తమిళనాడులో దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...

ఫొటో సోర్స్, youtube
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సోషల్ మిడియాలో గత కొన్ని రోజులుగా ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో ఒక దళితుడి శవాన్ని అంత్యక్రియల కోసం నదిపై ఉన్న ఒక వంతెనపై నుంచి తాళ్ల సాయంతో కిందికి దించారని చెబుతున్నారు. మీడియాలో దీనిని కులవివక్షగా చెప్పారు.
కానీ, ఈ ఘటనకు నిజంగా కారణం అదేనా, కులవివక్షతోనే ఇలా జరిగిందా అన్నది తెలుసుకోడానికి బీబీసీ ప్రయత్నించింది.
ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లా, నారాయణపురం గ్రామంలో జరిగింది. అక్కడ కుప్పన్(ఎస్సీ) అనే వృద్ధుడి మృతదేహాన్ని అంత్యక్రియలకు ఒక ప్రైవేటు భూమిలోంచి తీసుకెళ్తుంటే అక్కడ ఉన్నవారు అడ్డుకున్నారు.
బీబీసీ బృందం ఈ ఘటన వెనుక ఉన్న నిజాలు తెలుసుకోడానికి నారాయణపురం గ్రామం చేరుకుంది.
వెల్లూర్ జిల్లా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామంలోని 40 ఆది ద్రవిడర్ దళిత కుటుంబాల్లో 200 మంది ఉన్నారు.

కుప్పన్ ఎవరు
కుప్పన్ 55 ఏళ్ల వృద్ధుడు. కొన్నేళ్ల క్రితం ఆయన నారాయణపురంలో ఉండేవారు. పెళ్ళయిన కొన్నేళ్లకు ఆయన స్వగ్రామం వదిలి తన భార్య ఊరైన పుదుకోవిల్ వెళ్లిపోయారు.
తర్వాత కుప్పన్‌కు అక్కడే పని దొరికింది. ఆ తర్వాత ఆయన తన భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో అదే గ్రామంలో ఉండిపోయారు.
ఆగస్టు 16న రాత్రి పదిన్నరకు కుప్పన్ పనికి వెళ్లి తిరిగివస్తున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృతిచెందాడు.
ఆ తర్వాత వానియాంబడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. ఆ తర్వాత దానిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అంత్యక్రియలు నిర్వహించేందుకు కుప్పన్ కుటుంబం ఆయన మృతదేహాన్ని నారాయణపురం తీసుకొచ్చారు.

అంత్యక్రియల నిర్ణయం
నారాయణపురంలో ఆది ద్రావిడర్ సమాజం కోసం ఒక శ్మశానం ఉంది. కానీ అక్కడ అంత్యక్రియల కోసం సరైన ఏర్పాట్లు లేవు.
దాంతో, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు శ్మశానం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నది దగ్గర కుప్పన్ మృతదేహానికి దహనక్రియలు చేయాలనుకున్నారు.
నదికి రెండు వైపులా పట్టా భూములు ఉన్నాయి. దాంతో కుప్పన్ కుటుంబ సభ్యులు దహన క్రియల కోసం కావల్సిన కట్టెలు, మిగతా వస్తువులన్నీ వంతెన పైనుంచి కిందికి వేశారు.
అది చూసి పొలంలో ఉన్న గీత అనే మహిళ అలా ఎందుకు వేస్తున్నారని అడిగారు.
ఆమె బీబీసీతో "నేను వారిని నదిలో కట్టెలు ఎందుకు వేస్తున్నారని అడిగాను. దాంతో వాళ్లు నదీ తీరంలో దహన క్రియలు చేయాలి అని చెప్పారు. పట్టా భూముల్లో అలాంటివి చేయకూడదని నా భర్త వాళ్లకు చెప్పారు. భూమి యజమానిని పిలిచారు. ఆ తర్వాత ఆ భూమి యజమాని ఏమన్నాడో ఏమో నాకు తెలీదు" అన్నారు.
గీత భర్త నారాయణన్ మాత్రం బీబీసీతో ఆ విషయం గురించి మాట్లాడ్డానికి నిరాకరించారు.
కుప్పన్ 27 ఏళ్ల కొడుకు కన్నదాసన్, "వాళ్లు కట్టెలు వేయడాన్నే అడ్డుకోవడంతో, మేం మృతదేహాన్ని తాళ్లతో కిందికి దించాం. ఆ తర్వాత దహనక్రియలు పూర్తి చేశాం" అన్నారు.
ఆ సమయంలో కుప్పన్ బంధువులు కొందరు అదంతా వీడియో తీశారు. దానిని తమకు తెలిసినవారికి పంపించారు. దాంతో ఆ వీడియో మెల్లమెల్లగా వైరల్ అయ్యింది.
కుప్పన్ బంధువులతో మాట్లాడిన భూమి యజమాని, ఈ విషయం ముందే తెలిసుంటే వారిని తన భూమిలోంచి వెళ్లనిచ్చేవాడినని చెప్పారు. ఆ విషయాన్ని అంత పెద్దది చేసుండకూడదని అన్నారు.
కుప్పన్ కుటుంబం వారు అంత్యక్రియలకు అదే భూమి నుంచి వెళ్లుండచ్చని ఇద్దరూ చెబుతున్నారు.

