Instagram: మీ సెల్ఫీ వీడియో చూసి వయసెంతో గుర్తు పట్టేస్తుంది.

వయసు నిర్ధారణకు ఇన్‌స్టాగ్రామ్ సెల్పీ వీడియో అడుగుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వయసు నిర్ధారణకు ఇన్‌స్టాగ్రామ్ సెల్పీ వీడియో అడుగుతోంది
    • రచయిత, లివ్ మెక్‌మహోన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీనేజ్ యువతీ యువకుల వయసును ధృవీకరించుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ కొత్త మార్గాలను వెతుకుతోంది. ఈ సోషల్ ప్లాట్‌ఫామ్‌ యూజర్లకు వయసు నిర్ధరణ అవసరం.

వీడియో సెల్ఫీల నుంచి ముఖాలను పరిశీలించి వారి వయసును నిర్ధరించుకునేలా సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తోంది. దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

13 సంవత్సరాలు దాటిన పిల్లల్లో కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ కోసం తమ వయసును తప్పుగా పేర్కొంటూ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిని నియంత్రించాలన్నది ఇన్‌స్టాగ్రామ్ ప్రయత్నం.

అమెరికాలో యువకులు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వయసును ధృవించేందుకు మూడు మార్గాలున్నాయి. ఒకటి వారి అధికారిక ఐడెంటిటీ కార్డును అప్‌లోడ్ చేయడం, రెండు-ముగ్గురు వయోజనులైన యూజర్ల నుంచి సాక్ష్యం ఇప్పించడం, మూడు- వీడియో సెల్పీని పంపడం. ఈ మూడింటిలో ఏదో ఒకటి అనుసరించక తప్పదు.

ఈ నిబంధనల ద్వారా వయసుకు తగిన అనుభవం ఉన్నవారినే యూజర్లుగా తీసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా వెల్లడించింది.

పిల్లల భద్రత విషయంలో ఈ టెక్ దిగ్గజంపై విమర్శలు రావడంతో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు తెరవడం సర్వసాధారణంగా మారింది (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు తెరవడం సర్వసాధారణంగా మారింది (ప్రతీకాత్మక చిత్రం)

ఫేస్‌బుక్ విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సిస్ హౌగెన్ ఆరోపణల తర్వాత ఈ యాప్‌లో ఫొటోలను షేర్ చేసుకునే విషయంలో లోపాలపై అమెరికాలోని పలు రాష్ట్రాలు గత సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్‌ను పరిశోధించాయి.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ చేపడుతున్న చర్యలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని చైల్డ్‌నెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, యూకేలో సేఫర్ ఇంటర్నెట్ సెంటర్ డైరెక్టర్ విల్ గార్డ్‌నర్ అన్నారు.

"పిల్లలకు సంబంధం లేని కంటెంట్‌ను వారికి దూరంగా ఉంచడంలో, వారి ఇంటర్నెట్ వాడకాన్ని వయసుకు తగిన విధంగా మార్చడంలో ఇలాంటివి ఉపయోగపడతాయి'' అని గార్డ్‌నర్ అన్నారు.

అయితే, ఇది కాలంచెల్లిన చర్య అని డిజిటల్ రంగంలో పిల్లల భద్రత కోసం పని చేసే 5రైట్స్ ఫౌండేషన్ వ్యాఖ్యానించింది.

''ఇది చూడవద్దు, అది చూడవద్దు అంటూ ప్లాట్‌ఫామ్ లు నిబంధనలు పెట్టటం వల్ల పిల్లలు వాటిపట్ల మరింత ఆసక్తి పెంచుకుని ప్రమాదంలో పడతారు. ఇప్పుడు వాళ్ల వయసు ఎంతో తెలుసుకోవడం ఒక్కటే సరిపోదు'' అని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, META

పిల్లల ఇన్‌స్టాగ్రామ్ వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఈ నెల ఆరంభం నుంచే అదనపు టూల్స్ ను అందుబాటులోకి తెచ్చింది ఇన్‌స్టాగ్రామ్.

వీటి ద్వారా పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ను చూసే టైమ్‌ను కంట్రోల్ చేయవచ్చు. పిల్లలు ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించవచ్చు.

ఎక్స్‌ప్లోర్ పేజిలో పిల్లలు ఒకే విషయాన్ని చూస్తున్నట్లు గమనిస్తే, వేరే కంటెంట్ చూడాల్సిందిగా వీటి ద్వారా ప్రోత్సహించవచ్చు. అలాగే, ఎక్కువ రీల్స్ చూస్తుంటే కాస్త బ్రేక్ తీసుకొమ్మని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పవచ్చు.

