BBCImpact: యూపీలో దళిత యువతిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

మహిళ
    • రచయిత, సర్వప్రియ సాంగ్వాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, బహ్రాయిచ్‌(యూపీ) నుంచి

సాధారణంగా ఒక టీనేజీ అమ్మాయి ఏం చేస్తుంది- చదువుకొంటుంది.. స్నేహితులతో కలిసి ఆడుకొంటుంది.. అద్దంలో తనను తాను చూసుకొని ముసిముసిగా నవ్వుకొంటుంది. తనపై అత్యాచారం జరగకపోతే ఈ ఉత్తర్‌ప్రదేశ్ అమ్మాయి జీవితం కూడా ఇలాగే ఉండేదేమో!

అత్యాచారానికి గురై గర్భం దాల్చి ఏడాదిన్నర క్రితం ఒక శిశువుకు జన్మనిచ్చిన ఈ టీనేజర్‌కు ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు. కేసు వెలుగులోకి వచ్చి దాదాపు రెండేళ్లైనా పోలీసులు స్పందించలేదు. బాధితురాలికి పరిహారం కింద ఆర్థిక సాయం అందలేదు. వ్యవస్థ సున్నితత్వాన్ని, పనితీరును ప్రశ్నిస్తున్న కేసు ఇది.

ఈ అమ్మాయి యూపీలో బహ్రాయిచ్‌ జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తోంది. 2016 జూన్‌లో బాలిక ఉదర భాగం ఎత్తుగా కనిపించడంతో ఇంటి చుట్టుపక్కల మహిళలు ఏమైందని అడిగారు. ఆమెపై అత్యాచారం జరిగిందని వెల్లడైంది. తన తండ్రికి తెలిసిన, అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తే నిందితుడు.

మహిళ

పెళ్లికి డబ్బులిస్తున్నారని చెప్పి అమ్మాయిని తీసుకెళ్లాడు

బాలిక, ఆమె తండ్రి ఇద్దరూ నిరక్షరాస్యులే. ఆమె తల్లి కొన్నేళ్ల కిందట చనిపోయారు. వీరిది నిరుపేద దళిత కుటుంబం.

బాధితురాలి తండ్రి రోజుకూలీ. అష్టకష్టాలు పడి ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి పెళ్లి చేశారు. రెండో కుమార్తె పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించేవారు.

పేద అమ్మాయిల పెళ్లి ఖర్చులకు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని లఖ్‌నవూలో డబ్బు పంపిణీ చేస్తోందని ఇప్పుడు నిందితుడిగా ఉన్న వ్యక్తి బాధితురాలి తండ్రితో చెప్పాడు. ఆర్థిక సాయం అందుకొనేందుకు తన కుమార్తెను తండ్రి అతడి వెంట లఖ్‌నవూ పంపించాడు.

శిశువు
ఫొటో క్యాప్షన్, శిశువు

'మళ్లీ మళ్లీ అత్యాచారం'

''అతడి సాయం సంగతి పక్కనబెట్టండి. అతడు నా కూతురును లఖ్‌నవూ తీసుకెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. నాన్‌పారా(బహ్రాయిచ్‌)లో మళ్లీ అత్యాచారం చేశాడు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆమెపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు'' అని బాధితురాలి తండ్రి బీబీసీతో చెప్పారు.

ఇంటికి తిరిగి వచ్చాక భయంతో ఆ అమ్మాయి ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఆరు నెలల తర్వాత, జరిగిన దారుణం వెలుగు చూసింది.

బీబీసీ కథనం ప్రభావం.. నిందితుడు అరెస్టు

ఆమె తండ్రి 2016 జూన్ 24న సమీప పోలీసు స్టేషన్‌లో నిందితుడిపై కేసు పెట్టారు.

దాదాపు రెండేళ్లు అవుతున్నా పోలీసులు స్పందించలేదు.

ఈ అంశంపై బీబీసీ హిందీ జూన్ 20వ తేదీన కథనం ప్రచురించింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశామంటూ పోలీసులు ప్రకటించారు.

ఇల్లు

డీఎన్‌ఏ నివేదిక ఎప్పుడొస్తుంది?

