కోరుకొండ సుబ్బారెడ్డి: ఈ ఆదివాసీ నాయకుడిని బ్రిటిషర్లు ఉరితీసి, రాజమండ్రి కోటగుమ్మం దగ్గర వేలాడదీశారా?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గోదావరి నది భద్రాచలం దాటి రాజమండ్రి మీదుగా పాపి కొండల మధ్య ప్రవహిస్తుంది. రోడ్డు మార్గాలు లేని రోజుల్లో సరకు రవాణాకు అది ప్రధాన మార్గం. రవాణాకు తగిన పడవల్లో కలప, పత్తి వంటి ఎన్నో వస్తువులు నదీ మార్గంలో వెళుతుండేవి. ఆ నదికి రెండు వైపులా “కొరటూరు”, “కొండమొదలు” అనే గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ గ్రామాలకు చేరుకోవడం అంత తేలిక కాదు. పాపికొండల నడుమ గోదావరి ఒడ్డున ఉన్న గిరిజన గ్రామాలవి.
గోదావరి నదిలో ఆ రెండు గ్రామాల మధ్య నుంచి వెళ్లే సరకుపై పన్ను వసూలు చేయడం అక్కడి ఆదివాసీ గ్రామ పెద్దల హక్కుగా ఉండేది. ఆ హక్కు వారికి ఎవరు ఇచ్చారన్నది స్పష్టత లేదు. బహుశా పోలవరం జమీందారు ఆ గ్రామ పెద్దలకు పన్ను వసూలు అధికారం ఇచ్చి ఉండొచ్చని బ్రిటిష్ రికార్డుల ఆధారంగా తెలుస్తోంది.
ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కొరటూరు గ్రామానికి చెందిన “కొండరెడ్లు” అనే ఆదివాసీ తెగకు చెందిన కోరుకొండ సుబ్బా రెడ్డి, 1852 వరకూ ఇక్కడ పన్ను వసూలు చేసేవాడు. అందులో సగ భాగాన్ని, నదికి అవతలివైపున ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లాలో భాగం అయిన “కొండమొదలు” గ్రామ పెద్ద అయిన రామా రెడ్డి, అతని తదనంతరం, అతని కొడుకు లింగా రెడ్డికి వాటాగా ఇచ్చేవాడు.
సరిగ్గా అప్పుడే అడుగు పెట్టారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు. 1852వ సంవత్సరంలో ఈ గ్రామ పెద్దలకు ఉన్న పన్ను వసూలు అధికారాన్ని రద్దు చేశాడు స్థానిక సబ్ కలెక్టర్. దీంతో ప్రతీకారంతో ఎదురు చేశాడు సుబ్బారెడ్డి. అదే సమయంలో నాగవరం కోట వారసత్వం గొడవ వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
పోలవరం దగ్గరలోని నాగవరం జమీందారీ 10-12 గ్రామాలతో ఉండేది. ఆ జమీందారీ పాలకులుగా ఇద్దరు వితంతువులైన అత్తాకోడళ్లు ఉండేవారు. వాళ్ల భర్తలు పోయాక, ఆ జమీందారీని హస్తగతం చేసుకోవాలని చాలా మంది ఆశపడ్డారు. కోరుకొండ సుబ్బారెడ్డి కూడా నాగవరం జమీందారీని తన పరిధిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు. కానీ కుదరలేదు. వాస్తవానికి ఆ ఇద్దరు వితంతువుల్లో అత్తగారైన లక్ష్మీ నరసమ్మ, కోరుకొండ సుబ్బా రెడ్డి కొడుకును దత్తత తీసుకోవాలి అనుకుంది.
