9/11 పుట్టిన తేదీ, 9.11 గంటలు పుట్టిన సమయం, పాప బరువు 9.11 పౌండ్లు.. ఏమిటీ చిత్రం?

ఫొటో సోర్స్, METHODIST HEALTHCARE
అమెరికా 9/11 దాడుల వార్షిక దినమైన సెప్టెంబరు 11న రాత్రి 9 గంటల 11 నిమిషాలకు 9 పౌండ్ల 11 ఔన్సుల బరువుతో తనకు బిడ్డ పుట్టిందని, తను ఓ అద్భుతమని అమెరికా మహిళ చెబుతున్నారు.
టెనెసీ రాష్ట్రం జర్మన్‌టౌన్‌లో ఉన్న మెథడిస్ట్ లెబాన్హర్ ఆస్పత్రిలో పుట్టిన ఈ శిశువు పేరు క్రిస్టీనా బ్రౌన్.
క్రిస్టీనా- నాటి విధ్వంసం జ్ఞాపకాల మధ్య ఈ లోకంలోకి వచ్చిన కొత్త వెలుగు అని తల్లి కామెట్రియోన్ మూరె-బ్రౌన్ చెప్పారు.
బుధవారం దాడుల పద్దెనిమిదో వార్షిక దినం సందర్భంగా- న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య కేంద్రం(డబ్ల్యూటీసీ) భవనాలు కూలిన ప్రదేశం 'గ్రౌండ్ జీరో' వద్ద, పెంటగాన్, పెన్సిల్వేనియా, ఇతర ప్రాంతాల్లో సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి.
సిజేరియన్ ఆపరేషన్‌తో వైద్యులు బిడ్డను బయటకు తీశారు. బిడ్డ పుట్టిన సమయం, బరువు చూసి ఆపరేషన్ థియేటర్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. శిశువు బరువు కేజీల్లో చెబితే దాదాపు 4.4 కేజీలు.

ఫొటో సోర్స్, METHODIST HEALTHCARE
"క్రిస్టీనా పుట్టిన సమయాన్ని వైద్యులు ప్రకటించడం మేం విన్నాం. ఆమె బరువు తొమ్మిది పౌండ్ల 11 ఔన్సులని తెలిసిన తర్వాత ఆస్పత్రిలో అందరూ ఆశ్చర్యపోయారు" అని తండ్రి జస్టిన్ బ్రౌన్ తెలిపారు. విషాదకరమైన ఈ రోజున (సెప్టెంబరు 11న) బిడ్డ జననం తమకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
'ఇది చాలా అరుదు'
బిడ్డ పుట్టిన తేదీ, సమయం, బరువుపై ఆస్పత్రిలో మహిళా సేవల విభాగం సారథి రేచల్ లాగ్లిన్ స్పందిస్తూ- ఇలాంటి కాకతాళీయమైన సందర్భాలు చాలా అరుదన్నారు.
"మహిళా సేవల విభాగంలో 35 ఏళ్లకు పైగా పనిచేస్తున్నా. పుట్టిన తేదీ, పుట్టిన సమయం, బరువు ఇలా అన్ని నంబర్లూ ఒకే విధంగా ఉండటం నేనెన్నడూ చూడలేదు" అని రేచల్ తెలిపారు.
2001 సెప్టెంబరు 11న ఇస్లామిక్ మిలిటెంట్లు హైజాక్ చేసిన విమానాలతో న్యూయార్క్‌లోని డబ్ల్యూటీసీ భవంతులపై దాడి జరిపి నేల కూల్చారు. దాడిలో మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌పైనా, పెన్సిల్వేనియాలోనూ నాడు దాడులు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- సిజేరియన్ తరువాత సాధారణ ప్రసవం సాధ్యమేనా?
- మలేరియా వ్యాధి నిరోధక టీకా.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్
- రియల్ లైఫ్ అపరిచితురాలు: ఒక్క మహిళలో 2500 మంది..మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌కు లోనైన జెనీ హెయిన్స్ కథ
- ప్రసవం: సిజేరియన్ కన్నా సహజకాన్పుతోనే శిశువుకు మేలు
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- సోషల్ మీడియా నుంచి మీ పర్సనల్ డేటాను వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








