దేవీపట్నం: బోటు ప్రమాదాలు ఆపాలంటే ఎవరెవరు ఏమేం చేయాలి?

ఫొటో సోర్స్, Sangeetham Prabhakar/BBC
- రచయిత, బళ్ల సతీష్, సంగీతం ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
బోటు ప్రమాదాల నివారణలో నిర్వాహకులు, ప్రయాణికులు, పర్యవేక్షించే అధికారులు - ముగ్గురి పాత్రా ఉంటుంది. ఎక్కడ తేడా వచ్చినా, ఎవరు నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు నీటిలో కలిసిపోతాయి.
"మూలపాడు దగ్గర విపరీతంగా గాలి వాన వచ్చింది. లాంచిని కట్టేయాలని అడిగారు. సిబ్బంది వినిపించుకోలేదు. 'ఇలాంటి గాలులు వస్తుంటాయి, పోతుంటాయి. మనం ఎన్నోసార్లు వెళ్లాం కదా. మీకెందుకు భయం? తీసుకెళ్లే వాళ్లం మేమున్నాం కదా' అన్నారు. గాలి ఇంకా ఎక్కువ అయిపోయింది. వాడపల్లి ఎదురుగా ఉన్న మడిపల్లిలో కట్టేయాలన్నా వినలేదు. ఇక తిప్పకు (ఒడ్డుకు) 10 మీటర్లు ఉందనగా లాంచి వేగం బాగా తగ్గించారు. ఇలా చేశాక గాలి సుడిగుండంలా మారిపోయి, ఒక్కసారే ఇంచుమించు ఒక 20 మీటర్ల వరలాగా కెరటంలా లేచింది గాలి. అదే అమాంతంగా ముంచేసింది.. లాంచి మునిగిపోయింది" అంటూ ప్రమాదం జరిగిన తీరును బీబీసీకి వివరించారు లక్ష్మణ రావు అనే యువకుడు. దేవీపట్నం పడవ ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తుల్లో ఆయన ఒకరు.
ఈ దుర్ఘటనలో తప్పెవరిది? మానవ తప్పిదం ఎంత? ప్రకృతి ప్రకోపం ఎంత? - అనేది తేలడం అంత తేలిక కాదు. భవిష్యత్తులో ఈ ప్రమాదాలను నివారించాలంటే మాత్రం చేయాల్సింది చాలా ఉంది.

ఫొటో సోర్స్, Sangeetham PRabhakar/BBC
సంప్రదాయ బోటు డ్రైవర్లకు పరిసరాల్లోని నదులు, సముద్రంపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. సాధారణంగా ఎక్కడ లోతు ఎక్కువ, ఎక్కడ రాళ్లు ఉంటాయి, ఎక్కడ సుడులు వస్తాయి అన్న వివరాలు వారికి తెలుసు! తరతరాలుగా ఒకరి నుంచి మరొకరికి అబ్బుతున్న విజ్ఞానం, ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవం వారికి ఉంటుంది. అయినా ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణ పరిస్థితులపై అవగాహన ఉంటుంది సరే, మరి అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో వారికి తెలుసా అన్నది ప్రశ్న.
చాలాసార్లు సంప్రదాయ డ్రైవర్లు వాతావరణాన్ని సరిగా అంచనా వేయలేకపోవడం, సొంత అనుభవం మీద అతినమ్మకం ఉంచడం, ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఒత్తిడిలో తొందరపాటుతో వ్యవహరించడం లాంటివి చేటు చేస్తున్నాయి. ప్రయాణికుల ఒత్తిడి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Sangeetham Prabhakar/BBC
డ్రైవర్లకు అవగాహన కల్పించాలి
బోటు డ్రైవర్లు విధిగా పాటించాల్సిన ప్రాథమిక అంశాలతోపాటు, వాతావరణం గురించి వారికి సరైన సమాచారం అందించడం, తదనుగుణంగా సరైన నిర్ణయం తీసుకునేలా వారికి అవగాహన కల్పించడం, ప్రమాదాల గురించి వెంటనే సమాచారం అందించడం, బోటును వెంటనే గుర్తించడం, ప్రయాణికుల బోటులో వస్తువుల రవాణా జరగకుండా కట్టడి చేయడం, లైఫ్ జాకెట్లు వేసుకునేలా చూడడం - ఇలా జాగ్రత్తపడాల్సిన, కఠినంగా అమలు చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
1890 నాటి కాలువలు, ప్రజా రేవుల చట్టం (కెనాల్స్ ఎండ్ పబ్లిక్ ఫెర్రీస్ యాక్ట్-1890)లో ఎన్నో నిబంధనలు ఉన్నాయి. జలవనరుల శాఖ నుంచి పడవ లైసెన్సులు ఈ చట్టానికి లోబడే మంజూరు అవుతున్నాయి. కానీ నిబంధనల అమలుపై కచ్చితమైన నిఘా కొరవడింది.
