నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?

ఫొటో సోర్స్, Reuters
భారతదేశం.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో మహిళలకు తగిన భద్రత లేదన్నది అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ మాట. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారత్ తొలిస్థానంలో నిలిచినట్లు తాజా నివేదికలో తెలిపింది. ఇందులో నిజమెంత?
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిత్యం రక్తపాతం, హింస చోటుచేసుకునే అఫ్గానిస్తాన్, సిరియా, సోమాలియా వంటి దేశాలు భారత్ తరువాత ఉండటం.
ఏడు సంవత్సరాల కిందట ఇటువంటి సర్వేలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, Reuters
తీవ్ర విమర్శలు
భారత్‌లో ఈ నివేదికపై అనేక విమర్శలు వచ్చాయి. అసలు మహిళలకు స్వేచ్ఛ లేని అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు భారత్ కంటే మెరుగ్గా ఎలా ఉన్నాయనే ప్రశ్న వినిపిస్తోంది.
భారత జాతీయ మహిళా కమిషన్ ఈ నివేదికను కొట్టిపారేసింది. మహిళలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వని దేశాలకు మెరుగైన ర్యాంకింగ్ ఎలా వస్తుందని ప్రశ్నించింది.
ఇటువంటి సర్వేలతో భారతదేశ ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నిస్తున్నట్లు భారత మహిళా, శిశు సంక్షేమశాఖ ఆరోపించింది. ఇటీవల కాలంలో దేశం సాధించిన పురోగతిని పట్టించుకోవడం లేదంటూ ఒక ప్రకటనలో విమర్శించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
నివేదికకు ప్రాతిపదిక ఏమిటి?
ఆయా రంగాలకు చెందిన 548 నిపుణులు అభిప్రాయాల ఆధారంగా థామ్సన్ రాయిటర్స్ ఈ నివేదికను రూపొందించింది. విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, ఆరోగ్యసంరక్షణ కార్యకర్తలు వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో 41 మంది భారతదేశానికి చెందిన వారని థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ అధిపతి మోనిక్ విల్లా, బీబీసీ వరల్డ్ సర్వీస్‌తో చెప్పారు. అయితే ఇతర నిపుణులు ఏ దేశస్తులో స్పష్టంగా తెలియడం లేదు. 759 మందిని సర్వే చేయగా 548 మంది మాత్రమే అభిప్రాయాలు వెల్లడించినట్లు నివేదిక చెబుతోంది. ఆ నిపుణులు ఎవరో వారి వివరాలు అందుబాటులో లేవు.
నిపుణుల విషయంలో పారదర్శకత లేదని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) డైరెక్టర్ సంజయ్ కుమార్ అంటున్నారు. నిపుణులను ఏ ప్రాతిపదికన ఎంచుకున్నారు? వారిలో మహిళలు ఎంత మంది? ఎక్కడి వారు? వంటి విషయాలు ఎంతో ముఖ్యం. కానీ అటువంటి సమాచారం ఏదీ అందుబాటులో లేదని సంజయ్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
‘ఒక హెచ్చరిక’
మరోవైపు సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ రూపా రేఖా వర్మ మాత్రం థామ్సన్ రాయిటర్స్ నివేదికను ఆహ్వానిస్తున్నారు. ఈ నివేదిక చెబుతున్న విషయాలు తనకు ఇబ్బందికరంగా ఏమీ లేవని, పైగా ఇది మనకు ఒక హెచ్చరిక లాంటిదని ఆమె అంటున్నారు. "కచ్చితమైన గణాంకాలు, సమాచారంతో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సింది. అయినా 500 మంది నిపుణులు చెబుతున్నారంటే కచ్చితంగా ఆలోచించాలి" అని రూపా అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'అభిప్రాయాల'తో నివేదికలు తయారు చేయడం సరైనదేనా?
అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని నివేదికలు తయారు చేయడం సరికాదని సంజయ్ కుమార్ అన్నారు. "గణాంకాలు లభిస్తున్నప్పుడు, అవి నమ్మదగినవి అయినా కాకపోయినా వాటి మీదనే ఆధారపడాలి. ఒకవేళ గణాంకాలు అందుబాటులో లేకుంటే అభిప్రాయాలు తీసుకోవాలి" అని ఆయన చెబుతున్నారు.
ప్రస్తుతం థామ్సన్ రాయిటర్స్ నివేదిక కోసం నిపుణులతో నేరుగా మాట్లాడటంతోపాటు ఆన్‌లైన్, ఫోన్‌ల ద్వారా ఇంటర్వ్యూలు చేసినట్లు ఆయన తెలిపారు. "ఇక్కడ తమ సౌకర్యం కోసం రాయిటర్స్ ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. మరింత వివరణలు లేనందు వల్ల కచ్చితత్వం ప్రశ్నార్థకరంగా మారుతోంది. సర్వేలు చేయడానికి ఇది సరైన పద్ధతి కాదు" అని సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Emmanuel dunand/afp/getty images