బాధితురాలు ప్రసవించింది. పరీక్షల్లో శిశువు డీఎన్‌ఏ, నిందితుడి డీఎన్‌ఏ సరిపోలితే తదుపరి చర్యలకు అవకాశం ఉంటుంది. అయితే ఇంతవరకు డీఎన్‌ఏ నివేదిక సిద్ధం కాలేదు.

డీఎన్‌ఏ నివేదిక గురించి వివరాలు తెలుసుకొనేందుకు ఇటీవల బహ్రాయిచ్‌లోని సర్కిల్ ఆఫీసర్(సీవో) కార్యాలయానికి బీబీసీ వెళ్లగా, అప్పుడు అక్కడ సర్కిల్ ఆఫీసర్‌ లేరు.

డీఎన్ఏ పరీక్షలకు సంబంధించిన 5,500 కేసులు లఖ్‌నవూలో పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో ఈ కేసు ఒకటని, డీఎన్‌ఏ నివేదిక రాకుండా అరెస్టు ఎలా చేస్తామని ఆయన అటెండెంట్ అన్నారు.

పశువులు

పరిహారం మాటేమిటి?

షెడ్యూల్డు కులాలపై, షెడ్యూల్డు తెగలపై అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం బాధితురాలికి పరిహారం ఏమైనా ఇచ్చారా అని అడగ్గా, ఎఫ్‌ఐఆర్, బాధితురాలి వైద్య నివేదిక ప్రాతిపదికగా పరిహారం చెల్లించాల్సి ఉందని, బాధితులు ఎస్సీలైతే 50 శాతం పరిహారాన్ని తక్షణం చెల్లించాల్సి ఉందని సీవో అటెండెంట్ చెప్పారు.

పరిహారానికి సంబంధించి 2016 ఏప్రిల్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అత్యాచార కేసుల్లో ఎస్సీ, ఎస్టీ బాధితులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. సామూహిక అత్యాచార బాధితులైతే రూ.8 లక్షల చొప్పున ఇవ్వాలి. ఈ కేసులో బాధితురాలికి నిబంధనల ప్రకారం రూ.2.5 లక్షలు తక్షణం చెల్లించాల్సి ఉంది.

సీవో కార్యాలయంలోని సంబంధిత పోలీసును పరిహారం గురించి అడగ్గా, దర్యాప్తు అధికారి రాతపూర్వకంగా చెబితే వెంటనే చెల్లిస్తామని బదులిచ్చారు. ఈ పోలీసును, సీవో అటెండెంట్‌ను ఇద్దరినీ ఒకేసారి ఒకే చోట పరిహారం గురించి అడగ్గా, బాధితురాలికి రెండేళ్ల కిందటే చెల్లించి ఉండాల్సిందని, రేపే పంపిస్తామని చెప్పారు. వారి తీరులో చాలా నిర్లక్ష్యం కనిపించింది.

ఈ పేద బాధితురాలికి పరిహారం సకాలంలో అంది ఉంటే ఆమె వైద్యఖర్చులకు, న్యాయపోరాటానికి, శిశువు సంక్షేమానికి ఉపయోగపడేది.

ఇద్దరు వ్యక్తులు

ఇంతకూ వయసెంత?

బాధితురాలి తండ్రి చెబుతున్నదాని ప్రకారం అత్యాచారం జరిగిన సమయానికి ఆమె వయసు 14 ఏళ్లు. 2016 జులై 19న మేజిస్ట్రేట్‌ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఆమె వయసు 14 ఏళ్లుగానే ఉంది.

కానీ ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం వయసు 20 ఏళ్లుగా ఉంది. ఎఫ్‌ఐఆర్ 2016 జూన్ 24న నమోదైంది.

పోలీసుల వద్ద వైద్య రికార్డుల్లో బాధితురాలి వయసు 19 ఏళ్లుగా ఉంది.

బాధితురాలి వయసు 18 సంవత్సరాల లోపు అయితే 'లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం(పీవోసీఎస్‌వో చట్టం)' సెక్షన్‌ 21ను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాల్సి ఉంటుంది.