‘‘అలా జరిగితే సుబ్బారెడ్డికి ఎస్టేటులో ఒక వాటాయే వస్తుంది. కానీ సుబ్బా రెడ్డి మాత్రం రెండవ వితంతువు సీతమ్మను తన కొడుక్కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. అప్పుడు ఇద్దరి వాటాలతో సహా నాగవరం జమిందారీ మొత్తం తన వశం అవుతుందని అతను అనుకున్నాడు. కానీ సీతమ్మ మాత్రం పక్కనే ఉన్న బుట్టాయగూడెం మునసబు సుంకర స్వామితో ఉండేది. దీంతో నాగవరం జమిందారీలోని సీతమ్మ వాటాపై సుంకర స్వామి పెత్తనం వచ్చింది. ఈ సుంకర స్వామికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్దతు ఉంది. దీంతో నాగవరం కోట తనకు రాకుండా బ్రిటిష్ వారు అడ్డంకిగా మారారు సుబ్బారెడ్డికి’’అని బీబీసీకి వివరించారు చరిత్రకారులు రామచంద్రారెడ్డి.
రామచంద్రారెడ్డి పుదుచ్చేరిలోని ‘‘కంచి మామునివర్ గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ రీసెర్చ్’’ లో చరిత్ర విభాగం హెడ్‌గా ఉన్నారు. రాట్లెడ్జ్ అనే సంస్థ 2010లో ప్రచురించిన ‘‘ది గ్రేట్ రెబెలియన్ ఆఫ్ 1857 ఇన్ ఇండియా – ఎక్స్ప్లోరింగ్ ట్రాన్స్ గ్రెషన్స్, కాంటెస్ట్స్ అండ్ డైవర్సిటీస్’’ అనే వ్యాసాల సంకలనంలో సుబ్బారెడ్డి గురించి తాను చేసిన పరిశోధనను ఆయన ప్రచురించారు.
‘‘ఫారెస్ట్స్ ఆన్ ఫైర్ – ది 1857 రెబలియన్ ఇన్ ట్రైబల్ ఆంధ్ర’’ అనే పేరుతో ఈ ఘటన గురించి ఆయన ఒక వ్యాసం రాశారు. ఆ తరువాత ‘‘ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ కలోనియల్ ఆంధ్ర - గోదావరి అండ్ వైజాగపటం రీజిన్స్ 1857-1917’’ అనే పుస్తకం కూడా రాసి 2015లో ప్రచురించారు రామచంద్రా రెడ్డి.

‘‘పన్ను వసూలు ఆగడం, నాగవరం జమిందారీ దక్కకపోవడం - ఈ రెండు పరిణామాలతో ఈస్ట్ ఇండియా కంపెనీపై రగిలిపోయాడు సుబ్బారెడ్డి. అదే సమయంలో 1857 తిరుగుబాటు ఉత్తర భారతంలో జరిగింది. ఆ తిరుగుబాటు గురించి దక్షిణాదిన పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. ఆ తిరుగుబాటు విజయవంతం అయి కంపెనీని ఉత్తర భారత సైనికులు తరిమివేస్తారంటూ వచ్చిన వదంతులను చాలా మంది నమ్మారు’’ అంటూ తన వ్యాసంలో రాశారు చరిత్రకారులు రామచంద్రారెడ్డి.
సుబ్బారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీపై గుర్రుగా ఉన్న సమయంలోనే, కొచ్చెర్లకోట రామభద్రం అనే కలప వ్యాపారి తనను కలిశాడు. అతనికి 1857 సిపాయిల తిరుగుబాటు గురించి చెప్పాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడమని ప్రోత్సహించాడు. అప్పటికి తమ దగ్గరలోని పెద్ద సంస్థానం అయిన పోలవరం జమీందారుకు వారసులు లేరు. దీంతో ‘‘బ్రిటిష్ వారిపై పోరాడితే మొత్తం పోలవరం జమీందారీ నీకు వశం అవుతుంది’’అని సుబ్బారెడ్డికి పరోక్షంగా చెప్పాడు రామభద్రం.
