‘నా కుమారుడు స్వలింగ సంపర్కుడు.. అలా చెప్పుకోవడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను’

ఫొటో సోర్స్, Getty Images
స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు తాజా తీర్పు అనంతరం ఓ ‘గే’కు తండ్రి అయిన వ్యక్తి తన అనుభవాలను ఇలా పంచుకున్నారు...

నాకు ఆ రోజు ఇప్పటికీ బాగా గుర్తు. అప్పుడు మా అబ్బాయి హర్షు ముంబయి ఐఐటీలో ఎం.టెక్ చదువుతున్నాడు. హాస్టల్‌లో ఉండే హర్షు ఓసారి సెలవుల్లో ఇంటికి వచ్చాడు.
‘మీ ఇద్దరితో పర్సనల్‌గా మాట్లాడాలి’ అని నన్నూ, నా భార్యనూ ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఏదైనా ప్రేమ వ్యవహారం గురించి చెబుతాడేమో అని నాకు అనిపించింది. ఒకవేళ అదే విషయం చెబితే, ‘ఈ పెళ్లి జరగదు’ అని చెప్పాలని మనసులో అనుకున్నా.
ఇంతకీ అసలు అమ్మాయి గురించిన ప్రస్తావన ఎలా ప్రారంభిస్తాడోనని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కానీ హర్షు పూర్తిగా సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించడం మొదలుపెట్టాడు.
కొన్నాళ్ల క్రితం హర్షు ఓ క్యాంప్‌కు వెళ్లాడు. అక్కడ విద్యార్థులంతా రకరకాల యాక్టివిటీస్‌లో పాల్గొన్నారు. ఓ ఈవెంట్‌లో భాగంగా విద్యార్థులు తమ లైంగికత గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. హర్షు వంతు వచ్చేసరికి లేచి నిలబడి, ‘నా లైంగిక స్వభావం గురించి చర్చించాలంటే కొంత కలవరంగా ఉంది. నేను స్వలింగ సంపర్కుడిని అనిపిస్తోంది’ అని హర్షు వాళ్లతో చెప్పాడట.
ఆ విషయాలన్నీ హర్షు వివరిస్తుంటే నాకు నోట మాటరాలేదు. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కాసేపు వాడు మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడేమో అనిపించింది. ‘నువ్వు చెప్పేది నిజమేనా?’ అని గట్టిగా అడిగా. ‘అవును’ అంటూ హర్షు అంతే దృఢంగా తల ఊపాడు.
నా భార్య సులూ వాడిని కొన్ని ప్రశ్నలు వేసింది. అవేంటో నాకు సరిగా గుర్తులేదు. ఆ సమయంలో నా ఆలోచనలన్నీ ఎక్కడెక్కడికో వెళ్లిపోయాయి.

ఫొటో సోర్స్, SAMEER SAMUDRA
నాకు స్వలింగ సంపర్కం గురించి కొంత అవగాహన ఉంది. సినిమాల్లో, సాహిత్యంలో అక్కడక్కడా ఆ విధమైన లైంగిక ధోరణి కనిపించేది. కానీ చివరికి అది నా ఇంటి తలుపే తడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు.
‘ఈ విషయం గురించి ఇంకాస్త లోతుగా ఆలోచించాలి. ఇప్పుడీ చర్చను ఇక్కడితో ముగిద్దాం’ అని ఆ రోజు సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టా. ఆ తరువాత హర్షు ముంబై వెళ్లిపోయాడు. నా భార్య తన ఆఫీసు పనుల్లో పడిపోయింది. నేను వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని పీహెచ్‌డీ చేస్తూ బిజీగా ఉన్నా.
ఇతరులకు ఈ విషయం తెలిస్తే ఎలా?
మేం మా పనుల్లో లీనమవ్వడానికి ఎంత ప్రయత్నిస్తున్నా, హర్షు చెప్పిన మాటలు మాత్రం మెదడుని వదిలి పోవట్లేదు. ఇప్పుడేం చేయాలి? హర్షుకు మానసికంగా ఏదైనా సమస్య ఉందా? హాస్టల్లో వాడి స్నేహితులకు ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుంది? బంధువులు ఎలా స్పందిస్తారు?... ఇలాంటి ఆలోచనలన్నీ మనసును ఉక్కిరిబిక్కిరి చేసేవి.
ఓ రోజు సులూ నా దగ్గరకు వచ్చి, ‘హర్షు తెలిసీ తెలియక ఏదో మాట్లాడుతున్నాడు. కొన్నాళ్లకు వాడే కుదురుకుంటాడు’ అని చెప్పింది. కానీ, నాకు మాత్రం అలా అనిపించలేదు.