ఈ నెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి - టేకూరు గ్రామాల మధ్య గోదావరి నదిలో ముగినిపోయిన బోటు విషయంలో చాలా నిబంధనలు పాటించలేదు. ప్రమాదం జరిగిన రోజు ఉదయమే బోటును పరీక్షించి లైసెన్స్ పొడిగించారు అధికారులు. కానీ సాయంత్రమే ప్రమాదం జరిగింది. అంటే కేవలం ఫిట్‌నెస్ పరీక్షలు చేస్తే చాలదు, చూడాల్సినవి ఇంకా ఉన్నాయి.
నిరుడు కృష్ణా నదిలో బోటు ప్రమాదం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని జలమార్గాల్లో వాటిని అమలు చేయాలని ఆదేశించింది.

ఫొటో సోర్స్, Sangeetham Prabhakar/BBC
2017 నవంబర్ 16న విడుదలైన జలవనరుల శాఖ జీవో 667 ప్రకారం బోటు లైసెన్సింగ్ నిబంధనలు:
1. సిబ్బంది సహా ప్రతి ప్రయాణికుడికీ లైఫ్ జాకెట్ ఉండాలి. ప్రతి ఐదుగురు ప్రయాణికులకూ నీటిపై తేలే బుడగ 'బోయ్(buoy)' ఉండాలి. ముంపు సమయంలో ప్రాణరక్షణకు ఇది ఉపయోగపడుతుంది.
2. మంటలు ఆర్పే యంత్రాలు, నావిగేషన్ పరికరాలు ఉండాలి.
3. పోలీస్, రెవెన్యూ, జలవనరులు, పర్యాటక శాఖ అధికారులు తనిఖీ చేశాక లైసెన్సు ఇవ్వాలి.
4. ప్రతీ బోటు ఎక్కే దగ్గరా ఆ లైసెన్స్ సర్టిఫికేట్ అతికించాలి.
5. లైసెన్సు లేని బోటు తిరగకూడదు
6. దరఖాస్తు చేసిన 15 రోజుల్లో లైసెన్స్ ఇవ్వాలి.
7. కలెక్టర్ ఏర్పాటు చేసిన బృందాలు మూడు నెలలకోసారి తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలి.
8. ఎంత మందికి లైసెన్సులు ఇచ్చారనే వివరాలు ఉండాలి. జలవనరులశాఖ మూడు నెలలకోసారి తనిఖీలు చేయాలి.
9. రద్దీగా ఉండే మార్గాల్లో ప్రమాదాలు, రాళ్లు, ఇసుక మేటలుండే చోట గుర్తులు పెట్టాలి.
10. ప్రధాన రేవులను గుర్తించి వాటికి కంట్రోల్ రూమ్‌లు పెట్టాలి.
11. పోలీస్, జలవనరులు, పర్యాటక శాఖల అధికారులు కంట్రోల్ రూమ్‌లలో ఉండాలి.
12. కంట్రోల్ రూముకు తన పరిధిలో తిరిగే బోట్లతో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉండాలి.
13. బోటు ఆపరేటర్లు బోట్లలో వైర్‌లెస్ సెట్లు, జీపీఎస్ పరికరాలు పెట్టుకోవాలి.
14. బోటును కంట్రోల్ రూమ్ సిబ్బంది క్షుణ్నంగా తనిఖీ చేసి డిపార్చర్ క్లియరెన్స్ ఇవ్వాలి. పాటించని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి.
15. విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ నాయకత్వం వహించాలి.
16. ముఖ్య రేవుల్లో రాష్ట్ర విపత్తు సహాయ దళం(ఎస్‌డీఆర్ఎఫ్) బృందాలు, అగ్నిమాపక, పోలీసు బృందాలు, బోట్లు, యంత్రాలు అందుబాటులో ఉంచాలి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తిరిగే బోట్లలో, పెద్ద రేవుల్లో ఈ నిబంధనలు చాలావరకు పాటించడం లేదు. లైసెన్సులు, ఫిట్‌నెస్ తనిఖీలు, లైఫ్ జాకెట్లు మాత్రమే ఎక్కువగా చూస్తారు. కంట్రోల్ రూములు, జీపీఎస్ పరికరాల వరకు ఇంకా రాలేదు.

ఫొటో సోర్స్, Sangeetham Prabhakar/BBC
నిబంధనలు ఎందుకు పాటించరు?
ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తే బోటు ఆపరేటర్లు దారికి వస్తారు. నిబంధనల అమలుకు పూర్తిస్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇది ప్రమాదాలు జరిగినప్పుడు కాకుండా, నిరంతర ప్రక్రియగా ఉండాలి.