వీడియో క్యాప్షన్, చైనా సోషల్ మీడియా యూజర్ల ఆనందానికి బలవుతోన్న ఆఫ్రికన్ పిల్లలు

వీడియో సెల్ఫీలు, ఎండార్స్‌మెంట్‌లు

ఆన్‌లైన్ బ్యాంకింగ్ యాప్‌ల వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు యూజర్ల వయసు లేదా గుర్తింపును ధృవీకరించడానికి సెల్ఫీ వీడియోలు తీసుకోవడం కామన్ అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్ కూడా యూజర్ల అకౌంట్ లాక్ అయితే, వారి ఐడెంటిటీ ధృవీకరణకు ఒక మార్గంగా సెల్ఫీ వీడియోలను అడుగుతోంది.

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, META

వయస్సును ఎలా గుర్తిస్తారు?

యూకే డిజిటల్ ఐడీ ప్రొవైడర్ అయిన యోటి(Yoti) తో ఇన్‌స్టాగ్రామ్ పార్ట్‌నర్‌షిప్ కొనసాగిస్తోంది. దీని దగ్గరున్న సాంకేతికత మనిషి ముఖాన్ని బట్టి వయసును అంచనా వేస్తుంది.

తమ సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్ వ్యక్తుల ముఖాలను గమనించి వారి వయసును అంచనా వేయడం తప్ప, కస్టమర్ల గురించి మరేవిధమైన సమాచారాన్ని ఇవ్వలేవని యోటి సంస్థ చెబుతోంది.

గత ఏడాది మేలో విడుదలైన రిపోర్టు ప్రకారం, ఈ సాఫ్ట్‌వేర్ 6 నుంచి 12 సంవత్సరాలలోపు పిల్లల వయసును సుమారు ఏడాదిన్నర(1.36 ఏళ్లు) అటుఇటుగా అంచనా వేసింది.

అలాగే 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసుగల పిల్ల్లలను కూడా దాదాపు ఏడాదిన్నర(1.52ఏళ్లు) దగ్గరదగ్గరగా అంచనా వేసింది.

యూజర్ల వయసు నిర్ధారణ అయ్యాక ఈ వీడియోలను రెండు కంపెనీలు డిలీట్ చేస్తాయని మెటా పేర్కొంది.

వీటితోపాటు, ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ను వారి ఫాలోయర్లలో ముగ్గురి నుంచి వయసు ధృవీకరణకు సంబంధించి వెరిఫికేషన్ అడుగుతుంది

యూజర్ల వయసుపై వెరిఫికేషన్‌లో సాక్ష్యం ఇచ్చేవారు కూడా 18 సంవత్సరాలు నిండినవారై ఉండాలి. వాళ్లు మళ్లీ ఇతర యూజర్లకు సాక్ష్యం ఇవ్వలేరు.

Instagram

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తప్పుడు పుట్టిన తేదీలతో చాలామంది పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లు తెరుస్తున్నారు

సోషల్ మీడియాలో పిల్లలు సురక్షితమేనా?

కేవలం ఐడీ అప్‌లోడ్‌తో సరిపెట్టకుండా వయసు ధృవీకరణకు ఇతరుల నుంచి వెరిఫికేషన్ పద్ధతి అనుసరించడం స్వాగతించదగిన పరిణామమని యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్‌లోని డిజిటల్ మీడియా అండ్ సొసైటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ వైసాబెల్ గెరార్డ్ అన్నారు.

అయితే, ఇలా వయసు నిర్ధరణ అడగడం ద్వారా, వాళ్లు అసలు పెద్ద వయసు వారమంటూ ఎందుకు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో తెలుసుకునే అవకాశం లేకుండా పోతోందని ఆమె అన్నారు.

"చాలామంది తాము చెడ్డ పనులు చేయబోమని, చెడు కంటెంట్‌ను చూడబోమని, తమ వయసు 18 కంటే ఎక్కువంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌లు ఓపెన్ చేస్తున్నారు" అని గెరార్డ్ చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టిన వయసు నిర్ధరణ విధానాలపై గెరార్డ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటివల్ల పిల్లలు సురక్షితంగా ఉంటారా అని ఆమె సందేహం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, ఇతర మహిళలపై తనలో పుట్టే ఆకర్షణని ఆమె ఎప్పుడు తెలుసుకున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)