ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం: కులవివక్షను అధిగమించిన ఈ ఆలయంలో 11 తరాలుగా పూజారులంతా దళితులే

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు గ్రామంలోని ఓ ఆలయంలో తరతరాలుగా దళితులే అర్చకులుగా ఉండడం సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉప్పులూరులో ఉన్న చెన్నకేశవ ఆలయంలో దళితులు అర్చకులుగా కొనసాగుతున్నారు.
అక్కడ నిత్యం పూజలు చేస్తూ ఆలయానికి వచ్చేవారికి ఆశీర్వచనాలు అందిస్తుంటారు వారు.
ఉప్పులూరు చెన్నకేశవ ఆలయంలో సామాజిక చైతన్యం వెల్లివిరియడానికి సుదీర్ఘ చరిత్ర ఉందని గ్రామస్థులు చెప్పారు.
గ్రామస్థులు చెప్పిన ఆలయ చరిత్ర ప్రకారం.. పల్నాడు యుద్ధంలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మనాయుడి అనుచరుడిగా పేరున్న కన్నమదాసుకి అప్పట్లో అర్చకత్వం అప్పగించారు.
మలిదేవరాజు తరఫున బ్రహ్మనాయుడు పోరాడారు. విశిష్టాద్వైత సిద్దాంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన రామానుజాచార్యుల స్ఫూర్తితో సంస్కరణశీలిగా మారిన బ్రహ్మనాయుడు సమభావాన్ని పెంచడానికి చాపకూళ్ల పేరుతో అన్ని కులాల వారికి సహపంక్తి భోజనాలు పెట్టేవారని ప్రచారంలో ఉంది.
ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న కన్నమదాసుకి మాచర్ల, మార్కాపురంలో చెన్న కేశవస్వామి ఆలయాల అర్చక బాధ్యతలను బ్రహ్మనాయుడు అప్పగించారు.
ఆ తర్వాత కన్నమదాసు వారసుడు తిరువీధి నారాయణదాసు పల్నాడు యుద్ధం కారణంగా వలసపోయినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది.
అలా నారాయణదాసు సింహచలం చేరుకుని, కొన్నాళ్లు అక్కడి ఆలయంలో ఆశ్రయం పొంది, మళ్లీ పల్నాడు చేరుకునే క్రమంలో ఉప్పులూరు వచ్చినట్టు ఆలయ చరిత్రలో ఉంది.

ఇంటికో కేశవుడు..
ఈ ఊరిలో ప్రతి ఇంట్లో కేశవ అనే పేరున్నవారు ఉంటారని గ్రామస్థుడు రామస్వామి బీబీసీతో తెలిపారు.
ఈ గ్రామానికి పల్నాడు ప్రాంతం నుంచి వలస వచ్చిన వారి కారణంగా అనేక మార్పులు జరిగాయి.
సింహాచలం నుంచి పల్నాడుకి తిరిగి వెళ్లే క్రమంలో ఈ గ్రామంలో ఆగిన తిరు నారాయణ దాసు ఇక్కడి చెట్టు కింద పెట్టిన విగ్రహం తీయడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదని, అందుకే ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసి ఆలయం నిర్మించినట్టు మా పెద్దలు చెప్పారు.
‘అప్పటి నుంచి మా గ్రామ ఇలవేల్పుగా చెన్నకేశవ స్వామి కొనసాగుతున్నారు. ప్రతి ఇంటిలో ఒక్కరికైనా కేశవ స్వామి పేరు పెట్టుకుంటాం. మా ఊరి చరిత్రనే మార్చేసిన కన్నమదాసు వారసులే ఇప్పుడు అర్చకులుగా కొనసాగుతున్నారు’ అని రామస్వామి తెలిపారు.

