#GroundReport: ఝార్ఖండ్‌లో ఆ ఐదుగురిపై సామూహిక అత్యాచారం చేసిందెవరు? అసలేం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, రవి ప్రకాశ్
    • హోదా, కోచాంగ్ (ఖూంటీ) నుంచి, బీబీసీ కోసం

మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదుగురు యువతులు ఇటీవల ఝార్ఖండ్‌లో సామూహిక అత్యాచారానికి గురయ్యారు.

ఆ యువతులను అపహరించి, తర్వాత వారిపై సామూహిక అత్యాచారం జరపడమే కాకుండా, వారితో బలవంతంగా మూత్రం తాగించారని ఝార్ఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్‌కే మాలిక్ బీబీసీతో చెప్పారు.

ఖూంటీ జిల్లా అడకీ బ్లాక్‌లోని కోచాంగ్ గ్రామంలో జూన్ 19న ఈ దారుణం జరిగింది. అక్కడి చౌరస్తా సమీపంలో మిట్టమధ్యాహ్నం 12 గంటలకు అందరూ చూస్తుండగానే ఈ ఐదుగురు మహిళలతో పాటు వారితో ఉన్న ముగ్గురు పురుషులను కూడా దుండగులు అపహరించారు.

చౌరస్తాకు సమీపంలోనే ఆర్సీ మిషన్ స్కూల్ ఉంది. ఘటన జరిగిన సమయంలో నాటక బృందం ఒకటి అక్కడి ఆవరణలోని పెద్ద చింతచెట్టు కింద మనుషుల అక్రమ రవాణాపై గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు వీధి నాటకం ప్రదర్శిస్తోంది.

విద్యార్థులు, గ్రామస్థులు అంతా కలిసి సుమారు 300 మంది అక్కడున్నారు. నాటక బృందంలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.

మిషనరీ స్కూల్

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

ఫొటో క్యాప్షన్, ఈ మిషనరీ స్కూల్ నుంచే ఐదుగురు మహిళలను అపహరించారు

నాటకం జరుగుతున్న సమయంలో కారు, రెండు మోటారు సైకిళ్లపై ఐదుగురు దుండగులు వచ్చి నాటక బృందం మొత్తాన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.

అపహరణ విషయం తెలిసినా సమాచారం అందించలేదన్న కారణంతో స్కూలు ప్రిన్సిపల్‌ ఫాదర్ అల్ఫాన్సోను పోలీసులు అరెస్టు చేశారు.

ఘటన సమయంలో అక్కడున్న మార్టిన్ సోయ్ మాట్లాడుతూ- ''మహిళలను అపహరించిన దుండగులను నేను అంతకు ముందు ఎన్నడూ చూడలేదు. వారు కోచాంగ్ గ్రామానికి చెందినవారు కూడా కాదు. సాయంత్రానికి మాకు తెలిసిన సమాచారం ప్రకారం- మహిళలను ఎత్తుకెళ్లి వారిని దారుణంగా కొట్టారు. అత్యాచారం చేశారన్న సంగతి మాత్రం తెలియలేదు'' అని చెప్పారు.

తర్వాత ఊళ్లోకి పోలీసులు వచ్చాకే ఈ అత్యాచారం సంగతి తెలిసిందని, జూన్ 21న సుమారు 300 మంది పోలీసులు గ్రామానికి వచ్చి ప్రిన్సిపల్ ఫాదర్ అల్ఫాన్సోను, మరో ఇద్దరు నన్‌లను అరెస్టు చేశారని ఆయన తెలిపారు.

ఫాదర్ అల్ఫాన్సోను అందరూ గౌరవిస్తారని మార్టిన్ చెప్పారు.

కోచాంగ్ గ్రామానికి చెందిన మార్టిన్ సోయ్

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

ఫొటో క్యాప్షన్, కోచాంగ్ గ్రామానికి చెందిన మార్టిన్ సోయ్

ప్రిన్సిపల్ అరెస్టుపై వ్యతిరేకత

ఖూంటీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొందరు ఆదివాసులు దశాబ్ద కాలం కిందటే క్రైస్తవాన్ని స్వీకరించారు. ఇప్పుడు వీరి సంఖ్య పెరిగింది.

ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే పౌలుస్ సొరేన్- దీనిపై స్పందిస్తూ ఫాదర్ అల్ఫాన్సో అరెస్టును తప్పుపట్టారు.

''ఝార్ఖండ్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ తరపున పనిచేస్తోంది. క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం ఇది. చర్చిని అభాసుపాలు చేయడానికి కుట్రపూరితంగా ఫాదర్‌ను అరెస్టు చేశారు. ఝార్ఖండ్‌లో క్రైస్తవ మతబోధకులకు వ్యతిరేకంగా సెక్షన్ 107ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోంది. రాజకీయ నేతలను సంతృప్తిపరిచేందుకు పోలీసులు కట్టుకథలు అల్లుతూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు'' అంటూ ఆయన ఆరోపించారు.

ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే పౌలుస్ సోరెన్

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

ఫొటో క్యాప్షన్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే పౌలుస్ సోరెన్

బాధిత మహిళలేమంటున్నారంటే..

