ఉత్తర్ ప్రదేశ్: తొలి రోజు ఉద్యోగానికి వెళ్లి గోడపై శవంగా కనిపించిన నర్సు, గ్యాంగ్ రేప్ చేశారంటూ ఆరోపణలు

అత్యాచారం
    • రచయిత, రవి
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 18ఏళ్ల నర్సు శవం ఓ ఆసుపత్రి గోడకు వేలాడుతూ కనిపించింది.

తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులపై ఆరోపణలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఆసుపత్రిని కూడా సీల్ చేశారు.

న్యూ జీవన్ ఆసుపత్రిలో బాధితురాలు ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఈ ఘటన జరిగింది. మరోవైపు ఆ ఆసుపత్రిని కూడా బాంగర్మవూలోని దుల్లాపురవాలో ఐదు రోజుల కిందటే ప్రారంభించారు.

ఏప్రిల్ 25న స్థానిక ఎమ్మెల్యే ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ప్రాంతానికి సమీప గ్రామంలో బాధితురాలు ఉండేవారు.

అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

కుటుంబం ఏం చెబుతోంది?

‘‘శుక్రవారం సాయంత్రం ఆమె ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ రోగులు ఎవరూ లేరు. సాయంత్రం తను ఇటీవల అద్దెకు తీసుకున్న గదికి ఆమె వచ్చేసింది. అయితే, రాత్రి పది గంటలకు ఆమె మళ్లీ ఆసుపత్రికి రావాలని ఫోన్ వచ్చింది. ఆమె వెంటనే వెళ్లింది, అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు’’ అని బాధితురాలి కుటుంబ సభ్యులు ఒకరు చెప్పారు.

సమాచారం అందుకున్న వెంటనే, బాధితురాలి తల్లి ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు ఆసుపత్రి గోడకు వేలాడుతున్న తన కుమార్తె మృతదేహం కనిపించింది.

‘‘శనివారం ఉదయం ఆసుపత్రి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని వారు చెప్పారు. వెంటనే నేను ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ ఒక గోడకు మా అమ్మాయి మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ ఆసుపత్రిలో ఉద్యోగం కోసం మూడు రోజుల క్రితమే మా అమ్మాయి ఇక్కడికి సమీపంలో ఒక గదిని అద్దెకు తీసుకుంది’’అని ఆమె చెప్పారు.

‘‘మాకు ఎనిమిది మంది కుమార్తెలు. ప్రస్తుతం మరణించిన ఆమె నాకు నాలుగో కూతురు. ఆమెకు ముగ్గురు అక్కలు ఉన్నారు. వారూ ఉద్యోగాలు చేస్తున్నారు. పదేళ్ల క్రితం నా భర్త చనిపోయారు. అప్పటినుంచి మా అమ్మాయిలే ఇంటిని చూసుకుంటున్నారు’’ అని ఆమె వివరించారు.

ఇప్పుడు చనిపోయిన అమ్మాయి కూడా సొంతంగానే చదువుకుని నర్సు అయ్యారని ఆమె తల్లి తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్: ఉన్నావ్‌లో ఆస్పత్రి గోడకు శవమై వేలాడుతూ కనిపించిన నర్సు

పోలీసులు ఏం చెబుతున్నారు

బాధితురాలి గ్రామానికి ఈ ఆసుపత్రికి మధ్య 15 కి.మీ. దూరం ఉంటుందని ఉన్నావ్ ఏఎస్‌పీ శశి శేఖర్ చెప్పారు. దూరం ఎక్కువగా ఉండటంతో ఆమె ఆసుపత్రికి పరిసరాల్లో ఒక గదిని అద్దెకు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

‘‘ఆ అమ్మాయి ముఖానికి మాస్క్ ఉంది. ఆమె చేతుల్లో ఒక వస్త్రం కనిపించింది. ఆ వస్త్రం ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నాం. ప్రస్తుతం ఆసుపత్రిని సీల్ చేశాం’’అని ఆయన చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి అత్యాచారం, హత్య ఆరోపణలపై ముగ్గురి మీద కేసు నమోదు చేసినట్లు బాంగర్మవూ ఇన్‌స్పెక్టర్ బ్రిజేంద్ర నాథ్ శుక్లా వెల్లడించారు.

‘‘ఘటనపై మాకు సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లాం. అక్కడే మాకు ముగ్గురు నిందితులు కనిపించారు’’ అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ‘న్యాయం జరిగితే సరిపోదు, వివక్ష చూపే మగాళ్ల స్వభావం మార్చాలి’

బాధితురాలి మృతదేహానికి ఇద్దరు వైద్యులు శవపరీక్షలు నిర్వహించారని, ఈ పరీక్షలను వీడియోగా రికార్డ్ చేశారని అధికారులు తెలిపారు. ఉరి తీయడం వల్లే బాధితురాలు మరణించినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలిందని వెల్లడించారు.

అయితే, అత్యాచారం జరిగిందో లేదో తెలుసుకునేందుకు బాధితురాలి నమూనాలు లఖ్‌నవూలోని ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.

మృతదేహానికి సమీపంలో తమకు మరికొన్ని మాస్క్‌లు కూడా దొరికాయని చెప్పారు.

మరోవైపు ఈ ఆసుపత్రి ప్రమాణాలు పాటించడంలేదని తమ దర్యాప్తులో తేలినట్లు ఉన్నావ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్య ప్రకాశ్ చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ ఆసుపత్రి మూసే ఉంచుతామని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)