జైలులోని పురుష ఖైదీ, మహిళా గార్డు అదృశ్యం.. ఆచూకీ చెప్పిన వారికి రూ.ఏడు లక్షల బహుమతి

కేసీ వైట్, విక్కీ వైట్

ఫొటో సోర్స్, Lauderdale County Sheriff's Office

ఫొటో క్యాప్షన్, ఖైదీ కేసీ వైట్ (ఎడమ), జైలు అధికారి విక్కీ వైట్ (కుడి) శుక్రవారం నుంచి కనిపించకుండాపోయారు

అమెరికాలో హత్య అభియోగాలతో జైలులో ఉన్న ఒక పురుష ఖైదీ తప్పించుకుపోయాడు. అతడితో పాటు.. జైలు మహిళా గార్డు ఒకరు అదృశ్యమయ్యారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కేసీ వైట్ అనే ఖైదీ, జైలు అధికారి విక్కి వైట్.. చివరిసారిగా గత శుక్రవారం ఉదయం అలబామాలోని లాడర్‌డేల్ కౌంటీ షరీఫ్ ఆఫీస్‌లో కనిపించారు.

ఖైదీ కేసీ వైట్‌ని మానసిక పరిస్థితి తనిఖీ కోసం తాను తీసుకెళుతున్నట్లు గార్డు విక్కి వైట్ చెప్పి తనవెంట తీసుకెళ్లారు. అయితే.. ఆ తనిఖీ షెడ్యూలులో లేదని జైలు అధికారులు తర్వాత గుర్తించారు.

ఖైదీ తప్పించుకోవటానికి గార్డు విక్కీ వైట్ సాయం చేశారా? లేదంటే ఆమెను ఆ ఖైదీ కేసీ వైట్ బందీగా పట్టుకున్నాడా? అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

వీరిద్దరి ఇంటి పేర్లు కలుస్తున్నప్పటికీ వీరికి ఎలాంటి బంధుత్వం లేదు. జైలు గార్డు విక్కీ వైట్‌ దగ్గరున్న గన్ ఇప్పుడు కేసీ వైట్‌ చేతికి వచ్చి ఉండవచ్చునని.. కాబట్టి అతడిని సాయుధుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించాలని అధికారులు చెప్తున్నారు.

కేసీ వైట్

ఫొటో సోర్స్, Lauderdale County Sheriff's Office

ఫొటో క్యాప్షన్, ఖైదీ కేసీ వైట్ ఇటీవలి ఫొటోను జైలు అధికారులు మీడియాకు విడుదల చేశారు

లాడర్‌డేల్ కౌంటీ షరీఫ్ రిక్ సింగిల్టన్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. జైలు గార్డు విక్కీ వైట్ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు డిటెన్షన్ సెంటర్ నుంచి ఖైదీని తీసుకుని బయటకు వెళ్లారని తెలిపారు. అతడిని మానసిక ఆరోగ్య తనిఖీ కోసం కోర్ట్‌హౌస్ వద్ద దింపుతానని ఆమె తన సహోద్యోగులతో చెప్పారని వివరించారు.

అలాగే తనకు కాస్త నలతగా అనిపిస్తోందని, తాను కూడా ఆస్పత్రికి వెళ్లాల్సి ఉందని ఆమె తోటి అధికారులకు చెప్పినట్లు షరీఫ్ సింగిల్టన్ తెలిపారు.

అదే రోజు ఉదయం 11:00 గంటలు దాటాక ఆమె వాహనం ఒక షాపింగ్ సెంటర్ కార్ పార్కింగ్‌లో పార్క్ చేసి కనిపించిందన్నారు.

ఆ ఖైదీని తిరిగి కస్టడీకి అప్పగించలేదని మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో గుర్తించారు. అతడిని తీసుకెళ్లిన విక్కీ వైట్‌ని ఎవరూ కాంటాక్ట్ చేయలేకపోయారు.

కేసీ వైట్‌ను పట్టుకోవటానికి, విక్కీ వైట్ ఆచూకీ తెలుసుకోవటానికి వీలయ్యే సమాచారం అందించిన వారికి 10,000 డాలర్లు (దాదాపు 7లక్షల 65వేల రూపాయలు) బహుమతి ఇస్తామని అమెరికా మార్షల్స్ సర్వీస్ ప్రకటించింది.

''జైలు అధికారి విక్కీ వైట్‌కు, ప్రజలకు ఖైదీ కేసీ వైట్‌ నుంచి పెను ప్రమాదం ఉందని భావిస్తున్నాం'' అని అమెరికా మార్షల్ మార్టీ కీలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఈ జైలులోని ఖైదీలు వజ్రాలకు సానబెడుతూ నెలకు 12 వేలు సంపాదిస్తున్నారు

'విశిష్టమైన ఉద్యోగి'

విక్కీ వైట్ జైలు అధికారిగా దాదాపు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని షరీఫ్ సింగిల్టన్ తెలిపారు. జైలు విభాగానికి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఖైదీలను కోర్టుహౌస్‌కు తరలించటం ఆమె విధుల్లో భాగం.

ఖైదీ కేసీ వైట్‌ను తానే ఒంటరిగా కోర్టుహౌస్‌కు తీసుకెళ్లాలన్న ఆమె నిర్ణయం.. నిబంధనలను ఉల్లంఘించటమేనని షరీఫ్ సింగిల్టన్ వివరించారు. హత్య వంటి తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తరలించటానికి సాధారణంగా ఇద్దరు డిప్యూటీలు కలిసి వెళతారని చెప్పారు.

''ఆమె అదృశ్యం కావటం, ఇలా జరగటం ఆఫీస్‌లో ప్రతి ఉద్యోగినీ దిగ్భ్రాంతికి గురి చేసింది'' అన్నారాయన.

విక్కీ వైట్‌ 'విశిష్టమైన ఉద్యోగి' అని పలుమార్లు ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్‌గా కూడా ఎంపికయ్యారని షరీఫ్ సింగిల్టన్ తెలిపారు.

విక్కీ వైట్ ఏదైనా తప్పు చేశారని ఆరోపించే ముందు అందుకు బలమైన ఆధారం కావాలన్నారు.

''అతడు తప్పించుకోవటానికి ఆమె సహాయం చేశారా? అది సాధ్యం కావచ్చు. కాబట్టి దర్యాప్తులో ఈ అంశాన్ని ఒక కోణంగా పరిశీలిస్తున్నాం. కోర్టుహౌస్‌కు వెళ్లే దారిలో ఆమెను కిడ్నాప్ చేశారా? అంటే.. ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా నిర్బంధించి తీసుకెళ్లారా? అది కూడా మేం పరిశీలిస్తున్న మరో కోణం'' అని చెప్పారాయన.

''ఆ ఖైదీ గురించి తెలుసు కనుక.. పరిస్థితులు ఎలాంటివైనా కానీ ఆమె ప్రమాదంలో ఉన్నారని నేను భావిస్తున్నా'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)