1857 సిపాయిల తిరుగుబాటు ప్రముఖ నాయకుడు నానా సాహెబ్‌ను గౌరవంగా నానా వారు అని సంబోధించారు రామభద్రం. సిపాయిల తిరుగుబాటు గురించి ఇతనే సుబ్బారెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. ఇంగ్లిషు వారిపై సుబ్బారెడ్డి పోరాడితే, అప్పుడు నానా సాహెబ్ తన సైన్యంతో వచ్చి పోలవరం కోటను తనకు వశపరుస్తాడని ఊహించుకున్నాడు సుబ్బారెడ్డి. ‘‘నానా (సాహెబ్) వారు తన సైన్యంతో ముందుకు వెళ్తున్నాడు. ఇంగ్లిష్ వారితో ఎవరు ఎక్కువ పోరాడితే వారికి భారీ నజరానాలు ఇస్తున్నాడు’’ అంటూ సుబ్బారెడ్డి కోర్టులో చెప్పినట్టుగా హెన్రీ మోరిస్ గోదావరి గెజిట్‌లో రాశారు.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
మొదటి దాడి బుట్టాయ గూడెం మునసబుపై
పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న బుట్టాయగూడెం మునసబుగా సుంకర స్వామి ఉండేవాడు. అతనికి బ్రిటిష్ మద్దతు ఉంది. దీంతో 1857 సెప్టెంబరు 17న బుట్టాయ గూడెం మీద 400 మందితో దాడి చేశాడు సుబ్బారెడ్డి. వాస్తవానికి తన లక్ష్యం సుంకర స్వామి నుంచి సీతమ్మను తీసుకెళ్లడం. అక్కడ విఫలం అయ్యారు. కానీ బుట్టాయగూడెం ఊరు దోచుకుని, అటు నుంచి నాగవరం వెళ్లారు. ఈ దాడిలో కొరటూరు, కొప్పల్లె, కన్నాపురం, పడ, నాగవరం ఇతర గ్రామాలు నుంచి కోయలు, కొండ రెడ్లు కలిశారు.
నాగవరం వెళ్లిన తరువాత తనను స్థానిక పాలకుడిగా ప్రకటించుకున్న సుబ్బారెడ్డి, తూడిమళ్ల, గూటాల ప్రాంతాల వారు తనకే పన్ను కట్టాలి అని ఆదేశాలు ఇచ్చారు. అంతే కాదు, తనకు పన్ను చెల్లించకుండా గోదావరిలో సరకు రవాణా చేసే వారిని బంధించడం, ఆ సరకును ఆపివేయడం ప్రారంభించాడు.
సరిగ్గా అదే సమయంలో సుంకర స్వామికి మద్దతుగా, గోదావరి సరుకు రవాణా మార్గాన్ని విడిపించడానికీ ఈస్ట్ ఇండియా కంపెనీ రంగంలోకి దిగింది. అతణ్ని అణచడానికి బ్రిటిష్ ప్రభుత్వం మెలనీ అనే అసిస్టెంట్ మేజిస్ట్రేట్‌ను పంపింది. అతను మొదట్లో సుబ్బారెడ్డి మనుషులు నలుగురినీ, కొంత సంపదనూ స్వాధీనం చేసుకున్నాడు.
ఆ అసిస్టెంట్ మేజిస్ట్రేట్ బుట్టాయగూడెంలో ఉండగానే 1857 సెప్టెంబరు 23న 500-600 మందితో సుబ్బారెడ్డి ముట్టడించాడు. సీతమ్మనూ, సుంకర స్వామినీ తనకు అప్పగిస్తే యుద్ధం ఉండబోదని ఆ బ్రిటిష్ అధికారికి ఆఫర్ ఇచ్చాడు. సుబ్బారెడ్డి ముందు తన బలగం సరిపోదని గుర్తించిన కంపెనీ అధికారి, సుబ్బారెడ్డి చెప్పినట్టుగా చేశాడు. తరువాత సుంకర స్వామిని చంపేశారు సుబ్బారెడ్డి మనుషులు.

