నెల్లూరు టూరిజం శాఖలో మహిళా ఉద్యోగినిపై దాడి... జుట్టు పట్టుకుని కొట్టిన అధికారి అరెస్ట్

దాడి చేస్తున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ అధికారి పేరు సి భాస్కర్
ఫొటో క్యాప్షన్, దాడి చేస్తున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ అధికారి పేరు సి భాస్కర్
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా టూరిజం శాఖలో ఓ అధికారి స‌హోద్యోగినిపై దాడి చేస్తున్న‌ట్లు క‌నిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ దృశ్యాల్లో క‌నిపిస్తున్న అధికారి పేరు సి భాస్కర్. ఏపీ టూరిజం డిపార్ట్ మెంట్ నెల్లూరు డివిజన్ డిప్యూటీ మేనేజర్‌గా ఆయ‌న ప‌నిచేస్తున్నారు. ఆయ‌న వ్యవహారం పట్ల ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు.

బాధితురాలి ఫిర్యాదుపై ఆయ‌న మీద‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మ‌రోవైపు, ఆయ‌నను విధుల నుంచి స‌స్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

దాడి ఎందుకు జరిగింది..

క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న‌ల న‌డుమ‌ ఏపీ టూరిజం నెల్లూరు డివిజన్ పరిధిలో ఉన్న హోటల్‌ను ఇటీవల క్వారంటైన్ సెంటర్‌గా మార్చారు. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచేందుకు ఈ హోటల్ఉపయోగిస్తున్నారు.

అక్కడే ఉన్న కార్యాలయంలో డిప్యూటీ మేనేజర్‌గా సి భాస్కర్ బాధ్యతల్లో ఉండగా, కాంట్రాక్ట్ పద్దతిలో సీనియర్ అసిస్టెంట్ హోదాలో సీహెచ్ ఉషారాణి పనిచేస్తున్నారు.

ఆమె వికలాంగురాలు కావడంతో చాలాకాలంగా ఆమెపై అధికారిగా ఉన్న భాస్కర్ వేధింపులకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని నెల్లూరు డీఎస్పీ శ్రీనువాసుల రెడ్డి బీబీసీకి తెలిపారు.

భాస్కర్‌ను స‌స్పెండ్ చేస్తున్నట్టు ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఫొటో క్యాప్షన్, భాస్కర్‌ను స‌స్పెండ్ చేస్తున్నట్టు ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

"ఈ నెల 27న బాధితురాలు విధి నిర్వహణలో ఉండగా భాస్కర్ అక్కడికి వచ్చారు. మాస్కు పెట్టుకోవాల‌ని ఆమె సూచించ‌డంతో ఆయ‌న ఆగ్రహించి దాడికి పాల్పడినట్టు మా విచారణలో తేలింది" అని శ్రీనివాసుల రెడ్డి వివ‌రించారు.

"అంతకుముందు చాలా కాలంగా ఆమె అంగవైకల్యం మీద చిన్నచూపుతో భాస్కర్ పదే పదే కామెంట్స్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కింది స్థాయి కాంటాక్ట్ ఉద్యోగి తనను నిలదీయడంతో సహించలేక ఆయ‌న ఆగ్రహించినట్టు భావిస్తున్నాం. జుట్టు పట్టుకుని దాడికి పాల్పడుతూ, అక్కడ అడ్డుకున్న ఇతర సిబ్బందిని కూడా గాయపరిచే ప్రయత్నం చేసినట్టు మా దృష్టికి వచ్చింది."

"సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ జ‌రిగింది. ఘటన జరిగిన తర్వాత మాకు ఫిర్యాదు అందింది. విచారణ చేసి నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశాం. క్రైమ్ నెంబర్ 362 2020 కింద కేసు నమోదయ్యింది. ఆఫీసులోని ఇతర ఉద్యోగులను కూడా విచారించాం. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 324, 353, 354 తో పాటుగా వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 95 కింద కూడా కేసు నమోదయ్యింది. కరోనా టెస్టుల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాము. రిపోర్ట్ రాగానే కోర్ట్ ముందు హాజరుపరుస్తాం"

స‌స్పెండ్ చేసిన టూరిజం శాఖ

నెల్లూరు టూరిజం కార్యాలయంలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. భాస్కర్‌ను స‌స్పెండ్ చేస్తున్నట్టు ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

"బాధ్యత గల అధికారి నిబంధనలు ఉల్లంఘించారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. డిపార్ట్‌మెంట్‌ నిబంధనావళి ఉల్లంఘించినందుకు మేం స‌స్పెండ్ చేస్తున్నాం.ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలుంటాయి"అని బీబీసీతో ప్ర‌వీణ్ కుమార్ చెప్పారు.

"ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా స్పందించారు. శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ నిబంధనావళి రూల్ 10 ప్రకారం చర్యలు తీసుకున్నాం"

"మాస్కు పెట్టుకోవాల‌ని సూచించ‌డంతో ఆగ్రహించి దాడికి పాల్పడినట్టు విచారణలో తేలింది"
ఫొటో క్యాప్షన్, "మాస్కు పెట్టుకోవాల‌ని సూచించ‌డంతో ఆగ్రహించి దాడికి పాల్పడినట్టు విచారణలో తేలింది"

సస్పెన్షన్ సరిపోదు అంటున్న ప్రతిపక్ష నేతలు

ఘ‌ట‌న‌పై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మానవ మృగాలు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందంటూ ఆయ‌న ప్రశ్నించారు. బాధితుల‌కు 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చ‌ట్టం ఎక్క‌డా అంటూ ఆయన ట్వీట్ చేశారు.

"మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పాల‌కులే ప్ర‌తీకారంతో చెలరేగిపోతుంటే.. కొంద‌రు అధికారులు అదే పంథాలో అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నెల్లూరు ఏపి టూరిజం కార్యాలయంలో మాస్కు పెట్టుకోమన్న దివ్యాంగురాలైన ఓ మ‌హిళా ఉద్యోగిని అత్యంత దారుణంగా హింసించిన‌ డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌ను స‌స్పెండ్ చేసి చేతులు దులుపుకోవ‌టం కాదు. క‌ఠినంగా శిక్షించాలి."

కాంట్రాక్ట్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఏపీ టూరిజం డిపార్ట్ మెంట్ కాంట్రాక్ట్ అండ్ మ్యాన్‌ప‌వర్ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వర రావు కోరుతున్నారు.

"నెల్లూరు ఘటనను సీరియస్‌గా తీసుకోవాలి. కేవలం స‌స్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఇలాంటి పరిస్థితి మరో చోట ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాంట్రాక్ట్ సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలి"అని ఆయ‌న‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)