కర్ణాటక: అమిత్ షాను కాంగ్రెస్ ఆయన ఆయుధంతోనే ఎలా ఓడించింది?

bjp

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, భరత్ శర్మ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''మీరు ఏం చేయాలని ఆలోచిస్తున్నారో దాన్ని గమనించేలా చేయకండి. తెలివిగా దాన్ని రహస్యంగా ఉంచండి. గమ్యం చేరుకోవడానికి పట్టుదలతో ఉండండి"ఏదైనా చేసి చూపించాలని అనుకోడానికి, దాన్ని సాధించి చూపడానికి చాణక్యుడు ఉపదేశించిన సూత్రమిది. నాలుగేళ్లుగా చిన్న చిన్న రాజకీయ విజయాలతో సంబరాలు చేసుకుంటూ ఊరట పొందుతున్న కాంగ్రెస్ ఈ సూత్రాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. కర్ణాటక విషయంలో అది అలాగే చేసింది.

ఫలితం ఇప్పుడు మనకు తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన యడ్యూరప్ప, అధికారం దక్కించుకోలేకపోయారు. సీట్ల విషయంలో కాంగ్రెస్ ఆయన కంటే వెనకబడ్డా ఈ ఆటలో మాత్రం పైచేయి సాధించగలిగింది.

కాంగ్రెస్ ఈ పందేన్ని గెలవడానికి ముఖ్యమంత్రి పీఠాన్నే పణంగా పెట్టాల్సి వచ్చినా, ఒక పెద్ద రాష్ట్రంలో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడంలో విజయం సాధించగలిగింది.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను రాజకీయ చాణక్యుడు అని కూడా అంటుంటారు. కానీ ఈసారి చాణక్య సూత్రాలను కాంగ్రెసే ముందుగా ఒడిసిపట్టింది. అంతకంటే వేగంగా వాటిని అమలు చేసింది.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ పాఠం నేర్చుకుంది

కానీ అంత మాత్రాన కాంగ్రెస్ రాజకీయాల్లో అత్యుత్సాహం చూపిస్తోందని అనుకోవాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా ఆ పార్టీ చాలా విడనాడే వైఖరితో ఉంటోందని అనేవారూ ఉన్నారు.

చల్లబడిపోయిన కాంగ్రెస్ ఈసారి తొందరగానే మేలుకుంది. గోవా, మణిపూర్ నుంచి అది ఈ పాఠం నేర్చుకుంది.

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ ఆధిక్యం లభించలేదు. కానీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయినా ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.

యడ్యూరప్ప

ఫొటో సోర్స్, Getty Images

ఎలా?..

ఫలితాల సమయంలో కాంగ్రెస్ నేతలు దిల్లీలో అంకెలు చూసుకుంటూ మురిసిపోతున్నప్పుడు, బీజేపీ తమ వ్యూహకర్తలను ఆయా రాష్ట్రాలకు పంపించింది. ఇతర పార్టీల నేతలతో చర్చలు జరిపి, ఒప్పందాలు చేసుకుంది. కొన్ని గంటల్లోనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లేసరికే చాలా ఆలస్యమైపోయింది. దాంతో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆరోపించింది. అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వలేదంటూ ఫిర్యాదు కూడా చేసింది. కానీ అప్పటికే అధికారం చేజారిపోయింది.

ఈసారి కర్ణాటకలో దానికి సరిగ్గా భిన్నంగా జరిగింది. ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాదని ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పాయి. అందుకే కాంగ్రెస్ ఫలితాలు వచ్చేవరకూ వేచిచూడలేదు.

కాంగ్రెస్, జేడీఎస్

ఫొటో సోర్స్, Getty Images

అవకాశాన్ని ఒడిసిపట్టింది

సీట్ల మీటరులో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జనతా దళ్ సెక్యులర్ 37, ఇతరులు 3 దగ్గర ఆగిపోయే సరికి, కాంగ్రెస్ ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది.

"కాంగ్రెస్ ఈసారి తన సీనియర్ నేతలను రంగంలోకి దించింది. గులామ్ నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌కు ఈ పని అప్పగించింది" అని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు నీరజ్ చౌదరి బీబీసీతో చెప్పారు

"మణిపూర్, గోవాలో బీజేపీ ఏ ఎత్తులు వేసిందో, వాటికి కాంగ్రెస్ ఇక్కడ చెక్ పెట్టింది. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ ఈసారి బీజేపీకి షాక్ ఇచ్చిందని అనుకున్నా తప్పేం లేదు" అంటారు.