అసలు యుద్ధం మొదలు
ఈస్ట్ ఇండియా కంపెనీ వరసగా పోలీసు టీములను పంపడం, సుబ్బారెడ్డి సైన్యం వారితో తలపడడం.. ఇదే తంతు ఆరు నెలలకు పైగా సాగింది. ముఖ్యంగా అటవీ ప్రాంతం కావడం వల్ల సుబ్బారెడ్డిది పైచేయి అయింది.
అనేక దఫాలుగా అనేక బృందాలను ఈస్ట్ ఇండియా కంపెనీ దించింది. కనిపించని పొదల వెనుక దాక్కుని కంపెనీ సైన్యంపై కాల్పులు జరపడం వారికి రక్షణ కల్పించింది.
దానికితోడు అటవీ ప్రాంతంలో శీతాకాలంలో వచ్చే జ్వరాలు, మలేరియా వంటివి కంపెనీ సైనికులను బాగా ఇబ్బంది పెట్టేవి.
చివరకు కోరుకొండ సుబ్బారెడ్డిపై 2,500, వెంకట సుబ్బారెడ్డిపై 1,000 రూపాయల నజరానా ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. 1858లో ఆ మొత్తం ఎంత విలువో లెక్కించవచ్చు.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
అంతేకాదు, ఆ పోరాటంలో పాల్గొన్న రెండు ప్రధాన గిరిజన తెగలైన కొండ రెడ్లు, కోయల మధ్య విబేధాల చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు ఈస్ట్ ఇండియా అధికారులు. సాధ్యపడలేదు. అటవీ ప్రాంతంలో యుద్ధం చేయడంలో సిద్ధహస్తులైన గోల్కొండ సిబ్బంది అనే ప్రత్యేక బృందాన్ని బ్లూమ్ ఫీల్డ్ అనే అధికారి ఆధ్వర్యంలో దించారు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు.
అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, తిరుగుబాటుదార్లకు సహకరించిన గ్రామాలను కంపెనీ సైనికులు తగలబెడితే, కంపెనీకి సహకరించిన గ్రామాలను తిరుగుబాటుదార్లు తగలబెట్టేవారు. రాను రాను కంపెనీ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. తమకు సహకరించని వాళ్లను రెండు వైపుల వారూ చంపడం మొదలుపెట్టారు. గాయ పడ్డ ప్రతీ కంపెనీ సైనికుడికి ప్రతిగా ఒక ఊరిని తగలబెట్టారు ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులు. ప్రభుత్వానికి సహకరిస్తున్నారంటూ, దేవీపట్నం, వీరవరం, పురుషోత్తమపట్నం గ్రామాలను తిరుగుబాటుదార్లు తగలబెట్టారు. తన ఒకప్పటి భాగస్వామి, కొండమొదలు ఊరి పెద్ద లింగారెడ్డి కూడా బ్రిటిష్ వారికి సహకరించారని అతణ్ని చంపించాడు సుబ్బారెడ్డి.
బ్లూమ్ ఫీల్డు మొదటి ప్రయత్నంలో విఫలం అయి వెనక్కు తిరిగి వచ్చాడు. కానీ రెండవ ప్రయత్నంలో సుబ్బారెడ్డిని కట్టడి చేయగలిగాడు. మొదటి పర్యాయం కొండ మొదలు గ్రామం, రెండవ పర్యాయం కొరటూరు గ్రామం వెళ్లాడు అతను. తాము అడవుల్లో పడ్డ ఇబ్బందులు, సుబ్బారెడ్డి బృందం చేసిన పోరాటాల గురించి ఉన్నతాధికారులకు అనేక లేఖలు రాశాడు అతను. అతనికంటే ముందు ధవళేశ్వరం నుంచి యర్నగూడెం వరకూ లెఫ్టినెంట్ రోజ్, లెఫ్టినెంట్ విచర్డ్ వెళ్లారు. సఫలం కాలేదు.

