డి.రాజా: సీపీఐ చరిత్రలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి దళితుడు

డి.రాజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డి.రాజా
    • రచయిత, సంజీవ్ చందన్
    • హోదా, బీబీసీ కోసం

సీపీఐ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ ఎంపీ డి. రాజా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకున్నారు.

95 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా దళితుడు ఎన్నికవడం ఇదే తొలిసారి.

పార్టీలో అత్యున్నతస్థాయి నాయకత్వంలో దళితులకు ప్రాధాన్యం లేదని కమ్యూనిస్టు పార్టీలు తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నాయి.

డి.రాజా

ఫొటో సోర్స్, Getty Images

1925లో సీపీఐని స్థాపించిన 11 ఏళ్ల తర్వాత అంబేడ్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. 1938లో సీపీఐ పార్టీ కార్మిక చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ఆందోళనలో లేబర్ పార్టీ పాల్గొంది.

కానీ, తర్వాత కాలంలో సీపీఐతో అంబేడ్కర్ సంబంధాలు క్షీణించాయి. 1952లో ఉత్తర ముంబయి నుంచి పోటీకిదిగిన అంబేడ్కర్‌పై సీపీఐ తన అభ్యర్థిని నిలిపింది.

1967 నాటికి బహుజనుల నుంచి నాయకత్వం మొదలవడం, వారికంటూ ప్రత్యేకమైన పార్టీలు ఉద్భవించడంతో కమ్యూనిస్టు పార్టీలకు దళితులు మద్దతు తగ్గుతూ వచ్చింది.

1990లో మండల్ కమిషన్ తర్వాత దేశంలో కులరాజకీయ నాయకత్వం మార్పు చెందడం మొదలైంది.

బీజేపీ, దాని అనుబంధ సంఘ్‌పరివార్ దళితులు, ఓబీసీ వర్గాల నుంచి నాయకత్వాలను సృష్టించుకుంది. కానీ, కమ్యూనిస్టు పార్టీలు విలువలతో రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఈ తీరుగా వెళ్లలేదు.

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

ఫొటో సోర్స్, Getty Images

పార్టీకి విధేయుడు

తమిళనాడుకు చెందిన డి.రాజా 1967లో సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్‌లో చేరారు. 1973లో పార్టీ ఆయనను మాస్కోకు పంపింది. 1974లో ఆయన పార్టీ ఫుల్‌టైం వర్కర్‌గా మారారు.

1976లో పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

1985లో ఆయన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో సేవ్ ఇండియా, ఛేంజ్ ఇండియా నినాదంతో దేశమంతా సైకిల్‌పై ప్రచారం చేశారు.

హైదరాబాద్‌లో 1992లో నిర్వహించిన పార్టీ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

ఫొటో సోర్స్, Getty Images

జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్‌కు

2006లో తమిళనాడు నుంచి పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా డి. రాజా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. జులై 24న ఆయన పదవీకాలం ముగియనుంది.

రెండుసార్లు ఏఐడీఎంకే, డీఎంకే మద్దతుతో పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది. సభలో రాజా చాలా క్రీయాశీలకంగా వ్యవహరిస్తుంటారు. దేశంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై సభలో గళమెత్తుతుంటారు.

జంతర్ మంతర్ వేదికగా అనేక అంశాలపై ఆయన గతంలో ఆందోళనలు చేశారు.

ప్రస్తుతం సీపీఐ ప్రాబల్యం క్షీణిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ నుంచి లోక్‌సభకు కేవలం ఇద్దరు ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)