నిజానికి, కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత చురుకుగా వ్యవహరించింది.

"ఫలితాలు మంగళవారం రాబోతున్నాయనగా, కాంగ్రెస్ ఆదివారమే ఒక నిర్ణయం తీసుకుంది. తమకు 90 సీట్ల కంటే తక్కువ వస్తే, జనతాదళ్-ఎస్ నేత కుమార స్వామికి సీఎం పదవిని ఆఫర్ చేయాలని అనుకుంది" అని ఆయన అన్నారు.

తర్వాత 24 గంటల్లోపే దేవగౌడ-కుమారస్వామిని ఎలా కలవాలి? ఎలాంటి వ్యూహం సిద్ధం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అనేది నిర్ణయించారు.

modi, yedurappa

ఫొటో సోర్స్, Getty Images

సీఎం పదవే ఆయుధం

నీరజ్ "ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల్లోనే రెండు పార్టీలూ పొత్తుపై ప్రకటన చేశాయి" అని చెప్పారు.

నిజానికి, స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య జనతాదళ్ సెక్యులర్ కింగ్ మేకర్ అయ్యింది. తర్వాత పరిస్థితులు ఆ పార్టీని కింగ్ మేకర్ మాత్రమే కాకుండా, కింగ్ కూడా చేశాయి.

కాంగ్రెస్ వేసిన అతిపెద్ద ఎత్తు ముఖ్యమంత్రి పదవిని వదులుకుని దాన్ని జేడీఎస్‌కు ఆఫర్ చేయడం. ఇలాంటి ఆఫర్ ఇవ్వడం అతిపెద్ద పార్టీ బీజేపీకి అసాధ్యం.

బీఎస్ యడ్యూరప్పను పక్కనపెట్టి కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ ప్రయత్నించి ఉంటే, దానివల్ల మరింత నష్టం జరిగుండేది.

"ఈ సారి కాంగ్రెస్ పాతరోజుల్లో కాంగ్రెస్ పార్టీలా అద్భుతం చేసిందని" నిపుణులు అంటున్నారు. మైదానంలో అవతలి వారు ఎత్తు వేసేవరకూ ఆగకుండా బీజేపీ ఎలా అయితే, వేగంగా వ్యవహరిస్తుందో, సరిగ్గా అదే వ్యూహాన్ని ఈసారి కాంగ్రెస్ అనుసరించింది" అని చెబుతున్నారు.

"రాహుల్ గాంధీ ఈసారి తన రాజకీయ చాతుర్యం చూపించారు. ఈ విషయంలో క్రెడిట్ ఈసారి ఆయనకే దక్కాలి" అంటారు సీనియర్ జర్నలిస్ట్ ఊర్మిలేశ్.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ ఎత్తులకు చిత్తు

"రాహుల్‌లో సీరియస్‌నెస్ కనిపించింది. ఇప్పుడు ఆయన మొదట్లో ఉన్నట్టు లేరు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సమయంలో ఎంత చురుగ్గా ఉన్నారో, ఫలితాలు వచ్చాక కూడా రాహుల్ అలాగే కనిపించారు" అని ఊర్మిలేశ్ అన్నారు.

"కాంగ్రెస్ కమాండ్ ఇప్పుడు పూర్తిగా రాహుల్ చేతుల్లో ఉంది. ఆయన సోనియాలా వ్యవహరిస్తున్నారు. సోనియా వెంట నిలుస్తూ వచ్చిన నేతలు, ఇప్పుడు రాహుల్‌కు కూడా అండగా ఉన్నారు. గులామ్ నబీ ఆజాద్, గెహ్లాట్ లాంటి సీనియర్ నేతలు ఈసారి వేగంగా రంగంలోకి దిగారు"

సాధారణంగా ఒక రాజకీయ పార్టీ న్యాయం కోసం కోర్టు తలుపు తట్టిందంటే, అది రాజకీయ చదరంగంలో తన ఓటమిని అంగీకరించినట్టుగా అంతా భావిస్తారు.

కానీ కాంగ్రెస్ ఈసారి రెండు దళాలుగా పోరాటం చేసింది. గవర్నర్ బీఎస్ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినపుడు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించినపుడు, కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించింది.