చివరకు బ్లూమ్ ఫీల్డ్ అనే బ్రిటిష్ అధికారి స్టీమర్లో గోదావరిలో కొరటూరు వెళ్లి సుబ్బారెడ్డిని పట్టుకునేప్రయత్నం చేస్తే అతను తన కొడుకుతో సహా రంప పారిపోయాడు. ఆ తరువాత క్రమంగా 1858 ఏప్రిల్ నాటికి తిరుగుబాటు తగ్గింది. జూన్ నాటికి తిరుగుబాటు దార్లు దాదాపు కంపెనీ సైనికులకు దొరికిపోయారు.
1858 జూన్ 11న చింతపల్లి దాసి రెడ్డి అనే వ్యక్తి, మాజీ తిరుగుబాటుదారు ఇచ్చిన సమాచారంతో కోరుకొండ సుబ్బారెడ్డి దొరికిపోయాడు.
‘‘నాతో పది మంది ఉండుంటే నన్ను తీసుకెళ్ల లేవు అని’’ తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుతో సుబ్బా రెడ్డి అన్నట్టు పలు పత్రాల్లో నమోదు అయింది. వాస్తవానికి సుబ్బారెడ్డిని పట్టించడానికి సాయం చేసిన దాసిరెడ్డి తల మీద 200 రూపాయల రివార్డు ఉండేది. కానీ అతను ఈస్ట్ ఇండియా కంపెనీతో కలసిపోయి, శిక్ష తప్పించుకున్నాడు.
దుండగి వీరా రెడ్డి, పల్లాల రామయ్య రంప అడవుల దగ్గర అరెస్టు కాగా, గొబ్బలంపాటి రామి రెడ్డి పోలవరం దగ్గర లొంగిపోయాడు. జూన్ నాటికి చాలామంది అరెస్టు అయ్యారు. కొర్ల వెంకట సుబ్బా రెడ్డి, కొర్త సీతారామయ్య, కొర్ల సింగి రెడ్డి, కొర్ల రాజా రెడ్డి, వీరా రెడ్డి, కోరుకొండ తుమ్మి రెడ్డి జూన్ 7-27 మధ్య దొరికారు.
దొరికిన వారిలో ఐదుగురిని జీవిత ఖైదుగా అండమాన్ తరలించారు. కొచ్చెర్లకోట రామభద్రం, పల్లాల రామయ్య, వీరా రెడ్డి, కోరుకొండ పొట్టి రెడ్డి, తుమ్మి రెడ్డిలు అండమాన్ వెళ్లారు. 14 మందిని కఠిన శ్రమతో కూడిన జైలు శిక్షకు గుంటూరు పంపారు. పైడయ్య, గొబలంపాటి రామిరెడ్డి, ఇంకా 14 మంది అలా గుంటూరు జైలుకు వెళ్లారు. ఇక కోరుకొండ సుబ్బారెడ్డి సహా 8 మందికి ఉరి వేశారు.
గురుగుంట్ల తుమ్మి రెడ్డి, కొర్ల సీతారామయ్యలకు సుంకర స్వామిని చంపినందుకు, కోరుకొండ తుమ్మి రెడ్డిని దొర పాపడును చంపినందుకు, కోర్ల వెంకట సుబ్బా రెడ్డిని పొడెం యర్రప్పను చంపినందుకు, కోరుకొండ సుబ్బారెడ్డిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అని చెప్పి ఉరి తీశారు. కోర్టులో ఒక దశలో తనను కొర్ల వెంకట సుబ్బారెడ్డి, సీతారామయ్యలు ఉద్యమం వైపు ప్రోత్సహించారు అని చెప్పాడు సుబ్బారెడ్డి.
