గ్రీన్‌ల్యాండ్‌ను కొంటామన్న ట్రంప్.. అసలు అమెరికా ఇతర దేశాల నుంచి ఎన్ని భూభాగాలను కొన్నదో తెలుసా?

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచంలో అతి పెద్ద దీవి గ్రీన్‌ల్యాండ్‌ను కొంటామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. కానీ.. తాము అమ్మడానికి సిద్ధంగాలేమని గ్రీన్‌ల్యాండ్ తేల్చిచెప్పింది.
డెన్మార్క్ పాలనలో స్వయంప్రతిపత్తి గల ప్రాంతంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసే అంశం గురించి ట్రంప్ తన సలహాదారులతో విందు భేటీల్లో చర్చించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ విషయం మీద గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వం స్పందిస్తూ.. ''మేం వ్యాపారాలను ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ.. అమ్మకానికి కాదు'' అని వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, AFP
ట్రంప్ ఆలోచన ''ఏప్రిల్ ఫూల్స్ డే జోక్ కావచ్చు.. కానీ ఇది ఆ సీజన్ కాదు'' అని గ్రీన్‌ల్యాండ్ మాజీ ప్రధానమంత్రి లార్స్ లోక్ రాసుముసెన్ ట్వీట్ చేశారు.
‘‘గ్రీన్‌ల్యాండ్‌లో విలువైన వనరులు, ఖనిజాలు, అత్యంత స్వచ్ఛమైన నీరు, మంచు, చేపలు, సముద్ర ఆహారం, పునరున్వియోగించగల ఇంధనం వంటి అపార సంపద ఉంది.
సాహస పర్యటనకు ఆలవాలం. మేం వ్యాపారం చేయటానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా ప్రాంతాన్ని అమ్మటానికి కాదు’’ అని గ్రీన్‌ల్యాండ్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రధానమంత్రి కిమ్ కీల్సెన్ కూడా ఇదే మాట పునరుద్ఘాటించారు. డెన్మార్క్ రాజకీయ నాయకులు కూడా అమెరికా అటువంటి ఆలోచన చేస్తుందనటాన్ని ఎద్దేవా చేశారు.
''ఒకవేళ ఆయన నిజంగా దీని గురించి ఆలోచిస్తున్నట్లయితే.. ఆయనకు పిచ్చి పట్టిందనటానికి ఇది చివరి సాక్ష్యం'' అని డెన్మార్క్ పీపుల్స్ పార్టీ అధికార ప్రతినిధి సోరెన్ ఎస్పెర్సెన్ వ్యాఖ్యానించారు.
''డెన్మార్క్ 50,000 మంది పౌరులను అమెరికాకు అమ్మటమనే ఆలోచన చాలా విడ్డూరమైనది'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Wikimedia Commons/William Morris
ఇప్పటివరకూ అమెరికా కొన్న భూభాగాలు ఏమిటి?
ఇతర దేశాలకు చెందిన భూభాగాలను సైనిక ఆక్రమణల ద్వారానే కాకుండా.. ఆర్థిక ఒప్పందాల ద్వారా కూడా సొంతం చేసుకున్న ఉదంతాలు చరిత్రలో ఉన్నాయి.
అమెరికా.. 1803 నాటి లూసియానా కొనుగోలు ఒప్పందం కింద.. ఫ్రాన్స్ నుంచి 21 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల భూభాగాన్ని అమెరికా సొంతం చేసుకుంది. అప్పుడు దానికి చెల్లించిన ధర 1.5 కోట్ల డాలర్లు. ఇప్పటి విలువలో 34 కోట్ల డాలర్లు. ఇప్పుడు ఈ మొత్తం సొమ్ముతో రెండు మార్-ఎ-లాగో రిసార్టులు కొనవచ్చు.
అలాగే.. 1867లో రష్యా నుంచి అలాస్కాను కొనుగోలు చేయటానికి అమెరికా ఒప్పందం చేసుకుంది. మొత్తం 72 లక్షల డాలర్లు చెల్లించి ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి విలువ ప్రకారం చూస్తే ఆ మొత్తం 12.5 కోట్ల డాలర్లతో సమానం. అయితే.. అలాస్కాలో ఉన్న చమురు నిల్వల విలువ 20,000 కోట్ల డాలర్ల కన్నా ఎక్కవే ఉంటుంది.

ఫొటో సోర్స్, Wikimedia Commons/Kballen
ఇక 1848లో మెక్సికన్ సెషన్‌ను 1.5 కోట్ల డాలర్లకు అమెరికా సొంతం చేసుకుంది. ఆ మొత్తాన్ని ఇప్పటి విలువలో చూస్తే 48.7 కోట్ల డాలర్లు. ఇప్పుడు ఆ డబ్బుతో ట్రంప్ ప్రతిపాదించిన సరిహద్దు గోడలో 42 మైళ్లు కొనవచ్చు.
అనంతరం.. 1917లో డేనిష్ వెస్ట్ ఇండీస్‌ను కూడా అమెరికా కొన్నది. వాటికి అమెరికా వర్జిన్ ఐలాండ్స్ అని పేరు పెట్టింది.
చివరిసారిగా.. 1947లో అమెరికా మార్షల్ ఐలాండ్స్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ దీవులు.. అమెరికాకు అనుబంధంగా ఉండే స్వతంత్ర దేశంగా మారాయి.

ఫొటో సోర్స్, Getty Images
గ్రీన్‌ల్యాండ్‌ను కొనటానికి అమెరికా గతంలోనూ ప్రయత్నించిందా?
నిజానికి.. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలన్న అమెరికా ఆలోచన ఇప్పటిది కాదు. 1860ల్లో ఆండ్రూ జాన్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది.
గ్రీన్‌ల్యాండ్ వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటమే కాకుండా.. అందులో అపార ఖనిజ సంపద కూడా ఉందని.. దానిని కొనుగోలు చేయటం చాలా ప్రయోజనకరమని అమెరికా విదేశాంగ శాఖ 1867లో ఒక నివేదికలో సూచించింది.
అయితే.. ఈ విషయంలో 1946 వరకూ అధికారికంగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్.. గ్రీన్‌ల్యాండ్‌ను 10 కోట్ల డాలర్లకు కొంటామని డెన్మార్క్‌కు ప్రతిపాదించారు.
అంతకుముందు.. గ్రీన్‌ల్యాండ్‌లోని వ్యూహాత్మక భూభాగాలను అమెరికాకు ధారాదత్తం చేస్తే.. దానికి బదులుగా అలాస్కాలోని భూమిని ఇచ్చే ఆలోచన కూడా ట్రూమన్ చేశారని ఏపీ కథనం.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబు ఇంటి వరకు నీరు.. వరదొచ్చిందా.. సృష్టించారా.. ప్రకాశం బ్యారేజ్ లెక్కలు ఏం చెబుతున్నాయ్
- కాంచీపురం అత్తి వరదరాజస్వామి ఆలయం: 40 ఏళ్లకు ఒకసారి 48 రోజుల దర్శనం
- 124 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ఎంత కష్టమో వీరి కళ్లలోకి చూస్తే తెలుస్తుంది
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- పెహ్లూ ఖాన్‌పై మూక దాడి కేసు: నిందితులను కోర్టు ఎందుకు వదిలేసిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