చాలా సందర్బాల్లో ఇదంతా తమకు అవసరం లేదనే భావన సిబ్బందిలోనూ, ప్రయాణికుల్లోనూ కనిపిస్తోంది. రోజూవారీ బోటు ప్రయాణం చేసేవారు తమకు లైఫ్ జాకెట్లు అవసరం లేదనే అపోహతో ఉంటారు. సిబ్బంది కూడా అదంతా తమకు తెలుసనే భ్రమలో ఉంటారు. తామెన్నో తుఫాన్లు, వరదలు చూశామన్న మాటలు వారి నుంచి తరచూ వినిపిస్తాయి. నిబంధనలు పాటించడం తప్పనిసరని అందరూ గుర్తించేలా చేయాలి.
సంప్రదాయ డ్రైవర్లకు అనుభవం ఉన్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంతో కలిగే ప్రయోజనాలను వివరించి, దీని వాడకంపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. నీటి ప్రవాహం, గాలి దిశ, ప్రవాహంలో ఉన్న వస్తువులను అదుపు చేయడం లాంటి అంశాలపైనా శిక్షణ అవసరం.
జీవో 667ను అమలు చేస్తున్నాం: కలెక్టర్ కార్తికేయ మిశ్రా
"మేం జీవో 667ను పాటిస్తున్నాం. ఈ ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగింది. కృష్ణా, గోదావరి నదుల వెడల్పు తక్కువ. పది నిమిషాల్లో ఏదో ఒక ఒడ్డుకు చేరుకోవచ్చు. ఎలాంటి కమ్యూనికేషన్ సాధనం సహాయం లేకపోయినా వారు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. త్వరలోనే బోటు ఆపరేటర్లు అందరితో సమావేశం పెడతాం" అని తూర్పుగోదావరి కలెక్టర్ కార్తికేయ మిశ్రా బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Sangeetham Prabhakar/BBC
జనం ఏం చేయాలి?
ఏ నిబంధన అమలైనా సంబంధీకులందరూ పాటిస్తేనే ఫలితం ఉంటుంది. వీటి అమలులో అధికారుల నిబద్ధత ఒక ఎత్తయితే, జనం అప్రమత్తత మరో ఎత్తు. నిబంధనలు పాటించని బోటు ఎక్కబోమని ప్రయాణికులు తెగేసి చెబితే, అన్నీ చక్కబడే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Sangeetham Prabhakar/BBC
ప్రభుత్వం చొరవ చూపాలి
ప్రయాణికుల, పర్యాటకుల భద్రత దృష్ట్యా పడవ ప్రయాణాన్ని పూర్తిగా వ్యవస్థీకృతం చేయడం మంచిదే అయినప్పటికీ, దీని కారణంగా కొన్ని బోట్లకు, ప్రయాణికులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశమూ ఉంది. ప్రయాణికుల సంఖ్యపై పరిమితి లాంటి నిబంధనలు ఆదాయాన్ని బాగా తగ్గించేస్తాయి. సహజంగానే ధరలు పెరిగిపోతాయి. అప్పుడు ప్రయాణికులు ఈ బోట్లుకు ప్రత్యామ్నాయం వెతికే ప్రయత్నం చేస్తారు. అదే జరిగితే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది.
అన్ని నిబంధనలూ అమలవ్వాలి, ప్రయాణికులపై ధరల భారం పడకూడదు అని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే..
నిబంధనలు పాటించడానికయ్యే ఖర్చును ప్రభుత్వమే చొరవ చూపి పూర్తిగా లేదా పాక్షికంగా భరించాలి. లైఫ్ జాకెట్లు లాంటివి ఒకసారి కొంటే రెండు మూడేళ్లు పనికొస్తాయి. ఇలాంటి వాటి విషయంలో పర్యాటక బోట్లకు రాయితీలు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ రోజువారీ ప్రయాణికుల బోట్లకు వీటిని ఇవ్వొచ్చు. సంఖ్యాపరంగా రోజువారీ పాసింజర్ బోట్లు, వాటి ప్రయాణికులు తక్కువే కాబట్టి ఆ మొత్తం ప్రభుత్వానికి పెద్ద భారం కాబోదు.
ఇవి కూడా చదవండి:
- 11 తరాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ
- రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి.. కేంద్ర మంత్రి ఉత్తర కొరియా వెళ్లడం వెనుక రహస్యం ఏంటి?
- పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
- ఇంజినీర్స్ డే: హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- గాజా: అక్కడ బతుకు నిత్య నరకం
- చెర్నోబిల్: ఒకప్పుడు భయానక ప్రాంతం, ఇప్పుడు విహార స్థలం!
- కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం రావచ్చు: ఇమ్రాన్ ఖాన్
- ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
- అమెరికా గూఢచర్యం: ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పావురాలు సీక్రెట్ ఏజెంట్స్‌గా ఎలా పని చేశాయి... గుట్టు విప్పిన సిఐఏ
- ఈ బంగారు టాయిలెట్‌ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
- గూగుల్ మ్యాప్ గుర్తించిన నీటమునిగిన కారు, అందులో ఓ అస్థిపంజరం... దాని వెనుక 22 ఏళ్ళ నాటి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








