యుక్రెయిన్ యుద్ధం: వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతు తెలిపేందుకు నకిలీ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా?

ఈఆర్ యామిని

ఫొటో సోర్స్, ER Yamini

ఫొటో క్యాప్షన్, ఈఆర్ యామిని
    • రచయిత, జూలియానా గాగ్నాని, మేధావి అరోరా, సెరాజ్ అలీ
    • హోదా, వరల్డ్ సర్వీస్ డిస్‌ఇన్ఫర్మేషన్ టీమ్

భారత్‌కు చెందిన సోషల్ మీడియా ప్రముఖురాలు ఈఆర్ యామిని ఎప్పుడూ ట్విటర్ ఉపయోగించలేదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో మాత్రమే యాక్టివ్‌గా ఉంటారు.

అయితే, ఈ ఏడాది మార్చిలో ఆమె ఫోటోతో ఒక ట్వీట్ చేశారు. #IStandWithPutin అనే యాష్‌ట్యాగ్ పెడుతూ.. ఆమె అకౌంట్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేశారు. దీనిలో ఇద్దరు యువకులు హత్తుకుంటూ కనిపిస్తున్నారు. వీరిలో ఒకరిని భారత్, మరొకరిని రష్యాగా చూపించారు.

యుక్రెయిన్-రష్యా యుద్ధంలో తాను ఏ దేశానికీ మద్దతు ప్రకటించనని, ఆ ట్వీట్‌తో తన అభిమానులు ఏం అనుకుంటారోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘నా అభిమానులు ఆ ట్వీట్ చూస్తే, నా గురించి ఏం అనుకుంటారు? అసలు ఆ ట్వీట్ కోసం నా ఫోటోను ఉపయోగించకుండా ఉండాల్సింది’’అని ఆమె అన్నారు.

ట్విటర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్న నెట్‌వర్క్‌లో ఆ ఫేక్ అకౌంట్ కూడా ఒక భాగం. ఈ నెట్‌వర్క్ నుంచి మార్చి 2, 3 తేదీల్లో #IStandWithPutin, #IStandWithRussia హ్యాష్‌ట్యాగ్‌లతో భారీగా ట్వీట్లు చేశారు. భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, నైజీరియా లాంటి దేశాల్లో పుతిన్, రష్యాలకు మద్దతు తెలుపుతూ ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.

యామిని

ఫొటో సోర్స్, Twitter

అయితే, ఆ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్లు చేస్తున్న కొన్ని అకౌంట్లు వాస్తవమైనవే. వారు నిజంగానే రష్యా, పుతిన్‌లకు మద్దతు తెలుపుతున్నారు.

కానీ, చాలా అకౌంట్లు మాత్రం నకిలీవని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఆ నకిలీ ఖాతాల నుంచి పదేపదే ఆ ట్వీట్లు వచ్చాయి. వేరే ప్రొఫైల్స్‌లో తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలను ఆ నకిలీ ఖాతాలు ఉపయోగించుకున్నాయి.

‘‘బహుశా ఆ అకౌంట్లను బోట్‌లు సృష్టించి ఉండొచ్చు. అవి ఫేక్ ప్రొఫైల్స్. పుతిన్‌కు నకిలీ మద్దతు సృష్టించేందుకు వాటిని ఉపయోగించుకున్నారు’’అని డిస్‌ఇన్ఫర్మేషన్‌పై పరిశోధన చేపడుతున్న సీఏఎస్ఎం టెక్నాలజీ సంస్థ కౌ ఫౌండర్ కార్ల్ మిల్లర్ చెప్పారు.

మార్చి 2, 3 తేదీల్లో రష్యాకు మద్దతు తెలిపిన 9,907 ప్రొఫైల్స్‌ను కంపెనీ ట్రాక్ చేసింది. వీటిలో వెయ్యికిపైగా అకౌంట్లు స్పామ్‌ అని రుజువైంది.

అమెరికన్ ర్యాపర్ నిప్సీ హసల్ పేరుతో ఫేక్ ప్రొఫైల్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, అమెరికన్ ర్యాపర్ నిప్సీ హసల్ పేరుతో ఫేక్ ప్రొఫైల్

మరోవైపు బీబీసీ కూడా ఇలాంటి నకిలీ అకౌంట్లపై పరిశోధన చేపట్టింది. దీంతో మిల్లర్ చెప్పినట్లే ఆ అకౌంట్లు ఫేక్ అని రుజువైంది.