మాకు ఏమాత్రం పరిచయంలేని ఒక అంశాన్ని మేం ఎదుర్కొంటున్నాం అని అర్థమైంది. సులూ మనసును కూడా అవే ఆలోచనలు వెంటాడుతున్నాయేమో. తనో బాగా చదువుకున్న ఇంజినీర్, వ్యాపారవేత్త కావొచ్చు. కానీ తను కూడా ఓ అమ్మే కదా.
క్రమంగా రోజులు, నెలలు గడిచిపోయాయి. హర్షు ఎం.టెక్ పూర్తయింది. విదేశాలకు వెళ్లడం వాడికి ఇష్టం లేదు. ఏదో సేవా సంస్థలో వాడికి ఫెలోషిప్ వచ్చింది. దానికోసం చంద్రపూర్ వెళ్లాడు.
ఈలోగా స్వలింగ సంపర్కం గురించి మేం అవగాహన పెంచుకునే ప్రయత్నం చేశాం. ఈ అంశంపై దేశంలో చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ల వెబ్‌సైట్ల ద్వారా సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అప్పుడే ‘సమ్-పాథిక్’ (సహ-యాత్రికుడు) పేరుతో ఎల్‌జీబీటీక్యూ వారికోసం సంస్థను నడిపే బిందు మాధవ్ ఖిరే గురించి తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
బిందు మాధవ్‌ను కలవడానికి హర్షు సంశయించాడు. దాంతో మొదట నేనే ఒంటరిగా వెళ్లి ఆయన్ను కలిశా. ఆయనతో మాట్లాడాక చాలా భారం దిగిపోయినట్లు అనిపించింది. ఎల్‌జీబీటీలకు సంబంధించిన అనేక సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఆ తరువాత చాలా సార్లు ఆయన్ను కలిశా. పత్రికలు, మేగజీన్ల ద్వారా స్వలింగ సంపర్కం గురించిన మరింత సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించాం.
అది సమస్య కాదని, చాలా సహజమైన విషయం అని అర్థమైంది. అది మంచిది, చెడ్డదా, తప్పా, ఒప్పా అని విచారించడం సరికాదని అనిపించింది. అది రుగ్మతో, వ్యాధో కాదు కాబట్టి, ఎప్పుడూ వైద్యుడి దగ్గరకు వెళ్లాలన్న ఆలోచన కూడా రాలేదు. కౌన్సెలర్ దగ్గరకు కూడా వెళ్లలేదు.
హర్షు భవిష్యత్తు గురించి మాత్రం కొంత బెంగ కలిగింది. ఓ వ్యక్తి స్వలింగ సంపపర్కుడో కాదో తేల్చుకునేముందు ఓసారి శాస్త్రీయంగా ధ్రువీకరించుకుంటే మంచిదని నాకు అనిపించేది. హర్షును కూడా ఓసారి చెక్ చేయించుకోమని సూచించా. హర్షు నా వైపు బాధగా చూశాడు. ‘అలాంటి విషయాలను ఎలా పరీక్షించుకుంటారు? మీరు స్వలింగ సంపర్కులు కాదని ధ్రువీకరించుకోవడానికి మీరు పరీక్ష చేయించుకోగలరా?’ అని ప్రశ్నించాడు. దానికి నా దగ్గర సమాధానం లేదు.
పెళ్లి ప్రశ్నలు...
ఏళ్లు గడిచిపోయాయి. హర్షుకు పెళ్లి వయసు వచ్చింది. తెలిసినవాళ్లంతా అదే విషయం ప్రస్తావించేవారు. వాడి వయసు వాళ్లంతా పెళ్లిళ్లలు చేసుకుంటున్నారు. ‘హర్షు పెళ్లి గురించి ఆలోచించట్లేదా?’ అని బంధువులు అడిగేవారు. ‘ఆ విషయాన్ని వాడే నిర్ణయించుకోవాలి. మీరే అడగొచ్చు కదా...’ అని నవ్వుతూ సమాధానం దాటవేసేవాడిని.
వాడిని ఎవరైనా అడిగితే... ‘నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నా కదా, అలా ఉండటం ఇష్టం లేదా’ అని చెప్పేవాడు. ఇప్పట్లో హర్షు పెళ్లి సన్నాయి వినే అవకాశం లేదనే స్పష్టత నాకు వచ్చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
వంశాభివృద్ధి గురించి నేను ఆలోచించే వ్యక్తిని కాదు. హర్షుకు భాగస్వామి దొరకడం ఎలా అని మాత్రం ఆలోచించేవాడిని. సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో కొన్ని దారులైతే తెరుచుకున్నాయి. హర్షుకు ఏది సరైనదో వాడే నిర్ణయించుకోవాలి. ఓ తండ్రిగా అతడి సంతోషమే నాకు ముఖ్యం.
ఈ క్రమంలో నాలాంటి కొందరు తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నించా. హర్షు ‘గే’ స్నేహితుల్లో ఒకరి తల్లిదండ్రులు, తమ కొడుకు గురించిన వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధపడలేదు. మాకూ వాళ్లకూ హర్షు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మాతో మాట్లాడాక తన మనసు కుదుటపడిందని ఆ కుర్రాడి తల్లి చెప్పారు.
ఆ తరువాత కూడా కొన్ని కార్యక్రమాల్లో మాట్లాడి నా అనుభవాలను పంచుకొని, ఎదుటివాళ్లలో అవగాహన పెంచే ప్రయత్నం చేశా.
ప్రతి సమావేశం ముగిశాక నేను వాళ్లతో చెప్పేది ఒక్కటే... ‘ఫ్రెండ్స్... నేను ఒక గే కు తండ్రిని. అలా చెప్పుకోవడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను’ అని.
మా కొడుకుంటే మాకు చాలా ఇష్టం. తను గే అయిన కారణంగా వాడిపైన మా ప్రేమ ఏమాత్రం తగ్గదు.
(వ్యాసకర్త, ఆయన కుమారుడు తమ పేర్లను ప్రచురించడానికి అభ్యంతరం చెప్పలేదు. కానీ, ఇతర కుటుంబ సభ్యుల కోరికపై తండ్రి పేరును ప్రచురించలేదు. కుమారుడి పేరు మార్చాం.)
ఇవి కూడా చదవండి
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- C/o కంచరపాలెం: తెలుగు సినిమా ఎదుగుతోంది
- సౌదీ అరేబియా: మహిళతో కలిసి టిఫిన్ తిన్నందుకు వ్యక్తి అరెస్ట్
- మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర
- ఆరోగ్యం: ప్రజలంతా స్మార్ట్ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది?
- ‘పత్రిక ఎడిటర్ని చూసి కారు డ్రైవర్ అనుకున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









