కన్నయ్యలాల్: రాజీ కుదిరిన తర్వాత కూడా నిందితులు ఎందుకు హత్యకు పాల్పడ్డారు, ఈ కేసులో ఇంతకు ముందు ఏం జరిగింది?

కన్నయ్యలాల్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాక అంత్యక్రియల కోసం తరలిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున జనం వచ్చారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కన్నయ్యలాల్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాక అంత్యక్రియల కోసం తరలిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున జనం వచ్చారు

ఉదయ్‌పూర్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక టైలర్‌ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నామని రాజస్థాన్ పోలీసు అధికారులు చెప్పారు.

దర్యాప్తులో ఎవరి పేర్లు బయటకు వచ్చినా వారిని కూడా విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విపక్షాలు, ఈ ఘటనను పోలీసుల వైఫల్యంగా పిలుస్తున్నాయి. తనకు వస్తోన్న బెదిరింపుల గురించి కన్నయ్యలాల్ ముందే పోలీసులకు సమాచారం ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో కన్నయ్యలాల్‌కు బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తులకు మధ్య అంతకు ముందే సయోధ్య కుదిరిందని పోలీసులు చెబుతున్నారు.

ఉదయ్‌పూర్ ఘటన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరో నెల రోజుల వరకు 144 సెక్షన్‌ను విధించారు.

కన్నయ్యలాల్ మృతదేహాన్ని బుధవారం ఉదయం పోస్ట్‌మార్టం అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియల కోసం తరలిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు.

హత్య తర్వాత ఎలాంటి ఘటనలు జరగలేదని, పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని ఉదయ్‌పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ అన్నారు.

''నిందితులపై తగిన చర్యలు తీసుకుంటాం. ప్రజలందరూ చట్టంపై విశ్వాసం ఉంచాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రాష్ట్రంలో శాంతి వాతావరణమే ఉందని రాజస్థాన్ పోలీస్ అదనపు డీజీపీ దినేశ్ ఎంఎన్ బుధవారం అన్నారు.

మృతుడు కన్నయ్యలాల్ కుటుంబానికి నష్టపరిహారంగా రూ. 31 లక్షలు అందజేస్తామని ఉదయ్‌పూర్ డివిజనల్ కమిషనర్ రాజేంద్ర భట్ చెప్పారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్

దర్యాప్తు ప్రారంభం

అయితే, ఈ ఘటన మూలాలు చాలా లోతుగా ఉండొచ్చని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అభిప్రాయపడ్డారు. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఉదయ్‌పూర్‌కు ఇన్‌చార్జ్ మంత్రి చేరుకున్నారని ఆయన తెలిపారు.

''మంగళవారం రాత్రే సిట్‌ను ఏర్పాటు చేశాం. వెంటనే అది తన పని మొదలుపెట్టింది. సిట్ జైపూర్‌కు చేరుకున్న వెంటనే సమావేశం అవుతాం. హత్య చేసింది ఎవరు? వారి ప్రణాళిక ఏంటి? దీని వెనుక కుట్ర ఏంటి? దీనితో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు? జాతీయ- అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీల ప్రమేయం ఉందా? దర్యాప్తు తర్వాత ఈ విషయాలన్నింటిని వెల్లడిస్తాం’’ అని జోధ్‌పుర్‌లో మీడియాతో అశోక్ గహ్లోత్ అన్నారు.

‘‘దీన్నొక సాధారణ ఘటనగా మేం పరిగణించడం లేదు. ఏదో ఒక రాడికల్ ఎలిమెంట్ ప్రమేయం లేనిదే ఇలా జరగదని మా అనుభవం చెబుతోంది. అదే కోణంలో దర్యాప్తును ప్రారంభించాం'' అని ఆయన అన్నారు.

ఈ కేసులో అరెస్టులు ప్రారంభమైనట్లు రాజస్థాన్ మంత్రి సుభాష్ గార్గ్ చెప్పారు.

రాజస్థాన్ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రాజస్థాన్ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా

'' ఈ కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. 6 గంటల్లో పోలీసులు, నిందితులను పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఎస్‌ఓజీకి చెందిన ఏడీజీ అశోక్ రాథోడ్ పర్యవేక్షణలోని ఒక బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు'' అని గార్గ్ చెప్పారు.

మరోవైపు ఉదయ్‌పూర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ రాజస్థాన్ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా అన్నారు.

ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడి కుటుంబసభ్యులను కటారియా కలిశారు. ‘‘పోలీసులు ఆయనకు రక్షణ కల్పించి ఉండాల్సింది. తనకు భద్రత కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. నాలుగైదు రోజులు ఆయన దుకాణం తెరవలేదు. ఇది 100 శాతం పోలీసుల వైఫల్యమే'' అని కటారియా వ్యాఖ్యానించారు.

''నూపుర్ శర్మ వీడియోను ఆయన పిల్లలో లేదా మరెవరో షేర్ చేశారు. ఈ కారణంతో ఆయనపై కేసు పెట్టారు. అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు. ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకొని సయోధ్య కూడా కుదుర్చుకున్నారు. ఆ తర్వాత కూడా తనకు ప్రాణ హాని ఉందని భద్రత కల్పించాలని ఆయన పదే పదే కోరారు’’

‘‘నాలుగైదు రోజులు ఆయన షాపు కూడా మూసి ఉంది. తర్వాత ఆయన దుకాణం తెరిచినప్పుడైనా పోలీసులు ఆలోచించి ఉండాల్సింది. ప్రాణహాని ఉందని ఆయన చెప్పారు కాబట్టి ఆయనకు సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఉండాల్సింది. కచ్చితంగా ఇది యంత్రాంగం వైఫల్యమే'' అని ఆయన ఆరోపించారు.

రాజస్థాన్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) హవా సింగ్ ఘుమారియా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రాజస్థాన్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) హవా సింగ్ ఘుమారియా

రాజీపడ్డాక ఘటన జరిగిందన్న పోలీసులు

రాజస్థాన్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) హవా సింగ్ ఘుమారియా మంగళవారం నాటి ఘటన గురించి విలేఖరులకు వివరించారు.

''మహమ్మద్ ప్రవక్త కేసులో ఈ నెలలో కన్నయ్యలాల్‌పై ఒక ఫిర్యాదు నమోదు అయింది. తర్వాత ఆయనను అరెస్ట్ చేశాం. 10వ తేదీన మృతుడు కన్నయ్యపై ఒక కేసు నమోదు అయింది. మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను కన్నయ్యలాల్ మరింత ప్రచారం చేశాడంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని కేసు నమోదు చేశారు. కన్నయ్యలాల్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు నుంచి ఆయన బెయిల్ పొందారు’’

‘‘బెయిల్ పొందిన తర్వాత, తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని, భద్రత కల్పించాలంటూ రాతపూర్వకంగా కన్నయ్యలాల్ ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనను బెదిరించిన వారిని ఎస్‌హెచ్‌వో పిలిపించారు. ఇరు వర్గాలకు చెందినవారు ఏడుగురు చొప్పున పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చారు. ఇప్పుడు మాకు ఎలాంటి చర్యలు అక్కర్లేదు, మా మధ్య అపార్థాలు తొలిగిపోయాయని ఇరువర్గాల వారు అంగీకారానికి వచ్చారు. దీంతో ఇక ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’

‘‘ఆరోజు ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇలా ఎందుకు జరిగింది అనే కోణాన్ని మేం తెలుసుకుంటున్నాం'' అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)