భూమి యజమాని ఏం చెప్పాడు
కుప్పన్ అంత్యక్రియలు మున్నార్ దగ్గర జరిగాయి.
ఆ ప్రాంతంలో ఉన్న భూమి సుందరం అనే వ్యక్తిది. ఆ పొలానికి ఇంకోవైపు ఒక ఆలయం, ఆ ఆలయానికి వచ్చే వాహనాల పార్కింగ్ ప్లేస్ ఉన్నాయి.
అక్కడ సెక్యూరిటీ గార్డ్ నారాయణన్ మాట్లాడ్డానికి నిరాకరించినా, ఆ భూమి యజమాని అల్లుడు దేవకుమారన్ మాత్రం బీబీసీతో మాట్లాడారు.
"ఇలా జరగడం ఏమాత్రం సరికాదు. మా భూమిని చూసుకుంటున్న వాళ్లు వాళ్లను అడ్డుకున్నారు. మమ్మల్ని సంప్రదించి ఉంటే.. వాళ్లను మృతదేహం తీసుకెళ్లనిచ్చేవాళ్లం" అని ఆయన చెప్పారు.
నారాయణపురంలో ఆదిద్రవిడర్, వన్నియార్, గౌండర్ సమాజం వారు ఉంటున్నారు. వారు వెళ్లిన భూమి గౌండర్ భూముల మధ్య ఉంది.
చాలా ఏళ్ల క్రితం ఆది ద్రవిడర్ సమాజంలోని ఒక వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలప్పుడు కూడా ఇలాగే జరిగింది. కానీ, అవి ఎక్కడ జరిగాయి అనే దానిపై ఎలాంటి వివాదం జరగలేదు.

ప్రభుత్వం ఏమంటోంది
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత వానియంబడి తహశీల్దారు గత గురువారం కేసును సమీక్షించారు.
"నారాయణపురం పంచాయతీలో 3.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 21,780 చదరపు అడుగుల భూమిని శ్మశానం కోసం ఇస్తున్నాం. త్వరలో అక్కడ అంత్యక్రియలకు కావల్సిన ఏర్పాట్లు కూడా చేస్తాం అని స్థానిక అధికారులు అన్నారు.
మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత భారత ప్రభుత్వ అడిషనల్ సొలిసిటర్ జనరల్ కార్తికేయన్ ఈ కేసును జడ్జిలు మణికుమార్, సుబ్రమణ్యం ప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ కేసులో జోక్యం చేసుకున్న వెల్లూర్ కోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని జిల్లా అధికారులను కోరింది.
బీబీసీ అక్కడి డిప్యూటీ కలెక్టర్ ప్రియాంకతో మాట్లాడింది. "శనివారం ఈ విషయం మాకు తెలిసింది. మేం అందరం ఆఫీసులోనే ఉన్నాం. కానీ మాకు, పోలీసులకు ఎవరూ దీని గురించి ఫిర్యాదు చేయలేదు. మేం దీనిపై విచారించినపుడు పట్టా భూముల యజమానులు తాము దానికి అనుమతి నిరాకరించలేదని చెప్పారు. అటు ఆది ద్రవిడర్ సమాజం మాత్రం మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు. అలాంటప్పుడు ఎవరైనా దీనిని ఎలా విచారించగలరు. ఇప్పుడు శ్మశానం కోసం భూమిని కేటాయించాం" అని ప్రియాంక చెప్పారు.

ఈ విషయంలో పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కుప్పన్ కుటుంబ సభ్యులను అడిగినపుడు వారు దహనక్రియల్లో బిజీగా ఉన్నామని, అందుకు శవాన్ని వంతెనపై నుంచి దించాలని మేమే నిర్ణయించాం అని చెప్పారు.
వన్నియర్ సమాజం వారి భూమిలోంచి శ్మశానంలోకి రాకుండా ఇప్పుడు అంత్యక్రియలకు ఇచ్చిన స్థలాన్ని కూడా మార్చాలని ఆదిద్రావిడులు కోరుతున్నారు.
దీనిపై ప్రియాంక "ఇలాంటి విషయాల నుంచి బయటపడడానికి వారికి శ్మశానం కోసం భూమి ఇచ్చారు. వన్నియర్ సమాజం వారు రోడ్డుకు రెండు వైపులా ఉంటారు. అది ఒక పొడవాటి రోడ్డు. ఈ రోడ్డు నుంచి అందరూ వస్తూపోతూ ఉంటారు. అలాంటప్పుడు అంతిమయాత్రకు ఈ రోడ్డుపైనుంచి వెళ్లడంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ, వాళ్లు తమ ఇంటి దగ్గరే శ్మశానం కోసం భూమి కోరుతున్నారు. కానీ, అక్కడ ప్రభుత్వం దగ్గర ఎలాంటి భూమీ లేదు" అన్నారు.
ఆది ద్రవిడ సమాజానికి ఇక మీదట ఇలాంటి స్థితి ఎప్పుడైనా ఎదురైతే పోలీసులు, జిల్లా అధికారులను సంప్రదించాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఈ మహిళలు తుపాకీ రిపేర్ చేస్తే తూటా సూటిగా దూసుకుపోవాల్సిందే...
- చిన్నారికి పాలు పడుతూ, జో కొడుతూ పార్లమెంటును నడిపించిన స్పీకర్
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








