పన్నెండేళ్ల బాలుడి సాహసం.. వరదలో అంబులెన్సుకు ఎలా దారి చూపించాడంటే

ఫొటో సోర్స్, BHEEMARAYA
కర్నాటకకు చెందిన వెంకటేశ్ అనే 12 ఏళ్ల బాలుడిపై సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. స్థానిక అధికారులు కూడా అతడికి సన్మానం చేశారు.
దక్షిణ భారతంలోని చాలా రాష్ట్రాలు ప్రస్తుతం వరదలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే.
కర్నాటకలోనూ చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వాటిలో రాయ్‌చుర్ జిల్లాలోని దేవదుర్గ్ తాలూకా కూడా ఉంది.
కొన్ని రోజుల క్రితం అక్కడికి వచ్చిన ఓ అంబులెన్స్‌కు వరద కారణంగా, దారేదో తెలియక కదల్లేని పరిస్థితి ఏర్పడింది. కొంత దూరం వెళ్తే గానీ, సరిగ్గా ఉన్న రోడ్డుపైకి ఆ వాహనం చేరుకోదు.
చాలా మంది ఆ రోడ్డుపై నిల్చొని చూస్తున్నారు. 12 ఏళ్ల వెంకటేశ్ మాత్రం ఆ వాహనానికి దారి చూపించేందుకు సాహసానికి తెగించాడు.
వరద నీటిలో అంబులెన్స్ ముందు పరిగెత్తాడు. ఆ సమయంలో ఆ వాహనంలో కొందరు రోగులు, రెండు మృతదేహాలు ఉన్నాయి.
అంబులెన్స్ ముందు వెంకటేశ్ పరిగెడుతున్నప్పుడు కొందరు మొబైల్‌తో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.
ట్విటర్‌లో ఈ వీడియోకు చాలా మంది స్పందించారు. వెంకటేశ్ సాహసాన్ని అభినందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘దారి బాగా తెలుసు’
వెంకటేశ్ వీడియో వైరల్ కావడంతో బీబీసీ అతడితో మాట్లాడింది. ఆ చర్య వెనుకున్న వివరాల గురించి అడిగి తెలుసుకుంది.
''నీళ్లు ఎంతవరకూ ఉన్నాయో డ్రైవర్‌కు తెలియదు. నేను వాహనం ముందు పరిగెడతే, నీటి లోతు తెలుస్తుందని ఆయనకు చెప్పా. నా వెనకాలే రమ్మని చెప్పి, పరిగెత్తా'' అని వెంకటేశ్ చెప్పాడు.
వెంకటేశ్ ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అంబులెన్స్ ముందు దాదాపు వంద మీటర్ల దూరం అతడు పరుగెత్తాడు.
''నా వల్లైనంతవరకూ పరుగెత్తా. కొన్ని సార్లు నా ఛాతీ వరకూ నీళ్లు వచ్చాయి. ఆగకుండా పరుగెత్తుతూనే ఉన్నా. అంబులెన్స్ నా వెనకాలే వచ్చింది. నేను స్కూల్‌కు రోజూ ఆ దారి నుంచే వెళ్తుంటా. అందుకే ఆ దారి గురించి నాకు బాగా తెలుసు'' అని అతడు వివరించాడు.

ఫొటో సోర్స్, BHEEMARAYA
‘అమ్మ తిట్టింది’
ఈ సాహసం చేసి, ఇంటికి వచ్చాక వెంకటేశ్‌కు అతడి తల్లి చేతిలో చీవాట్లు తప్పలేదు. వెంకటేశ్ సోదరుడు భీమరాయ ఈ విషయాన్ని బీబీసీతో చెప్పారు.
''మొదట అమ్మ వెంకటేశ్‌ను బాగా కోప్పడింది. కానీ, కొన్ని టీవీ ఛానెళ్లు అతడి వీడియోను చూపించడం మొదలుపెట్టాయి. చాలా మంది అతడిని మెచ్చుకున్నారు'' అని వివరించారు.
వెంకటేశ్ సాహసం గురించి తెలియజేస్తూ రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి మణివన్నన్ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అతడికి 'సాహస పురస్కారం' ఇవ్వాలని సిఫార్సు చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ వెంకటేశ్‌కు సన్మానం చేసింది.
ఇవి కూడా చదవండి:
- నిజాం మ్యూజియంలో బంగారు టిఫిన్ బాక్సును ఎలా దొంగిలించారంటే..
- పారీక్: పాకిస్తాన్లో ఉర్రూతలూగిస్తున్న పాట.. మీరు విన్నారా?
- అమ్మానాన్నలు కావాలన్న వీళ్ల ఆశలు ఫలిస్తాయా?
- గర్భస్థ పిండానికి జీవించే హక్కు లేదా?
- 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సృష్టించడమే లక్ష్యం: ఆర్థిక సర్వే
- దక్షిణాఫ్రికా: 'నాజీ మండేలా' చిత్రంపై వివాదం
- ప్రకృతిని కాపాడేందుకు వేటను వదిలేసిన ఆదివాసీలు
- అమెరికాలో హరికేన్ ఫ్లోరెన్స్: వాళ్లు తిరిగి వచ్చేసరికి వాళ్ల ఇళ్లు ఉంటాయో ఉండవో
- ‘నా కుమారుడు స్వలింగ సంపర్కుడు.. అలా చెప్పుకోవడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








