నేతలు డబ్బులు దండిగా పంచుతున్నా ఓట్లు ఎందుకు పడడం లేదు?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడానికి ఒక భారతీయ ఓటరును ఏది పురిగొల్పుతుంది?
సాధారణంగా అభ్యర్థి గుర్తింపు, అతని భావజాలం, కులం, అతని పనితీరు మొదలైనవి అభ్యర్థిని ఎన్నుకోవడంలో ప్రభావం చూపుతాయి.
నగదు పంపిణీ, తాయిలాలు వంటివి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఓటర్లను ప్రభావితం చేస్తాయని భావిస్తుంటారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో అధికారులు సుమారు రూ.136 కోట్ల రూపాయల నగదు, ఇతర బహుమానాలను స్వాధీనం కూడా చేసుకున్నారు.
పార్టీ కార్యకర్తలు ఓటర్ల బ్యాంకు అకౌంట్లలోకి నగదును జమ చేస్తున్నట్లు, ఎన్నికల అనంతరం మరింత నగదును బదిలీ చేస్తామని హామీ ఇచ్చినట్లు కూడా ఒక నివేదిక పేర్కొంది.
నగదు, ఇతర బహుమతులను ఉపయోగించి ఓట్లను కొనుక్కోవడం అన్నది భారతదేశంలో చాలా విస్తృతంగా వ్యాపించింది. రాజకీయాలలో పోటీ తీవ్రంగా పెరగడం దీనికి ఒక ప్రధాన కారణం. 1952లో దేశంలో 55 పార్టీలుండగా, 2014 నాటి ఎన్నికల బరిలో మొత్తం 464 పార్టీలున్నాయి.
2009లో ఆధిక్యతలలో సగటు తేడా 9.7 శాతంగా ఉంది. మొదటి ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
అదే 2012లో అమెరికా కాంగ్రెషనల్ ఎన్నికలతో ఇది 32 శాతం కాగా, బ్రిటన్ సాధారణ ఎన్నికలలో ఇది 18 శాతం.

ఫొటో సోర్స్, AFP
స్థానిక నేతల జేబుల్లోకే..
భారతదేశంలో ఎన్నికలు చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరుగుతున్నాయి. గతంలో మాదిరి పార్టీలు ఓటర్లను నియంత్రించే పరిస్థితి లేదు. పార్టీలు, అభ్యర్థులు ఫలితాలను గతంలో మాదిరి సరిగా అంచనా వేయలేకున్నారు. అందువల్ల డబ్బును వెదజల్లి ఓట్లను కొనుక్కోవాలని చూస్తున్నారు.
అమెరికాలో డార్ట్‌మౌత్ కాలేజ్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సైమన్ చౌచార్డ్ పరిశోధన ప్రకారం, నగదు పంపకం ఖచ్చితంగా ఓట్లను రాబడుతుందని చెప్పలేం.
ఎన్నికల్లో పోటీ పెరగడంతో అభ్యర్థులు నగదుతో పాటు తాయిలాలు పంచుతున్నారు.
నగదును, తాయిలాలను ఎంతగా పంచినా అభ్యర్థుల విజయం ఇతర అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ సైమన్ అంటారు.
ప్రొఫెసర్ సైమన్ తన పరిశోధక బృందంతో కలిసి ముంబైలో 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికలపై పరిశోధన నిర్వహించారు.
ఈ పరిశోధనలో అభ్యర్థులు ప్రతి ఓటరుపై వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తేలింది.
పార్టీ కార్యకర్తలు కూడా తాయిలాల వల్ల ఫలితాలు చాలా స్వల్పంగానే ఉంటాయని వెల్లడించారు. తాయిలాలు చాలావరకు స్థానిక నేతల జేబులలోకే పోవడం వల్ల అవి ఓటర్ల వరకు వెళ్లడంలేదు. నిజానికి అందరికన్నా ఎక్కువ ఖర్చు చేసిన ఒక అభ్యర్థి నాలుగో స్థానంలో నిలిచాడు.