మరోవైపు, యడ్యూరప్ప తన బలం నిరూపించుకోడానికి గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చినపుడు, అది అన్యాయం అంటూ అర్థరాత్రి సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసినా కాంగ్రెస్.. బీజేపీ ఆట కట్టించింది. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థనను విన్న సుప్రీంకోర్టు యడ్యూరప్పకు బలం నిరూపించుకోడానికి కేవలం 28 గంటల గడువు మాత్రమే ఇచ్చింది.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

ఎమ్మెల్యేలను కాపాడుకుంది

బీజేపీ తన ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్‌గా నియమించించడంతో కాంగ్రెస్ మరోసారి కోర్టుకెక్కింది. ఈ విషయంలో అది విజయం సాధించలేకపోయినా, బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం నుంచి మాత్రం వెనక్కు తగ్గలేదు. చివరకు అందులో విజయం సాధించింది.

కోర్టులో ఊరట లభించిన తర్వాత కాంగ్రెస్ ముందు మరో సవాలు నిలిచింది. తన ఎమ్మెల్యేలు అవతలికి జారుకోకుండా కాపాడుకోవడం. అందులో కూడా కాంగ్రెస్ విజయం సాధించగలిగింది.

ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది కాబట్టి, జనతాదళ్ 37 మంది ఎమ్మెల్యేలు వేరే వైపు వెళ్లే అవకాశాలు తక్కువే. కానీ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లవచ్చని మీడియాలో వార్తలు వచ్చాయి.

కానీ కాంగ్రెస్ అలా జరగనివ్వలేదు. ఫ్లోర్ టెస్ట్ జరిగితే., 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైన బీజేపీ దాన్ని పొందడంలో విఫలమైంది.

దాంతో బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేశారు.

జైట్లీ, రాజ్‌నాథ్, మోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP/Getty Images

బీజేపీకి షాక్

కర్ణాటకలో తక్కువ సీట్లు వచ్చిన కాంగ్రెస్, బీజేపీకి అధికారం దక్కకుండా చేయడం అనేది అమిత్ షాకు నిజంగా ఒక పెద్ద షాక్ లాంటిదే. "ఇది షాకే, కానీ అవకాశం కూడా ఉంది" అంటారు నీరజ్ షా.

''కాంగ్రెస్, జనతాదళ్-ఎస్ కూటమిలో భిన్నాభిప్రాయాలు తలెత్తేవరకూ బీజేపీ వేచిచూస్తుంది. వారు చేసే తప్పుల కోసం ఎదురుచూస్తుంది. తర్వాత అవకాశం వెతుక్కుంటుంది"

''కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటూ జరగాలని బీజేపీ కోరుకుంటుంది. బీఎస్ యడ్యూరప్ప కూడా తన వీడ్కోలు ప్రసంగంలో తాము లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలూ గెలుచుకుంటాం" అన్నారు.

"కానీ కాంగ్రెస్ ఈ విజయం ఇక ముందూ కొనసాగుతుందా. రెండు పార్టీలూ సహజ భాగస్వాములుగా ఉండచ్చని, ఉండకపోవచ్చని ఆ పార్టీ చెప్పింది. కాంగ్రెస్, జనతాదళ్-ఎస్ పరస్పరం ఆరోపణలకు దిగేవి. కానీ బీజేపీని అధికారం నుంచి అడ్డుకోడానికి ఆ రెండూ చేతులు కలిపాయి.

కర్ణాటక రాజకీయాల నేపథ్యంలో మమతా బెనర్జీ ఒకటి స్పష్టం చేశారు. ఈ రాజకీయ వ్యూహం ఇక ప్రాంతీయ పార్టీల ఆధారంగా ఏర్పడే కూటమికి దారితీయవచ్చు అన్నారు. తరచూ కనిపిస్తున్న సంకేతాలను బట్టి అతిపెద్ద పార్టీకే మొదట ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఈ రోజు విషయానికి వస్తే 2019లో బీజేపీ మాత్రమే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించగలదు. అలాంటప్పుడు ఎన్నికలకు ముందే కూటమికి పొత్తులు కుదరకపోతే, ప్రతిపక్షాలకు అవకాశం కష్టమవుతుంది.

2019 కంటే ముందు అంటే 2018లో విజయం కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఎన్నికల్లో దెబ్బతిన్నప్పటికీ అది బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడంలో విజయం సాధించింది.

రాజకీయాల్లో సామ, దాన, దండ, భేద సూత్రం వర్తిస్తుంది. దీన్ని కాంగ్రెస్ కాస్త ఆలస్యంగా గుర్తించింది. తన ప్రత్యర్థి బీజేపీ నుంచే ఈ నైపుణ్యాలను నేర్చుకోవడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)