మేం కూడా రివర్స్ ఇమేజ్ సెర్చింగ్‌ను ఉపయోగించాం. దీంతో ఈ ప్రొఫైల్స్‌లో ఉపయోగించిన ఫోటోలను ప్రముఖుల ప్రొఫైల్స్‌ నుంచి తీసుకున్నట్లు తేలింది. నిజానికి తమ ఫోటోలను రష్యాకు మద్దతు తెలిపేందుకు ఉపయోగించుకుంటున్నట్లు ఆ ప్రముఖులకు తెలియదు.

అయితే, ఈ అకౌంట్లను ఎవరు సృష్టించారో మాకు స్పష్టంగా తెలియలేదు. వీటికి రష్యా ప్రభుత్వంతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయంలోనూ స్పష్టతలేదు.

ఉదాహరణకు ప్రెట్టీ శర్మ పేరుతో మాకు ఒక అకౌంట్ కనిపించింది. తను భారత్‌కు చెందిన మోడల్ అని ఆమె ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు తాను మయామిలో ఉంటున్నట్లు వివరించారు. అయితే, ఆ అకౌంట్‌ను ఫిబ్రవరి 26న మాత్రమే క్రియేట్ చేశారు. అంటే రష్యా దాడికి కేవలం రెండు రోజుల తర్వాత ఈ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ‘పుతిన్ చాలా మంచివారు’అని ఆ ప్రొఫైల్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది.

ఆ అకౌంట్‌లో కనిపిస్తున్న ప్రొఫైల్ ఫోటో ఆస్రేలియాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నికోల్ థార్న్‌ది. ఆమెకు ఇన్‌స్టాలో 15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకు ట్విటర్ అకౌంట్ కూడా ఉంది.

ఆస్ట్రేలియాకు చెందిన యువతి ఫోటోతో ఫేక్ ప్రొఫైల్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాకు చెందిన యువతి ఫోటోతో ఫేక్ ప్రొఫైల్

మరోవైపు భారత గాయకుడు రాజా గుజ్జర్ పేరుతో మరో అకౌంట్ మాకు కనిపించింది. ఫిబ్రవరి 24న ఆ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఆ రోజే రష్యా దాడి మొదలైంది. ఆ తర్వాత మొత్తంగా 178 పోస్టులు ఆ అకౌంట్ నుంచి వచ్చాయి. ఇవి ఆటోమేటిక్‌ ట్వీట్లలా కనిపించాయి.

అటు థార్న్, ఇటు గుజ్జర్ ఇద్దరినీ బీబీసీ సంప్రదించింది. ఆ అకౌంట్లు తమవి కావని ఇద్దరూ ధ్రువీకరించారు. ఇవి చూడటానికి బోట్‌ల సాయంతో క్రియేట్‌చేసిన అకౌంట్లలా కనిపిస్తున్నాయి.

గాయకుడు రాజు గుజ్జర్ పేరుతో ఫేక్ ప్రొఫైల్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, గాయకుడు రాజు గుజ్జర్ పేరుతో ఫేక్ ప్రొఫైల్

ఒక ప్రొఫైల్‌ను ఫిబ్రవరి 2022లో క్రియేట్ చేశారు. మార్చి 2 నుంచి దీని నుంచి వరుస ట్వీట్లు వచ్చాయి. దీనికి ఎలాంటి ఫాలోవర్లు లేరు. ఈ అకౌంట్ ప్రొఫైల్ ఫోటోను రివర్స్ సెర్చ్ చేశాం. దీంతో భారత్‌కు చెందిన ఒక యువకుడి లింకిడ్ ఇన్ ప్రొఫైల్ ఫోటో అది.

అయితే, ఆ అకౌంట్ వాస్తవమైనదే. దాన్ని ఏరోనాటికల్ ఇంజినీర్ సెంథిల్ కుమార్ క్రియేట్ చేశారు. రష్యాకు మద్దతు తెలిపేందుకు ఆ అకౌంట్‌ను ఎందుకు క్రియేట్ చేశారని మేం ఆయన్ను ప్రశ్నించాం.

