మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?

కాబా

ఫొటో సోర్స్, TWITTER@REASAHALHARMAIN

సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్లే సందర్శకులు కాబా గృహానికి ఉన్న నల్లని రాయిని తాకి ముద్దు పెట్టుకోవచ్చు. కరోనా మహమ్మారి వల్ల కాబాను తాకేందుకు విధించిన నిషేధాన్ని ప్రస్తుతం తొలగించారు.

ఈ నిషేధం తొలగించిన తర్వాత భక్తులు ఉత్సాహంతో ఈ నల్లని రాయిని తాకి ప్రార్ధనలు చేయడం కనిపిస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

30 నెలల తర్వాత ఈ నిషేధాన్ని తొలగించారు. ఉమ్రా యాత్ర మొదలు కావడానికి ముందు ఈ చర్యను అమలు చేశారు.

ఉమ్రా అంటే ఏంటి?

ఉమ్రా అంటే ఒక ప్రయాణం. హజ్ తరహాలోనే ముస్లింలు మక్కాకు వెళ్లి ప్రార్ధనలు చేస్తారు.

అయితే, ఇది హజ్ కంటే భిన్నంగా ఉంటుంది. హజ్ యాత్ర ఒక ప్రత్యేక నెలలోనే జరుగుతుంది. ఉమ్రా కోసం ఏడాదిలో ఎప్పుడైనా వెళ్ళవచ్చు.

కాబా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాబా గృహం

ఉమ్రా సమయంలో మతపరమైన చాలా రకాల ఆచారాలు నిర్వహిస్తారు. ఉమ్రా కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ముస్లింలు మక్కా సందర్శిస్తారు.

చాలా మంది మక్కాకు దగ్గర్లో ఉన్న మదీనాకు కూడా వెళతారు.

Banner

ఇస్లాం నియమాలు

  • తవాహీద్ - 'అల్లా ఒకరే. మహమ్మద్ ఆయన పంపిన దూత' అని ముస్లింలు అందరూ నమ్మాలి
  • నమాజ్: రోజుకు ఐదు సార్లు ప్రార్ధనలు నిర్వహించాలి
  • ఉపవాసం: రంజాన్ సమయంలో ఉపవాసాలు చేయాలి
  • జకాత్: పేదవారికి, అవసరమైన వారికి దానం చేయాలి
  • హజ్ - మక్కా యాత్ర చేయాలి
Banner

కోవిడ్ ప్రభావం

సౌదీ అరేబియా కరోనా మహమ్మారి వల్ల విధించిన చాలా రకాల నిబంధనలను ఈ ఏడాది సడలించింది.

ఈ ఏడాది జులై 7 నుంచి 13 మధ్యలో హజ్ యాత్ర చోటు చేసుకుంది. ఈ యాత్రకు వెళ్లిన భక్తుల సంఖ్య సాధారణ రీతిలోనే నమోదయింది.

2020లో కేవలం 1000 మందికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతి లభించింది. ఆ ఏడాది కేవలం సౌదీ అరేబియాకు చెందిన వారికి మాత్రమే హజ్ యాత్రకు అవకాశం దక్కింది. ఇతర దేశాల వారికి హజ్ యాత్ర పై నిషేధం విధించారు.

2021లో భక్తుల సంఖ్య 60,000కు పెరగగా ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది మక్కా సందర్శించి హజ్ యాత్ర చేశారు.

అయితే, కరోనా ముందు మక్కాకు వెళ్లే సందర్శకులతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. 2019లో 25లక్షల మంది హజ్ యాత్రకు వెళ్లినట్లు స్టాస్టిక వెబ్ సైటు పేర్కొంది.

కాబా

ఫొటో సోర్స్, Getty Images

ఈ నల్లని రాయి ఏంటి?

కాబా గృహంలో ఈశాన్యం మూలలో పెట్టిన రాయి (బ్లాక్ స్టోన్)ని ఇస్లాంలో నల్లని రాయి అని అంటారు. దీనిని అరబిక్ భాషలో అల్- హజర్-అల్- అస్వద్ అని అంటారు.