1858 అక్టోబరు 7న కోరుకొండ సుబ్బారెడ్డి, కొర్ల సీతారామయ్యలను బుట్టాయగూడెంలో ఉరి వేశారు. కొర్ల వెంకట సుబ్బా రెడ్డి, గోరుగుంట్ల కొమ్మి రెడ్డిలను పోలవరంలో, కోరుకొండ తుమ్మి రెడ్డిని తూడిగుంటలో ఉరి వేశారు.
పోలవరం దగ్గర ఉరి వేసిన ఉరి కంభం చాలా కాలం అలాగే ఉండి 1900 సంవత్సరంలో గోదావరి వరదలకు వచ్చినప్పుడు కొట్టుకుపోయిందని ఎఫ్‌ఆర్ హెమింగ్ వే అనే బ్రిటిష్ అధికారి నమోదు చేశాడు.

ఫొటో సోర్స్, BETTMANN
సుబ్బారెడ్డి మృతదేహాన్ని రాజమండ్రిలో వేలాడదీశారా?
బ్రిటిష్ వారు కొందరు నిందితులకు శిక్షలు విధించినప్పుడు కఠినమైనవే కాకుండా, క్రూరమైన శిక్షలు విధించేవారు. వాటిల్లో ఒకటి గిబ్బెట్. అంటే ఉరి శిక్ష విధించిన ఖైదీ చనిపోయిన తరువాత మృతదేహాన్ని బంధువులకు ఇవ్వకుండా, అంత్యక్రియలు చేయకుండా, ఒక ఇనుప చట్రం లేదా పంజరంలో పెడతారు. దాన్ని బహిరంగంగా వేలాడదీస్తారు. కొన్నాళ్లకు శవం కృషించిపోతుంది. ఎముకలు మిగుల్తాయి. చాలా సందర్భాల్లో పుర్రె, కొన్ని బలమైన ఎముకలు మాత్రమే మిగుల్తాయి. అవి సుదీర్ఘ కాలం అలాగే బహిరంగంగా వేలాడుతూనే ఉంటూ ఆ శిక్షను, పదే పదే చూసేవారికి గుర్తు చేస్తుంటాయి. ఇలా తమ విషయంలో భయాన్ని పెంచే అనేక చర్యలు చేపట్టేవారు. జీవితాంతం అండమాన్ దీవుల్లో శిక్షకు పంపడం, దేశంలోనే జైలు జీవితంతో పాటూ అతి కఠినమైన శ్రామిక పనులు చేయించడం వంటి శిక్షలు వీటికి అదనం.
కోరుకొండ సుబ్బా రెడ్డిని ఉరి తీశాక ఆయన మృతదేహాన్ని రాజమండ్రి కోటగుమ్మం దగ్గర ఇలానే ఇనుప పంజరంలో వేలాడదీశారని స్థానికుల కథనం. దానిని ‘‘సుబ్బారెడ్డి సంచి’’ అని పిలిచేవారు అని జనబాహుళ్యంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపై చారిత్రక ఆధారాలు ప్రస్తుతానికి దొరకడం లేదు.
‘‘ఈ విషయానికి ఆధారం కోసం నేను విస్తృతంగా ప్రయత్నించాను. కానీ ఎక్కడా సరైన సాక్ష్యం దొరకలేదు. విశాఖలో పాయక రావు అనే వ్యక్తిని ఇలానే చేసినట్టు ఆధారాలు దొరికాయి కానీ, రాజమండ్రిలో సుబ్బారెడ్డి గురించి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. ఆఖరికి గోదావరి సర్వస్వం అనే పుస్తకంలో కూడా కోట గుమ్మం దగ్గర మృతదేహాన్ని వేలాడదీశారు అని జనం చెప్పుకొంటారు అనే రాశారు. అది ఔను అనీ చెప్పలేం, కాదు అనీ చెప్పలేం’’ అన్నారు చరిత్ర ప్రొఫెసర్ బద్దెల రామచంద్రా రెడ్డి.
