచి మరొక మూలకు వెళ్లినప్పుడు కలిగే మార్పులే ఈ నవల.

ఒక వ్యక్తి, ఒక సమూహం, ఒక జాతి, ఒక సంస్కృతి అన్నింటిని ఈ ప్రయాణం మార్చి వేస్తుంది.

ప్రపంచంలోని ఏ మతం గురించి అయినా వచ్చే కొత్త ఆలోచనలే ఈ పుస్తకం' అని రష్దీ తెలిపారు.

సల్మాన్ రష్దీ

ఫొటో సోర్స్, Getty Images

ఆయుతుల్లా ఖొమేనీ మీద విమర్శ

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖొమేనీ కఠిన విశ్వాసాలను 'ది సాటానిక్ వెర్సెస్' విమర్శించింది.

'మతానికి సంబంధించిన విషయాలను నవల్లో చర్చించాను. ఇవాళ మనం వింటున్న అనేక నియమాలు, నిబంధనలు వాస్తవంగా ఉన్నవి కావు.

యూనివర్సిటీలో చరిత్రను చదివే రోజులో 'ఇస్లాం చరిత్ర' మెయిన్ సబ్జెక్ట్‌గా ఉండేది. మహ్మద్ ప్రవక్తకు చెందిన కొన్ని వింత కథలు అక్కడ చూశాను. అవన్నీ ప్రజలను ప్రలోభ పెట్టేవే. ప్రజలతో మహ్మద్ ప్రవక్త చేసుకునే ఒప్పందాలు, రాజీల మాదిరిగా అవి ఉంటాయి' అని రష్దీ అన్నారు.

వీడియో క్యాప్షన్, మత విద్వేష వ్యాప్తికి మాధ్యమంగా సంగీతాన్ని వాడుకుంటున్న హిందూ రైట్ వింగ్ సమర్థకులు

బాంబే గురించి...

'నేను ఇకపై భారతీయున్ని కాను. చాలా కాలంగా నాకు నేను ఇదే చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు నాకు భారత్ పరాయిదేశమే. అయినప్పటికీ నా ఇల్లు అదే. భారత్ వెళ్లిన ప్రతిసారీ నా ఇంటికి వెళ్తున్నాననే ఫీలింగ్ కలుగుతుంది.

బాంబేను ప్రపంచంలోని ఏ ఇతర ప్రాంతంతోనూ పోల్చలేను. కానీ బాంబేను ఆరాధించడాన్ని మెల్లగా మానుకున్నా. దాని గురించి కలలు కనడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదనే వాస్తవాన్ని అంగీకరించా.

బాంబే ఇకపై నా ఇల్లు కాదు. ఇదే (లండన్) నా ఇల్లు. ఇక ఆ ఇంటి(బాంబే)కి నేను వెళ్లలేను' అని సల్మాన్ రష్దీ అన్నారు.

'ది సాటానిక్ వెర్సెస్' నవల విడుదలైన తరువాత జరిగిన నిరసన ప్రదర్శనల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 59 మంది చనిపోయారు. ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది.

మహ్మద్ ప్రవక్త భార్య పేర్లను పుస్తకంలోని రెండు వేశ్యపాత్రలకు పెట్టడాన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.

పుస్తకం విడుదలైన ఏడాది తరువాత సల్మాన్ రష్దీని చంపేందుకు ఫత్వా జారీ చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖొమేనీ. ఇలాంటి బెదిరింపుల వల్ల సుమారు 9 ఏళ్ల పాటు సల్మాన్ రష్దీ దాక్కున్నారు.

వీడియో క్యాప్షన్, 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు ఏం జరిగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)