'ఎక్స్‌రే అబద్ధం చెప్పదు'

బాధితురాలి వయసు గురించి సీవో అటెండెంట్‌ను ప్రశ్నించగా- 2016లో జరిపిన వైద్యపరీక్షల పత్రాలను చూపించారు. ఆమె వయసును నిర్ధరించేందుకు చేయి ఎముకలను ఎక్స్‌రే తీయించి, పరీక్షలు జరిపించామని ఆయన చెప్పారు. వైద్యపరీక్షల పత్రాల్లో ఈ ఎక్స్‌రే నివేదిక కూడా ఉంది. బాధితురాలి వైద్యనివేదికలో వయసు 19 ఏళ్లుగా ఉంది.

అత్యాచారం జరిగిన సమయానికి తన కూతురికి 14 ఏళ్లని బాధితురాలి తండ్రి చెబుతున్నారని, వైద్యనివేదికలోనేమో 19 ఏళ్లని రాశారని ప్రస్తావిస్తే- ఎక్స్‌రే నివేదిక అబద్ధం చెప్పదని అటెండెంట్ వ్యాఖ్యానించారు.

మహిళ

అనుమానాస్పదంగా దర్యాప్తు

ఎక్స్‌రేను నిశితంగా పరిశీలిస్తే కేసు దర్యాప్తుపై కొన్ని అనుమానాలు కలిగాయి.

బాధితురాలి వయసును నిర్ధరించే పరీక్షలు చేపట్టడానికి ముందు ఆమె మెడికల్ కార్డులో ఎక్స్‌రే నంబరును నల్లసిరాతో '1278' అని రాశారు. ఎక్స్‌రేపై మాత్రం నంబరు '1378' అని ఉంది. పరీక్ష జరపడానికి ముందు మెడికల్ కార్డులో 1278గా రాసిన ఎక్స్‌రే నంబరును తర్వాత 1378గా మార్చారు. నీలి రంగు సిరాతో ఈ సంఖ్యలో '2'ను '3'గా మార్చారు. తుది నివేదికను సగ భాగం నీలి సిరాతో, మిగతా సగం నల్ల సిరాతో రాశారు. దీనిపై బాధితురాలి వేలిముద్ర వేయించుకున్నారు.

వైద్యనివేదికలో సంఖ్య తారుమారు గురించి ప్రశ్నించగా, దీనికి పోలీసులు సమాధానమివ్వలేదు. ఈ కేసు గురించి మీకెవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్న వేశారు.

పోలీసుల దర్యాప్తుపై బాధితురాలి తండ్రికి ఏ మాత్రం నమ్మకం లేదు. నిందితుడు ధనబలంతో దర్యాప్తును ప్రతీ దశలో ప్రభావితం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

''రూ.15 వేలు ఇస్తాను, అబార్షన్ చేయించుకో'' అని అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు నిందితుడు అన్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వ్యక్తిత్వాన్నే ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేశారని చెప్పారు.

కుటుంబ సభ్యులు

ఎవ్వరూ పట్టించుకోలేదు

తన కుమార్తెకు న్యాయం జరిగేలా చూడాలంటూ బాధితురాలి తండ్రి గ్రామపెద్ద సాయంతో ప్రధాని మొదలుకొని చాలా మందికి వినతిపత్రాలు సమర్పించారు. ప్రధానమంత్రి, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి, బహ్రాయిచ్‌ జిల్లా కలెక్టర్, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, రవాణాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్, డీఐజీలకు ఆయన పెట్టుకున్న వినతిపత్రాలపై ఎలాంటి స్పందనా రాలేదు.

బాధితురాలి ఆస్పత్రి ఖర్చులను ఆమె బంధువు ఒకరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనే ఆమె భర్త. అత్యాచారంతో ఆమెకు పుట్టిన శిశువును ఆమె తండ్రి పెంచుతున్నారు.

నిందితుడు బాధితురాలికి మళ్లీ మళ్లీ తారసపడుతున్నా ఆమెకు భద్రత కల్పించేందుకు అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

ఈ కేసులో అభియోగపత్రం(ఛార్జిషీటు) ఇంకా దాఖలు కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)