సాధారణంగా ఉరి తరువాత గిబ్బెట్ చేయాలంటే (ఇనుప పంజరంలో మ్రుతదేహాన్ని పెట్టి ప్రదర్శించాలంటే), అదే విషయాన్ని తీర్పులో రాసేవారు అప్పటి జడ్జీలు. సుబ్బారెడ్డి ఉరి శిక్ష తీర్పులో ఆ విషయం లేదు అని బీబీసీతో అన్నారు రామచంద్రారెడ్డి.
ఆంధ్రలో 1857 తిరుగుబాటు
1857కి ముందు కూడా ఆంధ్ర ప్రాంతంలో రైతులు, గిరిజనుల నుంచి 40 వరకూ తిరుగుబాట్లు జరిగాయి. ఎక్కువ తిరుగుబాట్లు తమ హక్కుల కోసం జమీందార్లు చేసినవి ఉన్నాయి. అలాగే 1857 సిపాయిల తిరుగుబాటులో మొఘల్ చక్రవర్తి బహదూర్ షాను భారతదేశ పాలకుడిగా ప్రకటించడంతో ఆంధ్ర ప్రాంతంలో ముస్లింలు చాలా చోట్ల చిన్న చిన్న తిరుగుబాట్లు చేశారు.
1766 నుంచే ఆదివాసీలు కంపెనీపై తిరుగుబాట్లు చేసేవారు. వాస్తవానికి 1850 నాటికే మైదాన ప్రాంతంలోని జమీందార్ల తిరుగుబాట్లు తగ్గగా, ఆదివాసీల తిరుగుబాట్లు మాత్రం కొనసాగాయి. ప్రధానంగా గ్రామ పెద్దలు, జమీందార్లు తమ పన్ను వసూలు హక్కు కోసం చేసిన తిరుగుబాట్లే ఎక్కువ.
1857 సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతాన్ని కుదిపేసింది. కానీ ఆ తిరుగుబాటు ప్రభావం దక్షిణ భారతంపై ఎంత అనేది ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉండేది. కానీ 1857 సిపాయిల తిరుగుబాటు ప్రతిధ్వనులు దక్షిణాదిన కూడా బలంగానే వినిపించాయి అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు.
‘‘ఇప్పటికీ దారి సరిగా లేని ఒక చిన్న ఆదివాసీ గ్రామ పాలకుడికి ఎక్కడో మేరట్‌లో జరిగిన నానా సాహెబ్ ఆధ్వర్యంలోని సిపాయిల తిరుగుబాటు గురించి సమాచారం రావడం చాలా ఆశ్చర్యకరం. సుబ్బారెడ్డి పోరాట లక్ష్యాల్లో అనేక అంశాలున్నప్పటికీ, కోర్టులో మాత్రం నానాసాహెబ్ వస్తాడు అని చెప్పడం, 1857 తిరుగుబాటు ప్రభావాన్ని పట్టిస్తుంది’’ అని బీబీసీతో అన్నారు బద్దెల రామచంద్రా రెడ్డి.
ఈ సుబ్బారెడ్డి గురించి పలువురు చరిత్రకారులు రాశారు. దిగవల్లి వేంకట శివ రావు రాసిన భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857, ఆదివాసుల యుద్ధములు: 1785-1858 అనే వ్యాసంలో ఈ సుబ్బారెడ్డి గురించి వివరించారు. ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి రాసిన అప్రైజింగ్ ఆఫ్ 1857 – ఎ మూమెంట్ దట్ డిఫైన్డ్ ఇండియా ఆఫ్ ఆగస్ట్ 15, 1947లో కూడా ఈ ఘటనల గురించి ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి:
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- మనం ఎందుకు చనిపోతాం? సంతాన సామర్థ్యం.. వృద్ధాప్యానికీ, మరణానికీ దారితీస్తుందా?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు
- హమీదా బాను: 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో కనిపించిన భారతీయ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