బాధిత మహిళలు ఐదుగురూ ఖూంటీ జిల్లావారే. వారిలో ఒకరు వితంతువు, ఇద్దరు అవివాహితలు. వారంతా ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను నాటకాల రూపంలో ప్రచారం చేస్తూ పొట్టపోసుకుంటున్నారు.

తమను అపహరించినవారు తుపాకులతో బెదిరించారని, దుస్తులు విప్పించి ఫొటోలు, వీడియో తీశారని, మర్మాంగాల్లో కర్రలు చొప్పించారని బాధిత మహిళలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా జరిగిన తర్వాత కొన్ని గంటలకు మిషన్ స్కూల్ వద్ద తమను వదిలేశారని చెప్పారు.

సామాజిక కార్యకర్త లక్ష్మి బాఖ్లా

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

ఫొటో క్యాప్షన్, సామాజిక కార్యకర్త లక్ష్మి బాఖ్లా

'పురుషులతో మూత్రం తాగించారు'

తమ బృందంలోని పురుషులతో దుండగులు బలవంతంగా మూత్రం తాగించారని, వారిని కొట్టారని ఫిర్యాదులో ఉంది. ''మేం పోలీసుల ఏజెంట్లమని, పత్థల్‌గడీ అమలవుతున్న ప్రాంతంలో డికు భాషలో కరపత్రాలు పంచుతున్నామని వాళ్లు మాపై ఆరోపణలు మోపారు'' అని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనతో బాధితులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. వారు ఖూంటీకి వెళ్తూ, ఫోన్‌లో సామాజిక కార్యకర్త లక్ష్మి బఖ్లాకు జరిగిందంతా చెప్పుకొన్నారు.

అప్పటికి రాత్రి అయ్యిందని, వాళ్లు తనకు వివరాలు చెప్పిన సమయానికి తాను ఖూంటీలో లేనని లక్ష్మి వెల్లడించారు.

''ఈ ఘటన గురించి వెంటనే ఎవరికీ చెప్పలేకపోయాను. మరుసటి రోజు ఒక ఫ్రెండ్ ద్వారా రాంచీలోని ఏడీజీ అనురాగ్ గుప్తాకు సమాచారం చేరవేశాను'' అని ఆమె తెలిపారు.

ఝార్ఖండ్ పోలీసు విభాగం ప్రతినిధి, ఏడీజీ ఆర్‌కే మలిక్

ఫొటో సోర్స్, Ravi Prakash/BBC

ఫొటో క్యాప్షన్, ఝార్ఖండ్ పోలీసు విభాగం ప్రతినిధి, ఏడీజీ ఆర్‌కే మలిక్

ఏడీజీ అనురాగ్, ఖూంటీ ఎస్‌పీకి సమాచారం అందించారు. ఫిర్యాదు దాఖలు చేయాలని బాధితులకు ఎస్‌పీ సూచించారు.

జూన్ 20వ తేదీ రాత్రికి ఫిర్యాదు దాఖలైంది. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్ అల్ఫాన్సో ఒకరు.

ఝార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి, ఏడీజీ ఆర్‌కే మాలిక్ మాట్లాడుతూ- ''సామూహిక అత్యాచారం వెనక పత్థల్‌గడీ తీవ్రవాదులు ఉన్నారు. సూత్రధారిని గుర్తించాం. ఆరకి, ఖూంటీలలోని మహిళా పోలీసు స్టేషన్లలో రెండు ఫిర్యాదులు దాఖలయ్యాయి. రెండు కేసుల్లోనూ స్కూల్ ప్రిన్సిపల్‌ను రిమాండ్‌పై తీసుకున్నాం. మిగతా నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాం'' అన్నారు.

పత్థల్‌గడీ

ఫొటో సోర్స్, Ravi Prakash

ఫొటో క్యాప్షన్, కోచాంగ్ గ్రామంలో రాయిని పాతి దానిపై భారత రాజ్యాంగం ఆదివాసులకు ప్రసాదించిన హక్కుల ప్రకటన చేశారు. దీనిని స్థానికులు పత్థల్‌గడీ ఉద్యమంగా వ్యవహరిస్తున్నారు.

'పోలీసులవి కట్టుకథలు'

'పత్థల్‌గడీ క్యాంపెయిన్ ఫర్ ట్రైబల్స్'‌కు చెందిన శంకర్ మహలి బీబీసీతో మాట్లాడుతూ- ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు కట్టుకథలు చెబుతున్నారని ఆరోపించారు.

''మమ్మల్ని మేమే పాలించుకొంటామని మేం నినదిస్తున్నాం. ఇది గిట్టని ప్రభుత్వం, మమ్మల్ని లక్ష్యంగా చేసుకొంటోంది. కొన్నిసార్లు మమ్మల్ని నక్సలైట్లు అంటోంది. మరికొన్నిసార్లేమో మేం గంజాయి సాగుచేస్తున్నామని అంటోంది. ఇప్పుడు మమ్మల్ని రేపిస్టులని అంటోంది. పోలీసుల మాటల్లో నిజం లేదు'' అని శంకర్ మహలి చెప్పారు.

ఈ ఘటనపై కోచాంగ్ గ్రామంలో పంచాయితీ జరిగింది. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వారిని శిక్షించాలని ఇందులో నిర్ణయించారు.

వీడియో క్యాప్షన్, భారత్‌లో ఎవరు ఎక్కువ సురక్షితం? గోవులా లేక మహిళలా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)