‘‘సాధారణంగా ట్విటర్‌లో ఏం ట్రెండ్ అవుతుందో నేను చూస్తుంటాను. ఆ రోజు పుతిన్ పేరు ట్రెండ్ అవుతోంది. దీంతో ఆ ట్వీట్‌ను నేను రీట్వీట్ చేశాను’’అని ఆయన చెప్పారు. ‘‘గతంలో భారత్‌కు రష్యా మద్దతు పలికింది. అందుకే మనం ఇప్పుడు రష్యాకు మద్దతు పలకాలి’’అని ఆయన వివరించారు. ఆయన ప్రొఫైల్ కొత్తదే. అయితే, పాత అకౌంట్ పాస్‌వర్డ్ మరచిపోవడం వల్లే కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేశానని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, 2,000 కి.మీ. కఠిన ప్రయాణం చేసిన యుక్రెయిన్ యువతి కథ

పశ్చిమ దేశాలే లక్ష్యంగా

ఫేక్ ప్రొఫైల్స్ నుంచి వస్తున్న ట్వీట్లలో ఎక్కువగా పశ్చిమ దేశాలపై విమర్శలు చేస్తున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) కూటమికి సంఘీభావం తెలపడంతోపాటు పుతిన్‌కు కూడా నేరుగా మద్దతు ప్రకటిస్తున్నారు.

‘‘పశ్చిమ దేశాలే లక్ష్యంగా ఆ అకౌంట్ల నుంచి ట్వీట్లు వస్తున్నాయి. అయితే, నేరుగా పశ్చిమ దేశాల పేరును వాటిలో ప్రస్తావించడం లేదు’’అని మిల్లర్ చెప్పారు.

ఫేక్ ప్రొఫైల్

ఫొటో సోర్స్, Twitter

ఎందుకు వీటిని నకిలీ అకౌంట్లుగా భావిస్తున్నారనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘‘రోజులో 24 గంటలూ ఈ అకౌంట్ల నుంచి ట్వీట్లు వస్తున్నాయి. భిన్న అంశాలపై ట్వీట్లు చేస్తున్నారు. ఈ అకౌంట్లు చాలా అసాధారణంగా ఉంటున్నాయి’’అని ఆయన వివరించారు.

‘‘విడివిడిగా చూసినప్పుడు ఈ అకౌంట్లలో అంతా సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తోంది. కానీ, అంతా కలిపి చూసినప్పుడు ఏదో తప్పు జరుగుతున్నట్లు తెలుస్తుంది’’అని ఆయన పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఫేక్ న్యూస్‌ ఎక్కడ కనిపించినా ఆమె అలా పసిగట్టేస్తారు...

నకిలీ ప్రొఫైల్ ఫోటోలు కూడా ఫేక్ ప్రొఫైల్స్‌కు ఒక సంకేతంగా చెప్పవచ్చని ఆయన అన్నారు.

సీఏఎస్ఎం ట్రాక్‌చేసిన వంద అకౌంట్లలో 41 అకౌంట్లకు అసలు ప్రొఫైల్స్ ఫోటోలు లేనట్లు బీబీసీ గుర్తించింది. మరో 30 అకౌంట్లకు పుతిన్, ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌ బర్గ్ లాంటి ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి. కేవలం నాలుగో వంతు ప్రొఫైల్స్‌కు మాత్రమే సాధారణ ఫోటోలు కనిపించాయి. వీటిలో నకిలీ ఫోటోలు కూడా ఉన్నాయి.

ఇలా ఇతరులు, సంస్థల ప్రొఫైల్స్ ఫోటోలను తమ ఫోటోలుగా పెట్టడానికి ట్విటర్ నిబంధనలు అంగీకరించవు.

యుద్ధం మొదలైన తర్వాత అలాంటి లక్షకుపైగా అకౌంట్లను తాము తొలగించినట్లు ట్విటర్ వెల్లడించింది. #IStandWithRussia, #IStandWithPutin లాంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్లు చేసిన అకౌంట్లు కూడా అలా తొలగించిన అకౌంట్లలో ఉన్నట్లు పేర్కొంది.

సీఏఎస్‌ఎం పరిశోధించిన అకౌంట్లను తాము కూడా పరిశీలిస్తున్నట్లు ట్విటర్ స్పష్టంచేసింది. వీటిలో బీబీసీ పరిశోధన చేపట్టిన ఇతరుల ప్రొఫైల్ ఫోటోలతో సృష్టించిన అకౌంట్లు కూడా ఉన్నాయి. బీబీసీ పంపిన 12 అకౌంట్లలో 11 అకౌంట్లను ట్విటర్ తొలగించింది.

అయితే, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఒక వర్గానికి కృత్రిమంగా మద్దతు పలికేలా భారీగా ప్రయత్నాలు జరిగినట్లు తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని ట్విటర్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)