'ఏడాదికి ఒక నెల సెలవు పెట్టి అర్చకత్వ బాధ్యతలు చూస్తాం'
తరతరాలుగా ఆలయ సేవలో ఉంటున్నామని ప్రస్తుతం ఆలయంలో అర్చక బాధ్యతలు చూస్తున్న వీధి రామ కేశవ దాసు బీబీసీకి తెలిపారు.
''ఇప్పటి వరకూ 11 తరాలుగా దేవుని అర్చకత్వంలో ఉన్నాం. ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరు చొప్పున 9 కుటుంబాలకు చెందిన వారు అర్చక బాధ్యతలు చూస్తుంటాం. పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకూ నెలకు ఒకరు చొప్పున బాధ్యతలు చూస్తాం. వైశాఖం, ధనుర్మాసాలలో అందరం కలిసి స్వామి వారి సేవలు చేస్తాం. అన్ని కులాల వారు భక్తిభావంతో ఆలయానికి వస్తారు. అందరినీ సమానంగా చూస్తారు. ఏ కార్యక్రమం జరిగినా మా సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రాధాన్యమిస్తారు. ఆర్చకత్వంలో ఉన్న వారందరం వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. బ్యాంకు మేనేజర్లు, సీఆర్పీఎఫ్, పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. ఎంత దూరంలో ఉన్నా ఆలయంలో అర్చకత్వం కోసం వస్తాం'' అని చెప్పుకొచ్చారు.
రఘువంశం, కుమార సంభవం, శబ్దమంజరి, అమరకోశం, మేఘదూతం, శిశు పాలవధ వంటి కావ్యాలు.. ప్రాచీన గ్రంథాల్లోని సంస్కృత శ్లోకాలు పఠించే విద్యను తమ పూర్వీకులు సొంతం చేసుకున్నారని.. వారి నుంచి తాము నేర్చుకున్నామని అర్చకుడు కృష్ణ కేశవదాసు తెలిపారు. సుప్రభాత సేవతో పాటు తిరుప్పల్లాణ్డు, తిరుపళ్లియెళుచ్చి, తిరుప్పావై చదువుతూ పూజలు చేస్తుంటామన్నారాయన.
వందల ఏళ్ల కిందటే వివక్షను పారదోలాం
చుట్టు పక్కల గ్రామాల్లో ఎలా ఉన్నప్పటికీ ఈ ఊరిలో మాత్రం ఆలయ అర్చకులుగా ఉన్న దళితులకు అన్నింటా ప్రాధాన్యం ఉంటుందని ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నిమ్మల సత్యనారాయణ తెలిపారు.
"తిరు నారాయణ దాసు వారసులు 1280 ప్రాంతంలో మా గ్రామానికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి అర్చకులుగా వారే ఉన్నారు. ఎలాంటి వివక్షా ఉండదు మా గ్రామంలో. అన్ని కులాల వారు భక్తిభావంతో ఇక్కడికి వస్తుంటారు. అర్చకుల పాదాలకు కూడా నమస్కరిస్తారు. 1868లో ఈ ఆలయ విగ్రహాన్ని చెన్నకేశవస్వామిగా రామాజనుజాచార్యులు నిర్థారించారు.
అప్పటి వరకూ అప్పలస్వామిగా పిలిచే స్వామిని చెన్నకేశవ స్వామిగా పేర్కొంటూ 1893లో నూజివీడు జమీందార్ రాజా పార్థసారథి అప్పారావు 40 ఎకరాలను కేటాయించారు. ప్రస్తుతం 25 ఎకరాల్లో అర్చక కుటుంబాలు సాగు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. మరో 13 ఎకరాలు ఆలయాభివృద్ధికి, రెండెకరాలు భజంత్రీలకు కేటాయింపులున్నాయి.
1784లోనే ఈ ఆలయానికి తొలి ధర్మకర్తల మండలి ఏర్పాటయ్యింది. వందల ఏళ్ల నాడే వివక్షకు చోటు లేకుండా చేసిన చరిత్ర ఉంది" అని ఆయన చెప్పారు.

సేవలన్నీ వారే చేస్తారు..
ఆలయంలో అర్చకత్వంతో పాటుగా అన్ని కార్యక్రమాలను 9 కుటుంబాల వారే నిర్వహించడం మరో విశేషం. సుమారుగా అర ఎకరం పైగా విస్తీర్ణంలో ఉన్న ఆలయాన్ని నిత్యం శుభ్రం చేయడంతో పాటుగా సుప్రభాత సేవ, అలంకరణ సేవ, మహానైవేద్యం, పవళింపు సేవల వరకూ దళిత అర్చకులే నిర్వహిస్తుంటారు.
కల్యాణోత్సవాల సమయంలో విగ్రహాలతో పాటుగా అర్చకులుగా ఉన్న దళితులు రథం మీద కూర్చుంటే వివిధ సామాజికవర్గాల వారు ఆ రథాన్ని లాగుతారని స్థానికుడు వీరాంజనేయులు తెలిపారు. వైశాఖ పౌర్ణమి నాడు జరిగే ఈ వేడుకకి గ్రామస్తులు ప్రాధాన్యమిస్తారు. దేశ, విదేశాలలో ఉన్న వారు సైతం కళ్యాణోత్సవాల కోసం తరలివస్తారు. ప్రముఖులు, అధికారులు వచ్చిన సందర్భాల్లో కూడా వారిని ప్రత్యేకంగా పీటల మీద కూర్చోబెట్టే ఆచారం లేదని, అందరూ సమానమే అనడానికి అదో సూచికని చెబుతున్నారు.
నాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ నుంచి గుర్తింపు
కులాలకు అతీతంగా సామాజిక సామరస్యానికి తార్కాణంగా ఉన్న ఆలయ కమిటీ బోర్డులో కూడా ప్రత్యేకతలున్నాయి. ట్రస్ట్ బోర్డులో కూడా అన్ని వర్గాల నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా కమిటీలో చోటు దక్కుతోంది.
ఈ ఆలయంలో పనిచేసిన వీధి కృష్ణమూర్తి దాసు పాండిత్యానికి రాష్ట్రపతి నుంచి గుర్తింపు దక్కింది. 1996లోనే నాటి భారత రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్శ.. కృష్ణమూర్తి దాసుని సత్కరించారు. దళిత అర్చక అవార్డు కూడా అందించారు.
భక్తుల నుంచి కానుకలు కూడా స్వీకరించకుండా, హుండీ కూడా ఏర్పాటు చేయని ఈ ఆలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం సామాజిక వివక్షకు దూరంగా ఉంటూ, అందరూ సమానమేననే భావనతో సాగడమే అని స్థానికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'టీటీడీ ఆలయాల్లో దళితుల నియామకం లేదు'
- మునివాహన సేవ: దళితుడిని పూజారి భుజాలపై ఎందుకు ఎక్కించుకున్నారు?
- భారత్‌లో కులం-మతం లేకుండా సర్టిఫికెట్ పొందిన మొట్ట మొదటి మహిళ
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- కమలీ: ఆస్కార్ 2020 బరిలో నిలిచిన ఈ అమ్మాయి జీవిత కథేంటంటే..
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
- ఇంజినీర్స్ డే: హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం రావచ్చు: ఇమ్రాన్ ఖాన్
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
- 9/11 పుట్టిన తేదీ, 9.11 గంటలు పుట్టిన సమయం, పాప బరువు 9.11 పౌండ్లు.. ఏమిటీ చిత్రం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