కాబాను సందర్శించిన భక్తుల్లో కొందరు ఈ పవిత్ర రాయిని తాకుతారు, మరికొందరు ముద్దు పెట్టుకుంటారు. ఈ రాయి ఆదాము (ఆడమ్), హవ్వా (ఈవ్) కాలానికి చెందినవని నమ్ముతారు. భూమిపై పుట్టిన తొలి మానవులు వీళ్లేనని భావిస్తారు.

ఇస్లాం ఆవిర్భావానికి ముందు నుంచే ఈ రాయిని పవిత్రంగా భావించేవారు.

ఈ రాయి మొదట్లో తెల్లని వర్ణంలో ఉండేదని, కానీ, తనను తాకిన భక్తుల పాపాల భారాన్ని మోస్తూ ఈ రాయి నల్లగా అయిందని అంటారు.

ప్రార్ధన

ఫొటో సోర్స్, Getty Images

మక్కా

సౌదీ అరేబియాలోని మక్కా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరికీ పవిత్ర స్థలం. 4000 సంవత్సరాల క్రితం మక్కా జనావాసాలు లేని ఎడారి ప్రాంతంగా ఉండేది.

అల్లా ఆదేశాల ప్రకారం ప్రవక్త ఇబ్రహీం, ఆయన కుమారుడు ఇస్మాయిల్‌తో కలిసి మక్కాలో కాబా గృహాన్ని నిర్మించారని ముస్లింలు నమ్ముతారు.

ఆ తరువాత అక్కడి ప్రజలు క్రమక్రమంగా అనేక విగ్రహాలు పెట్టి, పూజించడం మొదలు పెట్టారు.

కొంతకాలం తర్వాత కాబా దగ్గర తనను మాత్రమే ఆరాధించేలా ఏర్పాట్లు చేయమంటూ మొహమ్మద్ ప్రవక్తను అల్లా ఆదేశించారని చెబుతారు.

క్రీ.శ. 628లో మొహమ్మద్ ప్రవక్త 1400 మంది అనుచరులతో కలిసి మక్కాకు వెళ్లారు. ఇస్లాం ప్రకారం ఇదే తొలి తీర్థ యాత్ర. దీనినే హజ్ యాత్ర అంటారు. ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తులు హజ్ యాత్రకు వెళతారు. ఇది ఇస్లాంలో చాలా ముఖ్యమైన భాగం.

ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వర్తించాల్సిన అయిదు బాధ్యతల్లో హజ్ యాత్ర ఒకటి. ఇస్లాంను ఆచరించేవారు తమ జీవిత కాలంలో కనీసం ఒకసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని చెబుతారు.

ఆర్థికంగా ఆరోగ్యం పరంగా బాగా ఉన్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్‌ యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసం.

మక్కాకు వెళ్లిన తర్వాత ముస్లింలు మస్జీద్ అల్ - హరామ్‌కు వెళ్లి ఏడు సార్లు కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసి అల్లాను ప్రార్థిస్తారు.

కాబా సందర్శన తర్వాత ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మదీనా

మదీనా

హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లే సందర్శకులు మదీనాకు కూడా వెళతారు. ఇది మక్కాకు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మదీనాలో మస్జీద్-ఈ-నబ్వీ ఉంది. ఇక్కడ భక్తులు ప్రార్ధనలు నిర్వహిస్తారు.

మదీనాకు ప్రయాణం చేయడం హజ్‌లో ముఖ్యమైన భాగం కాదు.

కానీ, మహమ్మద్ ప్రవక్త ఈ మసీదును కూడా నిర్మించారు. దీంతో, ముస్లింలందరూ కాబా తర్వాత మదీనాను అత్యంత పవిత్రంగా భావిస్తారు.

ఇక్కడ ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ సమాధి కూడా ఉంది. హజ్ యాత్రకు వెళ్లేవారు ఈ సమాధిని కూడా సందర్శిస్తారు.

వీడియో క్యాప్షన్, కర్నాటక: జై శ్రీరామ్ vs అల్లా హో అక్బర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)