మహారాష్ట్ర రైతులను సీపీఐ(ఎం) ఎలా సమీకరించింది?

ఫొటో సోర్స్, PRASHANT NANAWARE/BBC
నాసిక్ ప్రాంతం నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పూర్తి చేసిన మహారాష్ట్ర రైతులు ముంబై చేరుకున్నారు. తమ పంటలకు మరింత మెరుగైన ధర ఇవ్వాలని, తమ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలో ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) నిర్వహణలో ఆ పాదయాత్ర చేపట్టారు.
ఈ పాదయాత్రలో రైతుల ప్రధాన డిమాండ్లు:
- అటవీ భూములపై యాజమాన్య హక్కులు
- పంటకు మెరుగైన ధర
- రైతులకు పింఛన్లు
- తుపానులు, పంట చీడల కారణంగా పంట నష్టానికి పరిహారం
- తమ ప్రాంతంలోని నదీజలాల నుంచి తమ వాటా నీరు
- రైతుల జాతీయ కమిషన్ సిఫార్సుల అమలు
- రుణమాఫీ పథకం సక్రమంగా అమలు
- సామాజిక అటవీ హక్కుల స్థానంలో వ్యక్తిగత అటవీ హక్కులు

ఫొటో సోర్స్, Rahul Ransubhe/BBC
మహారాష్ట్రంలో పార్టీ పటిష్టంగా లేకున్నా, సీపీఐ(ఎం)రైతులను ఎలా సమీకరించగలిగింది?
కమ్యూనిస్టు పార్టీకి మహారాష్ట్రలోని నాసిక్, పాల్ఘార్ జిల్లాలలో, అహ్మద్‌నగర్ జిల్లాలోని కొంత ప్రాంతంలో చెప్పుకోదగ్గ ప్రభావం ఉంది.
ముంబై వీధుల్లో కదం తొక్కుతున్న రైతులంతా నాసిక్ జిల్లాలోని కల్వాన్, దిండోరి పేఠ్, సర్గానా; పాల్ఘార్ జిల్లాలోని తలసారి, జవ్హార్, మొఖాడా; థానె జిల్లాలోని షాహపూర్, మురాదాబాద్; అహ్మద్‌నగర్ జిల్లాలోని అకోలె, సంగమనేర్; జల్గావ్ జిల్లాలోని కొన్ని గిరిజన ప్రాంతాలకు చెందిన వారు.
సీపీఐ(ఎం) ఎమ్మెల్యే జీవ పాండు గావిత్‌కు నాసిక్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో మంచి పట్టు ఉంది. పాల్ఘార్ జిల్లాలో కూడా ఆ పార్టీకి గతంలో చాలామంది శాసనసభ్యులు ఉన్నారు.
మరోవైపు ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి అజిత్ నవాలె గత దశాబ్దకాలంగా గిరిజన సమస్యలపై పోరాడుతున్నారు. గావిత్, నవాలె ఇద్దరూ ఈ పాదయాత్రకు నేతృత్వం వహిస్తున్నవారిలో ప్రముఖులు. గిరిజన రైతులను చైతన్యవంతం చేయడంలో వారిదే ముఖ్యపాత్ర.

ఫొటో సోర్స్, Rahul Ransubhe / BBC
రైతులు ఏమంటున్నారు?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తాను రూ. 40 వేలు రుణం తీసుకున్నానని నాసిక్ జిల్లా పంగార్నె గ్రామానికి చెందిన సుభాష్ కాలు గాంగొడె తెలిపారు.
ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించగానే, తాము పత్రాలన్నీ నింపి, రుణమాఫీకి దరఖాస్తు చేశామని అన్నారు.
కానీ నాలుగు నెలలు గడిచినా, వాళ్లకు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం మాత్రం లక్షన్నర వరకు రుణమాఫీ చేశామని చెబుతోంది.
రైతుల రెండో సమస్య - అటవీ భూములు.
2007-08లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 68 మంది సీపీఎమ్ ఎంపీలు ఒక చట్టం ఆమోదం పొందడం కోసం కృషి చేశారు. ఆ చట్టం కింద గ్రామపంచాయితీ, స్థానిక సంస్థలతో కలిసి ఒక అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ అటవీభూములను సాగు చేసుకుంటున్న వారి కుటుంబ పెద్ద పేరిట భూములు కేటాయించేలా చూస్తుంది.
ఆదివాసీలు తాము సాగు చేసుకుంటున్న అటవీభూములను తమకే కేటాయించాలని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Rahul Ransubhe/BBC
తమ పంటలకు సరైన మద్దతు ధర కల్పించాలని, రైతులకు జరైన జీవనోపాధి కల్పించాలని అమరావతికి చెందిన చాయాతాయి గుల్హానేకోరారు.
తమకు సుమారు ఒక లక్ష అప్పు ఉందని, దానిని మాఫీ చేయాలని కోరారు.
ఎలాంటి ఉపాధి కానీ, పింఛన్ కానీ లేకపోవడంతో గుడ్డివాడైన తన భర్త ఆరు నెలల క్రితం మరణించాడని తెలిపారు. ఉపాధి కోసం తన కుమారులు ఇంకా అక్కడా ఇక్కడా తిరుగుతున్నారని అన్నారు.

ఫొటో సోర్స్, Rahul Ransubhe/BBC
తాము ఏ అటవీభూముల్ని సాగు చేసుకుంటున్నామో, వాటిపై తమకు హక్కు కల్పించాలని నాసిక్ జిల్లా సుర్గానా తెహసీల్‌కు చెందిన రమేష్ దేవరామ్ లహరే అన్నారు.
తమకు భూములు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు అది జరగలేదని తెలిపారు. తమకు 5-6 ఎకరాలు ఇవ్వాలని రమేష్ కోరారు.
తన తల్లిదండ్రులు, సోదరిని తానే పోషించాలని, పొలాల్లో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు తెలిపారు.
‘‘మా రైతులమంతా మా భూమిపై మాకే హక్కు ఉండాలని కోరుతున్నాం'' అని రమేష్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