'పరిస్థితి అంత మెరుగ్గా లేదు'
కరస్పాండెంట్ విశ్లేషణ: గీతా పాండే, బీబీసీ న్యూస్, దిల్లీ
థామ్సన్ రాయిటర్స్ నివేదికలోని విశ్వసనీయతను ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. వాస్తవంగా చూస్తే మహిళల విషయంలో భారత్ పెద్దగా గర్వించాల్సిన పరిస్థితులు కూడా కనిపించడం లేదు. 2016 అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతున్నారు. రోజుకో మహిళను సామూహికంగా అత్యాచారం చేస్తున్నారు. ప్రతి 69 నిమిషాలకు ఒక మహిళను కట్నం కోసం చంపేస్తున్నారు. నెలకు 19 మందిపై యాసిడ్ దాడి జరుగుతోంది. వీటికి అదనంగా లైంగిక వేధింపులు, గృహహింస వంటి కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి.
అయితే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ భారత్ ప్రజాస్వామిక దేశం. నాకు తెలిసిన చాలా మంది మహిళలు ఇక్కడ ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. పూర్తి హక్కులను కలిగి ఉన్నారు. అఫ్గానిస్తాన్, సిరియా, సౌదీ అరేబియా వంటి దేశాలలోని మహిళలు, భారతదేశంలో మహిళలు పొందుతున్న స్వేచ్ఛను కలలో కూడా ఊహించుకోలేరు. నిన్నమొన్నటి దాకా వాహనాలు నడిపితే జైలులో వేసే కఠిన చట్టాలు సౌదీ అరేబియాలో ఉన్నాయి. భారత్‌ను సిరియాతో పోల్చడమంటే కుక్కను, నక్కను ఒకే గాటన కట్టినట్లే.
మరి ఈ సర్వేకు విలువ లేదా? అంటే పూర్తిగా లేదని చెప్పలేం. ప్రజల దృక్పథం కూడా ఎంతో ముఖ్యం. నివేదికను పూర్తిగా వ్యతిరేకించేకంటే, ఈ దేశం మహిళలకు ప్రమాదకరం కాదని ప్రపంచానికి చాటి చెప్పేలా మహిళల భద్రత కోసం తీసుకోవాల్సిన మెరుగైన చర్యలపై దృష్టి పెట్టాలి.


ఫొటో సోర్స్, Reuters
'ర్యాంకింగ్ ముఖ్యం కాదు'
ర్యాంకింగ్ ముఖ్యం కాదని, సర్వేని సరైన దృక్పథంతో అర్థం చేసుకోవాలని మహిళా కార్యకర్త జకియా సోమన్ అంటున్నారు. రాయిటర్స్ అభిప్రాయాలు కోరిన నిపుణుల్లో జకియా ఒకరు. "భారతదేశంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువ, మహిళలను చిన్నచూపు చూస్తుంటారు. ఇలాంటప్పుడు నివేదిక చెబుతున్న లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి" అని ఆమె చెబుతున్నారు.
"సోమాలియా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో మహిళలు స్వేచ్ఛగా జీవిస్తారని ఎవరూ అనుకోరు. కానీ భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశం మహిళల భద్రత విషయంలో ఒకమెట్టు పైన ఉండాలని ఎవరైనా ఆశిస్తారు" అని ఆమె అభిప్రాయపడ్డారు.
పురుషుల ఆధిపత్యాన్ని కూడా నివేదిక పరిగణనలోకి తీసుకుందా?
నలుగురిలోకి రానివ్వకుండా నాలుగు గోడలకు మాత్రమే పరిమితం చేసే సౌదీ అరేబియాతో భారత్‌ను పోల్చడం సబబేనా?
"సౌదీ అరేబియాలో మహిళలకు పెద్దగా హక్కులు లేవు. కొద్ది రోజుల కిందటే వాహనాలు నడిపే అవకాశాన్ని మహిళలకు కల్పించారు. ఇది మార్పును సూచిస్తోంది. అంటే ఆ దేశం పురోగతిని కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. అంతమాత్రాన సౌదీ అరేబియాను భారత్‌తో పోల్చలేం" అని వర్మ అభిప్రాయపడ్డారు.
ఆయా విషయాల ఆధారంగా దేశాలను విభజించేటప్పుడు వాటికి ర్యాంకులు ఇచ్చేటప్పుడు మరింత విశ్వసనీయమైన సర్వే పద్ధతులను అవలంబించాలని సంజయ్ కుమార్ సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- మహిళల ఉద్యోగాలను ఆటోమేషన్ మింగేస్తుందా?
- సౌదీలో మహిళల కంటే రోబోకే ఎక్కువ స్వేచ్ఛ!
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- మహిళలు బ్రా ధరించడం ఎప్పుడు, ఎలా మొదలైంది?
- మహిళలు మద్యం కొనడానికి వెళ్తే ఏమవుతుంది?
- మహిళా ఉద్యోగులతో కంపెనీలకు మేలేనా?
- చరిత్రలో మహిళలు: ఒక ఆటతో ఓటుహక్కును ఎలా సాధించుకున్నారు?
- తెలంగాణ: మహిళలూ మీరు ఫిర్యాదు చేస్తే చాలు.. మిగతా మేం చూసుకుంటాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











