హర్‌ఘర్ తిరంగా: ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి

ఫొటో సోర్స్, Getty Images
ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపు మీద అనేక విమర్శలు, వివాదాలు ఉన్నాయి.
ఇప్పటికే చాలామంది జాతీయ జెండాను తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నారు. అయితే, ఇంటి మీద జెండా ఎగురవేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాలు ఏంటో తెలుసుకునే ముందు భారత దేశపు ఫ్లాగ్ కోడ్ ఏంటో కూడా తెలుసుకోవాలి.
ఫ్లాగ్ కోడ్ అంటే ఏమిటి?
జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ ఫ్లాగ్ కోడ్ 2002 ను అనుసరించాల్సి ఉంది. అలాగే యాంటీ డిఫమేషన్ ఆఫ్ నేషనల్ సింబల్స్ యాక్ట్-1971 నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది.
ఈ కోడ్‌లోని నిబంధన 2.1 ప్రకారం, జాతీయ జెండా పట్ల పూర్తి గౌరవంతో సాధారణ పౌరులు ఏ ప్రదేశంలోనైనా జెండాను ఎగురవేయవచ్చు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు.
అయితే, జాతీయ జెండాను అవమానిస్తే మొదటి తప్పుకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధన ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
2002 జనవరి 26న కొత్త కోడ్ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు నేషనల్ సింబల్స్ అండ్ నేమ్స్ యాక్ట్-1950, యాంటీ డిఫమేషన్ ఆఫ్ నేషనల్ సింబల్స్ యాక్ట్-1971 ఉండేవి.
ఇటీవల ఈ కోడ్‌లో రెండు ప్రధాన మార్పులు చేశారు. 2022 జూలై 20న చేసిన సవరణ ప్రకారం, ఇప్పుడు జాతీయ జెండాను పగలు, రాత్రి కూడా ఎగురవేయవచ్చు. అది బహిరంగ ప్రదేశమైనా, ఇంటి మీదైనా ఎగరేయడానికి అనుమతి ఉంది.
అంతకు ముందు జాతీయ జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఎగురవేయడానికి అనుమతి ఉండేది.
జాతీయ జెండాను పాలిస్టర్ ఫాబ్రిక్‌తో తయారు చేయడానికి 2021 డిసెంబర్ 30 నుంచి అనుమతించారు. గతంలో ఖాదీ వస్త్రంతో మాత్రమే జాతీయ జెండా తయారీకి అనుమతి ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
ప్రభుత్వ ఫ్లాగ్ కోడ్ గతంలో చాలా కఠినంగా ఉండేది. ఇప్పుడు దానిని సరళీకృతం చేశారు. అయినా సరే, జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
1.జెండాను ఎగరేసేటప్పుడు అది చిరిగిపోయి ఉండకూడదు. నలిగిపోయిన, తిరగబడిన జెండాను ఎగరవేయరాదు. సరైన స్థలంలోనే జెండాను ఎగరేయాలి.
2. జాతీయ జెండాను ఎగరేసే ఎత్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండాఎగురవేయకూడదు.
3. జెండాను ఎలాంటి అలంకరణకు ఉపయోగించకూడదు.
4. జెండానుఎగురవేసేటప్పుడు, కాషాయ రంగు పైకి ఉండేలా జాగ్రత్త వహించాలి.
5. జెండా కర్ర మీద లేదా జెండాపైన పూలు, ఆకులు,దండలు పెట్టకూడదు.
6. జెండాపై ఏమీ రాయకూడదు. ఏ వస్తువు మీద కప్పడానికి జెండాను ఉపయోగించకూడదు.
7. జెండాను ఎగురవేయడానికి సిద్ధం చేస్తున్నప్పుడు, అవసరమైతే పువ్వులు అందులో ఉంచవచ్చు.
8. జాతీయ జెండా నేల మీద పడేయకూడదు, నీటిపై తేలనీయకూడదు.
9. జెండానుదుస్తులుగా కుట్టించుకోకూడదు. నడుము కింది భాగంలో చుట్టుకోకూడదు. రుమాలుగా, సోఫా కవర్‌గా, న్యాప్‌కిన్‌గా, లోదుస్తుల తయారీకి ఉపయోగించకూడదు.
10. జెండాను ఎగురవేసేటప్పుడు, అది జెండా కర్రకు కుడి వైపున ఉండాలి.
అసలు 'హర్ ఘర్ తిరంగా' ప్రచారం అంటే ఏమిటి?
ఈ ప్రచారం కింద దేశంలోని 20 కోట్ల ఇళ్లపై జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో 4 కోట్ల జెండాలు అందుబాటులో ఉన్నాయి.
అంటే ఇతర జెండాలను వారి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించి నిర్దిష్ట ప్రదేశాలకు విక్రయించి పంపిణీ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుండి జెండాలను కోరవచ్చు. లేదా రాష్ట్ర స్థాయిలో జెండాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రకారం మూడు వేర్వేరు సైజుల్లో జెండాలు అందుబాటులో ఉంటాయి. రూ.9, రూ.18, రూ.25 ధరల్లో ఇవి దొరుకుతాయి.
జెండా తయారీ కంపెనీలు తొలుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుగా జెండాలను అందజేస్తాయి. పౌరులు తమ సొంత డబ్బుతో జెండాను కొనుగోలు చేయాలి.

ఫొటో సోర్స్, EPA
క్యాంపెయిన్ ఖర్చు ఎంత?
20 కోట్ల ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జెండా ధర రూ.10 అయితే ఈ ప్రచారానికి రూ.200 కోట్లు ఖర్చవుతుంది.
ఇప్పటి వరకు ఇంత పెద్దఎత్తున జెండా వ్యాపారం జరగలేదన్నది స్పష్టం. ఇందుకోసం స్వయం సహాయక సంఘాలు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, పెద్ద కంపెనీలు కూడా టెండర్లు వేశాయి. దీనివల్ల వీలైనన్ని ఎక్కువ జెండాలు అందుబాటులో ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- క్విట్ ఇండియా: ఈ నినాదం ఎలా పుట్టింది, ఈ ఉద్యమంలో ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన యోధులెవ్వరు?
- బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