ఈ పరిస్థితికి కారణం ఓటర్లే అని పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. ఓటర్ల మనోగతాలను అర్థం చేసుకోవడం అభ్యర్థులకు కష్టతరం అవుతోందని వారన్నారు. నగదును జేబులో వేసుకున్న తర్వాత, నిజాయితీ కలిగిన అభ్యర్థిని కూడా వారు మోసం చేస్తున్నారని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
తాయిలాల వెనుక సాంస్కృతిక కారణాలు
''అయితే నగదు పంపిణీ ఫలితాలను మొత్తంగానే ప్రభావితం చేయడం లేదని చెప్పలేం. ఒకవేళ నగదు పంపిణీ చేయకపోతే, అభ్యర్థులు ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. నగదు, తాయిలాల పంపిణీ వల్ల అందరికీ సమానావకాశాలు లభించే పరిస్థితి ఏర్పడుతుంది. తాయిలాలు ఇవ్వని అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అని ఉన్నప్పుడు, అది ఫలితాలను ప్రభావితం చేయొచ్చు'' అని ప్రొఫెసర్ సైమన్ అన్నారు.
దిల్లీకి చెందిన రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు సంజయ్ కుమార్, పేదల ఓట్లను కొనుగోలు చేయవచ్చనే నమ్మకం రాజకీయ పార్టీలలో చాలా బలంగా ఉందని అన్నారు.
''రాజకీయ పార్టీలు ఓటర్లకు తాయిలాలు పంచేది అందుకే. ఎటూ నిర్ణయించుకోలేని ఓటరు వాటి వల్ల తమ వైపు మొగ్గుతాడని పార్టీలు భావిస్తాయి. కానీ నిజంగా అలా జరుగుతుందని చెప్పడానికి సాక్ష్యాధారాలేం లేవు'' అని ఆయన తెలిపారు.
ఓటర్లకు తాయిలాలు పంచడం వెనుక సాంస్కృతిక కారణాలు కూడా ఉండొచ్చు. దక్షిణాసియాలోని పేద ఓటర్లు ధనికులైన అభ్యర్థులను ఆదరిస్తారని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసమానతలు ఎక్కువగా ఉన్న సమాజంలో, నగదు బహుమతులు, తాయిలాలు ఇచ్చి పుచ్చుకునే వాతావరణాన్ని సృష్టిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
అధికారుల కళ్లు కప్పేందుకు 'నకిలీ’ వేడుకలు
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి చెందిన ప్రొఫెసర్ అనస్తసియా పిలావ్‌స్కీ రాజస్థాన్‌కు చెందిన గ్రామీణ ఓటర్లపై అధ్యయనం చేశారు. అక్కడి ఓటర్లు అభ్యర్థుల నుంచి విందును కానీ, తాయిలాలను కానీ ఆశిస్తారని ఆ అధ్యయనంలో తేలింది.
అందుకే అభ్యర్థులు ఎన్నికల అధికారుల కళ్లు కప్పేందుకు 'నకిలీ' జన్మదినోత్సవాలు, పెళ్లి విందులు ఏర్పాటు చేస్తారని, బహుమతులు స్వీకరించేందుకు ఓటర్లంతా వాటికి హాజరవుతారని ఆమె తెలిపారు.
మొత్తంగా చివరికి ఓటరు ఎక్కువ తాయిలాలు ఇచ్చిన అభ్యర్థికి కాకుండా, 'ఇతర అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని' ఓటు వేస్తాడని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన ఆంత్రోపాలజిస్ట్ ముకులికా బెనర్జీ తెలిపారు.
''విచారకరం ఏమిటంటే, ప్రస్తుత రాజకీయాల్లో మీరు ఎన్నికల్లో ఖర్చు చేయాల్సిందే. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు.'' అని ఓ బీజేపీ నేత డాక్టర్ సైమన్‌తో అన్నారు.
''ఎన్నికల్లో నగదు పంపిణీ మోటర్ బైక్‌కు పెట్రోల్ కొట్టించడం లాంటిది. పెట్రోల్ కొట్టించకపోతే మీరు గమ్యం చేరుకోలేరు. కానీ ఎక్కువ కొట్టించినంత మాత్రాన మీరు వేగంగా గమ్యం చేరుకోలేరు.''
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








